స్టార్ డ్యూన్స్:ప్రతియేటా 50 సెం.మీ.లు కదులుతున్న ఈ ఇసుక తిన్నెల కథ ఏంటి?

మొరాకో, ఇసుక దిబ్బలు, ఎడారి

ఫొటో సోర్స్, C BRISTOW

ఫొటో క్యాప్షన్, మొరాకోలోని ఎడారిలో వంద మీటర్ల ఎత్తున్న లల లల్లియా ఇసుక దిబ్బ
    • రచయిత, జార్జినా రన్నార్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భూమి మీద అతి పెద్దదైన, సంక్లిష్టమైన ఇసుక దిబ్బలలో ఒక దాని వయసుని తొలిసారిగా లెక్కించారు.

వాటి విలక్షణమైన ఆకారం, వందల మీటర్ల ఎత్తులో ఉండటంతో వాటిని స్టార్ డ్యూన్ లేదా పిరమిడ్ డ్యూన్ అని పిలిచే వారు.

ఇలాంటివి ఆఫ్రికా, ఏషియా, నార్త్ అమెరికా, అలాగే మార్స్ మీద కూడా ఉన్నాయి. అయితే అవి ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు పుట్టాయనే దానిపై శాస్త్రవేత్తల వద్ద ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

అయితే ప్రస్తుతం మొరాకోలోని ఎడారిలో లల లల్లియా అని పిలిచే ఒక పెద్ద ఇసుక దిబ్బ 13వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని గుర్తించారు.

ఇవి గాలికి వ్యతిరేకంగా నిలబడి గాలి వాలును మళ్లించడం ద్వారా ఏర్పడ్డాయి. వీటి వయసు గురించి తెలుసుకోవడం ద్వారా గాలి వాలు దిశ ఆ కాలం నాటి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు అవకాశం లభించిందని అబ్రేస్విత్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జెఫ్ డుల్లర్ చెప్పారు.

ఈ పరిశోధనల గురించి బ్రిక్‌బెక్ యూనివర్సిటీ ఆచార్యుడు ఫ్రొఫెసర్ చాల్స్ బ్రిస్టో ప్రచురించారు.

లల లల్లియా( అమేజిగ్ తెగకు చెందిన ఈ మాటకు పవిత్ర స్థానం అని అర్ధం) ఆగ్నేయ మొరాకోలోని ఎర్గ్ చబ్బీ ఎడారిలో ఉంది. వంద మీటర్ల కంటే ఎత్తున్న ఈ ఇసుక తిన్నె 700 మీటర్లు పొడవున విస్తరించి ఉంది.

ఈ భారీ ఇసుక తిన్నె మొదట ఏర్పడిన తర్వాత 8వేల ఏళ్ల పాటు ఎదగడం ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలుగా వేగంగా విస్తరించడం, ఎదగడం మొదలైంది.

భూమి భౌగోళిక చరిత్రలో ఎడారులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ స్టార్ డ్యూన్స్ మాత్రం లేవు.

ఎడారులు చాలా పెద్దవి కావడంతో నిపుణులు ప్రత్యేకించి ఒక పెద్ద ఇసుక తిన్నె మీద దృష్టి సారించలేకపోయారని ప్రొఫెసర్ డుల్లర్ చెప్పారు.

“శాస్త్రవేత్తలు కనుక్కున్న విషయాలు గమనిస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి ఎంత వేగంగా ఏర్పడ్డాయి, ప్రతీయేటా 50 సెంటీమీటర్ల దూరం ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలు ఈ పరిశీలనలో బయటపడ్డాయి.” అని ఆయన చెప్పారు.

ఈ భారీ ఇసుక తిన్నె వయసు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ల్యూమైన్‌సీన్ డేటింగ్ అనే సాంకేతికతను ఉపయోగించారు.

స్టార్ డ్యూున్, ఇసుక దిబ్బలు, కొలరాడో

ఫొటో సోర్స్, C BRISTOW

ఫొటో క్యాప్షన్, ఇసుక దిబ్బల విస్తరణ ద్వారా వాటికి ‘స్టార్ డ్యూన్స్’గా గుర్తింపు

ల్యూమైన్‌సీన్ డేటింగ్ విధానంలో ఇసుక రేణువులపై ఎంత కాలం సూర్యకాంతి ప్రసరించిందనే దాని ఆధారంగా వాటి వయసుని లెక్కిస్తారు.

మొరాకోలోని ఎడారిలో కొంత లోతులో నుంచి ఇసుకను తీసుకుని, దాన్ని ల్యాబ్‌లో ఎరుపు రంగు బల్బు ద్వారా వెలువడే మసక వెలుతురు కింద పరీక్షిస్తారు. కచ్చితంగా చెప్పాలంటే ఇది పాత కాలపు ఫోటో నెగెటవ్ ఫిల్మ్ డెవలప్ చేసే ల్యాబ్ మాదిరిగా ఉంటుంది.

ఇసుకలో ఉండే ఖనిజాలు ‘రీ చార్జ్ చేసుకోదగిన బ్యాటరీల’ మాదిరిగా పని చేస్తాయని ప్రొఫెసర్ డుల్లర్ చెప్పారు. అవి సహజ వాతావరణంలో రేడియో ధార్మికత నుంచి వచ్చే శక్తిని స్పటికాలలో నిల్వ చేస్తాయి.

భూమిలో ఇసుక ఎక్కువ లోతులో ఉంటే ఎక్కువ రేడియో ధార్మికత వెలువడుతుంది. దీంతో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది.

ఇసుక రేణువుల్ని ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు అవి ఆ శక్తిని కాంతి రూపంలో బయటకు వెదజల్లుతాయి. ఆ కాంతి ఆధారంగా శాస్త్రవేత్తలు దాని వయసుని గుర్తిస్తారు.

“చీకటిగా ఉండే మా పరిశోధనశాలలో, ఇసుక రేణువుల నుంచి వెలుగుని మేము చూశాము. అవి ఎంత కాంతివంతంగా ఉంటే వాటి జీవితకాలం అంత ఎక్కువ, వందల ఏళ్ల నుంచి అవి భూగర్భంలో నిక్షిప్తంగా ఉన్నాయని తెలుసుకోవచ్చు” అని ప్రొఫెసర్ డుల్లర్ చెప్పారు.

ఇలాంటి స్టార్ డ్యూన్స్‌కి మరి కొన్ని ఉదారణలు చెప్పుకోవాలంటే కొలరాడో ఎడారిలో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవి ఉత్తర- దక్షిణ అమెరికాల్లోనే అతి పెద్దవి. వీటి ఎత్తు భూమి మీద నుంచి 225 మీటర్ల ఎత్తు ఉన్నాయి.

వీటి మీదకు ఎక్కడం చాలా కష్టం. “మీరు వీటి మీదకు ఎక్కేటప్పుడు రెండడుగులు పైకి ఎక్కితే, ఒక అడుగు కిందకు జారిపోతారు. అయితే ఎంత కష్టమైనా వాటిని చివరి వరకు ఎక్కి పై నుంచి చూస్తే అవి చాలా అందంగా కనిపిస్తాయి” అని ప్రొఫెసర్ డుల్లర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)