లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకు దీనికి సంబంధం ఏమిటి

సుప్రీం తీర్పు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి జేఎంఎం ఎంపీలకు పీవీ ప్రభుత్వం ముడుపులు ఇచ్చింది

చట్టసభల్లో కావాల్సిన అంశంపై మాట్లాడేందుకు, ప్రశ్నలు వేయడానికి, ఓటు వేసేందుకు ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం పార్లమెంట్ ప్రత్యేకాధికారాల పరిధిలోకి రాదని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని.. వారికి ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణ ఉండదని ఈ తీర్పు స్పష్టం చేసింది.

ఈ తీర్పును వెలువరిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ‘శాసనాధికారాల ఉద్దేశం సభకు సమష్టిగా ప్రత్యేకాధికారాలు ఇవ్వడమే’ అన్నారు.

ధర్మాసనం ఈ సందర్భంగా ‘‘105, 194 ఆర్టికల్స్ ప్రజాప్రతినిధులకు భయంలేని వాతావరణం సృష్టించడానికి ఉద్దేశించినవి. కానీ లంచాలు, అవినీతి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో తీర్పును ప్రస్తావిస్తూ ‘‘ఈ కేసులో ఇచ్చిన తీర్పు ఓ విరుద్ధమైన పరిస్థితిని సృష్టించింది. ప్రజాప్రతినిధులు లంచం తీసుకుని తదనుగుణంగా ఓటు వేసినా వారికి రక్షణ కల్పించింది’’ అని పేర్కొన్నట్టు లీగల్ అఫైర్స్ వెబ్‌సైట్ లైవ్ లా తెలిపింది.

పార్లమెంటు, అసెంబ్లీలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలకు, ఓటు వేయడానికి డబ్బలు తీసుకున్నా క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ 1998లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 3-2 మెజార్టీతో తీర్పు ఇచ్చింది.

‘‘మేం ఈ తీర్పు సందర్భంగా లంచాలు తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు రక్షణ కలిస్తున్నపీవీ నరసింహారావు కేసులోని తీర్పును కొట్టివేస్తున్నాం’’ అని సీజేఐ వెల్లడించినట్టు బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ కథనం తెలిపింది.

‘‘ఏ ఎంపీ, ఎమ్మెల్యే అటువంటి అధికారం ఉపయోగించుకోలేరు. మొత్తం సభకు సమష్టిగా ప్రత్యేక హక్కు ఉంటుంది. నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 105 (2), 194కు వ్యతిరేకంగా ఉన్నాయి’’ అని కోర్టు పేర్కొంది.

కాగా సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలకు హామీ ఇస్తుందని తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.

సుప్రీం తీర్పు

ఫొటో సోర్స్, ANI

జేఎంఎం ఎమ్మెల్యే నుంచి పీవీ కేసు వరకు

తాజా తీర్పు ఇవ్వడానికి కారణం ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్.

2012 రాజ్యసభ ఎన్నికలలో ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసేందుకు ఆమె లంచం తీసుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసులోనే 1998 నాటి పీవీ నరసింహారావు వర్సెస్ సీబీఐ కేసు ప్రస్తావన వచ్చింది.

1998 నాటి పీవీ కేసులో లంచం కేసుల విచారణ నుంచి ప్రజాప్రతినిధులకు మినహాయింపునిస్తూ తీర్పు ఇచ్చారు.

2019లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నా సీతాసోరెన్ కేసును విచారించి, పీవీ నరసింహారావు కేసులోని తీర్పు ఇక్కడ కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

అయితే పీవీ నరసింహారావు కేసు సందర్భంలో ధర్మాసనంలోని ఐదుగురు సభ్యులలో ముగ్గురు న్యాయమూర్తులు మినహాయింపులకు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఆ కేసును మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించాలని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పడింది. ఇందులో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు.

సుప్రీం తీర్పు

ఫొటో సోర్స్, GETTY IMAGES

అసలేమిటి పీవీ కేసు?

రాజీవ్ గాంధీ హత్య తరువాత 1991లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బోఫోర్స్ కుంభకోణంతో 1989లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 1991 ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 487 స్థానాలలో పోటీ చేసి 232 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం.

ఈ నేపథ్యంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికయ్యారు.

నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం లాంటి అనేక సవాళ్ళను ఎదుర్కొంది. ఈయన హయాంలోనే 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఉదారవాద ఆర్థిక విధానాలకు పచ్చజెండా ఊపారు.

కానీ అదే సమయంలో రాజకీయంగానూ దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో రామజన్మభూమి ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారు.

ఈ రెండు అంశాల కారణంగా పీవీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

1993 జులై 26న వర్షాకాల సమావేశాలలో సీపీఐ(ఎం) సభ్యుడు అజయ్ ముఖోపాధ్యాయ నరసింహారావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

‘‘అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు, ప్రపంచ బ్యాంకు ముందు పూర్తిగా సాగిలపడి, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను తీసుకురావడం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం అనేవి భారత పరిశమ్రలను, రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’

‘‘ఈ ప్రభుత్వం మతతత్త్వశక్తులపట్ల రాజీధోరణితో వ్యవహరిస్తోంది. అందుకే అయోధ్య సంఘటన జరిగింది. రాజ్యంగం పేర్కొన్న లౌకికవాదాన్ని పరిరక్షించడంతో ఈ ప్రభుత్వం విఫలమైంది. అయోధ్యలో మసీదును కూలగొట్టడానికి కారణమైనవారిని శిక్షించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది’’ అని అవిశ్వాస తీర్మానంలో పేర్కొన్నారు.

ఆ సమయంలో మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య 528. కాంగ్రెస్‌కు 251 మంది బలం ఉంది. అయితే ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే మరో 13మంది అభ్యర్థుల అవసరం ఉంది. అవిశ్వాసంపై మూడు రోజులపాటు సుదీర్ఘ చర్చ సాగింది.

జులై 28 1993న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కానీ 14 ఓట్ల తేడాతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 265, అనుకూలంగా 251 ఓట్లు పడ్డాయి.

అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన మూడేళ్ల తరువాత లంచాల విషయం వెలుగుచూసింది.

సుప్రీం తీర్పు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉదారవాద ఆర్థిక వేత్త

సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

1998లో ఈ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ‘‘ రాష్ట్రీయ ముక్తి మోర్చా సభ్యుడు రవీంద్రకుమార్ సీబీఐ వద్ద ఫిబ్రవరి1, 1996న ఓ ఫిర్యాదు చేశారు. 1993లో జులైలో నేరపూరిత కుట్ర ద్వారా పీవీ నరసింహారావు, సతీష్ శర్మ, అజిత్ సింగ్, భజన్ లాల్, వీసీ శుక్లా, ఆర్‌కే ధవన్, లలిత్ సూరీ ఎంపీలకు లంచాలు ఇచ్చి తమ ప్రభుత్వాన్ని కాపాడుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకోసం మూడుకోట్లరూపాయలకు పైగా ముడుపులు చెల్లించారని, నేరపూరిత కుట్రను అమలుచేసేందుకు సూరజ్ మండల్‌కు కోటి పదిలక్షల రూపాయలు చెల్లించారని ఆరోపించారు.

ఈ కేసులో జేఎంఎం ఎంపీలపై సీబీఐ విచారణ జరిపింది. మండల్, శిబూ సోరెన్, సైమన్ మరాండీ, శైలేంద్ర మహతో సీబీఐ విచారణను ఎదుర్కొన్నవారిలో ఉన్నారు. అప్పట్లో జేఎంఎంకు మొత్తం ఆరుగురు ఎంపీలు ఉన్నారు.

సీబీఐ విచారణను ఉటంకిస్తూ ‘‘జేఎంఎం నాయకులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారు. ఈ ఓట్లు మరికొంతమంది ఇతర ఎంపీల ఓట్లు వల్లే ప్రభుత్వం గట్టెక్కింది’’ అని కోర్టు పేర్కొంది.

‘లంచాలు తీసుకున్న ప్రజాప్రతినిధుల కేసు విషయంలోని తీవ్రత పై మేమంతా ఎరుకతోనే ఉన్నాం. ఇదే కనుక నిజమైతే తమను ఎన్నుకున్న ప్రజల నమ్మకంతో వారు వ్యాపారం చేసినట్టే’’ అని అప్పట్లోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘‘వారు డబ్బు తీసుకుని ప్రభుత్వాన్ని కాపాడారు. కానీ దీనికి భిన్నంగా రాజ్యాంగం కల్పించిన రక్షణకు వారు అర్హులు. మన ఆగ్రహం పార్లమెంటరీ భాగస్వామ్య హామీలను ప్రభావితం చేసి, రాజ్యాంగాన్ని సంకుచితంగా నిర్వచించేందుకు కారణం కారాదు.’అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)