బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

కూరగాయల దగ్గర కూర్చున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లైస్ అలెగ్రెటీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘బరువు తగ్గాలంటే వ్యాయామం తర్వాత ఏం తినాలి?’’, ‘‘త్వరగా బరువు తగ్గేందుకు ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి?’’, ‘‘బరువు తగ్గేందుకు మంచి చిట్కాలు ఏవి?’’, ‘‘చిలకడ దుంపలతో బరువు తగ్గొచ్చా?’’.. బరువు తగ్గేందుకు గూగుల్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న ప్రశ్నలివీ.

ఈ ప్రశ్నల్లో కొన్నింటిని పరిశీలిస్తుంటే ప్రజలు షార్ట్‌కట్‌ల కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోందని సవ్‌పాలో యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ సైన్సెస్‌కు చెందిన న్యూట్రీషనిస్టు డిసైర్ కొయెల్హో అన్నారు.

‘‘సాధారణంగా ఇక్కడ చాలా మంది లక్ష్యం బరువు తగ్గాలని కాదు. కానీ, మంత్రం వేసినట్లుగా సన్నగా మారిపోవాలని వారు కోరుకుంటారు’’ అని ‘వై కాంట్ లూస్ వెయిట్: ఎ లుక్ ఎట్ ద బాడీ, బిహేవియర్, న్యూట్రిషన్’ పుస్తకంలో ఆమె రాశారు.

‘‘ఆరోగ్యానికి, బరువు తగ్గే ప్రయత్నాలకు సంబంధం ఉంటుంది. ఒకవేళ మీరు కొన్ని ప్రమాదకర మార్గాల్లో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తే, చాలా అనారోగ్యాలు కూడా చుట్టుముట్టే ముప్పుంది’’ అని ఆమె హెచ్చరించారు.

‘‘సన్నగా ఉండేవారే అందంగా ఉంటారని అనుకోవడమే ఈ సమస్యలన్నింటికీ మూలం. కొంతమంది సన్నంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తారు. అలా అనుకోవడం తప్పు’’ అని ఆమె అన్నారు.

‘‘తీవ్రంగా సన్నబడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లే మన స్నేహితుల్లో సన్నంగా ఉండేవారిలో ‘ఈటింగ్ డిజార్డర్స్’ను గుర్తించడం ఆలస్యం అవుతోంది’’ అని ఆమె అన్నారు.

‘‘మీకు ఏదైనా సందేహాలుంటే, ఎదుటి వ్యక్తి శరీరం గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే అతడు లేదా ఆమె ఆరోగ్య చరిత్ర గురించి మీకు తెలియదు కాబట్టి’’ అని ఈటింగ్ డిజార్డర్ల నిపుణురాలైన కొయెల్హో చెప్పారు.

అసలు ఏ అంశాలు బరువు తగ్గే ప్రక్రియలను సంక్లిష్టం చేస్తాయి? ఏ అంశాలు మెరుగ్గా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి? లాంటి అంశాలను ప్రశ్నలు, సమాధానాల రూపంలో ఇప్పుడు తెలుసుకుందాం.

డిసైర్ కొయెల్హో

ఫొటో సోర్స్, DESIRE COELHO

ఫొటో క్యాప్షన్, బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలతో ‘వై కాంట్ లూస్ వెయిట్: ఎ లుక్ ఎట్ ద బాడీ, బిహేవియర్, న్యూట్రిషన్’ అనే పుస్తకం డిసైర్ కొయెల్హో రాశారు.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో బరువు తగ్గేందుకు సెర్చ్ చేస్తున్న అంశాలను చూస్తుంటే మీకు ఏమని అనిపిస్తోంది?

డిసైర్ కొయెల్హో సమాధానం: ప్రతిదానికీ షార్ట్‌కట్ కోసం వెతక్కూడదు. కొన్ని ప్రశ్నలు చూస్తుంటే అసలు షార్ట్‌కట్ కాదు, ఏకంగా మ్యాజిక్ పిల్ కోరుకుంటున్నారు.

నిజానికి సదరు వ్యక్తులు బరువు తగ్గాలని కోరుకోవడం లేదు. సన్నంగా కనబడాలని మాత్రమే అనుకుంటున్నారు. అది కూడా ఏదో మంత్రం వేసినట్లుగా సన్నం అయిపోవాలి. బరువు తగ్గేందుకు శ్రమించాలని వారు అసలు అనుకోవడం లేదు.

ఏదో ఒక్క రాత్రిలోనే సన్నంగా అయిపోవడం అనేది అసలు ఊహకు కూడా అందని అంచనా. మనం బరువు తగ్గాలంటే మొదటగా బరువు తగ్గే ప్రక్రియలతోపాటు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి.

మరో విషయం ఏమిటంటే న్యూట్రిషన్ గురించి చెప్పేటప్పుడు కూడా, నేరుగా సన్నంగా కనిపించడం గురించే ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించడం సరికాదు.

అయితే, ఈ విషయంలో నేరుగా ఆ వ్యక్తిని తప్పుపట్టకూడదు. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. చాలా మంది సన్నంగా ఉండటమే ఆరోగ్యమని భావిస్తున్నారు. కానీ, ఇందులో నిజంలేదు.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

‘వై కాంట్ లూస్ వెయిట్’ పుస్తకంలో బరువు తగ్గడంలో ఎదురయ్యే అడ్డంకుల గురించి ప్రస్తావించారు. అసలు బరువు తగ్గే క్రమంలో మనకు ఎదురయ్యే ప్రధాన అవరోధాలు ఏమిటి?

డిసైర్ కొయెల్హో సమాధానం: సాధారణంగా బరువు తగ్గే ప్రక్రియల్లో ‘బిగినింగ్, మిడిల్, ఎండ్’ లాంటి దశలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. నిజానికి అలాంటివేమీ ఉండవు.

ఇక్కడ ఎలాంటి శరీరం కావాలి? ఎంత బరువు ఉండాలి? లాంటి అంశాలతోపాటు ఎలాంటి జీవన శైలి కావాలని అనుకుంటున్నారో కూడా వారు ఆలోచించాలి.

అప్పుడే మనకు ఈ ప్రక్రియ లోతుగా అర్థం అవుతుంది. మరొక విషయం ఏమిటంటే బరువు తగ్గే ప్రక్రియ మొదట్నుంచి, చివరవరకు ఒక రేఖపై ఉన్నట్లుగా ఉంటుందని భావిస్తారు. ఇది కూడా ఒక అపోహే. ఈ ప్రక్రియలో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. వీటి ద్వారానే వారి ఏం నప్పుతుంది? ఏం నప్పదు అనే అంశాలను వారు నేర్చుకోవాల్సి ఉంటుంది.

ప్రజలు ఒక సింగిల్ మ్యాజిక్ ఫార్ములాను కోరుకుంటారు. కానీ, ఇక్కడ అలాంటిదేమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరి శరీరంలో కొవ్వు ఒక్కోలా పేరుకుంటుంది.

కాబట్టి అందరికీ ఒకే ఫార్ములా అనేదే ఉండదు. ఇక్కడ ఆ వ్యక్తి సంబంధించిన ‘‘జెనెటిక్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ’’ లాంటి చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మధ్యలో ఎక్కడైనా ఈ ప్రయత్నాలను ఆపేస్తే, మళ్లీ ఎంత వేగంగా ఈ ప్రాసెస్‌ను మొదలు పెట్టగలరు? నిరంతరం దీనిపై ఎంత కృషి చేయగలరు? లాంటి అంశాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి.

బరువు తగ్గింపు

ఫొటో సోర్స్, Getty Images

ఒక వ్యక్తి జీవన శైలి, ఆహారం తీసుకునే ప్రక్రియలను ప్రభావితం చేస్తుందని కూడా చెప్పారు. దీన్ని ఉదాహరణతో వివరించగలరా?

డిసైర్ కొయెల్హో సమాధానం: నా దగ్గరకు చాలా బరువు పెరిగిన ఒక పేషెంట్‌ వచ్చారు. మొదట్లో ఆమె స్వీట్లను విపరీతంగా తినేవారు. చికిత్సలో భాగంగా ఆమె జీవన శైలి గురించి ప్రశ్నలు అడిగాను. తాను ఒక న్యూట్రిషనిస్టు దగ్గరకు వెళ్లానని, రోజూ భోజనం తర్వాత స్వీట్ తినే అలవాటు ఉందని ఆయనకు చెప్పానని ఆమె వివరించారు.

దీనిపై ఆ న్యూట్రిషనిస్టు స్పందిస్తూ.. ‘‘షుగర్స్ మీకు మంచిది కాదు. ఆ స్వీట్లను తినడం ఆపేయండి’’ అని చెప్పారు. అప్పటి నుంచి స్వీట్లను దూరం పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే, వారం రోజుల తర్వాత నియంత్రణ కోల్పోయిన ఆ పేషెంట్.. ఒక చాక్లెట్ డబ్బాను కొనుక్కొని మొత్తం చాక్లెట్లన్నీ తినేశారు. ఆ తర్వాత ఒకేసారి ఎక్కువ చాక్లెట్లు తినడం కూడా ఆమెకు అలవాటైంది. ఇదంతా తనకు విధించిన కొన్ని నిబంధనల వల్లే జరిగిందని ఆమె గ్రహించారు.

అంటే ముందెన్నడూలేని రీతిలో ఆమెకు స్వీట్స్‌తో కొత్త బంధం ఏర్పడింది. అందుకే ఇక్కడ మన జీవన శైలి గురించి తెలుసుకోవాలి. ఇది మనం తీసుకునే ఆహారం, మన శరీరాలను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

ఒక్కొక్కరిపై వ్యక్తిగతంగా ప్రభావం చూపించే అంశాలను పక్కనపెడితే, ఇక్కడ అందరిపైనా ఒకేలాంటి ప్రభావం చూపించే ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉంటాయా?

డిసైర్ కొయెల్హో సమాధానం: కొన్ని ఉన్నాయి.

వీటిలో మొదటిది నిద్ర. దీని గురించి ప్రజలు అవగాహన నేడు చాలా పెరిగింది. అయితే, ఇప్పటికీ ఎంతమేర ఇది మనం ఆహారం ఎంచుకునే శక్తిని ప్రభావితం చేస్తుందో తెలియాల్సి ఉంది.

అన్నింటికంటే హాయిగా నిద్రపోవడం ముఖ్యం. ఇక్కడ ఎంతసేపు పడుకున్నామనేది కాదు, ఎంత మంచిగా పడుకున్నామనేదే ముఖ్యం. మీ నిద్రలో నాణ్యత లోపించినప్పుడు, బరువు తగ్గే ప్రక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే సరిగా నిద్రలేకపోతే, ఆకలి పెరుగుతుంది. దీంతో మరింత ఎక్కువ ఆహారం తీసుకుంటాం. మరోవైపు అనారోగ్యానికి కూడా గురవుతుంటాం. దీని వల్ల శరీరాన్ని ఎక్కువగా కదిలించం. ఇవన్నీ చాలా ప్రమాదకర కాంబోలు.

రెండోది శారీరక వ్యాయామం. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అంటే నిపుణుల పర్యవేక్షణలో చేసే వ్యాయామం అని అనుకోకూడదు. మనం శరీరాన్ని కదిలిస్తూ రోజువారీ చేసే పనులు కూడా దీని కిందకే వస్తాయి. కొందరు వ్యాయామం చేసిన తర్వాత, రోజు మొత్తం కదలకుండా కూర్చుకుంటారు. దీని వల్ల వారు చేసిన వ్యాయామం ఫలితాలు గాలిలో కలిసిపోతుంటాయి. అలా కాకుండా రోజంతా శరీరాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి.

మూడో ముఖ్యమైన అంశం ఆహారం: మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన పోషకాల గురించి మనకు తెలుసు. తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇక్కడ ఆహారం కోసం మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి. దీనికి అనుగుణంగా మనం ఆహారం తీసుకోవాలి.

నాలుగోది భావోద్వేగాలపై నియంత్రణ. దీని గురించి చెప్పేటప్పుడు చాలా మంది కాసేపు ఏడ్వడం లేదా ఒంటరిగా నడకకు వెళ్లడమని అనుకుంటారు. కానీ, ఇక్కడ తీవ్రభావోద్వేగాలకు గురైనప్పుడు తెలియకుండా ఎక్కువ ఆహారం తీసుకుంటాం. అసలు భావోద్వేగాలను ఎలా బయటకు వ్యక్తం చేస్తున్నామనేది అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. దీని వల్ల మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అలానే బరువు తగ్గింపు ప్రక్రియలకూ ఇది మేలు చేస్తుంది.

ఉపవాసం

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇది పనిచేస్తుందా?

డిసైర్ కొయెల్హో సమాధానం: కొంతమంది విషయంలో ఇది ఫలితాలను ఇవ్వొచ్చు.

నిజానికి మన పూర్వీకులు వెయ్యేళ్ల క్రితం లేదా రెండువేల ఏళ్ల క్రితం మనలా రోజుకు ఐదు భోజనాలు చేసేవారు కాదు. కానీ, ఇప్పుడలా కాదు.

నేడు మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో కొందరు రోజుకు ఏడుసార్లు భోజనం కూడా చేస్తున్నారు. అంటే శరీరంలో నిత్యం ఆహారం ప్రాసెస్ అవుతూనే ఉంటుంది.

అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చేందుకు ఉపవాసాలను ప్రజలు మళ్లీ చేస్తున్నారు. అయితే, ఇక్కడ ఇంటెర్‌మిటెంట్ ఫాస్టింగ్ కంటే ఓవర్‌నైట్ ఫాస్టింగ్ చేస్తే మేలు.

దాదాపు 11, 12 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అంటే రాత్రి 7 గంటలకు భోజనం చేయడం మళ్లీ ఉదయం ఏడు గంటలకే తినడం. దీని వల్ల కూడా శరీరానికి మేలు జరుగుతుంది. పైగా బరువు తగ్గేందుకూ ఇది మేలు చేస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

చాలా మంది ప్రోటీన్లు, సప్లిమెంట్ల గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది?

డిసైర్ కొయెల్హో సమాధానం: నేడు చాలా దేశాల్లో సైన్స్ కంటే పరిశ్రమలు ముందున్నాయి. ఇవి ప్రజలను మరింత ఆహారం తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఇక్కడ అతిపెద్ద సమస్య ఏమిటంటే, వీరిలో చాలా మంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఉదాహరణకు ఒమేగా-3ని తీసుకోండి. ఇది పుష్కలంగా ఉండే చేపలతోపాటు నట్స్, సీడ్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సైన్స్ చెబుతోంది. అయితే, అదే సమయంలో ఒమేగా-3 సప్లిమెంట్లతో అంత మంచి ఫలితాలు కనిపించడం లేదు.

ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, సప్లిమెంట్లు తీసుకోవాలా? లేదా ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాలా? దీనికి సమాధానంగా ఆహారంలో భాగంగానే తీసుకోవాలని చాలా మంది చెబుతారు. అలానే తీసుకోవడం మంచిది.

పండ్లు, కూరగాయలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రోటీన్ల గురించి మీరు ఏం చెబుతారు?

డిసైర్ కొయెల్హో సమాధానం: ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే, ఎక్కువగా ప్రోటీన్లు తీసుకునేవారిలో చాలా మందికి వాటి అవసరం ఉండదు. ఉదాహరణకు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిని తీసుకోండి. వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే షేక్‌లను తీసుకుంటారు. కానీ, వారికి ఇవి అంత అవసరం ఉండదు.

కానీ, ప్రతి శరీరానికి ప్రోటీన్లు అవసరం. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారికి ఈ ప్రోటీన్లు మరింత ఎక్కువగా అవసరం. ఎందుకంటే ఆ వయసులోనే కండరాల క్షీణత మొదలవుతుంది.

వీరు శరీరాన్ని కదిలిస్తూ అదనంగా ప్రోటీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రోటీన్లు తీసుకోవాలంటే మళ్లీ ప్రోటీన్ డ్రింక్స్, సప్లిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది. దీనికి సమాధానం ఒకటే. ఇక్కడ మాత్రం మన శరీరానికి ఏది సరిపోతుందో దాన్నే ఎంచుకోవాలి.

(ఈ కథనం స్థూలమైన అవగాహన కోసమే)

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)