కెమికల్ ట్యాంకులో పడి బయటికొచ్చిన పిల్లి, దానిని ఎవరూ తాకొద్దంటూ నగరమంతా హై అలర్ట్..

పసుపు రంగు పాదాల గుర్తులు

ఫొటో సోర్స్, PROVIDED BY NOMURA PLATING

ఫొటో క్యాప్షన్, ట్యాంకులోంచి బయటకు వచ్చిన పిల్లి పాదాల గుర్తులు
    • రచయిత, లూ న్యూటన్
    • హోదా, బీబీసీ న్యూస్

విషపూరితమైన రసాయనాలు ఉన్న ట్యాంకులో పడి, బయటికి వచ్చిన ఒక పిల్లికి దూరంగా ఉండాలని జపాన్‌లోని ఫుకుయామా నగర ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాంకు నుంచి పిల్లి బయటికి వచ్చినట్లుగా ఉన్న పసుపు రంగు పాదాల గుర్తులను ఫుకుయామాలో ఫ్యాక్టరీ కార్మికుల్లో ఒకరు గుర్తించారు.

సెక్యూరిటీ ఫుటేజీని పరిశీలించగా, కంటైనర్‌ నుంచి బయటికి వచ్చిన పిల్లి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు కనిపించింది.

ఇలా ఈ పాదాల గుర్తులు పిల్లివేనని అధికారులు నిర్ధరించారు. దీంతో, ఆ పిల్లిని ఎవరూ తాకొద్దని, దానికి దూరంగా ఉండాలని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

అంతేకాదు, ఎక్కడైనా ఆ పిల్లి కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

పిల్లి

ఫొటో సోర్స్, PROVIDED BY NOMURA PLATING

ఫొటో క్యాప్షన్, ఫ్యాక్టరీ సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన పిల్లి

ఈ పిల్లి గాఢమైన యాసిడిక్, కార్సినోజెనిక్ రసాయనం హెక్సావాలెంట్ క్రోమియం ఉన్న ట్యాంకులో పడి, బయటికి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఆ రసాయనం నారింజ, ముదురు గోధుమ రంగులో ఉంది.

నోమురా ప్లాటింగ్ ఫుకుయామా ఫ్యాక్టరీకి చెందిన ఉద్యోగులు మంగళవారం తిరిగి విధులకు వచ్చిన సమయంలో ఈ పిల్లి పాదాల గుర్తులను చూశారని వార్తా వెబ్‌సైట్ అసహి తెలిపింది.

ఏదైనా పిల్లి అనుమానాస్పదంగా, అసాధారణంగా కనిపిస్తే దాన్ని ముట్టుకోవద్దని ఫుకుయామా నగర ప్రజలకు అక్కడి పర్యావరణ బృందం తెలిపింది.

ట్యాంకు నుంచి బయటికి వచ్చిన పిల్లి చనిపోయి ఉండొచ్చని కూడా ఈ బృందం భావిస్తోంది.

షీటుతో ట్యాంకును కప్పామని, కానీ, కొంతమేర షీటు తొలగించి ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది.

‘‘పిల్లి లాంటి చిన్న జంతువులు లోపలికి చొరబడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకునేలా ఈ సంఘటన మమ్మల్ని మేల్కొల్పింది. ఇలాంటి ఘటనలను మేం ముందెన్నడూ ఊహించలేదు’’ అని కంపెనీ అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

అయితే, ఈ పిల్లి ఎక్కడా కనిపించలేదని మంగళవారం అధికారులు తెలిపారు.

వీడియో క్యాప్షన్, జపాన్ నగరాన్ని వణికిస్తున్న పిల్లి పాదముద్రలు, హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

హెక్సావాలెంట్ క్రోమియం ప్రమాదకరమా?

హెక్సావాలెంట్ క్రోమియాన్ని సాధారణంగా కర్మాగారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉత్పత్తి చేస్తారు. ఇది క్యాన్సర్‌కు దారి తీసే రసాయన సమ్మేళనం.

దీనిని తాకితే చర్మంపై మంటలు, శ్వాస సంబంధిత సమస్యలు, చూపు కోల్పోవడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి పలు తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రసాయన సమ్మేళనానికి దగ్గరగా పనిచేసేటప్పుడు ఉద్యోగులు మాస్కులను, రబ్బర్ గ్లోవ్‌లను ధరించాలి.

అలాయ్ స్టీల్ గట్టిగా, తుప్పు పట్టకుండా ఉండేందుకు క్రోమియం మెటల్‌ను కలుపుతారు. స్లెయిన్‌లెస్ స్టీల్‌ను వెల్డింగ్ చేసేటప్పుడు, క్రోమియం మెటల్ ఉన్న ఇతర అలాయ్ స్టీల్‌తో పనులు చేసే సమయంలో చాలా మంది ఉద్యోగులు దీని ప్రభాానికి గురవుతుంటారు.

డైస్, పెయింట్స్, ఇంక్‌లు, ప్లాస్టిక్స్‌లో కూడా హెక్సావాలెంట్ క్రోమియం సమ్మేళనాలను వాడుతుంటారు. పెయింట్‌లు, ప్రైమర్లు, ఇతర సర్‌ఫేస్ కోటింగ్‌లలో కూడా దీనిని వాడుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)