శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
దట్టమైన నల్లమల అడవిలో అక్కడక్కడా చెంచు గూడేలు మినహా పెద్దగా జన సంచారం కనిపించదు. కానీ శివరాత్రికి పది రోజుల ముందు నుంచి ఉగాది వరకు పెద్ద సంఖ్యలో సాగే భక్తుల పాదయాత్ర కారణంగా జన సందోహంలా ఉంటుంది.
నంద్యాలజిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర 40 కిలోమీటర్ల పాటు సాగుతుంది. దట్టమైన అడవి, కొండలు దాటుకుంటూ అనేకమంది శ్రీశైలం వరకు ఈ పాదయాత్రను సాగిస్తారు.
దారిలో ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగే యాత్ర ఒకరకంగా సాహస యాత్ర గానే భావించాలి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జంకూ గొంకూ లేకుండా పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తుంది.
వన్యప్రాణులకు ఆవాసంగా ఉండే తుమ్మలబయలు జంగిల్ సఫారీ ప్రాంతం మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాదయాత్ర చేస్తుంటారు తమిళనాడు నుంచి కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో సాగే ఈ శ్రీశైలం యాత్రలో కనీసంగా 25 వేల మంది వరకు భక్తులు కాలినడకన ఆలయానికి వస్తుంటారని శ్రీశైలం దేవస్థానం అధికారుల అంచనా.

యాత్ర దారి ఇదీ
వెంకటాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర తొలుత సాధారణ మట్టి రోడ్డు లోనే సాగుతుంది. ఆ తర్వాత నల్లమల అడవిలోకి ప్రవేశిస్తుంది.
నాగలూటి అనే చెంచుగూడెం దాటినప్పటి నుంచి అడవి బాట పట్టాల్సి ఉంటుంది. సరైన మార్గం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్ టిఆర్) పరిధిలోని నాగులూటి ఫారెస్ట్ రేంజ్ నిర్వహణలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మీదుగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆ మార్గంలోనే 9 కిలోమీటర్లు నడిచిన తర్వాత వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. అక్కడే మండపంలో యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారు.
సమీపంలోనే స్నానం చేసేందుకు అవకాశం కూడా ఉంది. తదుపరి కొండ ఎక్కి, దిగాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సన్నద్ధమవుతారు.

కొండల్లో పయనం..
నాగలూటి వీరభద్ర స్వామి ఆలయం దాటిన తర్వాత నుంచి ఈ యాత్ర మరింత కష్టతరంగా ఉంటుంది, ముఖ్యంగా కొండ మార్గం కావడంతో కాలినడకన పైకి ఎక్కుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా సాగాల్సి ఉంటుంది.
వెంకటాపురం నుంచి సుమారు రెండు గంటలలోపే నాగులూటి వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల పాటు నరసంచారం లేని ప్రాంతాల్లో కొండ మార్గాన ముందుకు సాగాల్సి ఉంటుంది. దానికోసం దాదాపు నాలుగుగంటల పైగా సమయం తీసుకుంటారు. ఆ తర్వాత పెద్ద చెరువు అనే చెంచుగూడెం చేరుకుంటారు.
అప్పటికే 24 కిలోమీటర్ల దూరం కాలినడకన సాగడం, కొండ మార్గాన్ని అధిగమించడం వల్ల అలసటతో ఎక్కువమంది పెద్ద చెరువు సమీపాన సేద తీరుతుంటారు.
సాయంత్రం పూట అక్కడికి చేరుకున్న వాళ్ళు రాత్రి అక్కడే బస చేసి మళ్లీ తెల్లవారుజామునే యాత్ర ప్రారంభించేందుకు మొగ్గు చూపుతారు. దానికి అనుగుణంగా పెద్ద చెరువు ప్రాంతంలో చదునుగా ఉండే ప్రదేశంలో యాత్రికులు వందల సంఖ్యలో ఆరు బయట నిద్రించడం కనిపిస్తుంది.

మరో రెండు కొండలు దాటి..
పెద్ద చెరువు మజిలీ తర్వాత మరో రెండు కొండలు దాటితేనే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సన్నద్ధమైన యాత్రికులు ఎక్కువగా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారు రెండు, మూడు గంటల సమయంలో మళ్లీ పెద్ద చెరువు నుంచి తమ యాత్రను ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి కొండ మార్గంలో ప్రయాణం చేస్తే మఠం బావి చేరుకుంటారు. దానికోసం ఆరు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. కొందరు అక్కడ కూడా మజిలీ ఏర్పాటు చేసుకుంటారు.
తర్వాత భీముని చెరువు అని పిలిచే కొండల మధ్యలోనే లోయ ప్రాంతానికి వెళ్తారు. మఠం బావి నుంచి భీముని చెరువు వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అక్కడి నుంచి మళ్లీ మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొండ దిగి కైలాస ద్వారం సమీపానికి చేరుకుంటారు. దాంతో కొండల మార్గం పూర్తవుతుంది. మెయిన్ రోడ్డు కి యాత్ర చేరుతుంది.
దోర్నాల శ్రీశైలం ప్రధాన రహదారిపై మరో నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిస్తే యాత్రికులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు.
జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రఖ్యాతి చెందిన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుని భక్తులు అభిషేకాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనేక సవాళ్లు, అవరోధాలు
అడవి గుండా ప్రయాణం కొండల మీదుగా కాలినడక అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సాగుతుంది అయినప్పటికీ అనేకమంది శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద విశ్వాసంతో తమ కోర్కెలు తీర్చాలని కొందరు, తమ మొక్కులు చెల్లించేందుకు మరికొందరు పట్టుదలగా ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
వయస్సు సహకరించకపోయినా కొందరు వృద్ధులు, చిన్నారులు కూడా పాదయాత్ర చేస్తుంటారు.
మార్గం మధ్యలో కొండలు ఎక్కి, దిగడం వంటి అవస్థలు అధిగమించలేక పలువురు యాత్ర మధ్యలోనే విరమించిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటివారు కనీసంగా పెద్ద చెరువు కాలినడకన రావాల్సి ఉంటుంది.
అక్కడి నుంచి తుమ్మల బయలు గ్రామం చేరేందుకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.
ఆటోలు ఎక్కి వచ్చి, బస్సుల్లో శ్రీశైలం చేరుకునే వారు కూడా ఉంటారు. కానీ అత్యధికులు మాత్రం పట్టువదలకుండా ముందుకే సాగుతారు.

‘‘ మొదట భయం వేసింది. మా నాన్న మొక్కుకున్నారు. ఆయనతో పాటు కలసి వచ్చాను. మేమిద్దరమే ఉన్నాం అనుకున్నాను. కానీ ముందుకు వచ్చే కొద్దీ చాలామంది కనిపించారు. ధైర్యం వచ్చింది. పెద్దగా నడిచే అలవాటు లేదు. అయినా శివయ్య మీద భక్తితో పాదయాత్ర చేస్తున్నా" అంటూ నాగలూటి అటవీ ప్రాంతంలో బీబీసీతో అన్నారు సుమతి.
ఆమె ఓ ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆమెతో వందలాది మంది భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటూ క్లిష్టమైన యాత్రను పూర్తి చేశారు.
సహజంగా మొత్తం వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకూ యాత్ర పూర్తి చేసేందుకు కనీసం 18 గంటల సమయం పడుతుంది. కొందరు 20 గంటల పైగా సమయం తీసుకుంటారు.

ఆహారం, తాగు నీటి ఏర్పాట్లు..
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పాదయాత్రగా వచ్చే వారి కోసం మార్గం మధ్యలో కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. శ్రీశైలం దేవస్థానం బోర్డు అధికారులు యాత్రికుల సౌకర్యార్థం ఆహారం, తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా శివరాత్రికి ముందు వారం రోజుల పాటు, ఉగాది సమయంలోనూ ఉంటుంది.
దాదాపు నలభై రోజుల పాటు ఇలాంటి యాత్ర జరుగుతుంది. ఎక్కువగా భక్తులు వచ్చే సందర్భాల్లో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
సహజంగా అక్కడ ఏమీ అందుబాటులో ఉండే అవకాశం లేదు. జనసంచారం కూడా అరుదు. అలాంటి ప్రాంతంలో భక్తులు తమ వెంట ఆహారం మోసుకుని వెళ్లడం కూడా కష్టం అవుతుంది.
నాగలూటి, పెద్దచెరువు తుమ్మబైలు అటవీ ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు, ఆహారం భక్తులకు ఏర్పాటు చేస్తుంటామని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు.
"పాదయాత్ర మార్గంలో భక్తులు సేదతీరడానికి చలువ పందిళ్ళు, శౌచాలయాలు గత సంవత్సరం కంటే ఎక్కువ ఏర్పాట్లు చేశాం. అటవీశాఖ అధికారుల నుంచి జంగిల్ క్లియరెన్స్ తీసుకుని పాదయాత్రకు అనుమతించాం. భక్తులకు అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చేశాం. కోనేర్లను శుభ్రపరిచి, భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం" అని ఈవో పెద్దిరాజు వివరించారు.

మరిన్ని సదుపాయాలు అవసరం..
ఈ పాదయాత్ర లో శివరాత్రి సమయంలో ఎక్కువగా ఏపి, తెలంగాణా వాసులు పాల్గొంటారు. వారితో పాటుగా మహారాష్ట్ర వాసులు సైతం ఉంటారు.
భక్తుల అవసరాలకు తగ్గట్టుగా దేవస్థానం సదుపాయాలు కల్పించడం లేదనే వాదన ఉంది. అనేక అవస్ధలు అధిగమించి వచ్చిన వారికి తగిన ఆహార ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని కర్నూలు జిల్లా అదోని ప్రాంతానికి చెందిన భారతి అనే మహిళ బీబీసీతో చెప్పారు.
"మూడేళ్ల నుంచి వస్తున్నాం. మా కుటుంబమంతా కలసి వచ్చాం. నిరుడు శివరాత్రికి నాలుగైదు రోజుల ముందు వచ్చాము. ఈసారి శివరాత్రి జాతరలో పాల్గొనేలా వచ్చాం. కానీ మాకు ఇక్కడ భోజనాలు లేవు. అంతా సర్దేశారు. మాతో తెచ్చుకున్న అటుకులు తినేసి సర్దు కున్నాం. అలా కాకుండా ప్రతీ రోజు ఆహారం అందించే ఏర్పాటు చేయాలి" అన్నారు భారతి.
కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమలలో మాదిరిగా దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.
ఒకనాడు కాలి నడకన మాత్రమే శ్రీశైలం కొండకి చేరే అవకాశం ఉన్న కాలంలో ఇలాంటి పాదయాత్ర మార్గంలోనే భక్తులు కొండకి వచ్చే వారు.
నేటికీ ఏటా 25వేల మంది వరకూ ఇలా పాదయాత్ర ద్వారా కొండకి చేరడం వెనుక ఆనాటి సంప్రదాయమే కారణమని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సుధామూర్తి: రాజ్యసభకు నామినేట్ అయిన ఈమె జీవితంలో విశేషాలే కాదు, వివాదాలూ ఉన్నాయి...
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















