ఎలక్టోరల్ బాండ్లు: మేఘా ఇంజినీరింగ్ చిన్న సంస్థగా ప్రారంభమై రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడంలో 2వ స్థానంలో ఎలా నిలిచింది?

ఫొటో సోర్స్, ppreddyofficial/Insta
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు రెండో స్థానంలో నిలిచాయి. రాజకీయ పార్టీలకు 966 కోట్ల రూపాయల విరాళాలు అందించడం ద్వారా ఆ సంస్థ టాప్ 2లో నిలవగా, తెలుగునాట ఎక్కువ విరాళాలు తీసుకున్న పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి నిలిచింది. ఈ పార్టీకి ఏకంగా 12 వందల కోట్ల రూపాయలు విరాళాలు అందాయి.
హైదరాబాద్ కేంద్రంగా ఉండే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీని షార్ట్ ఫామ్ లో మెయిల్ (Meil) అని కూడా పిలుస్తారు. చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ, ప్రధానంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కువగా చేస్తోంది.
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈ కంపెనీయే నిర్మించింది.
మహారాష్ట్రలోని థానే-బోరివలి జంట టన్నెల్స్ ప్రాజెక్టు, దాదాపు రూ.14 వేల కోట్ల విలువైనది కూడా మేఘా చేతుల్లోనే ఉంది.
సాగునీరు, రవాణా, పవర్.. ఇలా ఆ సంస్థ అనేక రంగాలలో వ్యాపారాలు చేస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు ఉన్నట్టు ఆ సంస్థ చెప్పుకుంది. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ కూడా వీరిదే.
బర్గుండీ ప్రైవేట్, హురూన్ ఇండియా అనే రేటింగ్ సంస్థల ప్రకారం, స్టాక్ మార్కెట్లో లిస్టు కాని, భారతదేశపు టాప్ 10 మోస్ట్ వాల్యూబుల్ కంపెనీలలో మూడవ స్థానం మేఘాకు వచ్చింది. అలాగే బయటి పెట్టుబడులు లేని, అంటే బూట్ స్ట్రాప్డ్ కంపెనీలో దేశంలో రెండవ స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Megha Engineering and Infrastructures Ltd/Facebook
చిన్న సంస్థగా మొదలై...
కృష్ణా జిల్లాలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన పామిరెడ్డి పిచ్చి రెడ్డి 1989లో ఈ సంస్థను ప్రారంభించారు. పిచ్చిరెడ్డి బంధువు పురిటిపాటి వెంకట కృష్ణా రెడ్డి ఆ సంస్థకు ఎండీగా ఉన్నారు. పది మంది కంటే తక్కువ మందితో మొదలైన సంస్థ గత ఐదేళ్లలో బాగా విస్తరించింది. మేఘా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌గా మొదలై, 2006లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌గా మారింది.
ఇప్పుడు ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలను దాటి, దేశవ్యాప్తంగా విస్తరించింది.
మేఘా సంస్థ ఇచ్చిన బాండ్ల నుంచి ఏ పార్టీ ఎంత తీసుకుందనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మేఘా తరువాత డాక్టర్ రెడ్డీస్ 80 కోట్లు, ఎన్సీసీ కంపెనీ 60 కోట్లు, నాట్కో ఫార్మా 57 కోట్లు, దివీస్ ల్యాబ్స్ 55 కోట్లు, రామ్కో సిమెంట్స్ 54 కోట్లు విరాళాలు ఇచ్చాయి.
ఇది కాక తెలుగు నాట దాదాపు 30 వరకూ కంపెనీలు, పాతిక మంది పైగా వ్యక్తులు ఈ ఎలక్టోరల్ బాండ్లలో డబ్బు సమర్పించారు. ఆ జాబితాలో సిమెంట్ కంపెనీలు, ఫార్మా-రియల్ ఎస్టేట్ మొదలు కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ లాంటి సంస్థలున్నాయి. వీటిల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంస్థలు ఎక్కువగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TELANGANACMO
7, 8 స్థానాల్లో వైసీపీ, టీడీపీ
దేశవ్యాప్తంగా బీజేపీ అత్యధికంగా బాండ్ల ద్వారా విరాళాలు పొందింది. బీజేపీ మొత్తం రూ.6 వేల కోట్లు తీసుకుంది. ఇది మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో దాదాపు సగం. బీజేపీ తరువాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ రూ.1,600 కోట్లు, కాంగ్రెస్ పార్టీ రూ.1400 కోట్లు తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా నాల్గవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది.
బీఆర్ఎస్ తరువాత ఏడవ స్థానంలో వైయస్సార్సీపీ 337 కోట్లు, 8వ స్థానంలో తెలుగుదేశం 219 కోట్లు, 15వ స్థానంలో జనసేన 21 కోట్లు విరాళాలు తీసుకున్నాయి.
అయితే, ఎన్నిక సంఘానికి స్టేబ్ బ్యాంకు ఇచ్చిన సమాచారం పొందికగా కూర్చలేదు. ఏరోజు ఎవరు ఎంత జమ చేశారు, ఏరోజు ఎవరు ఎంత తీసుకున్నారు? అనేది నేరుగా ఇచ్చేయడం వల్ల వందల పేజీలు, వేల గడుల్లో సమాచారం ఉంది. ఎవరు ఇచ్చిన డబ్బు ఎవరు తీసుకున్నారన్న వివరాలు ఇందులో లేవు. ఇచ్చిన వారి పద్దు వేరుగా, తీసుకున్న వారి పద్దు వేరుగా ఉన్నాయి. వాటిని ఎవరికి వారు లింకు చేసుకోవాల్సి ఉంది.
ఆయా సంస్థలు విరాళాలు ఇచ్చిన తేదీలు, ఆయా తేదీలకు అటు ఇటుగా ఆ సంస్థలకు జరిగిన లాభాలు లేదా ఆ సంస్థలపై ఉన్న కేసులను పోలుస్తూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ డేటాను కచ్చితంగా, స్పష్టంగా సమన్వయం చేసే వరకూ ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు అనేది తెలియదు.
ఒక్క సీపీఎం మాత్రం ఈ ఎన్నికలు బాండ్లను తిరస్కరించింది. తమ పార్టీ దీనికి వ్యతిరేకం అని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఈ ఎన్నికల బాండ్ల ద్వారా తీసుకోలేదు.

ఫొటో సోర్స్, AFP
బాండ్ల సీరియల్ నంబర్ ఉండి ఉంటే..
స్టేట్ బ్యాంకు ఇచ్చిన సమాచారంలో ఆయా బాండ్లు ఎవరు ఇచ్చారు అనే పేరు ఉందే తప్ప వాటి సీరియల్ నంబర్ లేదు.
బాండ్లు కొన్న వారి జాబితాలో వ్యక్తి లేదా సంస్థ పేరిట ఉన్న మొత్తం బాండ్ల విలువ కాకుండా, ఏ రోజు ఎంత కొనుగోలు చేశారో ఇచ్చారు.
అలానే రెండో జాబితాలో ఏ పార్టీ ఏ రోజు ఎంత జమ చేసుకుందో ఇచ్చినప్పటికీ అక్కడ కూడా బాండ్ సీరియల్ నంబర్ ఇవ్వలేదు.
ఈ రెండు జాబితాల్లో బాండ్ సీరియల్ నంబర్లు ఇచ్చి ఉంటే ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారనేది, బాండ్ సీరియల్ నంబర్ల ఆధారంగా తెలుసుకునే వీలు ఉండేది. ఆ వివరాలు వెల్లడించలేదు.
ఆ బాండ్ సీరియల్ నంబర్లు మ్యాచ్ చేసే పని పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుంది అని కోర్టుకు చెప్పింది.
ఆ సీరియల్ నంబర్స్ ఇచ్చి ఉంటే, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి ఉన్న వారు వాటిని మ్యాచ్ చేసుకుని, ఏ పార్టీకి ఎవరి నుంచి విరాళాలు అందాయని తెలుసుకునే వీలు ఉండేది.
ఏ పార్టీకి ఎంతెంత..

విరాళాలు ఇచ్చిన కంపెనీలు

ఆంధ్ర, తెలంగాణ కంపెనీలు
- మేఘా ఇంజినీరింగ్
- నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ
- డాక్టర్ రెడ్డీస్ లేబరేటొరీస్
- నాట్కో ఫార్మా
- ఎన్సీసీ లిమిటెడ్
- అరబిందో ఫార్మా
- రాజపుష్ప
- ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్
- హెటిరో డ్రగ్స్
- శ్రీ చైతన్య స్టూడెంట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్
- గ్రీన్ కో
- సన్ బోర్న్ ఎనర్జీ
- ఎన్ఎస్ఎల్ సెజ్ హైదరాబాద్
- రామ్కో సిమెంట్స్
- సోమశిల సోలార్ పవర్
- కమల్ ట్రేడింగ్ కార్పొరేషన్
- వంశీరాం బిల్డర్స్
- దివీస్ లేబొరేటరీస్
- సాగర్ సిమెంట్స్
- వి బాలవీరయ్య సన్స్
- బయోలాజికల్ ఈ
- బుట్టా హాస్పిటాలిటీస్
- సియెంట్ లిమిటెడ్
- అపర్ణా ఫామ్స్
- కల్పతరు
- షిరిడి సాయి ఎలక్ట్రికల్స్
- భారత్ బయోటెక్.
- రిత్విక్ ప్రాజెక్ట్స్
ఆంధ్ర, తెలంగాణ వ్యక్తులు
- పెద్దిరెడ్డి రామాంజనేయ రెడ్డి
- పప్పిరెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి
- సంగిరెడ్డి తిరుపతి రెడ్డి
- చెన్నవరం స్వప్న
- పి శివ శంకర రెడ్డి
- పోలిన గణేశ్వర రావు
- జోస్యుల వెంకటేశ్
- గోరుకంటి రవీందర్ రావు
- కోనేరు రవితేజ
- కుందూరు పవన్ కుమార్ రెడ్డి
- పి తేజవర్ధన్ రెడ్డి
- బండి రవీంద్రనాథ రెడ్డి
- వీరా రవీంద్ర
- మండవ ప్రభాకర రావు
- కౌకుంట్ల వేణుగోపాల్
- చండక సన్యాసి రావు
- ముప్పన వెంకట రావు
- గుఱ్ఱం మౌనిక
- గుఱ్ఱం రవి
- ఆల రామాంజనేయులు
- బైరపనేని శివార్జున రావు
- గంగదాసు బసివి రెడ్డి
- గౌరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి
- ఎన్వీ సుబ్బా రావు
- ఇందూరు సుధాకర రెడ్డి
- వల్లూరుపల్లి ప్రభు కిషోర్
ఎన్నికల సంఘం ప్రచురించిన దేశవ్యాప్త వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది...' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














