చక్కెరకు చౌకగా లభించే ప్రత్యామ్నాయం ఇదేనట, నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందంటే...

అల్యులోజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయి కార్బిన్
    • హోదా, శాన్ ఫ్రాన్సిస్కో

అల్యులోజ్‌గా పిలిచే ఒక తెల్లని పౌడర్‌ను చూపిస్తూ.. ‘‘ఇది చక్కెరకు ప్రత్యామ్నాయంగా మారబోతోందని మేం భావిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌కు చెందిన డాక్టర్ జీవ్ జ్విఘాఫ్ట్ చెప్పారు.

చక్కెరలో 70 శాతం తీపితో అల్యులోజ్‌ ఉంటుంది. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ. దీంతో శరీరంలోని ‘బ్లడ్ షుగర్’ స్థాయులపై ఇది పెద్దగా ప్రభావం చూపదు.

ఎండు ద్రాక్ష, ఫిగ్స్‌లలో అల్యులోజ్ స్వల్పమొత్తంలో సహజంగానే దొరుకుతుంది.

దీన్ని సాధారణ ప్రజలు తీసుకునేందుకు దశాబ్దం క్రితమే అమెరికా ఆమోదించింది. ‘రేర్ షుగర్’గా పిలిచే దీన్ని ఫ్రక్టోజ్ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.

ఇటు రుచి, అటు పనితీరు.. రెండింటిలోనూ చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్న అల్యులోజ్‌ను ఉత్పత్తి చేయడం ఖర్చుతో కూడుకున్న పని.

అయితే, డాక్టర్ జ్విఘాఫ్ట్‌కు చెందిన ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ అంబ్రోసియా దీన్ని చాలా తక్కువ ధరలో తయారుచేస్తోంది. దీనిలో ఒక ప్రోప్రైటరీ ఎంజైమ్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్ని జన్యుపరమైన మార్పులు చేసిన ఒక సూక్ష్మజీవి ఉత్పత్తి చేస్తోంది. ఇది చక్కెర లేదా హైఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను తీసుకొని అల్యులోజ్‌ను ఉత్పత్తి చేస్తోంది.

చక్కెరను ఉత్పత్తిచేసే సంస్థలతో చేతులు కలపడం ద్వారా అల్యులోజ్‌ను వాణిజ్య అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తి చేయాలని డా. జ్విఘాఫ్ట్ భావిస్తున్నారు.

చక్కెరకు చవకైన ప్రత్యామ్నాయం

ఫొటో సోర్స్, FALLING WALLS

ఫొటో క్యాప్షన్, డాక్టర్ జ్విఘాఫ్ట్‌కు చెందిన ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ అంబ్రోసియా చాలా తక్కువ ధరలో చక్కెర ప్రత్యామ్నాయాన్ని తయారు చేస్తోంది

ఊబకాయం, మధుమేహం స్థాయులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చక్కెర ప్రత్యామ్నాయాలవైపు వినియోగదారులు చూస్తున్నారు. వీరికి తగిన ఉత్పత్తులను అందించేందుకు చాలా ఫుడ్ టెక్ కంపెనీలు శ్రమిస్తున్నాయి.

‘‘చక్కెర ప్రత్యామ్నాయ పరిశ్రమ వృద్ధి బాటలో పయనిస్తోంది’’ అని ఇన్నోవేషన్ కన్సల్టింగ్ సంస్థ గ్రేబీకి చెందిన విశ్లేషకుడు గౌరవ్ సాహ్నీ చెప్పారు.

చక్కెరపై సుంకాలను విధించడం ద్వారా ఈ వృద్ధికి ప్రభుత్వాలు కూడా ఊతం అందిస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం 17 బిలియన్ డాలర్లు (రూ.1.41 లక్షల కోట్లు)గానున్న ప్రపంచ చక్కెర ప్రత్యామ్నాయ పరిశ్రమ మరో పదేళ్లలో 28 బిలియన్ డాలర్లు (రూ.2.32 లక్షల కోట్లు)కు పెరగొచ్చని గ్రేబీ అంచనా వేస్తోంది.

ఇప్పటికే చక్కెరకు చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అస్పార్టేమ్, సచారిన్, సుక్రాలోజ్ లాంటి పాత ప్రత్యామ్నాయాలతోపాటు స్టీవియా, మాంక్ ఫ్రూట్ లాంటి కొత్తవి కూడా వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

చక్కెర కంటే చాలా రెట్లు తియ్యగా ఉండే వీటిని స్వల్ప మొత్తంలో తీసుకుంటే చాలు.

మరోవైపు పాలియాల్ లేదా షుగర్ ఆల్కహాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటికి ప్రజాదరణ పెరుగుతోంది.

చక్కెర, పిండి పదార్థాల నుంచి తయారుచేసే ఇవి చక్కెర అంత తియ్యగా ఉండవు. అయితే, పెద్ద మొత్తంలో వీటిని ఉత్పత్తి చేసుకొనేందుకు వీలుగా ఇవి ఉంటాయి.

చక్కెరకు చవకైన ప్రత్యామ్నాయం

ఫొటో సోర్స్, Getty Images

‘డిమాండ్‌ను చేరుకోలేకపోతున్నాయి’

అయినప్పటికీ ఈ ప్రత్యామ్నాయాలు డిమాండ్‌ను అందుకోలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ రుచి తర్వాత వచ్చే అనుభూతి సమస్యగా మారుతోంది.

తినేందుకు అనువుగా ఉండటం, రంగు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. లాంటి అంశాల్లో చక్కెరతో ప్రత్యామ్నాయాలు పోటీ పడలేకపోతున్నాయి.

‘‘చక్కెర తీపిని ఇవ్వడంతోపాటు చాలా పనులు చేస్తుంది’’ అని అమెరికా బయోటిక్ కంపెనీ జింక్‌కో బయోవర్క్స్‌కు చెందిన సీనియర్ డైరెక్టర్ మెర్విన్ డిసౌజా చెప్పారు.

మరోవైపు ప్రత్యామ్నాయాలతో కొన్ని అనారోగ్యపరమైన ముప్పులు కూడా ఇక్కడ ఉంటున్నాయి. పాలియోల్స్‌లో ఒకటైన ఎరిథ్రోటిల్‌తో పక్షవాతం, గుండె పోటు వచ్చే ముప్పు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది.

మరోవైపు అస్పార్టేమ్ క్యాన్సర్ కారకం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) క్యాన్సర్ నిపుణులు హెచ్చరించారు.

బరువును నియంత్రించేందుకు నాన్-షుగర్ స్వీటెనర్స్‌ను ఉపయోగించడాన్ని తగ్గించుకోవాలని గత మే నెలలో డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వీటి వల్ల కూడా మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ముప్పుందని హెచ్చరించింది.

దీంతో స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నాయి.

చవకైన ‘‘రేర్ షుగర్‌’’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తున్న సంస్థ అంబ్రోసియా బయో మాత్రమే కాదు.

గత జనవరిలో అమెరికాకు చెందిన బోన్యుమోస్ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే మరో చక్కెర ప్రత్యామ్నాయం టాగటోస్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద షుగర్ రీఫైనరీ ఏఎస్ఆర్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకుంది.

టాగటోస్‌ కూడా చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం. ‘‘ చక్కెరలో 90 శాతం తీపితో ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది’’ అని బోన్యుమోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ రోజెర్స్ అన్నారు.

బ్రిటన్‌లోనూ ద సప్లాంట్ కంపెనీ క్యాలరీలు తక్కువగా ఉండే ఒక చక్కెర ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసింది. ఆహార ధాన్యాల పొట్టు, కాండం లాంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి శీలింధ్రాల్లో కనిపించే ఎంజైమ్‌ల సాయంతో దీన్ని ఉత్పత్తి చేస్తోంది.

‘‘ఇది దాదాపు చక్కెర లానే పనిచేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చక్కగా దొరుకుతాయి. ఇది పర్యావరణహితమైనది కూడా’’ అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. టామ్ సైమన్స్ అన్నారు.

మరో ఇజ్రాయెల్ స్టార్టప్ కంపెనీ ఇంక్రెడో కూడా ఆహారంలో ఉపయోగించే మినరల్ సిలికాతో చక్కెరలో మార్పులు చేస్తోంది.

దీని వల్ల చక్కెరలో తీపి తగ్గుతుంది. అంతేకాదు నోటిలో తేలిగ్గా కరిగేలా దీనిలో మార్పులు చేస్తున్నారు. ఫలితంగా అదే రుచికి కాస్త తక్కువ చక్కెరను మనం ఉపయోగించొచ్చు. ప్రస్తుతం అమెరికాలో చాక్లెట్ తయారీ సంస్థ బ్లోమెర్.. ఇంక్రెడోతో ఒప్పందం కుదుర్చుకుంది.

మరోవైపు స్వీట్ ప్రోటీన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చక్కెర కంటే కొన్ని వేల రెట్లు తీయగా ఉండే ఇవి, కొన్ని పళ్లలో సహజంగా లభిస్తుంటాయి. ఇవి మిగతా ప్రత్యామ్నాయాల కంటే మెరుగ్గా పనిచేస్తాయని వీటిని ఉత్పత్తిచేసే సంస్థలు చెబుతున్నాయి.

చక్కెరకు చవకైన ప్రత్యామ్నాయం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాకు చెందిన స్టార్టప్ ‘ఊబ్లి’ స్వీట్ ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తోంది. చక్కెరను పులియబెట్టి జన్యుమార్పులు చేసిన ఈస్ట్‌ను ఉపయోగించి దీన్ని తయారుచేస్తోంది.

‘‘సోడాల తయారీకి ఇవి చక్కగా సరిపోతాయి’’ అని ఊబ్లి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలీ వింగ్ అన్నారు.

అయితే, ఈ స్టార్టప్ కంపెనీలు చాలా అవరోధాలను కూడా ఎదుర్కొంటున్నాయి.

వీటిలో మొదటిది కస్టమర్లను చేరుకోవడం. కొత్త ప్రత్యామ్నాయంతో తమ ఉత్పత్తుల్లో మార్పులు చేయడానికి పెద్దపెద్ద సంస్థలకు కొన్నేళ్ల సమయం పడుతుంది. అదే సమయంలో భారీగా వీటిని ఉత్పత్తి చేయగలమని స్టార్టప్‌లు నిరూపించుకోవాలి.

మరోవైపు ఈ కొత్త ఉత్పత్తులను ప్రయత్నించేందుకు కొన్ని సంస్థలు సంకోచిస్తుంటాయి కూడా.

చక్కెరకు చవకైన ప్రత్యామ్నాయం

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం కూడా చాలా కష్టమే. అమెరికాలో జనరల్లీ రికగ్నైజ్డ్ ఏస్ సేఫ్ (జీఆర్ఏఎస్) కింద కొన్ని కంపెనీలకు అనుమతులు వస్తుంటాయి. కానీ, యూరప్‌లో ఇలాంటి అనుమతులు తీసుకోవడం కష్టంతో కూడుకున్నపని.

ప్రస్తుతానికి అల్యులోజ్‌కు బ్రిటన్‌లో లేదా యూరోపియన్ యూనియన్‌లో అనుమతి లేదు. ద సప్లాంట్ కంపెనీ బ్రిటన్, ఈయూ నియంత్రణా సంస్థలకు నమూనాలను పంపించే పనిలో ఉంది. అదే సమయంలో టాగటోస్‌కు అమెరికా, బ్రిటన్, ఈయూలలో అనుమతి ఉంది.

మరోవైపు మార్కెటింగ్ చేయడం కూడా కొంచెం కష్టమే. వీటిని ‘జీరో షుగర్’గా చెప్పుకోవడానికి వీల్లేదు.

అయితే, కొత్త చక్కెర ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లోకి రావడం చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ న్యూట్రిషన్ బయాలజిస్టు కింబెన్ స్టాన్‌హోప్ అన్నారు. ‘‘ఈ ఉత్పత్తులు మనకెంతో అవసరం’’ అని ఆమె చెప్పారు.

ఈ ఉత్పత్తులతో బరువు, మధుమేహాలను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆమె భావిస్తున్నారు.

అయితే, ఈ ప్రత్యామ్నాయాలను అనుమతించే ముందు, జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని ఆమె చెబుతున్నారు. ‘‘క్లినికల్ ట్రయల్స్ తప్పనిసరి’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, చక్కెరకు చౌకగా దొరికే ప్రత్యామ్నాయం ఇదేనట

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)