ప్రపంచ నిద్ర దినోత్సవం: గురక ఎందుకొస్తుంది? అది బంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సునెత్ పెరెరా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
‘‘నా భర్త పెద్దగా గురక పెట్టడంపై నా కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు సరదాగా జోకులు చేసేదాన్ని. కానీ, అసలు విషయం ఏంటంటే, ఆయన గురక నన్ను చాలా ఇబ్బంది పెట్టేది’’ అని సింగపూర్‌కు చెందిన ఒక 45 ఏళ్ల వివాహిత అరునిక సెల్వం చెప్పారు.
‘‘నా భర్తతో దీని గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ కోపగించుకుంటాడేమోనని భయపడేదాన్ని’’ అని ఆమె అన్నారు.
పెళ్లితో పాటు గురక కూడా ప్యాకేజీలా వచ్చేస్తుందని భావించేదాన్నని, కానీ, ఇది భర్తతో తనకున్న బంధాన్ని దెబ్బతీసిందన్నారు.
‘‘గురక వల్ల ఆయన రాత్రంతా సరిగా నిద్రపోరు. దీంతో, ఉదయం పూట కోపంగా ఉంటారు’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.
భర్త గురక వల్ల అరునిక కూడా రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోరు. సరైన నిద్ర లేకపోవడం వల్ల తర్వాత రోజు ఆమె పనిపై ప్రభావం చూపేది.
గురక సాధారణమే అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ, భాగస్వామిపై, ఇది వారి మధ్య బంధంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్లీప్ ఆప్నియా అంటే ఏమిటి?
గట్టిగా గురకపెట్టడం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా(ఓఎస్ఏ) అని పిలిచే నిద్ర రుగ్మతకు సంబంధించినది. దీని వల్ల నిద్రలో తరచుగా శ్వాస తీసుకోవడం ఆపివేయడం, మళ్లీ తీసుకోవడం జరుగుతుంటుందని నిపుణులు చెప్పారు.
ఈ రుగ్మత వల్ల సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై, రక్తంలో ఆక్సీజన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది.
స్లీప్ ఆప్నియా లక్షణాలు భిన్నంగా ఉంటాయని, స్వల్పంగా, మధ్యస్థమంగా నుంచి తీవ్రంగా కూడా ఉంటాయని బ్రిటన్‌లో జేమ్స్ కుక్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో శాశ్వకోశ వైద్య కన్సల్టెంట్‌గా పనిచేసే డాక్టర్ రామమూర్తి సత్యమూర్తి చెప్పారు. కొన్నిసార్లు ఇది తీవ్ర ప్రమాదకరంగా కూడా మారుతుందన్నారు.
దీనికి చికిత్స చేయించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల గురక పెట్టే వ్యక్తి, వారి భాగస్వామి ఇద్దరి మధ్యలో లైంగిక బంధంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్లీప్ ఆప్నియా లక్షణాలేంటి?
ఈ లక్షణాలు సాధారణంగా మీరు నిద్రపోతున్నప్పుడు కనిపిస్తుంటాయి. అవేంటంటే..
- బిగ్గరగా గురకపెట్టడం
- శ్వాస తీసుకోవడం ఆపడం, మళ్లీ తీసుకోవడం
- ఉక్కిరిబిక్కిరి అవ్వడం, శ్వాస తీసుకునే సమయంలో శబ్దాలు చేయడం
- నిద్రలో పదేపదే మేల్కోవడం
పగటి పూట కూడా దీని వల్ల ఇబ్బంది పడుతుంటారు. రోజులో కనిపించే లక్షణాలు ఏంటంటే..
- లేచినప్పుడు తీవ్రమైన తలనొప్పి రావడం
- చాలా అలసటగా అనిపించడం
- ఏదైన పనిపై నిమగ్నత తగ్గడం
- జ్ఞాపకశక్తి పడిపోవడం
- పదేపదే మానసిక కుంగుబాటుకు గురికావడం, చిరాకు లేదా ఇతర మానసిక పరిస్థితులను ఎదుర్కోవడం
- భాగస్వామికి సరైన సహకారం ఇవ్వలేకపోవడం
- లైంగిక ఆసక్తి తగ్గడం
- ఇతర ఆరోగ్య సమస్యలు
స్లీప్ ఆప్నియా వల్ల రక్తంలో అకస్మాత్తుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తపోటు పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సంబంధిత ఎన్నో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పారు.
ఓఎస్ఏ వల్ల గుండె ఫెయిల్ అయ్యే ప్రమాదం 140 శాతం పెరుగుతుందని, గుండె పోటు వచ్చే అవకాశం 60 శాతం, కరోనరీ గుండె వ్యాధి ప్రమాదం 30 శాతం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
స్లీప్ ఆప్నియా లైంగిక ఆసక్తిపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు స్లీప్ థెరపిస్టులు అంటున్నారు.
కొంతమంది జంటలు తమ భాగస్వామి గురకను హాస్యాస్పందంగా భావిస్తున్నప్పటికీ, వారి బంధం విషయంలో తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారని డాక్టర్ సత్యమూర్తి చెప్పారు.
‘‘దీని వల్ల జంటలు వేరువేరు గదుల్లో పడుకుంటున్నారని, స్లీప్ డివర్స్ అనే విధానానికి ఇది కారణమైంది’’ అని చెప్పారు.
గురక పెట్టినా, పెట్టకపోయినా జంటలు వేరుగా పడుకోవడం చెడ్డ విషయమేమీ కాదని అమెరికాకు చెందిన రిలేషన్‌షిప్ థెరపిస్ట్ సారా నాసెర్‌జాదే చెప్పారు.
రాత్రి మంచి నిద్ర వల్ల భాగస్వాముల ఇద్దరి మధ్య కూడా ఆరోగ్యకరమైన సంబంధాలు మెరుగవుతాయని ఆమె బీబీసీతో అన్నారు. అయితే, అదనపు బెడ్‌రూమ్ ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
కానీ, కొన్ని జంటలకు మాత్రం ‘స్లీప్ డివోర్స్’ అనేది శాశ్వతంగా విడిపోయేందుకు తొలి అడుగు అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తలసరి జీడీపీ ఉన్న అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన సింగపూర్‌లో అరునిక సెల్వం నివసిస్తున్నప్పటికీ, ఆమెకు ఇంట్లో ప్రత్యేకంగా బెడ్‌రూమ్ లేదు.
‘‘సింగపూర్‌లో నివసించడం అత్యంత ఖర్చు కావడం వల్ల మేం అదనపు ఆదాయం కోసం మా గెస్ట్ రూమ్‌ను అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది’’ అని ఆమె చెప్పారు. ఆమెకు ఒక బిడ్డ ఉన్నారు. 15 ఏళ్ల క్రితం పెళ్లయింది.
ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపిన తర్వాత, అరునిక సెల్వం తన భర్తతో ఆయన గురక సమస్య గురించి మాట్లాడారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భాగస్వామితో ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాలి?
ఆయన వైద్యునికి చూపించుకునేందుకు నిరాకరించారు. ఎందుకంటే, తన తండ్రి, తాత కూడా గురకపెట్టేవారని అన్నారు. ఇది సాధారణమేనని ఆయన నమ్ముతున్నారు.
గురక వల్ల నిద్రకు భంగం వాటిల్లడంతో అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడి, అనవసర వాదనలకు దారితీస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామితో దీని గురించి సున్నితంగా, వారిని నొప్పించకుండా మాట్లాడేందుకు సరైన సమయం కూడా చూడటం అత్యంత ముఖ్యమని వైద్య నిపుణురాలు సారా నాసెర్‌జాదే చెప్పారు.
‘‘శారీరకంగా ఒకటైన తర్వాత లేదా భర్త సంతోషంగా, మంచి మూడ్‌లో ఉన్నారని అనిపించినప్పుడు దీని గురించి మాట్లాడవచ్చు’’ అని సూచించారు.
లవ్ బై డిజైన్ – 6 ఇంగ్రిడియెంట్స్ టూ బిల్డ్ ఏ లైఫ్‌టైమ్ ఆఫ్ లవ్ అనే పుస్తకాన్ని సారా రాశారు.
గురకపెట్టే వ్యక్తికి తన పరిస్థితి ఇబ్బందికరంగా అనిపిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సోషల్ సైకాలజీ నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గురక వల్ల వచ్చే తీవ్ర పరిణామాలేంటి?
బ్రిటన్‌లో సుమారు 1.5 కోట్ల మంది గురకపెట్టే వ్యక్తులున్నారని, దీని వల్ల దేశంలో 3 కోట్ల మంది ప్రజలు అంటే సగం జనాభాపై ప్రభావం పడుతుందని బ్రిటీష్ స్నోరింగ్ అండ్ స్లీప్ ఆప్నియా అసోసియేషన్ తెలిపింది.
గురకపెట్టే వ్యక్తులు మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారని తాజా అధ్యయనం సూచిస్తుందని ఈ అసోసియేషన్ చెప్పింది.
గురకపెట్టే వ్యక్తి ఎవరనే దానితో సంబంధం లేకుండా, దీని వల్ల తీవ్ర పరిణామాలు ఉంటున్నాయని హెచ్చరించింది.
అమెరికా, బ్రిటన్‌లో విడాకులకు దారితీసే కారణాల్లో గురక ఒకటని కొన్ని రిపోర్టులు సూచిస్తున్నప్పటికీ, ఇదే కారణమని చెప్పేందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలను గుర్తించలేకపోతున్నారు.
గురక వల్ల సంబంధాలపై తీవ్ర సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
గురకతో లింకై ఉన్న ఎన్నో విడాకుల కేసులు తమ సంస్థ వద్దకు వస్తున్నాయని బ్రిటన్‌లోని ఫ్యామిలీలాయర్‌గా పనిచేసే రితా గుప్తా చెప్పారు.
‘‘పెళ్లిళ్లలో సంతోషం లేకపోవడానికి కారణాల్లో ఇది కచ్చితంగా ఒకటిగా ఉంటుంది’’ అని బీబీసీతో చెప్పారు.
‘‘నేను ఎంతో మంది చెప్పింది వింటున్నాను. గురక వల్ల ఎన్నో ఏళ్లుగా మేం వేరువేరు గదుల్లో పడుకుంటున్నాం. మేం ఇప్పుడు కేవలం విడిపోతున్నాం అంతే అంటున్నారు’’ అని తెలిపారు.
విడాకుల కేసుల్లో వైద్య చికిత్సలను నిర్లక్ష్యం చేయడం సాధారణ సమస్యగా ఉంటుందని, ఈ సమస్యను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను వారు తీసుకోవడం లేదని, అదే బంధాలపై ప్రభావం చూపుతుందని ఈ ఫ్యామిలీ లాయర్ చెప్పారు.
ఒక మహిళ చెప్పిన విషయాన్ని ఆమె ఉదాహరణకు తీసుకున్నారు.
‘‘ఆయన గట్టిగా గురకపెడుతుంటారు. ఆ సమయంలో నాకు సరిగ్గా నిద్రపట్టదు. నా నిద్రపై ఆయన గురక బాగా ప్రభావం చూపుతుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు’’ అని ఆ మహిళ వాపోయాని తెలిపారు.
గురక లేదా స్లీప్ ఆప్నియా వచ్చినప్పుడు ఏం చేయాలి?
స్లీప్ ఆప్నియా చికిత్సల్లో మీ జీవన శైలిలో కొన్ని మార్పులు వస్తాయి.
- బరువు తగ్గాలి.
- ధూమపానాన్ని ఆపివేయాలి.
- ఆల్కాహాలో తీసుకోవడం తగ్గించాలి.
- చాలా మంది కంటిన్యూయెస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్- సీపీఏపీ అని పిలిచే వైద్య పరికరాన్ని వాడాల్సినవసరం ఉంది.
- ఇది మీరు నిద్రపోయేటప్పుడు ముక్కును లేదా నోటిని కవర్ చేస్తూ పెట్టుకున్న మాస్కు లోపలికి తాజా గాలిని, సున్నితంగా చొప్పిస్తూ ఉంటుంది.
నిద్రలో వచ్చే శ్వాసపరమైన ఇబ్బందులను ఈ సీపీఏపీ పరికరం నిరోధిస్తుంది.
భాగస్వామి, గురకపెట్టే వ్యక్తి ఆరోగ్యానికి ప్రాధానత్య ఇవ్వడం అత్యంత ముఖ్యమని, వైద్య సలహా తీసుకునేలా వారిని ప్రోత్సహించాలని డాక్టర్ రామమూర్తి సత్యమూర్తి చెప్పారు.
‘‘ఇది కేవలం రిలేషన్‌షిప్‌కు మాత్రమే కాక, ఆర్థికంగా కూడా ప్రయోజనకరం. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం తక్కువగా డబ్బులు ఖర్చు చేయొచ్చు. మొత్తం కుటుంబానికే ఇది ప్రయోజనకరం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఇబ్బందులు
గురక విషయంలో ఇతరుల వైఖరి ప్రపంచవ్యాప్తంగా, వ్యక్తుల మధ్య భిన్నంగా ఉంటుండొచ్చు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు, జెండర్, లైంగికతల ద్వారా కూడా ఈ వైఖరులు ప్రభావితం కావొచ్చు.
శ్రీలంకలోని కొలంబోలో హోటల్ రిసెప్షనిస్ట్‌గా పనిచేసే 40 ఏళ్ల గే వ్యక్తి సమన్(అసలు పేరు కాదు) ఇప్పటికీ తన కుటుంబం వద్ద తన లైంగికతను దాచి ఉంచారు. తన ఇంట్లో ఉండే ఆయన లవర్ సమన్ కుటుంబానికి కేవలం స్నేహితునిగా మాత్రమే తెలుసు.
‘‘నా భాగస్వామి గట్టిగా గురకపెడతాడు. ఆయన గురక వల్ల నేను సరిగ్గా నిద్రపోలేను. మా అమ్మ వచ్చినప్పుడు మాత్రమే నేను మంచి నిద్రపోగలను’’ అని సమన్ బీబీసీకి చెప్పారు.
‘‘అమ్మ వచ్చినప్పుడు, మా రూమ్‌లో ఉండే అదనపు గదిని తన గదిగా చెప్పుకుని అమ్మకు ఇస్తాడు. అప్పుడు నా భాగస్వామి సోఫాపై పడుకుంటాడు’’ అని చెప్పారు.
దీంతో, ఆ సమయంలో మాత్రమే తాను సరైన నిద్రపోగలుగుతానని తెలిపారు.
‘‘నా లవర్ తనను తాను ఆడలక్షణాలతో ఉన్న గే వ్యక్తిగా భావిస్తాడు. కానీ, మన సంస్కృతిలో గురక అనేది మగవారిదిగా భావిస్తారు. ఆయనతో దీని గురించి చర్చిస్తే బాధపడతాడేమోనని, నన్ను విడిచి వెళ్లిపోతాడేమోనని భయం వేస్తుంది’’ అని సమన్ అన్నారు.
సమన్ తన ప్రేమికుడితో ఈ గురక విషయం గురించి మాట్లాడేందుకు సాహసం చూపారు. అలాగే, సెల్వం కూడా తన భర్తను వైద్యునికి చూపించేందుకు ఒప్పించారు. ఫలితంగా వారికి అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉందని తెలిసింది.
తన భర్త ఇప్పటికే ఈ విషయంపై తగిన శ్రద్ధ వహిస్తూ, కొంత బరువు తగ్గేందుకు వ్యాయామాలు కూడా చేస్తున్నారని సెల్వం చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- గజనీ మహ్మద్: సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత?
- శ్రీశైలం: దట్టమైన నల్లమల అడవిలో వేలమంది జరిపే ఈ యాత్ర ఏంటి, ఎలా సాగుతుంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














