స్కార్లెట్ ఫీవర్: ఈ జ్వరం పిల్లలకు ప్రాణాంతకమా? లక్షణాలు, చికిత్స ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం పిల్లల్ని బ్యాక్టీరియల్ జ్వరం వణికిస్తోంది. దాని పేరు స్కార్లెట్ ఫీవర్.
సాధారణంగా జ్వరం అనేసరికి వైరల్ ఇన్ఫెక్షన్లు అనుకుంటాం. కానీ, ఇది బ్యాక్టీరియాతో వచ్చే జ్వరం. గత రెండు, మూడు నెలలుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు బాగా ఎక్కువగా నమోదువుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు.
ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ఈ కేసులు ఎక్కువగా రిపోర్టు అవుతున్నట్లు చెబుతున్నారు. ఓపీలోనే చూపించుకుని వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని ఫీవర్ కేసులు వస్తున్నాయో చెప్పలేకపోతున్నారు.
ప్రస్తుతం వచ్చే ఫీవర్ కేసులలో 25 నుంచి 30 శాతం స్కార్లెట్ ఫీవర్ కేసులు రిపోర్టు అవుతున్నాయని చెప్పారు అంకుర ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సి.సుమన్ కుమార్.
గతంలో కేవలం ఒకటి, రెండు శాతం కేసులు వచ్చేవని, ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగిందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫీవర్, లక్షణాలు
జ్వరాల్లో వైరల్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ఉన్నట్లే.. స్కార్లెట్ ఫీవర్ కూడా ఒక రకమైన జ్వరం.
ఇది స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, దద్దుర్లతో మొదలవుతుంది.
సాధారణ జ్వరం తరహాలోనే శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. 102, 103 డిగ్రీల జ్వరం వస్తుంది.
ఈ జ్వరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ‘‘విపరీతమైన గొంతు నొప్పితో స్కార్లెట్ ఫీవర్ మొదలవుతుంది.’’ అని చెప్పారు డాక్టర్ సి.సుమన్ కుమార్.
ఈ ఫీవర్ లక్షణాలను ఆయన బీబీసీకి వివరించారు.
- నాలుకపై మంట రావడం
- శరీరంపై దద్దుర్లు
- గొంతులో ఎర్రటి పొక్కులు
- నాలుక రంగు స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
- గొంతులో పగుళ్లు కూడా రావొచ్చు.
- నోరు, మెడ, చేతులు, కాళ్లపై ర్యాషెస్(చిన్నపాటి పొక్కులు)
- విపరీతమైన దురద
- తలనొప్పి, వికారం
- కడుపు నొప్పి
జ్వరం, గొంతునొప్పి నాలుగైదు రోజులపాటు ఉంటుందని డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు. శరీరంపై దద్దుర్లు తగ్గడానికి మాత్రం ఏడు రోజులు పడుతుందని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ వయసు పిల్లలకు వస్తుంది..
స్కార్లెట్ ఫీవర్ బడి ఈడు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంది.
- 2 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో ఫీవర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ.
- 5 నుంచి 7 సంవత్సరాల వయసుకు అవకాశాలు కాస్త తగ్గుతాయి.
- 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఇంకొంచెం తగ్గుతుంది. అసలు ఫీవర్ రాదని కాదుగానీ, వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- ఆ తర్వాత వయసులో ఈ ఫీవర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మమ్స్(దవడ బిళ్లలు లేదా గవద బిళ్లల వాపు) వంటివి ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వ్యాధులతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు వేరొక ఇన్ఫెక్షన్లు సోకేందుకు వీలుంటుంది. దీని వల్ల స్కార్లెట్ ఫీవర్ కూడా వ్యాపిస్తుంది.
ఒకరి నుంచి మరొకరికి..
ఇదొక అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి.. ముఖ్యంగా పిల్లల్లో సులువుగా వ్యాప్తి చెందుతుంది.
పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఒకరితో మరొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు పడటం, ఒకరి వస్తువులు మరొకరు వాడడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.
స్కార్లెట్ ఫీవర్‌కు సరైన సమయంలో చికిత్స చేస్తే వెంటనే తగ్గిపోతుందని అంటున్నారు కాచిగూడలోని నియోబీబీసీ ఆసుపత్రి పిల్లల వైద్యులు డాక్టర్ రంగయ్య.
‘‘99శాతం ఆసుపత్రిలో చేరే అవసరం ఉండదు. పిల్లలు ఆహారం తీసుకోలేక నీరసపడిపోవడం, మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం వహించి వ్యాధి ముదిరి నిమోనియాకు దారితీస్తే మినహా ఆసుపత్రిలో చేరే అవకాశాలు చాలా తక్కువ’’ అని చెప్పారు డాక్టర్ రంగయ్య.
గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మరింత ఇబ్బందికరమని వివరించారు. గొంతు నుంచి గుండె/కిడ్నీ/మెదడు/ ఎముకల్లోకి ఇన్ఫెక్షన్ చేరి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే మందులు వేసుకోవాలి?
ఫీవర్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కనీసం వారం రోజులపాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
జ్వరం తగ్గిన తర్వాత కూడా నాలుగు రోజులు కూడా యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుందని డాక్టర్ సుమన్ కుమార్ వివరించారు.
ఈ ఫీవర్ తగ్గే సమయంలో చర్మం పొట్టులా ఊడిపోతుంది. మళ్లీ యథావిధిగా కొత్త చర్మం వస్తుంది.
మమ్స్.. స్కార్లెట్ ఫీవర్‌కి తేడా ఏమిటి.?
ఈ రెండింటి మధ్య తేడాను డాక్టర్ సుమన్ కుమార్ వివరించారు.
‘‘మమ్స్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్.. దవడ బిళ్లలకు వైరస్ సోకి వాపు వస్తుంది. దీనివల్ల ఆహారం తీసుకోలేరు. ఇది వారం రోజుల వరకు ఉంటుంది. జ్వరం అనేది ఎక్కువగా ఉండకపోయినా, నాలుగైదు రోజులు ఉంటుంది.
స్కార్లెట్ ఫీవర్ సోకితే గొంతులో నొప్పి వస్తుంది. యాంటీబయాటిక్స్ తప్పకుండా తీసుకోవాలి. అదే మమ్స్ వస్తే యాంటీబయాటిక్స్ అవసరం ఉండకపోవచ్చు. హైఫీవర్ వస్తుంది. చలి వేస్తుంది. దద్దుర్లతో వచ్చే దురదతో నిద్ర సరిగా పట్టదు. చర్మానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.
స్కార్లెట్ ఫీవర్‌లో ఒకరికి ఇన్ఫెక్షన్ సోకితే.. వేరొకరికి వ్యాప్తి చెందడానికి రెండు, మూడు రోజులు పడుతుంది.
మమ్స్ విషయంలో రెండు వారాల తర్వాత ఇన్ఫెక్షన్ సోకుతుంది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆహారం, జాగ్రత్తలు
జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు సాత్విక ఆహారం అందించాలని, లిక్విడ్ ఫుడ్(ధ్రవ పదార్థాలు) ఇవ్వడం మేలని డాక్టర్ సుమన్ కుమార్ చెప్పారు.
- ఈ జ్వరం వచ్చిన పిల్లల్లో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆహారం సరిగ్గా తినలేకపోవచ్చు. అందుకే ధ్రవ పదార్థాలు అందించడం మంచిది. సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఇవ్వాలి.
- చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- తమ్మినా.. దగ్గినా చేతులు లేదా కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోమని పిల్లలకు చెప్పాలి.
- మాస్కు వేసుకుంటే మంచిది. చల్లని పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.
అలాగే, ఇన్ఫెక్షన్ తగ్గిందా.. లేదా.. అనే విషయాన్ని తెలుసుకోవడానికి పీడియాట్రిషియన్ వద్దకు పిల్లలను తీసుకెళ్లి చెకప్ చేయించడం ఉత్తమం. లేకపోతే వారం తర్వాత మళ్లీ ఫీవర్ వచ్చే వీలుంది.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం: రష్యాలో ‘లక్షన్నర జీతం’తో ఉద్యోగాలంటూ భారతీయులను ట్రాప్ చేస్తున్న ఏజెన్సీ.. పట్టుకున్న సీబీఐ
- రూపా వైరాప్రకాశ్: మరుగుజ్జువు నువ్వేం చేయగలవంటే.. ఏకంగా పారాలింపిక్స్‌లో బంగారు పతకంతో తిరిగొచ్చారు
- మహిళా దినోత్సవం: ‘స్టెమ్’లో మహిళలు మగవారిని మించిపోయారా?
- 'డ్రై-ఐస్' తిన్న తరువాత నోట్లోంచి రక్తం పడింది... గురుగ్రామ్ రెస్టారెంట్లో అసలేం జరిగింది?
- గవదబిళ్లలు: పిల్లలను ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలేంటి? చికిత్స ఎలా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














