మహిళా దినోత్సవం: ‘స్టెమ్‌’లో మహిళలు మగవారిని మించిపోయారా?

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రిత్విక్ దత్తా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరోగ్యం, ఆఫీసులు, వ్యాపారాలు, రాజకీయాల్లో భారతీయ మహిళల ప్రాతినిధ్యం ఎంత?

కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో గతంతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో ఎంత మెరుగుదల ఉందో తెలుసుకునేందుకు మేం ప్రభుత్వ గణాంకాలను పరిశీలించాం.

వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తే, గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరింత నిశితంగా గమనిస్తే ఆ గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

వివిధ రంగాల్లో మహిళా ప్రాతినిధ్య వృద్ధిని అర్థం చేసుకునేందుకు ఈ కథనంలో మేం కొన్ని రంగాలను పరిశీలించాం.

కార్మిక శక్తిలో మహిళలు

ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్వహించే కార్మిక శక్తి సర్వే ప్రకారం, 2017-18లో 23.3 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2020-21లో 32.5 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.

పట్టణ ప్రాంతాల్లో 23.2 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 36.5 శాతంగా ఉంది.

మహిళలు

భారత్‌లో మహిళా శ్రామికశక్తిలో పెరుగుదల ఉన్నప్పటికీ, అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో, ఆ తర్వాత వేల మంది మహిళలు పనులకు దూరమయ్యారు. ఇప్పటికీ పురుష కార్మికుల సంఖ్యతో సమానంగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసంఘటిత రంగంలో కార్మికుల సంఖ్య గురించి కచ్చితమైన గణాంకాలు లేకపోవడాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపా సిన్హా ప్రస్తావించారు. గణాంకాలు లేకపోవడం వల్ల కార్మిక శక్తిలో లింగ ప్రాతినిధ్యాన్ని తెలుసుకోవడం క్లిష్టతరమని ఆమె అభిప్రాయపడ్డారు.

మహిళలు చదువుకోగలిగినప్పటికీ ప్రసవాలు, ప్రసూతి సెలవులు, సమాన వేతన సమస్యల వంటి కారణాలతో శ్రామిక శక్తిలో వారి ఉనికి సవాల్‌గా మారింది.

''చాలా మంది మహిళలు చదువు, లేదా ఉద్యోగాన్ని మధ్యలోనే ఆపేస్తారు. ఇష్టపూర్వకంగానైనా లేదా బలవంతంగానైనా. ఇది నాయకత్వ స్థానాల్లో వారి ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది'' అని ఆమె బలంగా చెప్పారు.

నిర్ణయాధికారాలు ఉండే స్థాయికి రావడం రాత్రికి రాత్రే జరగదని, అయితే అన్ని కార్యాలయాల్లోనూ లింగపరమైన ఇబ్బందులు కలగని సురక్షిత ప్రదేశాలను సృష్టించడం కూడా చాలా కీలకమని ఆమె అన్నారు.

మహిళలు

స్టెమ్‌లో మగవారిని మించిపోయిన మహిళలు

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నత విద్యపై నిర్వహించిన సర్వేలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020-21 విద్యా సంవత్సరంలో 29 లక్షల మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది.

ఇది ఆయా కోర్సుల్లో అబ్బాయిల దరఖాస్తుల కంటే అధికం.

అదే విద్యా సంవత్సరంలో 26 లక్షల మంది అబ్బాయిలు స్టెమ్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

మహిళలు

2016-17 ఏడాదిలో స్టెమ్‌లో మహిళల సంఖ్య పురుషుల కంటే తక్కువ.

ఈ ట్రెండ్ 2017-18లో పుంజుకుంది. 2018-19 నాటికి పురుష అభ్యర్థులను మహిళా అభ్యర్థులు అధిగమించారు.

గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక ప్రకారం, భారత్‌లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో మహిళలు దాదాపు 27 శాతం ఉన్నారు.

కానీ, లింగం ఆధారంగా వేతనాల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. లింగ ఆధారిత వేతనాల వ్యత్యాసంలో, 146 దేశాల జాబితాలో భారత్ 127వ స్థానంలో ఉంది.

స్టెమ్ వంటి వృత్తుల్లో పరిశోధనకు సంబంధించిన, అంటే ప్రయోగాశాలల్లోకి ప్రవేశం వంటివి చాలా కీలకమని దీపా సిన్హా అన్నారు.

అలాంటి అవకాశాలను పొందడం వల్ల అర్ధరాత్రిళ్లు భద్రత గురించిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడం, అందుకు తగినట్లుగా విధానాల రూపకల్పనతో, మరింత బాధ్యతాయుతమైన రంగాల్లో మహిళల వృద్ధికి కారణమవుతుందని ఆమె చెప్పారు.

పార్లమెంటులో ప్రాతినిధ్యం

1999లో లోక్‌సభలో మహిళా రాజకీయ నాయకుల సంఖ్య 49. అది 2019 నాటికి 78కి పెరిగింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల అనంతరం ఆ సంఖ్య మరింత పెరిగింది.

రాజ్యసభలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. 2012 నుంచి 2021 మధ్య రాజ్యసభకు నామినేట్ అయిన మహిళల శాతం 9.8 శాతం నుంచి 12.4 శాతానికి పెరిగింది. ఇది మహిళా ప్రాతినిధ్యంలో పెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

మహిళలు

ఎకనమిక్ ఫోరం 2023 జెండర్ గ్యాప్ నివేదిక ప్రకారం, మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 146 దేశాల్లో 59వ స్థానంలో ఉంది.

మరీ ముఖ్యంగా పొరుగు దేశం బంగ్లాదేశ్, భారత్‌ను అధిగమించి భారత్‌ కంటే అత్యుత్తమ ర్యాంకుతో పాటు, టాప్ 10 దేశాల్లో చోటు దక్కించుకుంది.

''ఇండియాలో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను గమనిస్తే రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది, కానీ మహిళల జనాభా నిష్పత్తికి అనుగుణంగా పార్లమెంట్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేదు. దీనికి ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు'' అని బిజినెస్ స్టాండర్డ్‌ కన్సల్టింగ్ ఎడిటర్‌ రాధికా రామశేషన్ అన్నారు.

ఆరోగ్యం: అధిక బరువు

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాల ప్రకారం, దాదాపు 18 శాతం మంది మహిళలు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ- శరీర బరువు, ఎత్తు సూచిక)తో ఉన్నారు. అది 2015-16లో 22.9 శాతంగా ఉంది.

గతంతో పోలిస్తే బరువు తక్కువగా ఉన్న మహిళల సంఖ్య తగ్గినప్పటికీ, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊబకాయం సమస్య ఎక్కువైంది.

భారత్‌లో 24 శాతం మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారని, పురుషుల్లో అది 22.9 శాతంగా ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది.

మహిళలు

రక్తహీనత

పోషకాహార లోపాలతో పాటు, అన్ని వయసుల మహిళల్లో రక్తహీనత తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గర్భిణులు కాని 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో 57.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 2015-16లో నమోదైన 53.2 శాతంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. అదే వయసులో ఉన్న గర్భిణులు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.

మహిళల ఆరోగ్య సమస్యలను సామాజిక, సాంస్కృతిక కోణాల్లోనూ చూడాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో పబ్లిక్ హెల్త్ నిపుణురాలు, హెచ్‌ఐవీ వైద్యురాలు డాక్టర్ స్వాతి అభిప్రాయపడ్డారు.

భోజనం చేయడంలో మగవారికి ముందు ప్రాధాన్యం ఇస్తున్న దేశంలో, పోషకాహార లోపం, పేదరికం కారణంగా కూడా మహిళల్లో రక్తహీనత సంభవిస్తుంది. ఇది మహిళలు పౌష్టికాహారం తీసుకునే అవకాశాలను తగ్గించడంతో, అది రక్తహీనత, పోషకాహార లోపానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)