గాజా: 'పిల్లలకు ఆహారం తీసుకొస్తానని వెళ్ళిన నా భర్త శవపేటికలో తిరిగి వచ్చాడు'

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో తన భర్త మహ్మద్‌ను కోల్పోయిన జౌహ్రా ఇప్పుడు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు.
    • రచయిత, ఫర్గల్ కీన్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

జౌహ్రా తన పిల్లలు నిద్రిస్తున్నప్పుడు సముద్రంవైపు చూస్తూ ఉంటారు. సముద్రానికి ఆమె జీవితంతో విడదీయలేని బంధం ఉంది.

ఆ రోజు వాతావరణం నిర్మలంగానే ఉంది. ఆకాశం నీలం రంగులో ఉంది. సూర్యాస్తమయం అయ్యే సమయాన తీరం ఎరుపు, బంగారు రంగులను సంతరించుకుంటోంది.

అదే సముద్రం ఉత్తరాన టెల్ అవీవ్ బీచ్‌లను పలకరిస్తుంది. ఆ సముద్రమే జౌహ్రా జీవితంలో విషాదం నింపింది. అదే సముద్రం మీదుగా వచ్చిన ఇజ్రాయెల్ బోటు తన భర్త ప్రాణాలను తీసిందని జౌహ్రా చెప్పారు.

“ఆ రోజున మహ్మద్ కార్లు, సహాయ కాన్వాయ్ ఉన్న సముద్రతీరం వెంబడి నడుస్తున్నాడు. ఆ సమయంలో అక్కడంతా రద్దీగా ఉంది. సముద్రతీరానికి వచ్చిన మిలటరీ బోట్లు ప్రజలపై కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. నా భర్త తలకు బుల్లెట్ తగిలి, మరణించాడు” అని చెప్పారు.

ఆ ఘటన ఫిబ్రవరి 9న జరిగింది.

ఇజ్రాయెల్-గాజా యుద్ధం
ఫొటో క్యాప్షన్, అల్-మవాసీలోని శరణార్థి శిబిరం

'శవపేటికలో తిరిగి వచ్చాడు'

జౌహ్రా ప్రస్తుతం వితంతువులు, అనాథలు ఆశ్రయం పొందే శిబిరంలో ఉంటున్నారు. ఆమెను వెంటనే గుర్తించలేకపోయాం. అప్పటికే నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు జౌహ్రా.

ఆ రోజున, ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న యువకుడొకరు జౌహ్రాకు ఆమె భర్త చనిపోయిన విషయం తెలియజేయలేదు. మహ్మద్ కాస్త ఆలస్యంగా వస్తారని జౌహ్రాతో చెప్పారు. కానీ ఏదో కీడు జరిగిందని జౌహ్రా భావించారు.

అప్పుడే జౌహ్రా మామ రోదిస్తూ మహ్మద్ చనిపోయారని అరుస్తూ వచ్చారు. జౌహ్రా ఆ విషయం నమ్మలేదు.ఆసుపత్రి వెళ్లాక గానీ, తాను విన్నది నిజమని నమ్మక తప్పలేదు.

ఆ విషయం చెప్తున్న సమయంలో జౌహ్రా గోడకు ఆనుకుని తల దించుకుని, రోదించారు. తన తల్లి బాధపడుతోందని తెలిసి మూడేళ్ల లానా ఆమె భుజంపై చేయి వేసింది.

తన ఒడిలో నిద్రపోతున్న చిన్నారి వీపును మృదువుగా తడుతూ జోకొడుతున్నారు జౌహ్రా.

జౌహ్రా మళ్లీ మాట్లాడుతూ, “ఆయన శరీరం చల్లగా ఉంది. మహ్మద్‌కు ఏవో మెషిన్లు పెట్టారు. నేను వెంటనే మాట్లాడలేకపోయాను. కానీ, మహ్మద్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా, ఎలాంటి స్పందనా లేదు. నిద్రపోతున్నాడు. పిల్లలకు ఆహారం తీసుకురావడానికని వెళ్లాడు. కానీ, శవపేటికలో తిరిగి వచ్చాడు” అని చెప్పారు.

యుద్ధం వల్ల జౌహ్రా కుటుంబమంతా చిధ్రమైంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు వారు గాజా సిటీలో నివసించేవారు. దాడులు మొదలయ్యాక, గాజా స్ట్రిప్‌లో ఉన్న అల్-నుస్సేరాత్ శరణార్థి శిబిరానికి వచ్చారు.

అక్కడికి చేరుకునేందుకు గాజాలోని పయినీర్ ఫుడ్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న మహ్మద్‌, ఆ పని కూడా వదులుకోవాల్సి వచ్చింది.

ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ రఫా ప్రాంతం సురక్షితమైన ప్రదేశమని సూచించడంతో మహ్మద్ కుటుంబం అల్- నుస్సేరాత్ నుంచి అక్కడికి వెళ్లారు.

ఇజ్రాయెల్-గాజా

ఫొటో సోర్స్, Reuters

నిర్లిప్తంగా సాగుతోన్న జీవితం...

జౌహ్రా ప్రస్తుతం అల్- మవాసి శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆ శిబిరం మహిళలు, పిల్లల కోసం ఏర్పాటు చేశారు.

జహ్రా పొరుగున నివసించే మరో మహిళ అమీనా ఖాన్ యూనిస్‌ నుంచి వచ్చారు. వారు నివసిస్తున్న ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగి, భర్తతోపాటు ముగ్గురు పిల్లలను పోగొట్టుకున్నారు అమీనా.

శిథిలాల మధ్య చిక్కుపోయిన అమీనా, ఆమె ఐదేళ్ల కుమారుడు ఇబ్రహీంను రక్షించడంతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇబ్రహీం వికలాంగుడిగా మారారు.

అక్టోబర్‌లో సెంట్రల్ గాజాలో జరిగిన వైమానిక దాడిలో 32 ఏళ్ల అమనీ జాసర్ అల్ ఖౌర్ తన భర్త, ఐదుగురు పిల్లలను కోల్పోయారు. ఆమె ప్రస్తుతం జింక్ ప్యానెల్స్‌లో నిర్మించిన శిబిరంలో ఉంటున్నారు.

గాలిహోరుకు ఆ జౌహ్రా ఉంటున్న గుడారం ఊగిపోతోంది. వారికి రక్షణ కల్పించే పరదా ముందుకు వెనక్కూ వెళ్తోంది. పిల్లలతో ఆమె ఎలాంటి ఇబ్బందులు పడుతుందో మిగిలినవారికి తెలుసు.

జౌహ్రా ఉండే గుడారం చిన్నది. ఈగలు ఆమె పిల్లల చుట్టూ తిరుగుతున్నాయి. నేల ఊడ్చినట్లుగా కనిపించింది. జౌహ్రా తన భర్త ఫొటోను చూపి, తన కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే వాడని చెప్పారు.

“ఆయన లేకుండా నేనెలా బతకాలో నాకు అర్థం కావడం లేదు. నాకు, నా కుటుంబానికి అన్నీ సమకూర్చేది ఆయనే. నన్ను కాలు కూడా కిందపెట్టనిచ్చేవారు కాదు. ఇప్పుడు నన్ను పట్టించుకునేవారే లేరు” అన్నారు.

వితంతవుల జీవితాల్లో అడుగడుగునా సవాళ్లే. తన పిల్లల కోసం జౌహ్రాకు న్యాపీలు కావాలి. వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆందోళనగా కనిపించారు.

ఐదేళ్ల పిల్లాడు ముస్తాఫా గురించి చెప్తూ, “అతడు చూసింది కావాలంటాడు. నేను దానిని ఇవ్వలేను. అదే కావాలంటూ మారాం చేస్తూ, నేలపై పడుకుని ఏడుస్తాడు. ముస్తాఫా అవసరాలను తీర్చే పరిస్థితుల్లో లేను. ఆహారం, జ్యూస్, పండ్లు..ఇలా ఏవేవో అడుగుతాడు. నేను వాటిని సమకూర్చలేకపోతున్నాను” అన్నారు.

కొన్ని రోజుల క్రితం వారికి సమీపంలో నివసిస్తున్న కుటుంబం చికెన్ వండుకున్నారు.

జౌహ్రా పిల్లలు వారినే చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి మూడేళ్ల లానా ఏడవడం మొదలుపెట్టింది. కానీ, జౌహ్రా ఏమీ చేయలేకపోయారు.

అల్-మవాసీలో ఆశ్రయం పొందుతున్న వితంతువుల ఆశలన్ని కొత్తగా నిర్మించే శిబిరంపై ఉన్నాయి.

మహిాళలు వారి పిల్లల కోసం ఏర్పాటయ్యే ఆ శిబిరంలో ఆహారం లభిస్తుందని, హోరున వీచే గాలి నుంచి రక్షణ ఉంటుందని వారు భావిస్తున్నారు.

అంతేకాదు, ఆ మారణకాండ ఆగిపోవాలని, ఆ యుద్ధం తమనుంచి ఇంకేమీ లాక్కోకూడదని వారు కోరుకుంటున్నారు.

అదనపు రిపోర్టింగ్: హనీన్ అబ్దీన్, అలీస్ డోయార్డ్

వీడియో క్యాప్షన్, అనాథలుగా మారిన ఎందరో చిన్నారులు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)