చనిపోవాలనుకునే వారికి ఈ వ్యక్తి విషాన్ని పార్సిల్‌లో పంపిస్తున్నాడు...

జకుటెంకో
ఫొటో క్యాప్షన్, బీబీసీ కెమెరాను అడ్డుకుంటున్న జకుటెంకో
    • రచయిత, ఆగ్నస్ క్రాఫోర్డ్, టోనీ స్మిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

యూకేలో కనీసం 130 మంది ఆత్మహత్యలకు కారణమైన ఒక విషాన్ని విక్రయించిన యుక్రేనియన్ వివరాలను బీబీసీ పరిశోధన బయటపెట్టింది.

లియోనిడ్ జకుటెంకో అనే ఆయన ఆత్మహత్యలను ప్రోత్సహించే ఒక ఫోరమ్‌లో తన సర్వీస్ గురించి ప్రచారం చేసుకున్నారు.

వారానికి కనీసం ఐదు ప్యాకెట్ల విషాన్ని బ్రిటన్‌కు పార్సిల్ చేసినట్లు మా సీక్రెట్ రిపోర్టర్‌కు జకుటెంకో చెప్పారు.

గత ఏడాది ఇలాంటి ఆరోపణలతో కెనడాకు చెందిన కెన్నెల్ లా అనే వ్యక్తి అరెస్టయ్యారు.

కెన్నెత్ విక్రయించిన విషంతో 14 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయనపై అభియోగం ఉంది. కీయెవ్‌లోని ఓ ఇంట్లో జకుటెంకో ఉంటున్నట్లు బీబీసీ గుర్తించింది.

ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు, తాను అలాంటి పనులేవీ చేయడం లేదని జకుటెంకో చెప్పారు. ఈ విషం పేరును ప్రచురించరాదని బీబీసీ నిర్ణయించింది.

అయితే, ఆయన గత కొన్నేళ్లుగా ఈ విషాన్ని విక్రయిస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది. ఈ కెమికల్‌ను అమ్మడానికి యూకేలో చట్టబద్ధంగా అనుమతి ఉంది. అయితే, నిర్దిష్ట ప్రయోజనాల కోసం కంపెనీలు మాత్రమే దీన్ని కొనడానికి అనుమతి ఉంది.

ఎందుకోసం ఉపయోగించబోతున్నారనే దానిపై ప్రాథమికంగా నిర్ధరణ లేకుండా సప్లయర్లు దీనిని విక్రయించకూడదు. నిషేధం ఉంది.

కొద్దిమొత్తంలో తీసుకున్నా ఇది ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

జకుటెంకో
ఫొటో క్యాప్షన్, కీయెవ్ నగరం నుంచి యూకేకు విష రసాయనాను జకుటెంకో సరఫరా చేస్తున్నారని తేలింది.

కవలలకు విషం విక్రయించి..

జకుటెంకో గత సంవత్సరం లిండా, సారా అనే కవలలకు ఈ విషాన్ని విక్రయించారు. ఆత్మహత్యలను ప్రోత్సహించే ఒక ఆన్‌లైన్ ఫోరమ్‌‌లో ఆయన తాను ఈ విషాన్ని అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకున్నారని.. లిండా, సారాలు ఆ విషాన్ని సులభంగా ఆయన నుంచి కొనగలిగారని వారిద్దరి సోదరి కైట్ హెలెన్ బీబీసీకి తెలిపారు.

‘ఆయనొక దుర్మార్గుడు’ అని కైట్ విమర్శించారు. తన సిస్టర్స్ ఇద్దరూ ఎంతో తెలివైన వారని, ఆయన వల్ల తాము వారిని కోల్పోయామని కైట్ అన్నారు.

తన సిస్టర్స్‌లాంటి అనేకమందికి ఈ విష రసాయనం అందకుండా చర్యలు తీసుకోలేకపోవడం తమ దేశానికే అవమానకరమని కైట్ అన్నారు.

లిండా, సారాలు సందర్శించిన సూసైడ్‌ ఫోరమ్‌లో ఈ విషం గురించి బహిరంగంగానే చర్చ జరిగిందని, దీన్ని ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అన్నదానిపై కొందరు సలహాలు, సూచనలు ఇచ్చారని కైట్ ఆరోపించారు.

యూకేలో 2019లో జరిగిన 130 ఆత్మహత్యలకు ఈ రసాయనమే కారణం అయ్యుంటుందని లండన్లోని క్వీన్ మేరీ యూనివర్శిటీలో వాస్కులర్ ఫార్మకాలజీలో నిపుణురాలు ప్రొఫెసర్ అమృతా అహ్లువాలియా అభిప్రాయపడ్డారు.

యూకేలో ఆత్మహత్యలకు పాల్పడ్డ వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్‌ను ఆమె విశ్లేషించారు. ఆమె నిర్వహించిన 187 టెస్టుల్లో 71 శాతానికి పైగా కేసుల్లో ఈ విషం ఆనవాళ్లు లభించాయి. అంటే కనీసం 133 మంది ఈ పాయిజన్ వల్ల మరణించి ఉండొచ్చని స్పష్టమవుతోంది.

‘‘దీన్ని అడ్డుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సిందే. దీనిని దేని కోసం ఉపయోగిస్తున్నారు అన్నదానిపై సమగ్ర విచారణ జరగాలి. ఎందుకు వాడాలో అంత వరకే పరిమితం చేసేలా నిబంధనలు రూపొందించాలి’’ అన్నారు అహ్లువాలియా.

అహ్లువాలియా

ఫొటో సోర్స్, LEE DURANT

ఫొటో క్యాప్షన్, మృతుల శరీరంలో ఈ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు ప్రొఫెసర్ అహ్లువాలియా గుర్తించారు.

హత్యారోపణలు

2023 మే నెలలో కెనడాకు చెందిన షెఫ్ కెన్నెత్ లా ఇవే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆయనపై మొత్తం 14 హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు నమోదయ్యాయి.

40 దేశాల్లోని కస్టమర్లకు కనీసం సుమారు 1200కు పైగా డోసుల విషాన్ని సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. యూకేలో కనీసం 93 మంది ఆత్మహత్యలకు ఆయనే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు.

2020 నవంబర్ నుంచి జకుటెంకో ఈ రసాయనాన్ని అమ్ముతున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

సూసైడ్ గైడ్‌లలో కనిపించే మూడు రకాల రసాయనాలను ఆయన సరఫరా చేస్తుంటారు.

కెన్నెత్ లా మాదిరిగానే ఆయన తన గురించి సూసైడ్ ఫోరమ్‌లలో బ్రీఫ్‌గా ప్రచారం చేసుకున్నారు.

అప్పటి నుంచి ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఆయనతో టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా నేరుగా కాంటాక్ట్ అవుతున్నారని కూడా తేలింది.

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని సోవియట్ కాలం నాటి టవర్ బ్లాక్‌లోని ఒక చిన్న ఫ్లాట్‌లో జకుటెంకో ఉన్నట్లు బీబీసీ బృందం గుర్తించింది.

స్థానిక పోస్టాఫీసులో ఆయన తన పార్సిల్స్‌ను పోస్ట్ చేస్తుండగా మేం అతన్ని ప్రశ్నించాం. ఆత్మహత్య చేసుకునే వారికి మీరు ఎందుకు విష రసాయనాలను పంపుతున్నారని ప్రశ్నించాం.

దీనికి అతను ‘మీరు చెబుతున్నది అబద్ధం’ అంటూ మా కెమెరాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.

బీబీసీ బృందం అదే రోజు జకుటెంకోకు ఒక ఆర్డర్‌ కావాలని కోరింది. ఆయన పోస్టాఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయిన కొద్దిసేపటికే బీబీసీ బృందానికి పార్సిల్ ట్రాకింగ్ నంబర్ అందింది. అంటే, ఆయన పంపించిన పార్సిల్‌లో ఆత్మహత్యకు కావాల్సిన విషం ఉందని స్పష్టమైంది.

మృతుల కుటుంబాలకు మీరు ఏం సందేశమిస్తున్నారు అని ఆయనను అడిగినప్పుడు, ‘‘ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు" అని జకుటెంకో అన్నారు.

సూసైడ్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, కెనడాకు చెందిన కెన్నెత్ లా అనే షెఫ్ కూడా ఆత్మహత్యకు ఉపయోగపడే కెమికల్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

‘కఠిన చర్యలు తీసుకోవాలి’

డేవిడ్ పర్ఫెట్ అనే వ్యక్తి 2021 అక్టోబర్‌లో తన కొడుకును పోగొట్టుకున్నారు. ఆయన కొడుకు 22 ఏళ్ల టామ్‌ విష రసాయనంతో ప్రాణాలు తీసుకున్నారు. కెన్నెత్ లా ఆయనకు ఈ విషాన్ని సరఫరా చేశారు.

సూసైడ్ ఫోరమ్‌లను నిషేధించాలని, జకుటెంకోలాంటి అమ్మకందారులను అడ్డుకోవాలని పర్ఫెట్ డిమాండ్ చేస్తున్నారు.

23 ఏళ్ల జో నిహిల్ అనే వ్యక్తి మరణం సందర్భంగా ఈ కేసును విచారించిన బ్రిటిష్ అధికారి ఒకరు ఈ విషం గురించి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. 2020 సెంప్టెంబర్ నుంచి ఈ రసాయనం ఆన్‌లైన్‌లో కస్టమర్లకు అందుతోందని ఆయన గుర్తించారు.

ఈ కెమికల్ గురించి, సూసైడ్ ఫోరమ్ గురించి ఈ తరహా అలర్ట్స్‌ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇటీవలి కాలంలో కనీసం ఐదు సార్లు అందాయి.

ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది, అధికారులు దీనిని గుర్తించగలరా లేదా అన్నది తెలుసుకోవడానికి ఫర్ఫెట్ 2023లో డిసెంబర్‌లో జకుటెంకో ఒక పార్సెల్‌ ఆర్డర్ ఇచ్చారు.

‘‘నాకు పార్సెల్ వచ్చింది. కానీ, పోలీసు వ్యవస్థలకు సమాచారం ఇచ్చినా దానిని ట్రాక్ చేయలేకపోయారు. మనకు అన్ని వివరాలు తెలుసు. కానీ, దాన్ని మనం నిందితులను పట్టుకోలేకపోతున్నాం.’’ అని పర్ఫెట్ అన్నారు.

కెన్నెత్ లా పంపుతున్న పార్సిళ్లపై కూడా ఇలా నిఘా పెట్టడగా, ఆయన దొరికి పోయారు. చివరకు ఆయనను కెనాడలో అరెస్టు చేశారు.

ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్ఫెట్, కైట్ లాంటి బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు.

ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకోవడానికి గత సంవత్సరం చట్టంగా మారిన ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ ఉపయోగపడుతుందని యూకే ప్రభుత్వం చెబుతోంది.

ముఖ్యమైన సమాచారం..

ఆత్మహత్య ఆలోచనలకు మెడిసిన్, థెరపీతో మానసిక సమస్యలకు చికిత్స ఇస్తారు. దీని కోసం సైకియాట్రిస్ట్ నుంచి సాయం తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చు.

భారత దేశపు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019 (13 భాషల్లో అందుబాటు)

హ్యుమన్ బిహేవియర్, అలయిడ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ - 9868396824, 9868396841, 011-22574820

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరోసైన్స్ - 080 – 26995000

హిట్‌గుజ్ హెల్ప్‌లైన్, ముంబయి - 022- 24131212

వీడియో క్యాప్షన్, పిల్లల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తల్లులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)