ఇజ్రాయెల్‌లో హమాస్ లైంగిక దాడులకు ఆధారాలు: ఐరాస నివేదిక

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, EPA

ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబరు 7న హమాస్ దాడి సమయంలో సామూహిక లైంగిక దాడులు, ఇతర లైంగిక హింస జరిగిందని నమ్మడానికి సహేతుకమైన కారణాలున్నాయని ఐక్యరాజ్యసమితి బృందం ఒకటి ప్రకటించింది.

అంతేకాదు, బందీలు లైంగిక హింసకు గురైనట్లు "విశ్వసించదగ్గ సమాచారం" ఉందని ఐరాస చెప్పింది.

లైంగిక హింసపై సమాచార సేకరణ బృందానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్ నాయకత్వం వహించారు.

అయితే, దాడుల సమయంలో తమ ఫైటర్లు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను హమాస్ ఖండించింది.

"అక్టోబర్ 7 దాడుల సమయంలో అనేక ప్రదేశాలలో లైంగిక హింస జరిగినట్లు నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయి" అని ఐక్యరాజ్యసమితి రిపోర్టు పేర్కొంది.

ఈ దాడులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ ప్రాంతం, దాని పరిసరాలు, రోడ్ 232, కిబ్బట్జ్ రీమ్ వంటి ప్రదేశాలలో జరిగాయి.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, BBC/DAVE BULL

ఫొటో క్యాప్షన్, నోవా ఫెస్టివల్ జరిగిన ప్రాంత దృశ్యం

ఒక్కొక్కటిగా బయటికొస్తున్న రిపోర్టులు

అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. దాదాపు 1,200 మందిని చంపి, 253 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ ప్రకారం ఈ దాడుల్లో ఇప్పటివరకు 30,500 మంది మరణించారు.

అక్టోబర్ 7 తర్వాత హమాస్‌పై లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణల రిపోర్టులు ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలైంది.

బీబీసీ కూడా మహిళలపై లైంగిక దాడి(రేప్), లైంగిక హింస, అవయవాలను గాయపరచడం ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలను చూసింది, వినింది.

(హెచ్చరిక: లైంగిక దాడి, లైంగిక హింసకు సంబంధించిన వివరణలు ఉన్నాయి.)

"బందీలపై హమాస్ ఫైటర్లు, రేప్, క్రూరమైన, అమానవీయ, అవమానకరమైన ప్రవర్తన, లైంగిక హింసకు పాల్పడినట్లు స్పష్టమైన, నమ్మదగిన సమాచారం ఉంది" అని ఐక్యరాజ్యసమితి తన రిపోర్టులో పేర్కొంది.

"ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న వారిపై ఇటువంటి హింస కొనసాగుతుందని నమ్మడానికి సహేతుకమైన ఆధారాలు ఉన్నాయి" అని కూడా తెలిపింది.

ఆధారాలు ఎలా సేకరించారు?

ఐక్యరాజ్య సమితి బృందం జనవరి 29, ఫిబ్రవరి 14 మధ్య ఇజ్రాయెల్‌ను సందర్శించింది.

ఈ ఐరాస బృందంలో ప్రమీలా పాటెన్‌తో పాటు తొమ్మిది మంది నిపుణులున్నారు.

ఈ బృందం పరిశోధన కోసం ఏర్పాటు చేయలేదని, ఆరోపణలను సేకరించి ధృవీకరించడానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ఇజ్రాయెల్ ప్రతినిధులతో 33 సమావేశాలు జరిగాయని, 5,000 కంటే ఎక్కువ ఫోటోలను అలాగే 50 గంటల వీడియో ఫుటేజీని పరిశీలించామని పేర్కొంది.

బాధితులు ముందుకు వచ్చేలా "ప్రోత్సహించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ" బృందం వారిలో ఎవరినీ ఇంటర్వ్యూ చేయలేకపోయిందని రిపోర్టులో రాశారు.

రేప్, లైంగిక హింసకు సంబంధించిన కొన్ని ఆరోపణలు ధృవీకరణ కాలేదని, నిరాధారమైనవనీ తెలిపింది.

అక్టోబర్ 7 దాడుల తర్వాత చెక్ పాయింట్లు, ఇళ్లలో సోదాల సమయంలో, నిర్బంధ కేంద్రాల్లో పాలస్తీనియన్ పురుషులపై, మహిళలపై లైంగిక హింస జరిగినట్లుగా సమాచారం కూడా అందిందని ఐక్యరాజ్యసమితి బృందం తెలిపింది.

'ఐక్యరాజ్యసమితి రిపోర్టు దాస్తోంది'

గతంలో ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణుల ప్యానెల్ చేసిన ఇలాంటి ఆరోపణలనే ఇజ్రాయెల్ నిరాధారమైనవంటూ తిరస్కరించింది.

హమాస్‌పై రూపొందించిన 'తీవ్రమైన రిపోర్టు'ను ఐక్యరాజ్యసమితి తొక్కి పెట్టడానికి యత్నిస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.

సేకరించిన సమాచారాన్ని చర్చించడానికి, హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి భద్రతా మండలిని సమావేశపరచకపోవడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.

అయితే ఇజ్రాయెల్ పర్యటనలో ప్రమీలా పాటెన్‌కు గుటెర్రెస్ పూర్తి మద్దతిచ్చారని యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు. రిపోర్టును దాచేలా సెక్రటరీ జనరల్ ఏ విధంగానూ యత్నించలేదన్నారు. ఆ రిపోర్టు నేడు బహిరంగపరిచామని కూడా డుజారిక్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)