హమాస్‌ను నిర్మూలించడం ఇజ్రాయెల్‌కు సాధ్యమేనా?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దలియా హైదర్, నటాలీ మీర్జౌగు
    • హోదా, బీబీసీ అరబిక్

గాజాలో హమాస్ పాలన, సైనిక సామర్థ్యాలను నాశనం చేయడమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. హమాస్‌ను తుదముట్టించే లక్ష్యం గురించి ఆయన పదే పదే మాట్లాడతారు.

గాజాలో హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య శాఖ ప్రకారం, దాదాపు 5 నెలల ఈ పోరాటంలో సుమారు 30 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. తమ లక్ష్యం దిశగా గణనీయ పురోగతి సాధించినట్లు, ఇక పూర్తిస్థాయి విజయంపై దృష్టి నిలపాలని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది.

కానీ, సైనిక సామర్థ్యాలకు మించి ఒక రాజకీయ, సైద్ధాంతిక, సామాజిక ఉద్యమ సంస్థ అయిన హమాస్‌ను తుదముట్టించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుందా? అది ఆచరణ సాధ్యమేనా?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది?

గాజాలోని 24 హమాస్ బెటాలియన్లలో 18 బెటాలియన్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటరీ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా కూల్చేసినట్లుగా చెప్పింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు హమాస్ వద్ద 30 వేల మంది ఫైటర్లు ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. నాడు హమాస్ చేసిన దాడిలో 1200 మంది చనిపోగా 250 మంది బందీలుగా మారారు.

హమాస్ ఫైటర్లలో 13 వేల మందిని చంపినట్లుగా ఐడీఎఫ్ చెప్పింది. ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్న, గాయపరిచిన, చంపేసిన తీవ్రవాదుల సంఖ్య 20 వేలకు పైగా ఉంటుందని ఫిబ్రవరి మొదట్లో నెతన్యాహు అన్నారు. ఈ సంఖ్య హమాస్ పోరాటశక్తిలో సగాని కంటే ఎక్కువ. బీబీసీ ఈ గణాంకాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. వీటి గురించి సవివరంగా చెప్పాలని బీబీసీ చేసిన విజ్ఞప్తికి ఐడీఎఫ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఇజ్రాయెల్, గాజా వర్గాలు చెబుతున్న ఈ లెక్కలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గాజాలో మరణించిన పౌరులు సహా వయోజన పురుషుల సంఖ్య సుమారు 9 వేలు ఉంటుందని అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.

ఇజ్రాయెల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీబీసీతో హమాస్ రాజకీయ కార్యాలయం చెప్పింది. గాజాలోని అన్ని ప్రాంతాల్లో తమ సైనిక విభాగం అదే తీవ్రతతో పనిచేస్తోందని తెలిపింది. హమాస్ కొన్ని బెటాలియన్లను పునరుద్ధరించడం మొదలు పెట్టిందని ఇజ్రాయెల్ వార్తాపత్రిక హార్టెజ్‌లోని ఒక కథనం సూచిస్తోంది.

‘‘హమాస్ చాలా సులభంగా కొత్త ఫైటర్లను నియమించుకోగలదు. కాబట్టి ఇది బహుశా మనం తరచి చూడాల్సిన కీలక అంశం కాదు’’ అని జేన్స్ డిఫెన్స్ వీక్లీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్ జెరెమీ బిన్నీ అన్నారు.

ఇజ్రాయెల్ బలగాలు కమాండర్లను చంపాయని, ఆయుధాల నిల్వలను కనుగొన్నాయని, ఒక పద్ధతి ప్రకారం అండర్‌గ్రౌండ్ తీవ్రవాద వ్యవస్థను కూల్చేస్తున్నాయని రిటైర్డ్ ఇజ్రాయెల్ కల్నల్ మిరి ఈసిన్ చెప్పారు.

హమాస్ టన్నెల్ వ్యవస్థ గతంలో అంచనా వేసినదాని కంటే చాలా పెద్దది అని బిన్నీ అన్నారు. దాన్ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్పారు.

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ, మారణహోమానికి సంబంధించిన ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటున్నప్పటికీ మిగిలిన హమాస్ బెటాలియన్లను తుదముట్టించడాన్ని కొనసాగించాలని నెతన్యాహు పట్టుబట్టారు. ఇవన్నీ వక్రీకరించిన ఆరోపణలని ఇజ్రాయెల్ అంటోంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

సైద్ధాంతిక భావజాలాన్ని నిర్మూలించగలరా?

చాలా పశ్చిమ దేశాలు హమాస్‌ను ఒక తీవ్రవాద సమూహంగా చూస్తాయి. ఇజ్రాయెల్ వినాశనానికి హమాస్ నాయకులు పిలుపునిస్తారంటూ పశ్చిమ దేశాలకు చెందిన చాలా మంది నొక్కి చెబుతుంటారు. కానీ, అరబ్ ప్రపంచంలోని కొన్ని భాగాలు దాన్నొక ప్రతిఘటన ఉద్యమంగా చూస్తాయి.

2006లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2007 నుంచి గాజా స్ట్రిప్‌ను హమాస్ పాలిస్తోంది. ఇప్పుడు గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ దిగ్బంధనం చేసింది.

గత 20 ఏళ్లలో గాజా నుంచి పాలస్తీనా సమూహాలు వేల రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఇజ్రాయెల్ దళాల హింస, ఘర్షణలకు ప్రతిస్పందనగా కొన్నిసార్లు ఈ దాడులు చేసింది.

‘‘ఇది ఒక సైనిక ఉద్యమం కాదు. రాజకీయ ఉద్యమం కూడా కాదు. ఇది ఒక భావజాలం’’ అని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారన్ రిలేషన్స్ మిడిల్ ఈస్ట్ స్పెషలిస్ట్, సీనియర్ ఫెలో హ్యూ లోవట్ అన్నారు.

‘‘ఆ భావజాలాన్ని నిర్మూలించలేం. కచ్చితంగా ఇజ్రాయెల్ బలగాల ఆయుధాలు దీన్ని సాధించలేవు’’ అని ఆయన అన్నారు.

‘‘చాలా మంది పాలస్తీనియన్లు హమాస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే వారు భవిష్యత్‌ను చూడరు’’ అని వెస్ట్‌ బ్యాంక్‌లోని అరబ్ అమెరికన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లెక్చరర్ డాక్టర్ అంజద్ అబు ఇల్ ఇజ్ చెప్పారు.

ప్రధానమంత్రి నెతన్యాహు తన కెరీర్‌లో చాలా వరకు పాలస్తీనా రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ స్థానంలోని భద్రతపరమైన ఆందోళనలను, ఇజ్రాయెల్‌ను గుర్తించడంలో హమాస్ వైఫల్యం గురించి ఆయన ఉదహరించారు.

కానీ, నెతన్యాహు పార్టీలోని చాలా మంది, ప్రభుత్వ మిత్రపక్షాలు, వెస్ట్ బ్యాంక్‌తో పాటు గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌కు చెందినవిగా చూస్తాయి.

వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ స్థావరాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం 2023లో ఇజ్రాయెల్ ప్రభుత్వం రికార్డు సంఖ్యలో అనుమతులు ఇచ్చిందని ఇజ్రాయెల్ యాక్టివిస్టు గ్రూప్ పీస్ నౌ పేర్కొంది.

2023లో వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ బలగాలు, సెటిలర్ల చేతుల్లో 81 మంది చిన్నారులు సహా 507 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. 2005లో ఓసీహెచ్‌ఏ మరణాల సంఖ్యను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన ఏడాదిగా నిలిచింది.

వెస్ట్ బ్యాంక్ నుంచి పాలస్తీనియన్లు చేసిన దాడుల్లో 36 మంది ఇజ్రాయెలీలు చనిపోయినట్లు యూఎన్ రికార్డు చేసింది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్‌కు మద్దతుగా ఏం జరుగుతోంది?

అక్టోబర్ 7నాటి ఘటన తర్వాత గాజాలోని పాలస్తీనియన్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నప్పటికీ, పాలస్తీనియన్లలో హమాస్‌కు మద్దతు పెరిగిందని 2023 చివర్లో చేసిన ఒక సర్వే సూచించింది.

పోరాటాల సమయంలోనే సాధారణంగా హమాస్‌కు మద్దతు పెరుగుతుందని, అయితే తాజా పెరుగుదల చాలా నాటకీయమైనదని సర్వేను చేపట్టిన పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ సర్వే రీసర్చ్‌కు చెందిన డాక్టర్ ఖలీల్ షికాకి చెప్పారు.

నవంబర్‌లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధి సమయంలో సర్వే చేసినప్పుడు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనా మహిళలు, పిల్లలు విడుదల అవుతున్నారని ఆయన చెప్పారు.

పాలస్తీనా లక్ష్యాలను సాధించడానికి హమాస్ హింసా విధానం అత్యంత ప్రభావవంతమైనదిగా కొందరు భావించేలా చేసిందని ఆయన అన్నారు.

గాజాలో ఇది భిన్నంగా ఉంది. హమాస్‌కు మద్దతు ఇచ్చే వారి సఖ్య స్వల్పంగానే పెరిగింది.

అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులు సరైనవేనని గాజాలోని కొంత మంది మాత్రమే భావించారు. వెస్ట్‌బ్యాంక్‌లో ఇలా భావించిన వారి సంఖ్య 82 శాతం కాగా, గాజాలో ఇది 57 శాతంగా ఉంది.

‘‘యుద్ధానికి సంబంధించి హమాస్ నిర్ణయాల పర్యవసానాలను అనుభవిస్తున్న వారు హమాస్ పట్ల చాలా విమర్శనాత్మకంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’’ అని డాక్టర్ షికాకి అన్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

కొత్త తరం ప్రతీకారం కోసం యత్నిస్తుందా?

గాజాలోని చాలా మంది యువకులు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద, ఆక్రమణల మీద చాలా ద్వేషంతో ఉన్నారని డాక్టర్ అబు నమ్ముతున్నారు.

‘‘ప్రతీకారం తీర్చుకునేందుకు తర్వాతి తరాలు ఈ మిలిటరీ సమూహాల్లో చేరతాయని అనిపిస్తోంది. ఎందుకంటే వారు తమ కుటుంబాలను కోల్పోయారు. పిల్లల్ని పోగొట్టుకున్నారు. తల్లులను, కుమారుల్ని, తోబుట్టువుల్ని కోల్పోయారు’’ అని ఆయన అన్నారు.

హమాస్‌కు మద్దతు పెరుగుతుందనే ఆందోళనతో సైనిక లక్ష్యాలకు దూరంగా వెళ్లకూడదని కల్నల్ ఈసిన్ అన్నారు.

అక్టోబర్ 7 నాటి తీవ్రమైన, భయంకర, అకృత్యపు దాడులను పేర్కొంటూ వారు ఇప్పటికే రాడికలైజ్ అయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.

ఆ కోణంలో మొదటగా చేయాల్సింది వారి సామర్థ్యాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడమని ఆమె అన్నారు.

‘‘శాంతిని పునరుద్ధరిస్తే, ఒక పెద్ద యుద్ధం యువతరం ఆయుధాలు పట్టేలా దారి తీయదు’’ అని డాక్టర్ షికాకి అభిప్రాయపడ్డారు.

తర్వాత ఏం జరుగుతుంది?

గాజాలో యుద్ధానంతర ప్రణాళికను ప్రధాని నెతన్యాహు వివరించారు. ఇందులో గాజాలోని డీమిలిటరైజ్డ్ ఏరియాల్లో ఇజ్రాయెల్ నిరవధికంగా భద్రతను నియంత్రిస్తుందని చెప్పారు.

‘‘ఎవరైనా నిజంగా హమాస్‌ను అణగదొక్కి, బలహీనపరచాలని కోరుకుంటే దానికి ఆచరణీయ రాజకీయ మార్గాన్ని సృష్టించడమే ఏకైక మార్గం’’ అని లోవట్ అన్నారు.

కానీ, ఈ సమస్యకు పరిష్కారం లభించే మార్గాలు అస్పష్టంగానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)