హిజాబ్: ‘కొరడా దెబ్బలు తింటాం, జైలుకైనా వెళతాం’ అంటున్న ఇరానీ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కరోలిన్ హాలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆజాద్, డోన్యా, బహరే. ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తులు. ఒకరికొకరు పరిచయం లేదు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని పేర్లు మార్చి రాశాం
ఈ ముగ్గురు యువతులు ఇరాన్‌లో దేవుడి పరిపాలన చెప్పుకునే ప్రభుత్వాన్ని, 45 సంవత్సరాలుగా మహిళలు, బాలికలపై విధించిన డ్రెస్‌కోడ్‌ను వ్యతిరేకించాలని నిశ్చయించుకున్నారు.
దీనికి సూచికగా వాళ్లు ప్రతిరోజూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని తమ ఇళ్ల నుండి తల మీద గుడ్డ (హిజాబ్) కప్పుకోకుండా బయటకు వస్తారు.
"ఇది చాలా భయంకరమైన అనుభవం. ఎందుకంటే వాళ్లు మమ్మల్ని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. జరిమానా విధించవచ్చు’’ అని 20 ఏళ్ల డోన్యా ఒక ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా చెప్పారు.
‘‘మమ్మల్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చు. కొరడాతో కొట్టవచ్చు.’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
74 కొరడా దెబ్బల శిక్ష
గత నెలలో 33 ఏళ్ల కుర్దిష్-ఇరానియన్ కార్యకర్త రోయా హెష్మతి హిజాబ్ లేకుండా ఉన్న తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 74 కొరడా దెబ్బలు తిన్నారు. అయితే, ఎన్ని అవరోధాలు వచ్చినా తాము వెనక్కి తగ్గబోమని, డోన్యా, ఆజాద్, బహారేలు అంటున్నారు.
“ఇది చాలా ప్రతీకాత్మకమైన చర్య. ఇరాన్‌లో మహిళలను అణచివేయడానికి ప్రభుత్వ ఈ దారిని ఎంచుకుంది. అయినా సరే. నేను నిరసన తెలిపి నా స్వేచ్ఛ కోసం ఒక్క అడుగైనా ముందుకు వేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు డోన్యా.
ఈ వారం చివర్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయకుండా తమ నిరసన తెలపాలని ఈ ముగ్గురు మహిళలు నిర్ణయించుకున్నారు.
మహాసా అమినీకి మద్ధతుగా మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగినప్పుడు ప్రభుత్వం వారిని కఠినంగా అణచివేసిన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు ఎన్నికలివి.
సెప్టెంబరు 2022లో ఇరవై రెండేళ్ల మహిళ మహాసా అమీని అనే యువతి పోలీసు కస్టడీలో మరణించారు. ఇస్లాం సంప్రదాయలకు విరుద్ధంగా దుస్తులు ధరించారన్నది ఆమెపై ఉన్న ఆరోపణ.
మోరాలిటీ పోలీసు కస్డడీలో ఆమె మరణించారు. దీనికి నిరసన ఇరాన్‌లో మహిళల పెద్ద ఎత్తున నిరసనలు కనిపించాయి.

నిరసనలపై కఠిన వైఖరి
అమీని మరణం తర్వాత జరిగిన నిరసనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
బహిరంగ ప్రదేశాలలో హిజాబ్ ధరించనందుకు జైలు శిక్ష, కొరడా దెబ్బల్లాంటి శిక్షలు విధించేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో చాలామంది మహిళలు హిజాబ్ ధరిస్తున్నారు.
హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్న 34 ఏళ్ల ఆజాద్ ఈ అంశంపై నాతో మాట్లాడారు.
“ప్రజలు మునుపటిలా నిరసనలు వ్యక్తం చేయడానికి వీధుల్లోకి రావడం లేదు. కానీ మా హృదయాల్లో ఈ ప్రభుత్వంపై ఆశల్లేవు. దాని చర్యలను నేను అంగీకరించలేను.” అన్నారు.
ఈ పరిస్థితుల్లో నిరసన తెలపడానికి వారికి ఉన్న మార్గం ఓటుకు దూరంగా ఉండటమేనని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏకాంతవాస శిక్ష
ఆజాద్‌ను 2022 అక్టోబర్‌లో అరెస్టు చేసి ఒక నెలపాటు నిర్బంధంలో ఉంచారు. గతేడాది జులైలో మరోసారి ఆమె అరెస్టయ్యారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టు చేశారు.
ఈసారి ఆమె 120 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇందులో 21 రోజులపాటు ఆమెను ఏకాంత నిర్బంధంలో ఉంచారు.
“అందరూ అనుకుంటున్నట్లుగానే జైలు అనేది ఒక దారుణమైన ప్రదేశం. ఎప్పుడూ గది తలుపులు మూసే ఉంటాయి. గది సైజు ఒకటిన్నర మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు ఉంటుంది. బయట నుంచి వెలుతురు కూడా రాదు. రోజంతా లైటు వెలుగుతూనే ఉండాలి. బాత్రూమ్‌కు వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టి తీసుకెళతారు.’’ అన్నారామె.
తన తలను నేలకేసి బాదారని ఆమె చెప్పారు. తనను ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇంటరాగేషన్ చేసేవారని ఆమె తెలిపారు.
“దీనిని వైట్ టార్చర్ అంటారు. ఇది వెయ్యి కొరడా దెబ్బల కంటే ఘోరమైనది. వాళ్లు నన్ను బెదిరించేవారు. అవమానించేవారు.” అన్నారామె.
ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా హిజాబ్ ధరించకుండా తిరగడానికీ, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా ఆజాద్ సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు ఇరాన్‌లో చాలామంది మహిళలు హిజాబ్ లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అయితే, మోరాలిటీ పోలీసులు ఎదురైనప్పుడు వారిని నుంచి తప్పించుకోవడానికి మెడలో హిజాబ్ వేసుకుని వెళుతున్నారు.
అయితే, చాలామంది మహిళలు ధైర్యం చేసి రోజంతా హిజాబ్ లేకుండా తిరుగుతున్నారని, ప్రతి ఐదుగురిలో ఒక మహిళ హిజాబ్ ధరించడం లేదని అక్కడి మహిళలు కొందరు నాతో చెప్పారు.
‘‘నేను ఎప్పటికీ వెనక్కి తగ్గను’’ అంటూ ఆజాద్ నాకు మెసేజ్ పంపారు. తన మెసేజ్‌లో ఆమె హార్ట్ ఎమోజీని కూడా చేర్చారు.

ఫొటో సోర్స్, EPA
హిజాబ్ లేకుండా జాబ్ లేదు...
టెహరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపీ తెలిపీ తాను విసిగిపోయానని ఓ మహిళ చెప్పారు. ఆమె పేరు బహరే. 39 ఏళ్ల వయసున్న ఈమె రిపోర్టర్‌గా, సినిమా క్రిటిక్‌గా పని చేస్తుంటారు.
ఆఫీసులో పని చేయాలంటే కచ్చితంగా హిజాబ్ ధరించాల్సిందేనని నిబంధన పెట్టారనీ, ఇందుకు నిరసనగా వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఎంచుకున్నందుకు జీతాల్లో భారీగా కోత పెట్టారని ఆమె వెల్లడించారు.
‘‘నేను చాలా నిస్పృహకు లోనయ్యాను. అలసిపోయాను. హిజాబ్ ధరించకుండా ఆఫీసుకు వెళ్లడానికి వీల్లేదు. అది ధరించడం నాకు ఇష్టం లేదు.’’ అన్నారామె.
ఇప్పుడామె భర్త జీతంపైనే ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా, హిజాబ్ ధరించకుండా డ్రైవింగ్ చేసినందుకు పోలీసులు ఆమెను ఆపి, కారును సీజ్ చేశారు.
హిజాబ్ ధరించకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను పోస్ట్ చేసినందుకు, ఇతరులు కూడా అలాగే చేయాలంటూ ప్రోత్సహించినందుకు ఆమెను గత సంవత్సరం అరెస్టు చేశారు కూడా.
ఒక న్యాయస్థానం ఆమెకు జరిమానాతోపాటు ఆర్నెల్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ, తర్వాత దానిని రద్దు చేశారు.
“నన్ను అవమానించారు, బెదిరించారు. నేను తప్పు చేశానని అన్నారు. నేను ప్రజలను విప్లవం దిశగా నడిపించేందుకు ప్రయత్నించానని ప్రభుత్వం ఆరోపణలు చేసింది.’’ అని ఆమె తెలిపారు.
మరి మిమ్మల్ని ఎందుకు జైలుకు పంపలేదని నేను ఆమెను అడిగాను.
‘‘ఎందుకంటే జైళ్లన్నీ జనంతో నిండి ఉన్నాయి. నాలాంటి వారిని భయపెట్టాలని వారు కోరుకుంటారు. నేను ఇప్పటికీ బయటికి వెళ్తాను. అయితే ఇది చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఎందుకంటే హిజాబ్ లేకుండా నన్ను రెస్టారెంట్లు, బుక్‌షాపుల వాళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు.” అన్నారామె.
మా సంభాషణ ముగియగానే రికార్డింగ్‌ను వెంటనే డిలీట్ చేయాలని బహరే కోరారు. దీన్నిబట్టి ఆమె ఎంత భయంతో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
“లేదంటే నేను మిమ్మల్ని బ్లాక్ చేస్తాను. నాకు వేరే మార్గం లేదు. నేను అరెస్టయితే నాకు సాయం చేసేవారు కూడా ఉండరు. నేను గూఢచర్యానికి పాల్పడ్డానని కూడా ఆరోపణలు చేస్తారు. నాకు మరణశిక్ష కూడా విధించగలరు’’ అన్నారామె.
ఇరాన్ పాలనను సవాలు చేస్తున్న చాలా మంది ఇరానియన్ స్త్రీలలో భయం, ధైర్యం ఏకకాలంలో కనిపిస్తున్నాయి. అలాగే వారిలో ఆవేశం, ఆశను కూడా చూడవచ్చు.

ఫొటో సోర్స్, IRNA
ఎక్కడ చూసినా నిఘాయే....
డోన్యా ఇటీవల తన తండ్రితో కలిసి థియేటర్‌కి వెళ్లారు. చలి నుంచి రక్షించుకోవడానికి ఆమె టోపీ ధరించారు. మెట్రోలో దాన్ని తీసేసినప్పుడు అక్కడున్న కొంతమంది మహిళలు, పురుషులు హిజాబ్ ధరించాలని హెచ్చరించారు.
అక్కడున్న మహిళలంతా తమ శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే చాదర్‌ను ధరించారు. టెహరాన్‌లో మోరాలిటీ పోలీసు విభాగంలోని మహిళా పోలీసులు కూడా ఇలాగే ఒళ్లంతా చాదర్ కప్పుకుని కనిపిస్తారు.
‘నాకు హిజాబ్ లేదు’ అని ఆమె వారితో చెప్పారు. టోపీ మాత్రమే ఉంది, వేడి కారణంగా దాన్ని ధరించలేదని ఆమె చెప్పారు.
‘‘నేను అలా చెప్పి వారిని పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నాను. కానీ, పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, స్టేషన్‌లో ఎక్కడ చూసినా అలాంటి వారే కనిపిస్తున్నారు’’ అని డోన్యా చెప్పారు.
ఈలోగా ఎవరో 'ఈ అమ్మాయిని వ్యాన్‌లో తీసుకెళ్లండి' అని చెప్పడం విన్నారు డోన్యా. “నేను చాలా భయపడ్డాను. మా నాన్న కూడా భయపడ్డారు. నేను టోపీ ధరించక తప్పలేదు’’ అన్నారామె.

ఫొటో సోర్స్, REUTERS
డోన్యా తాను యూనివర్సిటీలో ప్రవేశించేటప్పుడు మాత్రమే హిజాబ్ ధరిస్తారు. ఎందుకంటే అది లేకుండా యూనివర్సిటీలోకి అడుగుపెట్టనివ్వరు. అయితే, క్లాసు రూములో వారు హిజాబ్ తొలగించవచ్చు.
‘‘అందరిలాగే మాకు మంచి డ్రెస్సులు వేసుకోవాలని, జుట్టును అలంకరించుకోవాలని ఉంటుంది. మహసా మరణించే వరకు అంతా నిద్రపోయారు. ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నారు’’ అన్నారామె.
"ఆ నిరసనల వల్ల చాలామంది మహిళలు వీధిలో హిజాబ్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. కానీ ఒత్తిడి, మరణశిక్షల భయం వెంటాడుతోంది. ఇది చాలా కఠినమైన ప్రయాణం’’ అన్నారామె.
ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడలపై నినాదాలు రాస్తున్నారని, అధికార టీవీ చానెల్‌ను బహిష్కరించారని ఆమె చెబుతున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకునే సమయం వచ్చిందని డోన్యా అంటున్నారు.
‘‘ఒక విప్లవం ఉంటుంది. అయితే, అది ఎప్పుడు ఎగిసిపడుతుంతో ఎవరికీ తెలియదు.’’ అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















