58 ఏళ్ళ వయసులో మళ్ళీ తల్లి అవుతున్న పంజాబీ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి...

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, FB/ CHARAN KAUR

ఫొటో క్యాప్షన్, తన తల్లి చరణ్ కౌర్‌తో సిద్ధు మూసేవాలా

దివంగత పంజాబీ పాప్ సింగర్ శుభ్‌దీప్ సింగ్ అలియాస్ సిద్ధు మూసేవాలా తల్లి 58 ఏళ్ళ వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు.

ఈ విషయాన్ని సిద్ధూ మూసేవాలా కుటుంబానికి చెందిన వారితో బీబీసీ ప్రతినిధి సురీందర్ మాన్ నిర్థరించుకున్నారు.

సిద్ధుమూసేవాలా తల్లి ఐవీఎఫ్ విధానంలో మార్చిలో ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

వయసు మళ్ళిన తరువాత బిడ్డను కనడమనేది భారతీయ సమాజంలో తప్పుగా చూస్తారు. ఈ కోవలోనే ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు అదేదో తప్పు అనే ధోరణిలో రాశాయి, ప్రసారం చేశాయి.

ఈ విషయంపై బీబీసీ కరస్పాండెంట్ మూసేవాలా కుటుంబంతో మాట్లాడగా, అది పూర్తిగా తమ వ్యక్తిగతమని, కుటుంబానికి సంబంధించిన విషయమని చెప్పారు.

28 ఏళ్ళ సిద్ధు మూసేవాలా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన గాయకుడు. 2022 మే 29న ఆయనను పట్టపగలే కాల్పి చంపారు.

ఈ ఘటన మాన్సా జిల్లా జవహార్కే గ్రామంలో జరిగింది.

మే 15, 2020న సిద్ధు మూసేవాలా ఓ పాటను విడుదల చేసి తన తల్లికి అంకితమిచ్చారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయనీపాట విడుదల చేశారు.

ఈ పాటకు సంబంధించిన వీడియోలో ఆయన తల్లి చరణ్ కౌర్, తండ్రి బాల్కౌర్ సింగ్ కూడా కనిపిస్తారు. ఈ పాటను ఇప్పటిదాకా యూట్యూబ్‌లో 143 మిలియన్ల మంది వీక్షించారు.

సర్పంచ్‌గా పోటీచేసిన చరణ్ కౌర్

మీడియా కథనాల ప్రకారం సిద్ధు మూసేవాలా తల్లి వయసు దాదాపు 58 సంవత్సరాలు. మాన్సా జిల్లాలో మౌసా గ్రామ ఎన్నికలలో ఆమె 2018లో సర్పంచ్‌గా పోటీ చేశారు.

2022 అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధు మూసేవాలా కాంగ్రెస్ పార్టీ తరపున మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆయన ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

సిద్ధు మూసేవాలా చనిపోయాకా తమకు న్యాయం చేయాలంటూ ఆయన తల్లిదండ్రులు పలు సందర్భాలలో కోరారు.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, SIDHU MOOSE WALA/YT

ఫొటో క్యాప్షన్, సిద్ధు మూసేవాలా రూపొందించిన ఓ పాటలోని దృశ్యం

ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్జిలైజేషన్) అంటే ఏమిటి?

‘‘1978లో లెస్లీ బ్రౌన్ టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వడంతో ఇది ప్రారంభమైంది. మహిళల ట్యూబ్స్ దెబ్బతినడమో, ఇన్ఫెక్షన్ కు గురవడమో జరిగితే, వారికి ఐవీఎఫ్ విధానాన్ని ఉపయోగిస్తారు’’ అని గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మెడికల్ డైరక్టర్‌గా ఉన్న డాక్టర్ నయనా పటేల్ బీబీసీతో చెప్పారు.

ఈ విషయాన్ని పటేల్ మరింత వివరిస్తూ ‘‘అండాన్ని, వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణ చెందిస్తాం. పిండం సిద్ధమయ్యాక , దానిని మహిళ యుటెరస్‌లో ప్రవేశపెడతాం. ఈ టెక్నాలజీ ఎంతోమంది జంటలకు సంతానాన్నిచ్చింది. పిల్లలు కలగరేమోననుకునే మహిళల బెంగను తీర్చింది’’ అని చెప్పారు.

ఐవీఎఫ్ విప్లవంలో రెండో దశగా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) టెక్నిక్ ను 1991లో తీసుకొచ్చారని డాక్టర్ నయనా తెలిపారు.

వీర్యకణాలు తక్కువగా ఉండి, తల్లిదండ్రులు కాలేని వారికి ఐసీఎస్ఐ విధానం ఊరటనిచ్చేదిగా మారింది.

‘‘ఈ విధానం వీర్యదాతల అవసరం కూడా లేకుండా చేయడంతో ఎటువంటి అనుమానాలు లేకుండా దీనిని ఆమోదిస్తున్నారు’’ అని డాక్టర్ నయనా చెప్పారు.

ఐవీఎఫ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

వయోపరిమితి

2021లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టి)యాక్ట్ 2021 అమలులోకి వచ్చింది.

ఈ చట్టం ప్రకారం ఐవీఎఫ్ కింద తల్లిదండ్రులవ్వాలనుకునేవారికి భర్త వయసు 55గానూ, భార్య వయసు 50ఏళ్ళుగా నిర్థరించారు.

ఈ వయోపరిమితిని దిల్లీలోని బ్లూమ్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీతా ఆరోరా గట్టిగా సమర్థించారు.

‘‘వయోపరిమితి విధించడంలో ఒక కారణం ఏమిటంటే పిల్లలను పెంచి పెద్దచేయడం. ఉదాహరణకు పిల్లాడికి 15, 20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రుల వయసు 70 ఏళ్ళు దాటుతుంది. ఆ సమయంలో వారు పిల్లాడి బాగోగులు ఎలా చూడగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా చూసినప్పుడు 50 ఏళ్ళ వయసులో తల్లి కావడం అంత తేలికైన విషయం కాదు’’ అని ఆరోరా చెప్పారు.

‘‘ఐవీఎఫ్ విధానంలో 45 ఏళ్ళు దాటినవారి విషయంలో వారి ఆరోగ్యం గురించి మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే గర్భవతుల గుండె వేగం పెరుగుతుంది. వారి రక్తపోటు కూడా హెచ్చు తగ్గులతో ఉంటుంది. చాలా సందర్భాలలో మహిళలు ఈ మార్పులను తట్టుకోలేరు’’ అంటారు ఆరోరా.

వృద్ధాప్యంలో ఐవీఎఫ్ విధానం కింద పిల్లలు కనడాన్ని డాక్టర్ పటేల్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఒకటీ అరా కేసులలో ఏదైనా ప్రత్యేక ప్రొవిజన్ ఉండి ఉంటే బావుండేదననారు.

‘‘ఉదాహరణకు భార్య వయసు 40 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండి, భర్త వయసు 56 ఏళ్ళు ఉన్నా, లేదంటే భర్త వయసు 53 ఉండి, భార్య వయసు 51 ఉన్నా, వారు ఆరోగ్యంగా ఉంటే ఇటువంటి కేసులో ఐవీఎఫ్ విధానాన్ని అనుమతించవచ్చు.

ఖర్చులు కూడా ముఖ్యమైన విషయమే

ఐవీఎఫ్ లో ఒక దశకు అయ్యే ఖర్చు ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఒక వేళ మహిళ వయసు 21 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉంటే ఒకటి, రెండు దశలలోనే వారు తల్లయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ సునీతా ఆరోరా చెప్పారు.

చాలా సందర్భాలలో వయసు పెరిగినవారికే ఐవీఎఫ్ అవసర పడుతుంది. దీంతో వీరికి ఎక్కువ దశలు, ఎక్కువ ఖర్చు అనివార్యమవుతుంది.

ఐవీఎఫ్‌కు వచ్చే మహిళలు ఆర్థిక కష్టాలతో మానసిక, శారీరక, సామాజిక స్థాయులలో అనేక కష్టాలను ఎదుర్కొంటారని డాక్టర్ పటేల్ చెప్పారు. కానీ, ఒకసారి బిడ్డ వారి చేతుల్లోకి వచ్చాకా అప్పటిదాకా పడిన కష్టాలు, విచారాలను మరిచిపోతారని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)