మహిళలపై లైంగిక దాడి చేసి చంపేసే సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకున్న ఏకైక మహిళ ఏమంటున్నారు? ఆ రోజు ఏం జరిగింది

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
- రచయిత, సేకరణ
- హోదా, బీబీసీ ముండో నుంచి,
క్యాథీ క్లెయినెర్ గురించి బహుశా మీరు విని ఉండరు. కానీ, ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన అమెరికాకు చెందిన సీరియల్ కిల్లర్ గురించి మీరు విని ఉండొచ్చు.
1974-78 మధ్య కాలంలో అమెరికాలో మహిళలను టార్గెట్ చేసి వారిని వేధించి, లైంగిక దాడి చేసి చంపిన సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఏకైక మహిళ క్యాథీ.
అంతకుముందే 12 ఏళ్ల వయసులో, మృత్యువు అంచువరకు వెళ్లి వచ్చారు క్యాథీ.
ఆ సమయంలో లూపస్ అనే వ్యాధి బారిన పడి కీమో థెరపీ చికిత్స తీసుకున్నారు. వ్యాధి నుంచి కోలుకుని 1978లో ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ఓ రోజు రాత్రి అపరిచితుడు ఆమె ఉంటున్న వసతి గృహంలోకి ప్రవేశించాడు.
ఆ తరువాత జరిగిన భయంకరమైన దాడిలో వసతిగృహంలోని ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. క్యాథీ, ఆమె స్నేహితురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృత్యువు నుంచి రెప్పపాటులో తప్పించుకున్నారు.
ఆ ఘటన నుంచి బయటపడి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించారు క్యాథీ.
అయితే, క్యాథీ ఒక సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకు ప్రాణాలతో బయటపడ్డారన్న వాస్తవం ఆమె కుమారుడికి 37 ఏళ్లు వచ్చేవరకు తెలియలేదు.
తన జీవితంలో చోటుచేసుకున్న సంగతులను వివరిస్తూ ఆమె ఎమీలీ లీ బ్యే లుకెసీతో కలిసి ‘ఏ లైట్ ఇన్ ది డార్క్: సర్వైవింగ్ మోర్‌దెన్ టెడ్ బండీ’ పేరిట పుస్తకాన్ని రాశారామె.
బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహిస్తున్న అవుట్‌లుక్ ప్రోగ్రామ్‌లో ఆ సంఘటనల గురించి గుర్తుచేసుకున్నారు క్యాథీ.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
సరదాగా సాగిపోతున్న జీవితంలో..
క్యాథీ క్లెయినెర్ రూబిన్ ఫ్లోరిడాలోని మియామీలో జన్మించారు. తల్లి క్యూబాకు చెందినవారు. తండ్రి అమెరికా పౌరులు.
క్యాథీ బాల్యం మంచి కుటుంబ వాతావరణంలో సోదరీసోదరుల మధ్య ఎంతో చక్కగా సాగింది. అంతలోనే తండ్రిని కోల్పోయారు క్యాథీ. ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడు గుండెపోటుతో మరణించారు క్యాథీ తండ్రి.
అనంతరం తల్లి జర్మన్ మూలాలున్న వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన తన పట్ల ప్రేమగా ఉన్నారని క్యాథీ చెప్పారు.
“ఆయన చాలా కూల్. నా కన్నతండ్రితో సమానంగా ప్రేమను పంచారు. అందుకే నేను ఆయన్ను నాన్నా అని పిలిచాను” అని చెప్పారు క్యాథీ.
తన తల్లి క్రమశిక్షణతో పెంచారని, తన జీవితంపై ఆమె ప్రభావం చాలా ఉందని చెప్పారు క్యాథీ.
ఈ క్రమంలో క్యాథీకి పన్నెండేళ్ల వయసున్నప్పుడు ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారు.
“అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను. దాదాపుగా ఆ ఏడాది పూర్తవుతోంది. ఆ సమయంలో నాకు అలసటగా అనిపించడం మొదలైంది. ఏ పనీ చేయబుద్ది కాలేదు. ఎలాగో అనిపించేది” అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
స్కూల్ నుంచి తిరిగి వెళ్లగానే బెడ్ మీద వాలిపోయేవారని, జ్వరం వచ్చేదని చెప్పారు.
వైద్యుల సలహాతో ఆమెను మియామిలోని పిల్లల ఆసుపత్రిలో చేర్చారని, అక్కడే మూడు నెలలపాటు చికిత్స తీసుకున్నప్పటికీ, తనకు ఏమైందో వైద్యులు కచ్చితంగా చెప్పలేకపోయారని అన్నారు.
ఆమె శరీరంపై దాడి జరుగుతోందని వైద్యులు గుర్తించారు కానీ, అందుకు కారణమేంటో అంతుబట్టలేదు. ఆమె ఎంత కాలం ప్రాణాలతో ఉంటుందో తెలీదని, ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు తన తల్లిదండ్రులతో చెప్పిన సంగతి క్యాథీ గుర్తుచేసుకున్నారు.
క్యాథీకి లూపస్ అనే నయంకాని వ్యాధి సోకింది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే ఆరోగ్యకరమైన కణాజాలాలను నాశనం చేసే వ్యాధి అది.
ఆ సమయంలో వ్యాథి తీవ్రతను తగ్గించే చికిత్స ప్రయోగాత్మకంగానే అందుబాటులో ఉంది.
క్యాథీ వ్యక్తిగత వైద్యులు ఆమెకు కీమోథెరపీ చేయించాలని సూచించారు.
కానీ, 12 ఏళ్ల వయసున్న క్యాథీ లాంటి పిల్లలకు కీమో థెరపీ చికిత్స అందించడం కష్టంతో కూడుకున్నదే.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
ఒంటరిగా ఏడాది పాటు..
“నా జుట్టు రాలడం మొదలైంది. క్రమంగా జుట్టంతా ఊడిపోయింది. ఏడో తరగతిలోకి వచ్చే సమయానికి ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది” అని క్యాథీ చెప్పారు.
ఓ ఉపాధ్యాయురాలు ఆమెకు ఇంటివద్దే చదువు చెప్పారు. అక్కడే కిటికీలో నుంచి బయట ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ గడిపేవారు క్యాథీ.
ఆ సమయంలో చాలా ఒంటరితనాన్ని అనుభవించానని క్యాథీ చెప్పారు.
కొన్నిసార్లు ఫోన్ తీసుకుని సున్నాకు డయల్ చేసి ఆపరేటర్ వాయిస్ వినేదానినని క్యాథీ చెప్పారు.
ఇబ్బందులు ఎదురైనా క్యాథీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు.
రోజులో ఎక్కువ సమయం బెడ్‌కే పరిమితమైనప్పటికీ తన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సమయానికి తానే లేచి దుస్తులు మార్చుకుని, టీవీ చూస్తూ, తాను బాగానే ఉన్నట్లుగా కనిపించడానికి ప్రయత్నించేవారు.
ఆ ఏడాది గడిచేసరికి కోలుకుని, వైద్యుల సూచనలతో తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యారు.
“లూపస్‌తో బాధపడుతున్న బాలికగా నేను ఉండాలని అనుకోలేదు. అందరిలాగా స్కూల్‌కు వెళ్లి చదువుకోవాలని అనుకున్నాను” అని చెప్పారు.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
యూనివర్సిటీ జీవితం..
స్కూల్ చదువు పూర్తిచేసుకుని జెయిన్స్‌విల్లీలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (ఎఫ్ఎస్యూ)లో చదువుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ క్యాంపస్ మియామికి దూరంలో ఉంది. అక్కడికి వెళ్లే కాస్త స్వేచ్ఛగా ఉండొచ్చనేది తన ఆలోచని అని క్యాథీ చెప్పారు. తల్లి క్రమశిక్షణ పెంపకం నుంచి మినహాయింపు కోరుకున్నట్లుగా ఆమె చెప్పారు.
“నేను అందరిలాగా జీవితాన్ని ఆస్వాదించాలని అనుకున్నాను. ఎక్కువగా పార్టీలకు వెళ్తూ, కాస్త తక్కువ చదువుతూ, కొత్త స్నేహితులను వెతుక్కుని సరదాగా ఉండాలని అనుకున్నాను” అన్నారు.
యూనివర్సిటీలో మొదటి ఏడాది బాగానే గడిచింది. కాలేజీలోని విద్యార్థినులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న సోషల్ క్లబ్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ క్లబ్ నిర్వహణ కోసం ఓ భవంతిని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ‘ఛై ఒమెగా’ అనే పేరు పెట్టుకున్నారు.
ఆ క్లబ్ భవనం గురించి క్యాథీ మాట్లాడుతూ, అది చాలా పెద్ద ఇల్లు. పెద్ద డైనింగ్ హాల్. లివింగ్ రూం. టీవీ, పెద్ద సోఫాతో చాలా బాగుండేది అని ఆ భవంతి గురించి చెప్పారు. హాలులో అందమైన మెట్ల నుంచి పైకి వస్తే దాదాపు 30 బెడ్‌రూంలకు దారి తీసే హాల్ ఉందని గుర్తు చేసుకున్నారు.
తానుండే గదిలో తన సిస్టర్ ఒకరు ఉండేవారు.
“ఆ బెడ్‌రూం చాలా అందంగా ఉండేది. కిటికీ నుంచి పార్కింగ్ ఏరియా కనిపించేంది. సూర్యరశ్మి ధారాళంగా వచ్చేది. అందుకే మేం కర్టెన్లు తీసే ఉంచేవాళ్లం” అని గుర్తు చేసుకున్నారు.
ఆ భవనం చాలా బాగుంటుంది. అంతా బాగానే ఉంది కానీ, కానీ ముందరి తలుపుకు ఉన్న తాళం పాడైపోయింది.
అదే సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మహిళల హత్యలు అందరినీ కలవర పెట్టాయి. ముఖ్యంగా పశ్చిమ తీరాన ఎక్కువగా హత్యలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
టెడ్ బండీ అనే సీరియల్ కిల్లర్ తమపై దాడులు చేస్తున్నాడని బాధితులు గుర్తించారు.
కానీ క్యాథీ నివసించే ఫ్లోరిడాకు చాలా దూరంలో ఆ సంఘటనలు జరగడంతో, ఆ హత్యల గురించి, సీరియల్ కిల్లర్ గురించి క్యాథీకి అంతగా తెలీదు.
కానీ, 1978 జనవరి 14న మాత్రం అతడెవరో ఆమెకు తెలిసింది.

ఫొటో సోర్స్, Getty Images
దాడి జరిగిన రోజు..
ఆ రోజు శనివారం..
క్యాథీ తనకు పరిచయం ఉన్న ఓ జంట వివాహానికి వెళ్లారు. వివాహం అనంతరం తిరిగి వసతి గృహానికి వచ్చినట్లు క్యాథీ గుర్తుచేసుకున్నారు.
ఆ సోమవారం తనకు కాలిక్యులస్ పరీక్ష ఉందని, అందుకోసం సిద్ధమయ్యేందుకు త్వరగానే తిరిగి వచ్చినట్లు తెలిపారు. అప్పటికే తన రూమ్‌మేట్ చదువుకుంటున్నారు.
ఆ రోజు రాత్రి 11:30 గంటల సమయంలో వారు నిద్రించారు.
కొన్ని గంటల తరువాత ఎవరో హాల్‌లోకి ప్రవేశించారు. తాళం విరిగిపోయిన ఆ ముందరి తలుపు నుంచి లోపలికి ప్రవేశించి, మెట్ల మీదుగా పైకి వచ్చారు. ఆ వ్యక్తి చేతిలో ప్రవేశ ద్వారం వద్ద తీసుకున్న కర్ర ఉంది. హాల్లోకి వచ్చిన ఆ వ్యక్తి మొదటి బెడ్‌రూంలోకి ప్రవేశించాడు.
“అతడు మార్గరెట్ బోమన్ ఉండే గదిలోకి ప్రవేశించి ఆమెపై కర్రతో దాడి చేసి, ఆమెను తీవ్రంగా కొట్టి, హత్య చేశాడు” అని క్యాథీ చెప్పారు.
ఆ తరువాత అతడు లీసా లెవీ ఉండే గదికి వెళ్లాడు. “ఆ గది తెరిచే ఉండటంతో లోపలికి వెళ్లి, అదే కర్రతో ఆమెను తీవ్రంగా కొరికాడు. ఆపై హత్య చేశాడు. ఆమె ఒంటిపై పంటిగాట్లు స్పష్టంగా తెలిసేలా ఉన్నాయి” అన్నారు క్యాథీ.
ఆ హంతకుడిని గుర్తించడంలో ఆ పంటిగాట్లే కీలకంగా మారినట్లు క్యాథీ చెప్పారు.
అక్కడితో ఆ హంతకుడు ఆగలేదు. హాల్‌ను దాటి క్యాథీ, తన రూమ్ మేట్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో వారికి బయట జరిగిందేమీ వినిపించలేదు. ఇద్దరూ నిద్రపోతున్నారు. కానీ తలుపు తెరిచిన శబ్దం వినిపించనప్పటికీ, ఆ తలుపు అంచు కార్పెట్‌ను రాసుకుంటూ వెళ్లిన శబ్దానికి క్యాథీ మేల్కొన్నారు.
“అప్పుడు నేను, నా బెడ్ మీద కూర్చుని చుట్టూ చూశాను. అక్కడేముందో నాకు తెలీడం లేదు. ఎవరో నా పక్కనే ఉన్నట్లుగా నీడ ద్వారా అర్థమైంది. ఆ నీడను చూస్తే, చేతిలో కర్రను పైకి లేపి, నాపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించాను” అని చెప్పారు.
అదే కర్రతో మార్గరెట్, లీసాలను హత్య చేశాడు. అదే కర్రతో క్యాథీపై ముఖంపై బలంగా దాడి చేశాడు.
ఆ తీవ్రతకు క్యాథీ దవడ మూడుచోట్ల విరిగిపోయింది. ఆ వెంటనే క్యాథీని వదిలి, పక్కనే ఉన్న ఆమె రూమ్ మేట్‌పై దాడి చేసేందుకు వెళ్లాడతను. క్యాథీ అరవడానికి ప్రయత్నించారు. కానీ, పక్కకు తొలగిన దవడ ఆమెను మాట్లాడనివ్వలేదు.
ఆ వ్యక్తి క్యాథీని చంపడానికి వచ్చాడు. కర్రతో మరోసారి దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కర్టెన్లు తెరిచి ఉన్న కిటికీలో నుంచి ఆ గదిలోకి ప్రవేశించిన తెల్లటి కాంతి ఆ గది మొత్తం ఆక్రమించింది.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
చివరి నిమిషంలో..
“అది కారు లైట్ల కాంతి. డేట్‌కు వెళ్లిన నా సోదరిని వదిలేందుకు వచ్చిన కారు అది” అన్నారు క్యాథీ.
ఆ సమయంలో దాడి చేయడానికి అతడు వెనుకాడాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి, భవనం నుంచి బయటకు పారిపోయాడు. కానీ ఆ సమయంలో వసతి గృహానికి తిరిగి వస్తున్న యువతి అతడిని చూసింది.
ఆ సమయంలోనే క్యాథీ తాను తీవ్రంగా గాయపడినప్పటికీ, సాయం కోసం ముందుకు కదిలారు.
“నా ముఖంపై కత్తులు గుచ్చినట్లు బాధ కలిగింది. నా దవడను అలానే పట్టుకున్నాను” అని చెప్పారు.
ఆమెను గుర్తించిన స్నేహితుల్లో ఒకరు ఎమర్జెన్సీ నెంబరుకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.
“నన్ను స్ట్రెచర్‌పై పడుకోబెట్టి, మెట్ల మీద నుంచి కిందకు తీసుకువచ్చారు. నేను ట్రాన్స్‌లో ఉన్నట్లుగా అనిపించింది” అన్నారు క్యాథీ.
రక్తస్రావాన్ని ఆపడానికి క్యాథీకి అక్కడే తాత్కాలికంగా చికిత్స చేశారు.
అక్కడి నుంచి నేరుగా ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో ఆరువారాల పాటు ఉన్నారు క్యాథీ. ఆ సమయంలో దవడను కదల్చకుండా అలాగే ఉంచారు. స్ట్రా ద్వారా మాత్రమే తాను ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండేదని క్యాథీ చెప్పారు.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
విచారణ..
తీవ్రంగా గాయపడిన క్యాథీ త్వరగా ఆ ఘటన నుంచి కోలుకోవాలని అనుకున్నారు.
అందుకు మానసికంగా, శారీరకంగా ఆమె సంసిద్ధురాలు కావాల్సి ఉంది. అయితే, ఆమె జులై 1979లోనే విచారణలో భాగంగా తనపై దాడి చేసిన వ్యక్తిని ఎదుర్కోవలసి వచ్చింది.
టెడ్ బండీ వారిపై దాడి చేసిన తక్కువ సమయంలోనే సెంట్రల్ ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడే 12 ఏళ్ల స్కూల్ విద్యార్థిని కింబర్లీ లీచ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు.
ఆ ఘటన జరిగిన నెల లేదా రెండు నెలల వ్యవధిలోనే అధికారులు అతడిని పట్టుకున్నారు.
అనంతరం విచారణ సమయంలో క్యాథీ దాడికి సంబంధించిన వివరాలన్ని చెప్పారు. ఆమెకు సమీపంలో ఉన్న టేబుల్ వద్ద కూర్చుని ఉన్న బండీ ఆమెనే చూస్తూ ఉన్నారని క్యాథీ చెప్పారు.
“అతడి చూపు ఎలా ఉందంటే, దీని నుంచి చాలా సులభంగా తప్పించుకుంటాను అన్నట్లు ఉంది” అన్నారు.
అయితే బండీని నేరుగా గుర్తించలేకపోయినప్పటికీ, ఇతరుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు నిందితుడే నేరం చేసినట్లు రుజువు చేయగలిగాయి.
“అందుకు నాకు సంతోషం కలిగింది. కోర్టులో వెనుక ద్వారంలోంచి బయటకు వచ్చిన సమయంలో దాదాపుగా వాంతి చేసుకున్నాను” అని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు క్యాథీ.
జ్యూరీ ఏడు గంటల కన్నా తక్కువ సమయంలోనే టెడ్ బండీ రెండు హత్యలు, మూడు హత్యాయత్నాల్లో దోషి అని తేల్చింది. ఇతర నేరాల్లోనూ అతడిని దోషిగా తేల్చేందుకు ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, Getty Images
మరణశిక్ష విధించిన రోజున..
టెడ్‌కు మరణశిక్ష విధించడానికి దాదాపు దశాబ్దకాలం పట్టింది. ఆ సమయంలో క్యాథీ వివాహం చేసుకున్నారు. మైకెల్ అనే కుమారుడు జన్మించాక విడాకులు తీసుకుని, స్కాట్‌ను వివాహమాడారు.
జనవరి 1989లో ఫ్లోరిడాలో టెడ్ బండీకి మరణశిక్ష అమలు చేశారు.
శిక్ష అమలును చూడడానికి రావాలన్న అధికారుల ఆహ్వానాన్ని క్యాథీ తిరస్కరించారు. కానీ టెలివిజన్ ప్రసారాల్లో ఆ వార్తను తన భర్తతో కలిసి చూశారు.
“ఆ దృశ్యాన్ని చూసేవరకు నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అతడికి శిక్ష అమలు చేయడం చూశాక నేను ఏడ్చాను. ఎంతలా అంటే, అందరి బాధితుల తరపున, అతడు హత్య చేసిన మహిళలందరి తరపున.. న్యాయం జరిగిందని భోరున ఏడ్చాను” అన్నారు క్యాథీ.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
అప్పటి నుంచి టెడ్ బండీ గురించి, అతడి జీవితం గురించి పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. వాటిల్లో అతడిని అందగాడిగా, తెలివి ఉన్నప్పటికీ జీవితాన్ని వృథా చేసుకున్న వ్యక్తిగా చిత్రీకరించారు.
కానీ, క్యాథీ అభిప్రాయం ప్రకారం బండీ అందగాడు కాదు. ఒంటరివాడైన ఒక రోగి. “యువకుడిగా ఉన్న సమయంలో అతడు ప్రవర్తించిన తీరు పెద్దయ్యాక అతడు ఎలాంటి నేరాలకు పాల్పడతాడో ముందే చెప్పింది. టెడ్ బండీ జంతువులను చంపాడు. అదే ఇతర పిల్లల పట్లా చేశాడు. ఇదేమీ సాధారణ విషయం కాదు. ఆ విషయం అతడికి కూడా తెలుసు” అన్నారు.

ఫొటో సోర్స్, KATHY KLEINER RUBIN
సాధారణ జీవితం..
టెడ్ బండీ ఇకపై ఎవరికీ హాని తలపెట్టలేడన్న నిజం తెలిశాక క్యాథీ ఉపశమనం పొందారు. తాను తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలని ఆమె కోరుకున్నారు.
తన కుమారుడు మైకెల్‌కు 37 ఏళ్ల వయసు వచ్చేంతవరకు కూడా తనపై దాడి జరిగిందన్న సంగతి తెలియనివ్వలేదు క్యాథీ.
“అతడు మామూలుగానే ఉండాలి. అతడే కాదు. నా కుటుంబం కూడా ఎప్పటిలాగే సాధారణ జీవితం గడపాలని నేను అనుకున్నాను” అని చెప్పారు క్యాథీ.
క్యాథీ కేవలం సీరియల్ కిల్లర్ నుంచి తప్పించుకున్న మహిళ మాత్రమే కాదు. 12 ఏళ్ల వయసులో లూపస్‌ను, 34 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌తోనూ పోరాడి, నిలిచిన మహిళ.
“మీరు రేసులోనే కొనసాగుతూ ఉండాలని నేను ఎప్పుడూ చెప్తుండేదానిని. ఇప్పుడు నాకు వయసు పైబడింది, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, మీరు చాలా వేగంగా నడక సాగించాలి. ఎదురైన అడ్డంకులను దాటి ముందుకు సాగాలి. ఎందుకంటే,.అక్కడ ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది” అన్నారు క్యాథీ.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
- పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా... అలాంటప్పుడు ఏం చేయాలి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














