గీతాంజలి మరణం: సోషల్ మీడియా ట్రోలింగ్ మహిళల ప్రాణాలను తీసే స్థాయికి చేరుతోందా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో చనిపోయిన వివాహిత గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రభుత్వ పథకాలతో తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ గీతాంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమెపై అనుచితంగా పోస్టులు పెట్టిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను గుర్తించామని, మరికొన్ని ఫేక్ ఖాతాలను కూడా గుర్తించామని, నిందితులందరినీ పట్టుకుంటామని గుంటూరు ఎస్పీ తుషార్ చెప్పారు.
టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
అయితే, గీతాంజలి మరణం విషయంలో అధికార పార్టీ అసత్య ప్రచాం చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, social media/BBC
మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్, బెదిరింపులకు సంబంధించిన కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రచయిత్రి కొండేపూడి నిర్మల, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు.. ఇలా చెప్పుకుంటూపోతే సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైన మహిళల జాబితాకు అంతే లేదు.
నిత్యం ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ బారినపడిన పడుతున్న మహిళల్లో కొందరు వీరు.
కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో, మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ, చదవలేని రీతిలో కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తుంటారు.
ట్రోల్స్ చేసేదెవరు?
ట్రోల్స్ చేసే వారెవరనేది చెప్పడం కొంచెం కష్టమే. వీరిపై కేసులు పెట్టినా, పట్టుకోవడం కష్టంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.
ఎందుకంటే, ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, వాటితోనే ట్రోల్స్ చేస్తుంటారు. వారి ఐడీలను ట్రాక్ చేసినా, ఫేక్ కావడంతో పట్టుకోవడం కష్టమే.
అయితే, ఎవరైనా ట్రోల్స్ బారిన పడ్డారంటే, వారిని ఏ వర్గం వారు ట్రోల్స్ చేస్తున్నారో గుర్తించవచ్చు.
ముఖ్యంగా రాజకీయ పార్టీలు, మతపరమైన వ్యక్తులు, పార్టీల సానుభూతిపరులు, వారికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు ట్రోల్స్ చేస్తుంటారు. ఫేస్ బుక్, ఎక్స్ (ట్విటర్), ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌లలో ట్రోల్స్ చేయడం పరిపాటిగా మారింది.
ఇందుకుగానూ ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేయడం లేదా యూట్యూబ్‌లో ప్రత్యేకంగా ఛానల్స్ పెడుతున్నారు.
‘‘నేను రాజకీయాలను ఎప్పుడైతే టచ్ చేశానో అప్పట్నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. పొలిటికల్ వీడియోలు చేయకపోతే ఎవరిమీదా ట్రోల్స్ రావు’’ అని చెబుతున్నారు జర్నలిస్టు తులసీ చందు.
ఇదే విషయంపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ బీబీసీతో మాట్లాడారు.
‘‘పాలిటిక్స్‌కు వచ్చే సరికి సోషల్ మీడియాను మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారేమో అనిపిస్తోంది. నేను ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు.. అవతల రాజకీయ పార్టీలను గానీ, నాయకులను గానీ కొన్ని సార్లు విమర్శలు చేస్తాం. అది రాజకీయంగా చూడకుండా వాళ్ల కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు వ్యక్తిగతంగా తీసుకుని అవతల ఉన్నది స్త్రీ.. తను ఎందుకు అలా అనాల్సి వచ్చిందనే కనీస ఆలోచన లేకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు’’ అని చెప్పారు.

అభిప్రాయాలు వ్యక్తపరిచినా అవమానాలేనా?
ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు.. అవి ఎదుటి వ్యక్తికి, లేదా వర్గానికి నచ్చకపోతే ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
అసభ్య పదజాలంతో దూషించడం, విపరీత కామెంట్లు చేయడం, ఎక్కువ మందికి వీడియో లేదా పోస్టు చేరకుండా రిపోర్టు చేయడం, డీఫేమింగ్, ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం, ఇలా రకరకాలైనవి ట్రోల్స్‌లో భాగమవుతున్నాయి.
ట్రోల్స్‌కు గురయ్యే వారిలో ఎక్కువ మంది అభిప్రాయాలు వ్యక్తం చేసినవారే.
ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా మాట్లాడే, ఆలోచనలను వ్యక్తంచేసే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కల్పిస్తుంది.
రచయితలు, కవులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తుంటారు. కొన్నిసార్లు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేకపోయినా, వారి వ్యాఖ్యలను కొన్ని వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు, లేదా పార్టీల సానుభూతిపరులు అవి తమను ఉద్దేశించి చేసినవేనని ఆపాదించుకుని ట్రోల్స్ చేస్తుంటారు.
ఈ విషయంలో మహిళా రచయితలపై మరింతగా ట్రోల్స్ వస్తుంటాయి.
ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల రాసిన బొట్టు అనే కవిత విషయంలో తీవ్రంగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
ఆ కవితలో ఏముందో ఆమె బీబీసీకి వివరించారు.
‘‘ఈ మధ్య నేను రాసిన బొట్టు అనే కవిత మీద మూడు వీడియోలు వచ్చాయి . ఒక బెదిరింపు కాల్ కూడా వచ్చింది . సైబర్ క్రైం విభాగానికి రిపోర్ట్ చెయ్యాలని చాలా మంది చెప్పారు , కానీ ఇది నాతో మొదలు కాలేదు.. నేనే ఆఖరూ కాదు.
అయినా ఆ కవితలో ఏముంది? బొట్టు అనేది అలంకరించి సుమంగళి పేరుతో గౌరవించిన సమాజమే, భర్త చనిపోగానే తీసేసి అవమానిస్తున్నారు. అది ఇప్పుడు ఆమె ముఖం దాటి దేశం ముఖమ్మీదికి వెళ్లిపోయింది. బొట్టు లేని వాళ్లను వెతికి అవమానిస్తున్నారు. బొట్టు అనేది ఇప్పుడు దాని అర్థాన్ని మార్చుకుంది’’ అనే అర్థంలో రాశానని ఆమె చెప్పారు
‘‘ఇందులో ఒక మతాన్ని కించపరచి౦దీ లేదు. ఒక భావ ప్రకటనా రూపాన్ని ఇలా పోస్టుమార్టం చేసి వక్రీకరించడమేమిటి? బూతులు తిట్టడం ఏమిటి..? ఇదేనా మన సంస్కృతి?’’ అని ప్రశ్నిస్తున్నారు నిర్మల.

ఫొటో సోర్స్, Getty Images
ట్రోల్స్ కాదవి, మూక దాడులు
ట్రోల్స్‌లో మూకదాడులు ఎక్కువ. ఇది కేవలం ఒకరిద్దరో కామెంట్లు పెట్టి వదిలేయడం కాదు, మొత్తం ఆ వర్గాన్ని ప్రేరేపిస్తూ కామెంట్లు పెడతారు.
తమకు మద్దతుగా ఉన్న గ్రూపులలో షేర్ చేసి నెగెటివ్ కామెంట్లు పెట్టడం లేదా అసభ్య పదజాలంతో దూషించడం చేస్తారు.
ఈ ట్రోల్స్ ద్వారా ఎదుటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యం.
‘‘ఇదిగో మనకు వ్యతిరేకంగా మాట్లాడింది.. చూసుకోండి ఈమెను.. అంటూ గ్రూపుల్లో షేర్ చేస్తారు. అప్పుడు ఒకేసారి మూకలా వచ్చి బూతులను కామెంట్లుగా పెడతారు. అదే సమయంలో ఎవరైనా మనల్ని అభిమానించేవాళ్లు లేదా కంటెంట్‌ను పొగడాలని భావించేవారు.. అక్కడ వచ్చే నెగెటివ్ కామెంట్లు చూసి భయపడిపోతుంటారు. మనకు సపోర్టుగా కామెంట్ పెట్టేందుకు ధైర్యం చేయరు.
ఒకవేళ ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే, వారిపై సోషల్ మీడియాలో దాడికి దిగుతారు’’ అని బీబీసీతో అన్నారు తులసీచందు.

సర్వేలు ఏం చెబుతున్నాయి?
అమెరికాలో నిర్వహించిన సర్వేలో 35 ఏళ్లలోపు ఉన్న 33 శాతం మంది యువతులు ఆన్‌లైన్ లో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు.
మైనార్టీ వయసులో ఈ వేధింపులు మరింత ఎక్కువ. ప్రతి పది మందిలో ఏడుగురు వేధింపులకు గురవుతున్నట్లు తేలింది.
2020లో ప్లాన్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ భారత్‌లో నిర్వహించిన సర్వేలో 58 శాతం మంది ఆన్‌లైన్ వేధింపులు లేదా అసభ్యతకు గురైనట్లు తేలిందని బిజినెస్ స్టాండర్డ్ ఒక కథనంలో పేర్కొంది.
ఇండియా, అమెరికా, బ్రెజిల్ సహా 22 దేశాల్లోని 15-22 ఏళ్ల వయసున్న 14 వేల మంది యువతులపై సర్వే నిర్వహించింది.
తాము వేధింపులకు గురైన తర్వాత ప్రతి ఐదుగురిలో ఒకరు సోషల్ మీడియా చూడటం మానేశారు. అదే సమయంలో ప్రతి పది మందిలో ఒకరు వేరొక మాధ్యమం లేదా ఐడీని మార్చుకున్నారు.
అత్యధికంగా ఫేస్‌బుక్‌లో 39 శాతం మేర వేధింపులకు గురవుతున్నట్లు యువతులు చెప్పారు.
ఇన్‌స్టాలో 23 శాతం, వాట్సాప్‌లో 14 శాతం, స్నాప్‌చాట్‌లో పది శాతం, ఎక్స్‌లో తొమ్మిది శాతం, టిక్ టాక్‌లో 6 శాతం చొప్పున వేధింపులకు గురవుతున్నట్లు సర్వేలో తేలింది.

అసభ్య పోస్టుల నియంత్రణ: ‘ప్రాజెక్ట్ ఏంజెల్’
ఐదేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ఐటీ) ప్రాజెక్ట్ ఏంజెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది.
సోషల్ మీడియాలో టీనేజీ అమ్మాయిలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులు, అసభ్య పదజాలాన్నినియంత్రించడం లేదా మెసేజ్‌లోని కంటెంట్ కనిపించకుండా చేయడం ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
ట్రిపుల్ ఐటీలోని ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ ఎక్స్ ట్రాక్షన్ ల్యాబ్ ప్రొఫెసర్ వాసుదేవ వర్మ సారథ్యంలో ప్రాజెక్ట్ ఏంజెల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉద్దేశాన్ని ఆయన బీబీసీతో పంచుకున్నారు.
‘‘మేం కొన్ని ప్రాజెక్టుల పని మీద హైదరాబాద్ చుట్టుపక్కల స్కూల్స్‌కు వెళ్లాం. దాదాపు 30 శాతం మంది టీనేజీ అమ్మాయిలు మానసికంగా కుంగుబాటులో ఉన్నట్లు గుర్తించాం. వారిలో పది శాతం మంది క్లినికల్ చికిత్స తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవ్వడం, అసభ్య పదజాలంతో వేధింపులకు గురవ్వడంతో వారంతా మానసికంగా ఆందోళన చెందుతున్నట్లు గుర్తించాం’’ అని చెప్పారు.

వేధించేలా లక్షల మెసేజీలు: ప్రొఫెసర్ వాసుదేవవర్మ
‘‘ప్రాజెక్ట్ ఏంజెల్ రూపొందించే క్రమంలో 13 వేల సోషల్ మీడియా ఖాతాలను మేం పరిశీలించాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, నేచర్ లాంగ్వేజీ టూల్స్ ఉపయోగించి ఆ ఖాతాల్లోని మెసేజ్‌లను విశ్లేషించాం. దాదాపు 20 లక్షల మెసేజీల్లోని పదాలు వేధింపులకు గురిచేసేవిగా ఉన్నట్లు గుర్తించాం’’ అని చెప్పారు ప్రొఫెసర్ వాసుదేవ వర్మ.
ఆ స్థాయిలో సోషల్ మీడియాలో అసభ్య పదజాలం, బాడీ షేమింగ్, దూషణలు జరుగుతున్నాయని వివరించారు.
‘‘ఇది బాధితుల అకౌంట్లకు వచ్చే అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లు కనిపించకుండా మాస్క్ వేస్తుంది. దాన్ని ఖాతా నిర్వాహకులు కావాలనుకుంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. లేదా అలాగే వదిలేయవచ్చు.
అలాగే, ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో.. వారు అసభ్య పదజాలాన్ని వినియోగించి టైప్ చేసి మెసేజ్ పంపేటప్పుడు హెచ్చరిక చేస్తుంది.
ఆ సందేశంలో అసభ్య పదజాలం ఉందని, దాన్ని పంపితే క్రిమినల్ చర్యలకు గురయ్యే అవకాశం ఉందని చెబుతుంది’’ అని వర్మ చెప్పారు.
సాధారణ సమయాల్లో మామూలుగా కనిపించే వ్యక్తులు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేసరికి చాలా క్రూరమైన వ్యక్తిత్వాన్ని కనబరుస్తున్నారని పరిశోధనలో తేలింది.

మనిషి స్వభావం ఎందుకు మారుతోంది?
సాధారణ సమయాల్లో సహజంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా గుంపులో ఉన్నప్పుడు స్వభావం మార్చుకుని విపరీత ధోరణిని ప్రదర్శిస్తుంటారని చెప్పారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సైకాలజీ ప్రొఫెసర్ పైడిపాటి స్వాతి.
‘‘మాబ్ బిహేవియర్ అని అంటుంటాం.. బంద్‌లు, రాస్తారోకోలు చేసినప్పుడు సహజంగా కనిపించే వాళ్లు గుంపులో కలిసినప్పుడు రాళ్లు విసురుతుంటారు. అద్దాలు పగలగొడతారు. మనల్ని ఎవరూ చూడరని భావించినప్పుడు ప్రవర్తన మారుతుంది.
సోషల్ మీడియాలోనూ ఫేక్ నేమ్స్‌తోనే ఉంటారు. ఎవరు చేశారనేది తెలుసుకోవడం కష్టమవుతోంది. ప్రత్యేకించి పోలీసులు దర్యాప్తు చేస్తే వారెవరో తెలియదు. నన్ను ఎవరూ పట్టించుకోరు అన్న సందర్భంలో విపరీత ప్రవర్తన బయటపెడుతుంటారు'’ అని స్వాతి అన్నారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్ వెనక మూడు కారణాలు ఉన్నట్లు ఆమె వివరించారు.
ఎదుటి వ్యక్తులు పాపులర్ అవుతుంటే డీఫేమ్ చేయాలనుకోవడం, పుట్టి పెరిగిన వాతావరణం- చదువు - స్నేహితులు, తన గురించి తెలుసుకోలేరనే భావనతో ట్రోల్స్‌కు పాల్పడుతుంటారని చెప్పారు.
మహిళలు ట్రోల్స్‌ను పట్టించుకోకుండా పట్టుదల, ఆత్మవిశ్వాసం కనబరిస్తేనే లక్ష్యాలు చేరుకోగలమని వివరించారు బీజేపీ నేత సాదినేని యామినీ శర్మ.
‘‘మహిళలు ఎదుగుతుంటే కొంతమంది ప్రోత్సహిస్తారు.. మరికొందరు రాళ్లు వేస్తుంటారు. అయినా మన లక్ష్యం మాత్రం సూటిగా ఉండాలి. మనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా, మనోస్థైర్యాన్ని వీడకుండా మరింత బలంగా మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలి’’ అన్నారామె.
సైబర్ క్రైం ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్
ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్) డాటా ప్రకారం.. 2022లో దేశవ్యాప్తంగా మహిళలకు వేధింపులపై 3,001 కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో లైంగికంగా వేధించిన 2,305 కేసులు ఇందులో ఉన్నాయి.
మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం, డిఫమేషన్, మార్ఫింగ్, ఫేక్ ప్రొఫైల్ తయారు చేయడం వంటి ఘటనలపై 696 కేసులు నమోదయ్యాయి.
‘‘మహిళలకు ఆన్‌లైన్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు జాతీయ స్థాయిలో పోర్టల్ అందుబాటులో ఉంది. నేరుగా పోలీసు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే www.cybercrime.gov.in అనే పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
అందులో కూడా ఐడెంటిటీ బయటపెట్టకుండా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు ఆధారంగా నిందితులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటాం’’ అని బీబీసీతో చెప్పారు తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖా గోయల్.

చట్టపరంగా ఎదుర్కోవడం ఎలా?
వెంటపడి వేధించడం (స్టాకింగ్), అసభ్య పదజాలంతో దూషించడం వంటి వాటి విషయంలో కొన్ని చట్టాలు వెసులుబాటు కల్పిస్తున్నాయని శిఖా గోయల్ చెప్పారు. ఐటీ యాక్ట్, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు వర్తింపజేయవచ్చన్నారు.
ఆన్‌లైన్ ట్రోలింగ్ విషయలో 2008లో ఐటీ చట్టానికి చేసిన సవరణలు కొంత వరకు కేసులు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నాయి.
ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద కేసులు నమోదు చేయవచ్చు.
ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం, లైంగికంగా అసభ్యకరమైన చర్యల వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం నేరంగా పరిగణిస్తారు.
కానీ, ఇండియాలో ప్రత్యేకించి సోషల్ మీడియా ట్రోలింగ్‌పై నమోదు చేసేందుకు చట్టాలు లేవు. ఇది ఒకరకంగా మాట్లాడే స్వాత్రంత్య్రాన్ని కోల్పోయేలా చేస్తుందన్న భావనతో కొత్త చట్టాలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
డిఫమేషన్: ఐపీసీ 499 ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునేందుకు వీలుంది. మహిళను డీఫేమ్ చేసినట్లు రుజువైతే రెండేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది.
లైంగిక వేధింపుల మాటలు: ఐటీ చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి మహిళపై లైంగిక వేధింపుల మాటలు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టు చేస్తే చర్యలు తీసుకునే వీలుంది.
నేరం రుజువైతే 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధిస్తారు.
బెదిరింపులు: మహిళపై అతడు లేదా ఆమె నేరపరమైన బెదిరింపులకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 503 ప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది. గుర్తుతెలియకుండా మహిళపై బెదిరింపులకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 507 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
‘‘మహిళలు, యువతులు ముందుకు వచ్చి తమపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులు, ఆన్‌లైన్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలి. వాటిని దాచేస్తే, నేరం చేసిన వారిపై చర్యలు తీసుకునే వీలుండదు. అందుకే ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నా’’ అన్నారు శిఖా గోయల్.
ఇవి కూడా చదవండి:
- అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...
- లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకు దీనికి సంబంధం ఏమిటి
- హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














