ఇథియోపియా ప్రజలు క్రైస్తవ మతంలో ఆర్థడాక్స్ శాఖకు ఎందుకు దూరమవుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ..
- హోదా, దునియా జహాన్
ఇథియోపియాలో వందల ఏళ్ళుగా ఆర్థడాక్స్ చర్చిపై లక్షలాది మందికి విశ్వాసముండేది. ఇపుడు చాలామంది ఆ చర్చిని వీడి వెళుతున్నారు. ఇథియోపియన్లకు వారి ఆర్థడాక్స్ క్రైస్తవ చర్చిపై విశ్వాసం తగ్గుతోందా?
ఇథియోపియా అనే పేరు వినగానే మీ మదిలో రకరకాల చిత్రాలు వస్తాయి, మీరు ఏ దృష్టితో ఆలోచిస్తున్నారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది.
యూరోపియన్ల కోణం నుంచి చూస్తే, ఎనభైల సమయంలో ఇథియోపియాలో వ్యాపించిన భయంకరమైన కరువు చిత్రాలు కనిపిస్తాయి.
కానీ ఆఫ్రికన్ ప్రజలకు ఇది వలస శక్తులు ఆక్రమించలేని భూమిగా కనిపిస్తుంది. వారికి ఇది ఆఫ్రికన్ ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన ఆధునిక దేశం ఇథియోపియా. ఈ దేశాన్ని ప్రస్తుతం నడిపిస్తోంది 2019లో నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రధానమంత్రి.
కానీ ఒక సంవత్సరం తర్వాత, ఇథియోపియాలో అంతర్యుద్ధం జరిగింది. ఇందులో వేలాది మంది సామాన్యులు చనిపోయారు.
ఇథియోపియన్ సమాజంలో ఆర్థడాక్స్ క్రిస్టియన్ చర్చి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ అంతర్యుద్ధం ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చిలో విభేదాలకు దారితీసింది.
దేశంలోని 44 శాతం మంది ప్రజలు తమను తాము ఆర్థడాక్స్ క్రైస్తవులుగా భావించిన రోజులున్నాయి.
ఇథియోపియన్ రాజకీయాలు ఆర్థడాక్స్ చర్చిపై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు క్రమంగా ఇతర వర్గాల్లో చేరుతున్న ఆర్థడాక్స్ సంఖ్య పెరుగుతోంది.
తమను తాము ఆర్థడాక్స్ క్రైస్తవులుగా పిలుచుకునే వారి సంఖ్య వేగంగా తగ్గుతోంది.
కాబట్టి ఈ వారం 'దునియా జహాన్' లో ఇథియోపియన్ ప్రజలకు వారి ఆర్థడాక్స్ క్రైస్తవ చర్చిపై విశ్వాసం తగ్గుతోందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
చర్చిలో విభేదాలు
తెవాహెడో క్రిస్టియన్ చర్చిల పురాతన క్రైస్తవ శాఖలలో ఇథియోపియన్ ఆర్థడాక్స్ ఒకటి. తెవాహెడో అంటే 'ఐక్యత'.
ఇథియోపియా పాలకులు, బైబిల్లో ప్రస్తావించిన సోలమన్ రాజు, మకాడా రాజుల వారసులని వారికి ఒక నమ్మకం ఉంది.
శతాబ్దాలుగా ఇథియోపియాపై ఆర్థడాక్స్ తెవాహెడో చర్చి ప్రభావం ఎక్కువగా ఉందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోని సీనియర్ పరిశోధకుడు మెబ్రతు కెలెచా అభిప్రాయపడ్డారు.
ఇది దేశం గుర్తింపులో ముఖ్యమైన భాగమని తెలిపారు. ఆర్థడాక్స్ చర్చిలో గతంలోనే విభేదాలు ఉన్నాయి, అయితే 2020 నవంబర్‌లో టిగ్రేలో అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అవి మరింత తీవ్రమయ్యాయి. ఒరోమియా ప్రాంతంలో జరిగిన తిరుగుబాటు కూడా దీనికి కారణం.
ఒరోమియా ప్రాంతంలో చర్చి అడ్మినిస్ట్రేషన్‌పై విమర్శలు ఉన్నాయి. అక్కడి అనుచరులతో కమ్యూనికేట్ చేయడానికి మాతృభాషను ఉపయోగించడంలో చర్చి విఫలమైందని ప్రజల భావన.
చర్చిలో పురాతన గీజ్ భాష ఉపయోగిస్తారు. ఇది అమ్హారిక్ భాషకు సంబంధించినది, ఇది ఇథియోపియాలోని పాత ఉన్నత తరగతి భాష.
కానీ 1974లో ఇథియోపియా రాజు అయిన హేలీ సెలాసీని అధికారం నుంచి తొలగించిన తర్వాత, ఆ ఉన్నత వర్గం అట్టడుగుకు పడిపోయింది.
ఆ చర్యలో వేలాది మంది చనిపోయారు. ఇందులో ఇథియోపియన్ రాజు, చర్చి పాట్రియార్క్ అంటే చర్చి అధిపతి కూడా హత్యకు గురయ్యారు.
ఆ తర్వాత అబునా మెర్కోరియస్ చర్చి కొత్త అధిపతిగా ఎన్నికయ్యారు. 1974లో రాజు సలాస్సీని తొలగించిన తర్వాత మారిన పరిస్థితులకు (సైనిక , రాజకీయ పాలన) అనుగుణంగా చర్చి కార్యకలాపాలు నిర్వహించడంలో విఫలమైందని మెబ్రతు కెలెచా అంటున్నారు.
అంతర్యుద్ధం
ఇథియోపియాలో ఏళ్ల అస్థిరత తర్వాత 1991లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చి హెడ్ అబునా మెర్కోరియస్ విదేశాలకు వెళ్లి అక్కడే ఆర్థడాక్స్ చర్చిని స్థాపించారు.
అనంతరం ఇథియోపియాలో ఆర్థడాక్స్ చర్చికి అబునా పౌలస్ పాట్రియార్క్ అయ్యారు, 2018 వరకు ఆయన చర్చి బాధ్యతలను నిర్వహించారు. కానీ 2018లో అబియ్ అహ్మద్ ప్రధానమంత్రి అయిన తర్వాత అబునా మెర్కోరియస్‌ను తిరిగి దేశానికి రప్పించారు. అబునా మెర్కోరియస్, ప్రస్తుత చర్చి హెడ్ 'అబూనా'ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
"చర్చిలో విభజనవాదం లేకుండా చూడాలని ప్రధాని ప్రవాసంలో ఉన్న మత పెద్దలను తిరిగి దేశానికి ఆహ్వానించారు, అయితే, ఇది చర్చిపై పట్టు కోసం ఇద్దరి మధ్య పోటీకి దారితీసింది" అని మెబ్రతు కెలెచా తెలిపారు.
ప్రధానమంత్రి అయిన తర్వాత, అబి దేశ పరిపాలనా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ కారణంగా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే దేశంలో అంతర్యుద్ధం మొదలైంది.
2020 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి టిగ్రే రీజియన్ దూరమైంది. ఇది ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చి ఐక్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.
ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చి కేంద్రంగా పరిగణించే అక్సమ్ నగరంపై దాడులకు దారితీసింది.
క్రైస్తవులు, యూదులు పవిత్రంగా భావించే 'ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్' నగరంలోని చర్చి ఆఫ్ మేరీలో వెయ్యేళ్లకు పైగా భద్రంగా ఉందని ఇథియోపియన్లు విశ్వసిస్తారు.
అయితే, దాడి సమయంలో ఈ చర్చిని ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చర్చిలో ఆశ్రయం పొందిన వందలాది మందిని బయటకు తీసి కాల్చి చంపారని, చర్చిలను లూటీ చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్టు పేర్కొంది.
2021 మే 7న, టిగ్రేలోని నలుగురు ఆర్చ్ బిషప్‌లు కలిసి స్వతంత్ర విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
యుద్ధాన్ని చర్చి వ్యతిరేకించడంలేదని, అబి ప్రభుత్వానికి మద్దతుగా ఉందని ఆయన ఆరోపించారు.
“ప్రిటోరియాలో ఇథియోపియన్ ప్రభుత్వం, టిగ్రే లిబరేషన్ ఫ్రంట్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడంతో హింస ఆగిపోయింది. కానీ దేశంలోని అనేక సమస్యలు, టిగ్రే భవిష్యత్తుకు సంబంధించిన వివాదాలు ఇంకా పరిష్కరించలేదు. ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చిలో విభజన కూడా దేశం అస్థిరతపై ప్రభావం చూపిందనుకుంటున్నా'' అని మెబ్రతు కెలెచా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మొదలైంది?
ఇథియోపియాలోని ఆర్థడాక్స్ చర్చ్ నాలుగో శతాబ్దం మధ్యలో స్థాపించారని యూకే ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ రాల్ఫ్ లీ చెప్పారు. అప్పటి నుంచి 1974 కమ్యూనిస్ట్ విప్లవం వరకు, ఇది దేశ అధికారిక మతంగా కొనసాగింది.
ఇంతకి ఇథియోపియాలో ఆర్థడాక్స్ చర్చి క్రైస్తవ మతం ప్రధాన చర్చి లేదా ప్రధాన శాఖగా ఎలా మారింది?
"ఇథియోపియాలో ఆర్థడాక్స్ మొదట స్థాపించడంతో అది అక్కడ ప్రధాన చర్చి అయింది. దీనికి ముందు ఇథియోపియాలో ఏ మతాలు ఉండేవనే విషయంపై మనకు చాలా తక్కువ సమాచారం ఉంది.
అక్కడ ఇస్లాం ఆవిర్భావానికి ముందే ఆర్థడాక్స్ మూలాలు బలంగా ఉన్నాయి. అక్కడ ముస్లింలూ ఉన్నారు'' అని రాల్ఫ్ లీ అన్నారు.
రాల్ఫ్ లీ ప్రకారం క్రిస్టియన్ ఆర్థోడాక్స్ చర్చి గత 1,700 సంవత్సరాలలో ఇథియోపియా సమాజం, రాజకీయాలు, సంస్కృతిని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. దేశంలోని ప్రధాన మతం కావడంతో దాని ప్రభావం విస్తృతంగా ఉంది.
“13వ శతాబ్దం నుంచి 1970లలో ఇథియోపియా రాజు హైలే సెలాసీ వరకు, దేశంలోని రాజులందరూ తమను తాము కింగ్ సోలమన్, క్వీన్ షెబా వారసులుగా భావించారు. క్వీన్ షెబా ఇథియోపియాలో జన్మించారని, క్వీన్ షెబా, కింగ్ సోలమన్ కుమారుడు ఇథియోపియాకు ఒడంబడిక పెట్టెను తీసుకువచ్చారనే నమ్మకం కూడా ఉంది'' అని అన్నారు రాల్ఫ్ లీ.
''ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్' అనేది చెక్క, బంగారంతో చేసిన పెట్టె అని క్రైస్తవులు, యూదులు నమ్ముతారు. దీని చిహ్నాన్ని క్రైస్తవులు, యూదులు పవిత్రమైనదిగా పరిగణిస్తారు'' అని రాల్ఫ్ లీ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రభుత్వాల మార్పులు.. విచ్ఛిన్నాలు
చివరి రాజు హైలే సెలాసీ హత్య తర్వాత రాజవంశం శకం ముగిసింది. ఆ తర్వాత మార్క్సిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దానిని డెర్గ్ అని పిలిచేవారు. ఆ ప్రభుత్వం మతాన్ని ప్రోత్సహించలేదు లేదా అణచివేయనూలేదు.
డెర్గ్ 1991లో అధికారం నుంచి దిగిపోయింది. ఇథియోపియన్ పీపుల్స్ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఈపీఆర్డీఎఫ్) నేతృత్వంలోని కూటమి దేశ పగ్గాలు చేపట్టింది.
దీని తర్వాత మార్పు ప్రారంభమైంది. వాళ్లు అట్టడుగున ఉన్న జాతి సమూహాలకు అధికారం ఇచ్చారు.
"ఈపీఆర్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇథియోపియాలో అనేక జాతి, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నించింది. ఉత్తర ఇథియోపియాలోని ఆర్థడాక్స్ చర్చి శక్తివంతమైనది కానీ ఐక్యంగా లేదు. అందులోనూ కుల విభజన జరిగింది. అబి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపించింది'' అని అమెరికాకు చెందిన విద్యావేత్త, ఈశాన్య ఆఫ్రికాపై అవగాహన ఉన్న నిపుణులు యోహాన్నెస్ వోల్డెమారియం అన్నారు.
ఎరిట్రియాతో సరిహద్దు వివాదంపై యుద్ధానికి ముగింపు పలికిన శాంతి ఒప్పందానికి అబి అహ్మద్ అలీ మధ్యవర్తిత్వం వహించారు. దీంతో అబి అహ్మద్‌కు 2019లో నోబెల్ బహుమతి లభించింది. దేశంలో రాజకీయ నియంత్రణను తొలగించారని ఆయనకు ప్రశంసలు దక్కాయి.
ఒరోమో కమ్యూనిటీకి చెందిన అబి అహ్మద్ అలీ తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. కానీ, ముస్లింగా చెప్పుకోరు. ఒరోమా సంఘం చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. అబి అహ్మద్ అలీ ఆధిపత్య ఓమ్హారా లేదా తిగ్రాయన్ జాతి వర్గాలకు చెందిన వ్యక్తీ కాదు, ఆర్థడాక్స్ క్రైస్తవుడూ కాదు. అటువంటి పరిస్థితిలో అబి దేశానికి నాయకత్వం వహించడం ఇథియోపియాలో పెద్ద విషయం.
యోహాన్నెస్ వోల్డెమారియం మాట్లాడుతూ "ఇది ఇథియోపియాకు కష్టకాలం. నా ప్రకారం ఇథియోపియా ముక్కలవుతోంది. ఈపీఆర్‌డీఎఫ్‌పై ఆగ్రహం, నిరసనల కారణంగా అబి 2018లో దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఒరోమియా ప్రజలు ఇథియోపియాలో మెజారిటీగా ఉన్నారు, కానీ సంవత్సరాలుగా అట్టడుగున ఉన్నారు. ఒమ్హారా ప్రాంత ప్రజలతో వాళ్లు కలిశారు'' అని అన్నారు.
''ఈ పరిస్థితుల కారణంగా 2020లో పోరాటం ప్రారంభమైంది, అయితే కేంద్ర ప్రభుత్వం, టిగ్రే డిఫెన్స్ ఫోర్స్ మధ్య ప్రిటోరియాలో ఒప్పందం కుదరడంతో 2022లో పోరాటం ఆగిపోయింది.
అయితే ఇది రాజకీయ ఒప్పందం మాత్రమే. అందువల్ల చర్చిలో చీలికలను ఇది తగ్గించలేదు. చర్చి ముందు ఇతర సవాళ్లూ ఉన్నాయి'' ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త పరిస్థితులు, కొత్త పోకడలు
గత 20-30 ఏళ్లలో ఇథియోపియాలోని ప్రజల మతపరమైన ఒరవడిలో మార్పు వచ్చిందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వరల్డ్ క్రిస్టియానిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యోర్గ్ హౌస్టెయిన్ అభిప్రాయపడ్డారు.
“ఇథియోపియా ఎప్పుడూ క్రిస్టియన్, ముస్లిం దేశం. అయితే, క్రైస్తవ మతంలోనే చాలామంది ఆర్థడాక్స్ నుంచి ప్రొటెస్టంట్ పెంటెకోస్టలిజం వైపు మొగ్గు చూపుతున్నారు, దీనికి ఒక కారణం పెంటెకోస్టల్స్ ఆకర్షణీయమైన ప్రచారం, దానికి పెరుగుతున్న ప్రజాదరణ'' అన్నారు.
ఇథియోపియా జనాభాలో దాదాపు 60 శాతం మంది 25 ఏళ్లలోపు వారే. కొన్ని అంచనాల ప్రకారం ఇథియోపియాలో ఆర్థడాక్స్ క్రైస్తవుల జనాభా ఇప్పుడు మొత్తం జనాభాలో యాభై శాతం కంటే తక్కువగా ఉంది.
"పట్టణీకరణ వంటి అనేక కారణాల వల్ల ఇథియోపియా యువత ఆధునిక భావజాలం వైపు పయనిస్తోంది. అందుకే వాళ్లు ప్రొటెస్టంట్ పెంటెకోస్టలిజం వైపు కదులుతున్నారు. ఎందుకంటే పెంటెకోస్టలిజం వ్యక్తిగత , ఆర్థిక అభివృద్ధిని నొక్కి చెబుతుంది'' అని హౌస్టెయిన్ గుర్తుచేస్తున్నారు.
''ఇథియోపియాలో ఇస్లాం వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంలో ఒకటని కూడా గుర్తుంచుకోవాలి. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది తమను తాము ముస్లింలుగా పరిగణిస్తున్నారు. అబి అహ్మద్ అభివృద్ధి, శాంతి అంటూ అధికారంలోకి వచ్చారు, అయితే అది త్వరలోనే మసకబారడం ప్రారంభించింది. వారు ఎదుర్కొనే ఒక సవాలు ఏంటంటే ఇథియోపియా ఒక పెద్ద, సంక్లిష్టమైన దేశం. అదే సమయంలో దాని పొరుగు దేశాలైన సోమాలియా, సూడాన్, దక్షిణ సూడాన్, ఎరిట్రియాలతో సంబంధాలు కూడా అంత సులభం కాదు'' అని తెలిపారు.
ఇథియోపియాలో కేంద్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య వైరుధ్యాల సుదీర్ఘ చరిత్ర ఉందని హౌస్టెయిన్ చెబుతున్నారు. బహుళ-మత, బహుళ-జాతి, బహుభాషా దేశంలో వనరుల సమాన పంపిణీ ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది. కానీ ఇథియోపియా వైవిధ్యాన్ని సరైన దిశలో తీసుకెళ్లడం, అన్ని జాతుల, సాంస్కృతిక సమూహాల మధ్య శాంతి, ఐక్యతను కొనసాగించడం దేశం ముందున్న పెద్ద సవాలు.
అయితే, ఇథియోపియన్లకు వారి ఆర్థడాక్స్ క్రైస్తవ చర్చిపై విశ్వాసం తగ్గుతోందా? అంటే వందల సంవత్సరాలుగా ఆర్థడాక్స్ చర్చిపై లక్షలాది మంది విశ్వాసముండేది.
ఇప్పుడు పలువురు క్రైస్తవం, ఇస్లాం మతం ఇతర శాఖల వైపు మొగ్గు చూపడంతో వారి సంఖ్య తగ్గుతోంది. కానీ మీరు ఇథియోపియాలో ప్రతిచోటా చర్చి గంటలు, అజాన్, పెంటెకోస్టల్ ప్రార్థనల శబ్దాన్ని వింటారు.
మతంపై విశ్వాసం తమను తాము బాగా అర్థం చేసుకోవడానికి, జీవించడానికి సహాయపడుతుందని ప్రజల విశ్వాసం. అయితే, ఇప్పుడు చాలామంది ఆర్థడాక్స్ తెవాహెడో చర్చి మాత్రమే దీనికి మార్గం అని మాత్రం నమ్మడం లేదు.
ఇవి కూడా చదవండి:
- 300 ఏళ్ల క్రితం భారీ సంపదతో సముద్రంలో మునిగిపోయిన యుద్ధ నౌక.. దీని వెలికితీతకు చేపడుతున్న ఆపరేషన్ ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














