217 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న జర్మన్.. ఆయనకు ఏమైంది?

కోవిడ్ టీకా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెలీ రాబర్ట్స్
    • హోదా, బీబీసీ డిజిటల్ హెల్త్ ఎడిటర్

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సీన్ రాగానే ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు. తరువాత టీకా మొదటి డోసు తరువాత రెండో డోసు తీసుకున్నారు. తరువాత బూస్టర్ డోసుపై చాలా చర్చ జరిగింది.

అయితే జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కేవలం 29 నెలల వ్యవధిలో 217 సార్లు ప్రైవేటుగా కోవిడ్ టీకా తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.

వైద్య సలహాలకు విరుద్ధంగా ఇలా చేసిన ఆయన వయసు 62 సంవత్సరాలు.

ఈ కేసు గురించి ది లాన్సెట్ ఇన్ఫెక్షిసియస్ డిసీజెస్ జర్నల్ ప్రచురించింది.

వైద్యపరీక్షల నివేదికల ప్రకారం- ఆయనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలూ ఎదురు కాలేదని ఎర్లాంజెన్-న్యూరెంబర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు.

‘‘ఈ విషయాన్ని వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్నాం’’ అని ఈ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ కిలియన్ స్కోబర్ చెప్పారు.

కోవిడ్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, PA MEDIA

‘‘మేం ఆయనను వివిధ పరీక్షల కోసం ఎర్లాంజెన్ యూనివర్సిటీకి పిలిచాం. ఆయన కూడా ఈ పరీక్షలు చేయించుకోవడానికి చాలా ఆసక్తి చూపారు. ఆయన నుంచి రక్తాన్ని, లాలాజాలాన్ని సేకరించాం’’ అని డాక్టర్ కిలియన్ స్కోబర్ తెలిపారు.

వీటితోపాటు ఆయన గతంలో పరీక్షల కోసం ఇచ్చిన గడ్డకట్టిన రక్త నమూనాలను పరీక్షించారు. ‘‘అధ్యయనం సమయంలో ఆయన మరోసారి టీకా తీసుకున్నప్పుడు కూడా మేం రక్త నమూనాలను సేకరించాం’’ అని చెప్పారు.

‘‘టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని నిర్ధరించడానికి ఈ నమూనాలను ఉపయోగిస్తాం’ అని తెలిపారు.

ఒక వ్యక్తికి 217 సార్లు టీకాలు ఇచ్చారనే విషయంపై మాగ్డెబర్గ్ నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన 130 సార్లు టీకాలు ఇచ్చినట్టుగా ఆధారాలు సేకరించారు. అయితే దీనిపై ఇప్పటిదాకా నేరాభియోగాలు నమోదు చేయలేదు.

కోవిడ్ టీకాలు ఇన్ఫెక్షన్లకు కారణం కావు. కానీ వ్యాధులతో ఎలా పోరాడాలో శరీరానికి నేర్పుతాయి.

కరోనా వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

రోగ నిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుంది?

మెసెంజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఎంఆర్ఎన్ఏ) టీకాలు శరీర కణాలకు వైరస్‌కు సంబంధించిన జెనెటిక్ కోడ్‌ను చూపేలా పనిచేస్తాయి. దీన్ని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి కోవిడ్ మీద పోరాటం చేయడం ఎలాగో తెలుసుకుంటుంది.

అయితే పదేపదే టీకాలు ఇవ్వడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మనీ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు ఆయన ఎప్పుడూ కోవిడ్ బారినపడిన లక్షణాలను కూడా గుర్తించలేదు.

రోగనిరోధక శక్తిని పెంచేందుకు తాము ఈ ‘హైపర్ వ్యాక్సినేషన్’ విధానాన్ని ఆమోదించబోమని పరిశోధకులు చెప్పారు. అయితే జర్మనీ వ్యక్తిపై జరిపిన అధ్యయనం ద్వారా వీరు ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేకపోయారు గానీ, ప్రజలకు కొన్ని సూచనలు చేయగలిగారు.

‘‘తాజా పరిశోధనల ద్వారా సాధారణ టీకాలతో పాటు మూడు డోసుల వ్యాక్సినేషన్ అనేది ఆమోదనీయమైన విధానమే’’ అని యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా చెప్పారు.

కోవిడ్ టీకాలు సాధారణంగా సమయానుకూలంగా ఇస్తారు. కానీ తీవ్ర బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్న కొంత మందికి ఇతర సమయాల్లో అవసరాన్ని బట్టి అదనపు డోసులు ఇవ్వాల్సి రావచ్చు. ఇలాంటి వారిని జాతీయ ఆరోగ్య సంస్థే సంప్రందించి, అర్హులను గుర్తిస్తుంది.

కోవిడ్ టీకాలు కొన్ని ప్రతికూల ప్రభావాల (సైడ్ ఎఫెక్ట్స్)కు కారణమవుతాయి. వీటిలో టీకా తీసుకున్నప్పుడు చేయి నొప్పి కలగడమనేది ఓ సాధారణ ప్రభావం. లేదంటే చాలామటుకు జ్వరం, అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటివే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)