మీకు నచ్చిన టైమ్‌లో ఉద్యోగం చేసే పద్ధతి ఎలా ఉంటుంది... 'క్రోనో వర్కింగ్' అంటే ఏంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎలోయిస్ స్కిన్నర్ తరచూ మధ్యరాత్రి వరకు పనిచేస్తుంటారు. ఆమె ఒక రచయిత, ఫిట్‌నెస్ శిక్షకురాలు, థెరపిస్ట్.
పని విషయానికి వస్తే స్కిన్నర్ ప్రతి రోజూ 11 గంటల ప్రాంతంలో ల్యాప్‌టాప్ తెరిచి ఈమెయిల్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత, లండన్‌లో ఒక జిమ్‌లో మధ్యాహ్నం లేదా సాయంత్రం షిఫ్ట్‌లలో వర్క్ అవుట్ క్లాస్‌లకు హాజరవుతారు. రాత్రి 7 గంటల తర్వాత ఆఫీసు ప్రాజెక్టు గురించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభిస్తారు.
ఈ సమయంలో ప్రజలంతా దాదాపు తమ పనులను ముగించుకుని కాస్త రిలాక్స్ అవుతుంటారు.
23 ఏళ్ల స్కిన్నర్ తనను రాత్రి గుడ్లగూబగా వర్ణించుకుంటారు. గత కొన్నేళ్లుగా ఆమె ఇలా పలు విభాగాల్లో పనిచేశారు.

ఫొటో సోర్స్, COURTESY OF RHIANNON PALMER
‘‘వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ, రాత్రి 8, 9, 10 గంటల సమయంలోనే నాకు ఏకాగ్రత లభిస్తుంది. దీంతో, ఆ సమయంలో నేను బాగా పనిచేయగలుగుతాను’’ అని స్కిన్నర్ చెప్పారు.
కరోనా తర్వాత, తమకు నచ్చిన సమయాల్లో పనిచేసుకోగలిగే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే, స్కిన్నర్ లాగా చాలా మంది తమకు నచ్చిన సమయాల్లో లేదా వారి షెడ్యూల్‌కు అనుగుణంగా పనిచేయాలనుకుంటున్నారు.
పనిలో మరింత ఉత్పాదకత కోసం పని గంటలను తమకు నచ్చిన విధంగా మార్చాలని చాలా మంది ప్రస్తుతం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘క్రోనోవర్కింగ్’ అని పిలుస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘క్రోనోవర్కింగ్’ అనే విధానాన్ని తొలుత జర్నలిస్ట్ ఎలెన్ సీ. స్కాట్ కనుగొన్నారు.
స్థిరమైన పని వేళల్లో పనిచేయడానికి బదులు వారి క్రోనోటైప్‌కు అనుకూలంగా ఉద్యోగులు పని గంటలను ఎంపిక చేసుకోవడాన్నే ‘క్రోనోవర్కింగ్’ అంటారు.
క్రోనోటైప్ అంటే ఒక వ్యక్తి శరీరం సాధారణంగా నిద్రను కోరుకునే సమయం.
నాలుగు రకాల క్రోనోటైప్‌లు ఉంటాయని అమెరికా సైకియాట్రిస్ట్, నిద్రా వైద్యులు మైఖేల్ బ్రూస్ చెప్పారు.
55 శాతం మంది ఉద్యోగులు రోజు మధ్యలో అంటే పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్కువ ఉత్పాదకతను అందించగలమని భావిస్తున్నారు.
15 శాతం మంది ఉద్యోగులు తెల్లవారుజాముల్లో, మరో 15 శాతం మంది రాత్రివేళ్లల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. 10 శాతం ఉద్యోగులు రోజులో ఎప్పుడైనా పనిచేయగలుగుతామని అంటున్నారు.
పని గంటల్లో ప్రజల ఎంపికల్లో తేడాలున్నప్పటికీ, పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత పని సమయంగా ఉంటున్నాయి. ఇది సంప్రదాయ ఎనిమిది గంటల పనివేళలు.
ఈ పని గంటలను 1800ల్లో అమెరికా కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఫలితంగా చాలా మంది ఉద్యోగులు వారికి నచ్చిన లేదా ఎక్కువ ఉత్పాదకత ఇచ్చే సమయాల్లో కాకుండా ఈ స్థిరమైన పని వేళల్లో బలవంతంగా వర్క్ చేయాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
జనవరిలో అమెరికాలో ఒక చిన్న అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో 1,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 94 శాతం మంది తమకు ఇలా జరుగుతున్నట్లు చెప్పారు.
77 శాతం ఉద్యోగులు నిర్దిష్ట పని గంటలు వారి పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు. వీరిలో సగం మంది ఉద్యోగులు పనిచేసే సమయాల్లో నిద్రపోతున్నట్లు తెలిపారు.
తమ ఎనర్జీ లెవల్స్‌ను పెంచుకునేందుకు 42 శాతం మంది ఉద్యోగులు ఆ సమయంలో కెఫేన్‌ను తాగుతున్నారు. ఒత్తిడిని పోగొట్టుకునే విధానాలను ఉద్యోగులు అనుసరిస్తున్నారు.
క్రోనోవర్కింగ్ సరికొత్త విధానం కాదు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచే పనిచేయడం లేదా హైబ్రిడ్ వర్కింగ్ ట్రెండ్ పెరగడంతో, క్రోనోవర్కింగ్ మరింత ఆకర్షణీయంగా మారిందని బ్రస్సెల్స్‌లోని వ్లెరిచ్ బిజినెస్ స్కూల్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ డిర్క్ బయెన్స్ చెప్పారు.
‘‘మాకు తెలుసు మేమెప్పుడూ బాగా పనిచేయగలమో. దాని నుంచి ఎంత ఎక్కువ ఉత్పాదకత తీసుకురావాలో’’ అని బయెన్స్ చెప్పారు.
ఉద్యోగులకు, ముఖ్యంగా యువ ఉద్యోగులు ఉన్నప్పుడు పని విధానం మరింత అర్థవంతంగా ఉండాలి. అప్పుడే మెరుగైన పనిని పొందుతామని అన్నారు బయెన్స్. క్రోనోవర్కింగ్ వల్ల కంపెనీలకు కూడా ప్రయోజనమని తెలిపారు.
ఉద్యోగులు బాగా పనిచేయగలుగుతామని భావించినప్పుడు వారికి పనిచేసుకునేందుకు అనుమతిస్తే, వారి పనితీరు పెరుగుతుందని బయెన్స్ చెప్పారు.
అదేవిధంగా, కంపెనీని వదిలిపెట్టి వెళ్లే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఉద్యోగులు కోరుకున్న సమయాల్లో మేనేజర్ పనిచేసేందుకు అనుమతిస్తే, దీర్ఘకాలం పాటు ఆ కంపెనీలోనే ఉండేందుకు వారు ఇష్టపడతారని తెలిపారు.

కానీ, ఈ విధానం ప్రతి దగ్గరా ఇంకా పాపులర్ కాలేదు. చాలా కంపెనీలు ఈ విధానాన్ని వాటికి సౌకర్యవంతంగా భావించడం లేదు. చాలా ప్రాంతాల్లో ఈ పని విధానం అనువైనదిగా కూడా లేదు. వినియోగదారులకు సంబంధించిన వ్యాపారాల్లో, అవుట్‌సోర్సింగ్ కంపెనీల్లో లేదా స్టాక్ మార్కెట్లో ఇది సరిపోదు.
అయితే, ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కొన్ని కంపెనీలు వెనుకాడటం లేదు.
లండన్‌కు చెందిన ఉపాధి సంస్థ ఫ్లెక్సా ఈ పని విధానాన్ని అవలంభిస్తోంది. ఉద్యోగులందరూ నిర్దేశించిన వర్క్ షెడ్యూల్‌కేమీ కట్టుబడి ఉండాల్సి లేదని కంపెనీ చెబుతోంది.
ఎప్పుడు ఉద్యోగులు ఎక్కువ ఉత్పాదకత ఇవ్వనున్నారో ఆ సమయంలో స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సీఈఓ మోలీ జాన్సన్ జోన్స్ చెప్పారు.
కొందరు 7.30కే లాగిన్ అవుతారు. కొందరు ఉదయం 11 అయినా లాగిన్ కారు. కానీ, రాత్రిపూట వారు బాగా పనిచేయగలుగుతారు.
రిమోట్ ఆర్గనైజేషన్లకు ఇది సరైన ఎంపిక అని చెప్పారు. ఒకే సమయంలో ఉద్యోగులందరూ కలిసి పనిచేయాలనే అవసరం లేదన్నారు.
పిల్లలను చూసుకోవాలని లేదా ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్న తల్లిదండ్రులకు ఇలాంటి ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్(అనువైన పని గంటలు) చాలా ప్రయోజనకరమని చెప్పారు.
ఈ బాధ్యతులున్న వారు 9 నుంచి 5 గంటల ఉద్యోగానికి కట్టుబడి ఉండటం కష్టమని మోలీ జాన్సన్ తెలిపారు.
కానీ, క్రోనోవర్కింగ్‌లో కూడా కొన్ని సవాళ్లు ఎదురు కావొచ్చని బయెన్స్ చెప్పారు.
నచ్చిన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, సమావేశాల కోసం లేదా ఇతర కార్యకలాపాల కోసమైనా అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, కొన్ని ప్రాజెక్టులపై ఉద్యోగులు కలిసి పనిచేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఒక్కరి పని గంటల గురించి టీమ్‌లోని ఇతర సభ్యులకు తెలియాల్సి ఉంటుంది. లేకపోతే, ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారా లేదా అన్నది మేనేజర్లకు తెలియడం కష్టం కావొచ్చు.
అయితే, క్రోనోవర్కింగ్‌ను అనుసరించాలనుకుంటున్న కంపెనీలు ఈ విషయాల్లో ఉన్న ఇబ్బందులపై పరిష్కారాలను కనుగొని ముందుకు వెళ్లొచ్చు.
ఉదాహరణకు, ఫ్లెక్సాలోని ఉద్యోగులందరూ క్రిటికల్ అవర్స్‌ల్లో(కీలకమైన సమయాల్లో) అంటే 11.00 నుంచి 15.00 మధ్యలో తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉండాలి. అందరూ కలిసి తమ పనిని పూర్తి చేసుకునేందుకు ఈ సమయాలు పని చేస్తాయి.
మీటింగ్‌లను రికార్డు చేసేందుకు ఇతర కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను వాడవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇతర ఉద్యోగులకు మీటింగ్‌లను షేర్ చేయొచ్చు.
ఈ విధానంలో సవాళ్లను మించి ప్రయోజనాలు ఉన్నాయని జాన్సన్ జోన్స్ చెప్పారు. ‘‘మీకు ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ ఉద్యోగులు దొరుకుతారు. ఏ సమయంలోనైనా వారు పనిచేయగలుగుతారు’’ అని తెలిపారు.
‘‘కొందరు ఉద్యోగులు ఉదయం పూట పనిచేస్తారు. కొందరు సాయంత్రం వస్తారు. కొందరు ఈ మధ్యలో పనిచేసేందుకు ఇష్టపడతారు. ఒకే పని వాతావరణంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకోవడం తప్పు’’ అని మోలీ జాన్సన్ జోన్స్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?
- పాము కాటేసే ముందు హెచ్చరిస్తుందా... అలాంటప్పుడు ఏం చేయాలి?
- కత్తి మింగడమనే కళ వైద్య రంగాన్ని ఎలా మార్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














