ఫేస్‌బుక్: ఈ 20 ఏళ్లలో ప్రపంచాన్ని ఎలా మార్చేసింది?

ఫొటో సోర్స్, Niall Kennedy
ఈ ఫోటో చూడండి. 20 ఏళ్ల కింద మార్క్ జుకర్‌బర్గ్ ప్రారంభించినప్పుడు ఫేస్‌బుక్ ఇలా కనిపించింది.
ఫేస్‌బుక్‌ను కొంతమంది స్నేహితులతో కలిసి జుకర్‌బర్గ్ ఆవిష్కరించారు.
తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఫేస్‌బుక్ రూపాన్ని చాలాసార్లు మార్చారు.
కానీ, దాని లక్ష్యం మాత్రం మారలేదు. ఆన్‌లైన్‌లో ప్రజల్ని కలపడం, ప్రకటనల ద్వారా విపరీతంగా డబ్బును ఆర్జించడం కొనసాగిస్తూనే ఉంది.
ఈ ప్లాట్‌ఫారమ్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచాన్ని ఫేస్‌బుక్ ఎలా మార్చిందో చూద్దాం.

ఫొటో సోర్స్, MySpace
1. సోషల్ మీడియాను మార్చేసింది
ఫేస్‌బుక్ రాక ముందు మైస్పేస్ వంటి ఇతర సోషల్ నెట్‌వర్క్‌లు ఉండేవి. 2004లో ప్రారంభించిన వెంటనే ఫేస్‌బుక్ ఊపందుకుంది. ఒక ఆన్‌లైన్ సైట్ ఎంత వేగంగా పట్టుసాధిస్తుందో ఫేస్‌బుక్ రుజువు చేసింది.
ఏడాదిలోపే 10 లక్షల మంది యూజర్లను సంపాదించింది. నాలుగేళ్లలో మైస్పేస్ సంస్థను అధిగమించింది. ఫోటోలకు స్నేహితుల్ని ట్యాగ్ చేయడం వంటి వినూత్న ఆప్షన్ల ద్వారా ఫేస్‌బుక్‌కు ఇది సాధ్యమైంది.
90ల చివరినాళ్లలోని టీనేజర్లకు డజన్ల కొద్ది ఫోటోల్లో స్నేహితులను ట్యాగ్ చేయడం అనేది ఒక గొప్ప అనుభవం. నిరంతరం కొత్త ఫీడ్ కనిపించడం ఆరంభంలో యూజర్లను బాగా ఆకర్షించింది.
2012 నాటికి ఫేస్‌బుక్ ఒక నెలకు 100 కోట్ల యూజర్లను అధిగమించింది. 2021 చివర్లో చిన్న కుదుపు వచ్చింది. అప్పుడు రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య మొదటిసారిగా 192 కోట్లకు పడిపోయింది. మళ్లీ ఫేస్‌బుక్ వృద్ధి కొనసాగుతూనే ఉంది.
తక్కువ కనెక్టివిటి ఉన్న దేశాలకు విస్తరించడం, ఉచిత ఇంటర్నెట్‌ను అందించడం వంటి చర్యల ద్వారా ఫేస్‌బుక్ యూజర్లను నిలుపుకోవడమే వారి సంఖ్యను పెంచుకుంది. తమకు రోజువారీ యూజర్లు 200 కోట్ల మందికి పైగా ఉన్నట్లు 2023 చివర్లో ఫేస్‌బుక్ వెల్లడించింది.
నిజం చెప్పాలంటే యువతలో ఫేస్‌బుక్ పాపులారిటీ గతంలో కంటే తగ్గింది. అయినప్పటికీ, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సామాజిక మాధ్యమంగా ఫేస్‌బుక్ నిలవడంతో పాటు ఆన్‌లైన్ సోషల్ యాక్టివిటిలో కొత్త తరానికి నాంది పలికింది.
కొంతమంది ఫేస్‌బుక్‌ను కనెక్టివిటి సాధనంగా చూస్తుండగా, మరికొందరు వ్యసనంగా భావిస్తారు.

ఫొటో సోర్స్, Facebook
2. వ్యక్తిగత సమాచారానికి పెరిగిన విలువ, తగ్గిన గోప్యత
మన ఇష్టాయిష్టాలను సేకరించడం చాలా లాభదాయకమని ఫేస్‌బుక్ నిరూపించింది.
గ్లోబల్ ప్రకటనల డబ్బులో సింహభాగం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తీసుకుంటోంది.
యాడ్ సర్వీసుల ద్వారా 2023 మూడో క్వార్టర్‌లో రూ. 2,82,582 కోట్లు (34 బిలియన్ డాలర్లు) రాబడి వచ్చినట్లు మెటా చెప్పింది. అందులో రూ. 95,581 కోట్లు (11.5 బిలియన్ డాలర్లు) లాభాలు ఉన్నట్లు వెల్లడించింది.
డేటా సేకరణలో తప్పులకు సంబంధించి ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి.
వ్యక్తిగత డేటా నిర్వహణలో తప్పులు చేసినందుకు మెటాకు చాలాసార్లు జరిమానా పడింది.
2014లో జరిగిన కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం బాగా ప్రచారంలోకి వచ్చింది. డేటా ఉల్లంఘనకు సంబంధించి చట్టపరమైన చర్యల పరిష్కారానికి ఫేస్‌బుక్ రూ. 6,026 కోట్లు (725 మిలియన్ డాలర్లు) చెల్లించాల్సి వచ్చింది.
సైట్ నుంచి వ్యక్తిగత డేటా తీసుకునేందుకు అనుమతించినందుకుగానూ 2022లో ఫేస్‌బుక్ రూ. 2400 కోట్లు (228 మిలియన్ పౌండ్లు) చెల్లించాల్సి వచ్చింది.
2023లో కూడా ఫేస్‌బుక్ కంపెనీకి ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ రికార్డు స్థాయిలో రూ. 10 వేల కోట్ల జరిమానా విధించింది. యూరోపియన్ యూజర్ల డేటాను బదిలీ చేసినందుకు ఈ జరిమానా వేసింది. దీనిపై ఫేస్‌బుక్ అప్పీల్ చేస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
3. ఇంటర్నెట్ రాజకీయాలు
టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి ఫేస్‌బుక్ ఒక ప్రధాన ప్లాట్‌ఫారమ్‌గా మారింది.
ఉదాహరణకు, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిదు నెలల ముందు ఫేస్‌బుక్ ప్రకటనల కోసం డోనాల్డ్ ట్రంప్ బృందం రూ. 332 కోట్ల (40 మిలియన్ డాలర్లు)కు పైగా ఖర్చు చేసిందని స్టాటిస్టా రీసెర్చ్ చెప్పింది.
క్షేత్రస్థాయి రాజకీయాలను మార్చడంలో కూడా ఫేస్‌బుక్ హస్తం ఉంది. ప్రపంచ స్థాయిలో ప్రచారాలు, చర్యలు చేపట్టేందుకు విభిన్న సమూహాల యూజర్లను కలపడం ద్వారా ఫేస్‌బుక్ తన పాత్రను పోషించింది.
అరబ్ స్ప్రింగ్ సమయంలో నిరసనల్ని సమన్వయం చేయడం, క్షేత్రస్థాయిలో జరిగే వార్తలను వ్యాప్తి చేయడంలో ఫేస్‌బుక్, ట్విటర్ కీలకంగా వ్యవహరించాయని చెబుతారు.
మానవ హక్కుల మీద ప్రభావం వంటి కొన్ని పర్యావసనాల కారణంగా రాజకీయాల విషయంలో ఫేస్‌బుక్ వైఖరి మీద విమర్శలు వచ్చాయి. 2018లో మియన్మార్‌లోని రోహింగ్యా ప్రజలపై ఆన్‌లైన్ హింసను ప్రేరేపించేందుకు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే వ్యక్తులను నిరోధించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని యూఎన్ నివేదిక చెప్పింది. ఫేస్‌బుక్ కూడా దీన్ని అంగీకరించింది.

ఫొటో సోర్స్, Reuters
4. మెటా ఆధిపత్యం
ఫేస్‌బుక్ ఘన విజయంతో మార్క్ జుకర్‌బర్గ్ ఒక సోషల్ మీడియా నెట్‌వర్క్, టెక్నాలజీ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఓకలస్ వంటి కంపెనీలన్నింటినీ ఫేస్‌బుక్ అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి 2022లో దానిపేరును ‘మెటా’గా మార్చారు.
300 కోట్ల మంది ప్రజలు తమ ఉత్పత్తుల్లో ఒకదాన్ని ప్రతీరోజు ఉపయోగిస్తారని మెటా చెబుతోంది.
ప్రత్యర్థులను కొనలేనప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వాటిని కాపీ చేస్తుందని మెటా మీద ఆరోపణలు ఉన్నాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ అనే ఫీచర్, స్నాప్‌చాట్‌లోని ఒక కీలక ఫీచర్‌ను పోలి ఉంటుంది. టిక్‌టాక్ యాప్ ఇచ్చిన పోటీకి బదులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫీచర్ తెచ్చింది. ట్విటర్‌ను తలపించేలా మెటా కంపెనీ థ్రెడ్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది.
పెరిగిన పోటీ, కఠిన నియంత్రణల కారణంగా వ్యూహాలు ఎప్పటికంటే మరింత ముఖ్యంగా మారాయి.
2022లో ‘జిఫ్’ మేకర్ జిఫీని నష్టానికి మెటా విక్రయించింది.

ఫొటో సోర్స్, REUTERS
రాబోయే 20 ఏళ్లలో ఎలా ఉంటుంది?
ఫేస్‌బుక్ ఎదుగుదల, నిరంతర ఆధిపత్యం అనేవి సైట్‌ను ఆసక్తిగా ఉంచడంలో మార్క్ జుకర్‌బర్గ్ చూపిన సామర్థ్యాలకు నిదర్శనం.
కానీ, అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్ అనే పేరును మరో 20 ఏళ్లు నిలబెట్టుకోవడం చాలా పెద్ద సవాలు.
మెటావర్స్ అనే భావన చుట్టూ తన వ్యాపారాన్ని నిర్మించడానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కృత్తిమ మేథ కూడా మెటాకు ప్రాధాన్యంగా మారింది.
కాబట్టి, ఫేస్‌బుక్ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడటం చాలా ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి:
- ప్యాకేజ్డ్ ఫుడ్: ‘ఒక్క బిస్కెట్ తగ్గినందుకు రూ.లక్ష పరిహారం’ ఇలాంటివి మీరూ పొందవచ్చు ఎలాగంటే...
- హాజి మలాంగ్: ‘ఈ దర్గాకు విముక్తి కల్పించి హిందువుల పరం చేయాలి’ అన్న వాదన ఎందుకు వినిపించింది, వివాదం ఏంటి?
- భారత్ vs ఇంగ్లండ్: గెలుపు వరకు వచ్చి టీమిండియా ఓటమికి ఇదే కారణమా... రోహిత్ శర్మ ఏం చెప్పాడు?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










