జై ఖామ్కర్: ‘నాకు కళ్లు లేవు... కానీ, గుడ్డిదాన్ని కాదు’

- రచయిత, ప్రాజక్తా ధులప్, నితిన్ నాగర్కార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
‘‘నాకు కళ్లు లేవు. కానీ, నన్ను నేను గుడ్డిదానిలా భావించను. కళ్లు, దృష్టి అనేవి రెండు వేర్వేరు విషయాలు. వికలాంగులను ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా బతికేలా చేయడమే నా లక్ష్యం. అదే నా దృష్టి కోణం కూడా.’’ ఈ మాటలు చెబుతున్నది మాల్‌గంగా అంధ అపాంగ్ సేవా సంస్థ వ్యవస్థాపకురాలు జై ఖామ్కర్.
‘‘మహిళల కథలు’’ పేరుతో బీబీసీ మరాఠీ చేస్తోన్న సిరీస్‌లో భాగంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం. ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేసిన మహిళలను ఈ సిరీస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం.
పుణేలోని షిరూర్ తాలూకాలో టకాలీ హాజీ గ్రామం ఉంటుంది. కుక్డీ, ఘోడ్నది అనే రెండు నదులకు సమీపంలోని ఈ గ్రామం ఇప్పుడు తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
2019 ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున టకాలీ హాజీలో అంధులు- వికలాంగుల కోసం ప్రభుత్వ గుర్తింపు ఉన్నకళాశాలను ప్రారంభించారు.
సావిత్రీబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలను మాల్‌గంగా అంధ-అపాంగ్ సేవా సంస్థ నడిపిస్తుంది.
అంధ, వికలాంగ విద్యార్థులకు ఉచితంగా సీటు ఇవ్వడం వెనుక భిన్నమైన ఆలోచన ఉందని జై ఖామ్కర్ అంటున్నారు. తన స్వీయ అనుభవం నుంచి ఆమెకు ఈ ఆలోచన వచ్చింది.

‘ఇంజెక్షన్ వల్ల చూపు పోయింది’
మాల్‌గంగా సంస్థను ప్రారంభించడానికి ముందు జై ఖామ్కర్ జీవితంలో చాలా కష్టాల్ని ఎదుర్కొన్నారు. ఇది 1997 నాటి కథ. అప్పుడు ఆమె 12వ తరగతి చదువుతున్నారు. ఒకరోజు జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెకు ఔషధానికి బదులుగా ఇంజెక్షన్ ఇచ్చారు.
‘‘ఆ ఇంజక్షన్ తర్వాత స్పృహ తప్పి పడిపోయాను. కాసేపటికి స్పృహలోకి వచ్చాను. అప్పుడు ఇంజెక్షన్ తాలూకూ రియాక్షన్ మొదలైంది. నాలుగు రోజులు అలాగే కొనసాగింది. ముఖం, కళ్లు, చేతులు, కాళ్లు వాచిపోయాయి. నాకు దెయ్యం పట్టిందని మా వాళ్లు అనుకోవడం మొదలుపెట్టారు. చివరకు నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రిలో చేరేనాటికే పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. శరీరంపై చర్మం ఒలిచినట్లుగా అయిపోయింది. బలహీన పడటంతో పాటు నొప్పితో గట్టిగా కేకలు వేయాలనిపించింది. గడువు దాటిన (ఎక్స్‌పైర్డ్) ఇంజక్షన్ వేయడం వల్ల ఇలాంటి రియాక్షన్ వచ్చిందని డాక్టర్ చెప్పారు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
"ఈ అమ్మాయి బతకదు అని మా కుటుంబీకులకు డాక్టర్ చెప్పారు. కానీ, చికిత్స కొనసాగించారు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్న తర్వాత కళ్లు మసకగా కనిపించడం మొదలైంది. అప్పటికీ గాయాలు, నొప్పులు, పెయిన్ కిల్లర్లు, సెలైన్లు, ఇంజక్షన్‌లతో పోరాడుతున్నాను.
ఆ స్థితిలో నేను కళ్లతో చూసి ఏదీ చదువలేకపోయాను. ఆరు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాను. అప్పుడే నా ప్రపంచం అంతా చీకటిగా మారిపోయింది. నిజానికి అప్పుడు నాకు టీచర్ కావాలనే కల ఉండేది. అప్పుడే వికలాంగురాలిగా మారాను’’ అని ఆమె వివరించారు.

‘నోటికి గడగడా 100 ఫోన్ నెంబర్లు’
తనకు కళ్లు పోయాయనే నిజాన్ని అంగీకరించడానికి జై ఖామ్కర్‌కు కొన్ని రోజులు పట్టింది. రైతు కుటుంబానికి చెందిన ఆమె చదువు పూర్తి చేసుకున్నారు. ఊరికి కూతవేటు దూరంలోని ఒక ఎస్టీడీ టెలిఫోన్ బూత్‌ను ఆమె నడిపించేవారు.
"నాకు కళ్లు కనిపించకపోయినప్పటికీ టెలిఫోన్ బూత్‌లో నా పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ పని చేయడంలో నేను ఆరితేరాను. నాకు దాదాపు 1,000 ఫోన్ నంబర్లు గుర్తుండేవి’’ అని ఆమె చెప్పారు.
టెలిఫోన్ బూత్‌లో పని చేస్తోన్న ఆమె వద్దకు సహాయం కోరుతూ చాలామంది అంధులు, వికలాంగులు వచ్చేవారు.
క్రమంగా గ్రామాల్లోని వందలాది మంది అంధులు, వికలాంగులు సర్టిఫికెట్లు పొందడంలో ఆమె సహాయం చేశారు. వికలాంగుల స్వావలంబన కోసం 2005లో మాల్‌గంగా అంధ-అపాంగ్ సేవా సంస్థను ఆమె స్థాపించారు.
మొదట్లో స్వయం ఉపాధి కోసం ఉల్లి-బంగాళదుంప బస్తాలను తయారీ చేసే పనిని మొదలుపెట్టారు. అంధులు, వికలాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా, స్వతంత్రంగా వ్యాపారం చేసుకునేలా మాల్‌గంగా సంస్థ కృషి చేసింది.
జై ఖామ్కర్ తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నారు. ఏదైనా సహాయం చేయమని బంధువుల్ని లేదా ఎవర్నైనా అడిగితే, అంధురాలివైన నీవు ఏం చేద్దామనుకుంటున్నావు?అని అడిగేవారని ఆమె చెప్పారు. పెళ్లి విషయంలో ఆమె మరిన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు బంధువుతో ఆమె పెళ్లి జరిగింది.

హాస్టల్ మూతపడింది, చదువు కూడా...
2014లో పుణేకు చెందిన కొంతమంది అంధులు, వికలాంగ బాలికలు ఆమెకు పరిచయం అయ్యారు.
వికలాంగులకు వృత్తిపరమైన సహాయం చేస్తామనే ప్రకటన చూసి 52 మంది అంధ బాలికలు పుణేకు వచ్చారు. వారితో మాట్లాడిన తర్వాత, వారంతా వేర్వేరు కళాశాలల్లో చదువుతున్నారని, వారంతా ఉండే హాస్టల్ మూతపడినట్లు ఖామ్కర్‌కు తెలిసింది. హాస్టల్ మూతపడటంతో చదువుకోవడానికి దారి లేక ఉద్యోగం కోసం వారంతా వెదుకుతున్నట్లు ఆమె గ్రహించారు.
“హాస్టల్ లేకుండా వీళ్లంతా ఎక్కడ ఉంటారు? అందుకే వాళ్లంతా చదువు మానేసి తమ ఊర్లకు వెళ్లిపోయారు. వాళ్లకు ఏమీ చేయలేక చాలా బాధగా అనిపించింది. ఏదో ఒక రోజు ఈ అమ్మాయిలకు ఒకే చోట విద్య, హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె చెప్పారు.
ఈ మేరకు విద్యాశాఖకు ఆమె ప్రతిపాదన పంపారు. కానీ, సానుకూల జవాబు రాలేదు. కానీ, పదే పదే ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత 2017లో కళాశాలకు మంజూరు లభించింది.
ముంబై సహా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడకు చదువుకునేందుకు వస్తుంటారు.
‘‘న్యూ విజన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ రెసిడెన్షియల్ బ్లైండ్ హ్యాండీక్యాప్డ్ కాలేజ్’’ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నుండి ఇప్పటివరకు 200 మంది విద్యార్థులు శిక్షణ పొందారు.

‘‘హాస్టల్ ఉంటేనే చదువుకోగలరు’’
అంధులు, వికలాంగులకు హాస్టల్‌తో పాటు విద్యను అందించే మొదటి కళాశాల ఇదేనని ఆమె చెప్పారు. ఈ కాలేజీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కానీ, డిమాండ్ సఫలం కాలేదు. కాలేజీ, హాస్టల్ కలిసి ఉండాలని ఆమె పట్టుబట్టారు.
‘‘రాష్ట్రంలోని ఏ కాలేజీ కూడా వికలాంగులకు అనుకూలంగా ఉండదు. కాలేజీ ఉండే ఊరుకు, ఇంటికి మధ్య 20-22 కి.మీ దూరం ఉన్నప్పుడు వారు ఇతరులపై ఎంతకాలం ఆధారపడి చదువుకోగలరు. ఊరిలో ఎస్టీ లేడు, రోడ్డు లేదు, సరైన సదుపాయాలు లేకుండా వారు ఎలా ప్రయాణించగలరనే విషయాన్నిఎవరూ ఆలోచించరు’’ అని ఆమె వివరించారు.

ప్రభుత్వ పాలసీ
వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘వికలాంగుల హక్కుల చట్టాన్ని (2016)’ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం, అపాంగ్ అనే పదానికి బదులుగా దివ్యాంగులు అనే పదాన్ని వాడాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల పాలసీని ప్రకటించింది. వికలాంగుల సంక్షేమ కమిషనరేట్ పేరును దివ్యాంగుల సంక్షేమ కమిషనరేట్‌గా మార్చారు.
ఈ పాలసీ ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు అయిదు శాతం రిజర్వేషన్ ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో స్వతంత్ర అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిశోధన ఆధారిత విద్యను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఉన్నత విద్యకు ఫీజు రాయితీ ఇస్తున్నారు. విద్యార్హత వయోపరిమితిని అయిదేళ్లు పెంచారు.
డిమాండ్లు ఏంటి?
- వికలాంగుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి.
- వికలాంగుల రెసిడెన్షియల్ కాలేజీలకు గ్రాంట్లు అందించాలి.
- వికలాంగులు ఇతరుల మీద ఆధారపడటం తగ్గించేలా విద్యలో కొత్త సాంకేతికత, సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించాలి.
- వికలాంగులకు ఉన్నత విద్య అందించేలా తల్లిదండ్రుల్లో, సమాజంలో అవగాహన కల్పించాలి.
జై ఖామ్కర్ రోజూ ఇంటి పనులన్నీ స్వయంగా చేస్తారు. వ్యవసాయం నుంచి పాలు పితకడం వంటివి తన దినచర్యలో భాగం. దివ్యాంగులు ఆత్మగౌరవంతో, స్వావలంబనతో జీవించాలనే తన కల నెరవేరితే చూడాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
రెండేళ్ళ క్రితం, జై ఖామ్కర్ మరణం అంచుల నుంచి బయట పడ్డారు. ఆమెకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె కొత్త ఆశతో జీవితాన్ని మొదలుపెట్టారు. ఈరోజు ఆమె వల్ల చాలా మంది జీవితాలు వెలుగు చేరింది.
ఇవి కూడా చదవండి:
- కత్తి మింగడమనే కళ వైద్య రంగాన్ని ఎలా మార్చింది?
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














