బోర్సూక్: ఈ రొట్టె వాసన చనిపోయిన వారిని చేరుతుందంట.. పెళ్లి, పండుగ, సంవత్సరీకం ఏదైనా అక్కడ ఇదే నైవేద్యం

బోర్సూక్

ఫొటో సోర్స్, Amanda Ruggeri

కిర్గిజ్‌స్తాన్‌లో ప్రజలు వందల ఏళ్లుగా రొట్టెలు తయారు చేస్తున్నారు. కేవలం తాము తినడం కోసమే కాకుండా, చనిపోయిన వారి గౌరవార్థం వారు బ్రెడ్‌ను తయారు చేస్తుంటారు.

చైనాకు పశ్చిమాన పచ్చని, పర్వతాలతో కూడిన ఈ దేశంలో పురాతన సంప్రదాయాలను బాగా పాటిస్తారు.

ఈ ప్రాంతంలోని తెగవారు తూర్పు, ఈశాన్య, మధ్య ఆసియాలకు చెందిన తెగలను పోలి ఉంటారు.

చెంఘిజ్ ఖాన్ నుంచి సోవియట్ యూనియన్ కాలం వరకు అనేకమంది ఇక్కడి తెగలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

ఈ ప్రాంత ప్రత్యేక గుర్తింపును, సంస్కృతిని కిర్గిజ్‌స్తాన్ ఆహారం చూపించినంత ప్రభావవంతంగా ఇంకేదీ చూపించలేదు.

మరీ ముఖ్యంగా, నూనెలో వేయించే బ్రెడ్ ఇక్కడి సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతుంది.

కిర్గిస్తాన్ కొండలు
ఫొటో క్యాప్షన్, కిర్గిస్తాన్ పర్వతాలు

కిర్గిజ్‌స్తాన్‌లోని అత్యంత సంప్రదాయిక బ్రెడ్‌లలో బోర్సూక్ ఒకటి. చిన్నగా, ఉబ్బినట్లుగా ఉండే వీటిని నూనెలో వేయిస్తారు. అయినప్పటికీ ఇవి తేలికగా, గుళ్లగా ఉంటాయి.

ఇవి తీపిగా ఉండవు. కానీ, వాటిపై జామ్ లేదా తేనె రాసుకొని తినొచ్చు. కిర్గిజిస్తాన్‌లో చాలామంది ప్రజలు వాటిపై ఏమీ రాయకుండా అలాగే తింటారు.

కొందరు తరిగిన టమోటా, దోసకాయ ముక్కలతో కలిపి తింటారు. కొందరేమో గుర్రపు పాల వెన్నతో కూడా వీటిని తింటారు. టీ తాగుతూ కూడా వీటిని తింటారు.

కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సహా మధ్య ఆసియా అంతటా విభిన్న రూపాల్లో బోర్సూక్‌ లభిస్తాయి. ఉజ్బెకిస్తాన్‌లో వీటిని గుండ్రంగా బంతుల్లా, తజికిస్తాన్‌లో క్రిస్ క్రాస్ నమూనాల్లో తయారు చేస్తారు.

కిర్గిజ్‌స్తాన్‌లో వేడుకలు, సెలవులు, స్మారకాల్లో బోర్సూక్ ప్రధానంగా కనిపిస్తుంది. ఆహార టేబుళ్ల మీద చిందరవందరగా బోర్సూక్‌ పడి ఉంటుంది. ముఖ్యంగా ఆసియాలోని అత్యంత పేద దేశాల్లో దాతృత్వానికి నిదర్శనంగా దీన్ని చూస్తారు.

ఈ రీజియన్‌లో బోర్సూక్‌కు ఇంత ఆదరణ దక్కడానికి సులభమైన తయారీ విధానం, రవాణాపరమైన సౌలభ్యత కారణాలుగా చెబుతుంటారు.

బోర్సూక్

ఫొటో సోర్స్, Amanda Ruggeri

ఫొటో క్యాప్షన్, కిర్గిస్తాన్‌లో బోర్సూక్

ఈ సౌలభ్యాలను మించి బోర్సూక్‌లను తయారు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి.

చనిపోయినవారి గుర్తుగా, వారికి సమర్పించడం అనేది ఆ కారణాల్లో అత్యంత ముఖ్యమైనది.

ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ ఏడాదంతా ప్రతి గురువారం, చనిపోయిన 40వ రోజు, సంవత్సరీకం సందర్భంగా వారిని తలుచుకుంటూ బోర్సూక్‌లను తయారు చేస్తారు. ఈ ఆచారాన్ని జ్యాట్ చిగారు అని పిలుస్తారు.

చిన్నగా ఉండే బోర్సూక్‌ లేదా అదే పిండితో పెద్దగా, గుండ్రంగా చేసే ‘మై టోకోచ్’ అని పిలిచే ఆహారపదార్థాలను సంప్రదాయకంగా స్వీట్లు, బిస్కెట్లతో పాటు టేబుల్ మీద ఉంచుతారు. తర్వాత ఎవరైనా ఒకరు ఖురాన్‌లోని పంక్తులను పఠిస్తూ ప్రార్థిస్తారు.

చనిపోయిన వారి పేరు మీద చేసే ఈ ప్రార్థనల్లో పాపాలను క్షమించి మరణానంతర జీవితంలో తమ వారిని కాపాడమంటూ దేవుడిని కోరుతారు. ప్రార్థనల తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారు.

బోర్సూక్

ఫొటో సోర్స్, Amanda Ruggeri

ఫొటో క్యాప్షన్, జ్యాట్ చిగారు ఆచారం కోసం బోర్సూక్‌లను సిద్ధం చేస్తోన్న మహిళ

వీటిని నూనెలో వేయించినప్పుడు వచ్చే నూనె వాసన, చనిపోయిన వారి వరకు ఈ ప్రార్థనల్ని తీసుకెళ్తుందంటూ వారు నమ్ముతారు. నిజానికి జ్యాట్ చిగారు అంటే అర్థం ‘‘వాసనను విడుదల చేయడం’’.

అంత్యక్రియల్లోనే కాకుండా ఈ వంటకానికి ఇతర అంశాల్లో కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కిర్గిజ్‌స్తాన్‌లోని చాలామంది తరహాలోనే బక్తిగుల్ అసన్‌బేవా, గులియా కెరింకులవా తమ కుటుంబంతో కలిసి వేసవిలో ఇస్సిక్ కుల్ సరస్సు పైన ఉన్న పర్వతాల్లోని జాయ్‌లూ అనే ప్రదేశంలో గడుపుతారు. అక్టోబర్‌లో సాధారణంగా మంచు కురిసినప్పుడు తిరిగి తమ ఇళ్లకు వస్తుంటారు. ‘‘పురాతన కాలం నుంచి దీన్ని పూర్వీకుల భూమి అని చెబుతుంటారు’’ అని అసన్‌బేవా అన్నారు.

ఈభూమితో పాటు పూర్వీకుల గౌరవార్థం జాయ్‌లూ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా వారు బోర్సూక్‌లను వండి, జ్యాట్ చిగారు ఆచారాన్ని పాటిస్తారు. ‘‘ఇలా చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయం. మేం ఎప్పుడూ జ్యాట్ చిగారును పాటిస్తాం’’ అని కెరింకులవా చెప్పారు.

బోర్సూక్

ఫొటో సోర్స్, Amanda Ruggeri

ఫొటో క్యాప్షన్, కిర్గిస్తాన్‌లో తయారు చేసే మై టోకోచ్ వంటకం

కెరింకులవా, అసన్‌బేవా కూడా ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో జంతుబలి కూడా ఉంటుంది. ‘‘ఉదాహరణకు వర్షాలు పడకపోతే మేం జంతు బలి ఇస్తాం. అప్పుడు వర్షం పడుతుంది’’ అని అసన్‌బేవా అన్నారు.

దుష్ట ఆత్మలను తరిమేయడంలో ‘‘మై టోకోచ్’’ సహాయపడుతుందని అక్కడివారు నమ్ముతారు.

‘‘ఒకవేళ ఏదైనా చెడు జరిగితే, లేదా ఎవరైనా అనారోగ్యం పాలైనా, ప్రమాదం బారిన పడినా దానికి పరిహారంగా తొమ్మిది టోకోచ్‌లను నైవేద్యంగా సమర్పిస్తారు. టోకోచ్‌ల సంఖ్య చాలా చాలా ముఖ్యం. చనిపోయిన వారి కోసం ఏడు టోకోచ్‌లను సమర్పిస్తారు’’ అని టోసోర్‌లో నివసించే పెన్షనర్ ఐగానిష్ బాప్కీవా చెప్పారు.

అలాగే దీన్ని పెళ్లిళ్లు, పండుగలు, వేడుకల సందర్భంగా కూడా తయారు చేస్తారు. ‘‘బోర్సూక్‌లు చేయకుండా పండుగలు జరుగవు’’ అని బక్తిగుల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)