బాన్సురీ స్వరాజ్‌ ఎవరు... బీజేపీ ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై వివాదం ఎందుకు?

బన్సురీ స్వరాజ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, న్యూదిల్లీ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బన్సురీ స్వరాజ్
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బాన్సురీ స్వరాజ్‌పై ఆప్ ఎందుకు విమర్శలు గుప్పిస్తోంది. ఆమెను దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి గా ఎందుకు అభివర్ణిస్తోంది?

లోక్ ‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ మార్చి 2న విడుదల చేసింది. మొత్తం 195 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది.

ఇందులో దేశరాజధాని దిల్లీలోని మొత్తం ఏడుస్థానాలలో బీజేపీ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.

2014,2019 ఎన్నికలలో బీజేపీ దిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలకు గానూ ఏడింటిని గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తుండటంతో మరోసారి బీజేపీ ఏడు స్థానాలనూ గెలుచుకునేందుకు కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. తొలి విడతలో ఐదుస్థానాలలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ ఐదుగురిలో సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీకి తప్ప మిగిలిన సిట్టింగులందరికీ బీజేపీ రిక్తహస్తం చూపింది.

ఇక కొత్తగా రంగంలోకి దింపిన అభ్యర్థులలో చెప్పుకోదగ్గ అభ్యర్థి బాన్సురీ స్వరాజ్. ఆమె కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కుమార్తె. ఈమెకు మీనాక్షి లేఖి స్థానంలో టిక్కెట్ కేటాయించారు. మీనాక్షితోపాటు , పర్వేష్ వర్మ, డాక్టర్ హర్షవర్థన్, రమేష్ బిదూరిలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు.

ఈసారి బీజేపీ ఇంత భారీగా మార్పులు చేయడంపై సీనియర్ జర్నలిస్ట్ రాధికా రామసేసన్ మాట్లాడుతూ, ‘‘మదన్ ‌లాల్ ఖురానా తరువాత, దిల్లీలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు బీజేపీకి కనిపించడం లేదు’’ అని చెప్పారు.

మదన్ ‌లాల్ ఖురానా బీజేపీ నేత. మాజీ ముఖ్యమంత్రి 90వ దశకంలో ఆయన దిల్లీ బీజేపీ ముఖచిత్రంగా కనిపించేవారు. ఆయనను పార్టీ కార్యకర్తలు ‘దిల్లీ సింహం’గా పిలుచుకునేవారు.

‘‘మోదీ పేరుతో బీజేపీ లోక్‌సభ ఎన్నికలను గెలుస్తోంది కానీ, ఆ పార్టీ దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి అద్భుతాలు చూపించలేకపోతోంది. అందుకే దిల్లీ లోక్‌సభ సీట్ల విషయంలో మార్పులు చేయడం ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది’’ అంటారు రాధికా రామసేసన్.

ఇదే విషయంపై సీనియర్ జర్నలిస్ట్ నీరజ చౌదరి మాట్లాడుతూ ఈసారి దిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నాయి. దీంతో ఈ సారి ఏడు స్థానాలలోనూ గెలవడం కష్టమనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుంది. అందుకే మార్పులు చేసింది అని విశ్లేషించారు.

దిల్లీ బీజేపీ

ఫొటో సోర్స్, GETTYIMAGES/HINDUSTANTIMES

ఫొటో క్యాప్షన్, ఆప్ ప్రభుత్వంలో ఆతిషీ కీలకంగా ఉన్నారు

ఆప్ ఆగ్రహం దేనికి?

దిల్లీలో బీజేపీ ఐదు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, వారిలో బాన్సురీ స్వరాజ్ పేరు కనిపించగానే ఆప్ నాయకురాలు, విద్య, ప్రజాపనుల శాఖా మంత్రి ఆతిషి అనేక ప్రశ్నలు సంధించారు. అలాగే బాన్సురి స్వరాజ్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.

‘‘మీనాక్షిలేఖీకి టికెట్ నిరాకరించి ఆమె స్థానంలో దేశ ప్రయోజనాలకు పదేపదే కోర్టులలో వ్యతిరేకంగా నిలబడే వ్యక్తికి టిక్కెెట్ ఇచ్చారు. ఆమె దేశవ్యతిరేకులను రక్షిస్తున్నారు. నేను బాన్సురీ స్వరాజ్ గురించి మాట్లాడుతున్నాను. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన ఆమె ఎవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు?’’ అని ఆతిషి మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

బాన్సురీ స్వరాజ్ వాదిస్తున్న కేసుల జాబితాను ఆతిషి లెక్కించారు. వాటిల్లో లలిత్ మోదీ కేసు కూడా ఉంది.

‘‘లక్షల కోట్లాదిరూపాయల దేశ సంపద దోచుకుని తప్పించుకుపోయిన కేసులో లలిత్ మోదీ తరపున కోర్టులో బన్సురీ స్వరాజ్ వాదిస్తున్నారు. ఈ విషయంలో ట్విటర్ ద్వారా మోదీ బాన్సురీ స్వరాజ్‌కు థాంక్స్ కూడా చెప్పారు’’ అని ఆమె ఆరోపించారు.

దీని తరువాత ఆతిషి మణిపుర్, పంజాబ్ మేయర్ ఎన్నికలను కూడా ప్రస్తావించారు.

‘మణిపుర్‌లో హింస కారణంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఈ కేసులో బన్సురీ స్వరాజ్ కేంద్రం తరపున సుప్రీం కోర్టులో వాదిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆమె దిల్లీ మహిళల ఓట్లు ఎలా అడుగుతారు? మరోపక్క చండీగర్ మేయర్ ఎన్నికల విషయంలోనూ అక్రమంగా ఎన్నికైన బీజేపీ మేయర్ పక్షాన వాదించారు. ఈ కేసులన్నింటిలోనూ వాదించినందుకు బన్సురీ దేశానికి క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.

దిల్లీ బీజేపీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

లలిత్ మోదీపై ఆరోపణలేంటి?

సుష్మా స్వరాజ్ కేంద్రంలో విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చీఫ్ లలిత్ మోదీ బ్రిటన్‌కు వెళ్లడానికి కావాల్సిన పత్రాల విషయంలో సహాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

లలిత్ మోదీపై ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి డజనుకుపైగా కేసులు ఉన్నాయి.

లలిత్ మోదీ భార్య కేన్సర్‌తో బాధపడుతున్నారు కనుక తాను మానవతా దృక్పథంతో సాయం చేసినట్టు సుష్మా స్వరాజ్ చెప్పారు.

దీనిపై పార్లమెంటులో పెద్ద రగడ జరిగింది. సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

‘‘సుష్మాజీ ఈ పని రహస్యంగా చేశారు. ఆమె శాఖలో ఎవరికీ ఈ విషయం తెలియదు. లలిత్ మోదీ సుష్మా భర్తకు, ఆమె కుమార్తెకు డబ్బులు ఇచ్చారు. తామెంత డబ్బలు తీసుకున్నాయో వారు చెప్పాలి’’ అని రాహుల్ గాంధీ అప్పట్లో ఆరోపించారు.

కానీ, సుష్మాస్వరాజ్ చేసింది సరైనదని భావిస్తున్నామని అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. తమ ప్రభుత్వం ఆమెకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ మనీ లాండరింగ్ కేసులో 2010లో దేశం విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. తనను పారిపోయిన వ్యక్తిగా చూడక్కరలేదని , ఏ కోర్టు తనను నిందితునిగా పేర్కొనలేదని లలిత్ మోదీ చెపుతారు.

లలిత్ మోదీని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు సాగాయి. కానీ 2017లో మోదీని వెనక్కు తీసుకురావాలనే ఈడీ విన్నపాన్ని ఇంటర్ పోల్ తిరస్కరించింది. లలిత్ మోదీపై ఉన్న ఆరోపణలకు సంబంధించి తగినన్ని ఆధారాలు లేవని ఇంటర్ పోల్ చెప్పింది.

ఇక తన అభ్యర్థిత్వంపై బన్సురీ స్వరాజ్ బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆప్ అవినీతి వల్ల దిల్లీ సమస్యల్లో చిక్కుకుందని, తనను గెలిపిస్తే దిల్లీ గళాన్ని పార్లమెంట్‌లో వినిపిస్తానని చెప్పారు.

దిల్లీ బీజేపీ

ఫొటో సోర్స్, TWITTER./BANSURISWARA

ఫొటో క్యాప్షన్, తల్లి సుష్మా స్వరాజ్‌తో బాన్సురీ స్వరాజ్

ఎవరీ బాన్సురీ స్వరాజ్

బాన్సురీ స్వరాజ్ కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె. ఈమె న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సుప్రీం కోర్టులో ఈమెకు న్యాయవాదిగా 15 ఏళ్ళ అనుభవం ఉంది. ఇంగ్లీషు లిటరేచర్‌లో డిగ్రీ చేసిన తరువాత లండన్‌లో లా చదివారు. బీజేపీ లీగల్ సెల్‌కు ఆమె 2023లో కో కన్వీనర్‌గా ఉన్నారు.

బాన్సురీ స్వరాజ్‌పై వస్తున్న విమర్శలపై రాథిక రామసేసన్ మాట్లాడుతూ ఓ యువ రక్తాన్ని తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్షాలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతాయి. కానీ బన్సురి తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నారు అన్నారు.

‘‘బాన్సురీ తన తల్లిని గుర్తుకు తెస్తారు. ఆమెను తమలో ఒకరిగా భావించడానికి బీజేపీ కార్యకర్తలు వెనుకాడరు.’’ అని తెలిపారు.

నీరజా చౌదరి ఇదే విషయంపై మాట్లాడుతూ బాన్సురీకి టిక్కెట్ ఇవ్వడం ఆసక్తిగా అనిపించింది. సుష్మా స్వరాజ్ వారసత్వాన్ని వినియోగించుకోవడానికి దిల్లీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే ఎన్నికల్లో గెలవడం అన్నారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)