బెంగళూరు: భారత ఐటీ కేంద్రంలో నీటి సంక్షోభం ఎందుకు తీవ్రం అవుతోంది?

బెంగళూరు, సరస్సులు, చెరువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మున్సిపాలిటీ కొళాయి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

భారత దేశపు ఐటీ కేంద్రంగా గుర్తింపు పొందిన బెంగళూరు రోజూ 20 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటోంది.

నీటి సంక్షోభం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఒక వైపుంటే, ఐటీ హబ్‌గా బెంగళూరు నగరానికున్న ప్రతిష్ట మసకబారుతోంది. ఈ పరిస్థితుల మధ్య రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది.

కోటిన్నర మంది జనాభా ఉన్న ఈ నగరానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది నుంచి 145 కోట్ల లీటర్ల నీటిని తీసుకువస్తున్నారు.

సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న బెంగళూరుకు కావేరీ నీటితో పాటు మరో 60 కోట్ల లీటర్ల నీళ్లు నగరంలోని బోర్ల ద్వారా అందుతున్నాయి.

నగరంలో నీటి సంక్షోభానికి భూగర్భ జలాలు పడిపోవడమే కారణం. 2023 వర్షాకాలంలో కూడా పెద్దగా వానలు పడలేదు.

బెంగళూరు చుట్టుపక్కల ఉన్న 110 గ్రామాలను నగరంలో కలపడం కూడా ఈ సమస్యకు మరో కారణం.

దీనికి తోడు దక్షిణ బెంగళూరులోని కాలనీలు, బహుళ అంతస్తుల్లో నివసిస్తున్న ప్రజలు కొత్త జీవనశైలిని అలవాటు చేసుకున్నారు.

దేశంలో చల్లగా ఉండే నగరాలలో ఒకటైన బెంగళూరులో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం, వేడి గాలులు వీయడంపై గతంలో వాతావరణ శాఖ ప్రకటన చేసినప్పటి నుంచి నీటి సమస్య పెరగడం ప్రారంభమైంది.

బెంగళూరు నీటి సమస్య

ఫొటో సోర్స్, BANGALORE NEWS PHOTOS

ఫొటో క్యాప్షన్, నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లు

కొత్త నిబంధనలు, కొత్త ఆంక్షలు

కొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే ప్రజలు తమ కార్లను రెండు రోజులకు ఒకసారి మాత్రమే కడుక్కోవాలని సూచనలు ఇచ్చారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్నానం చేసేందుకు అర బకెట్ నీళ్లు, టాయిలెట్లు క్లీన్ చేసేందుకు అరబకెట్ నీళ్లు మాత్రమే వాడుకోవాలని చెప్పారు.

అయితే ఒక్కో దానిలో 25 ఫ్లాట్లు ఉన్న రెండు అపార్ట్‌మెంట్ల యాజమాన్యం ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇక్కడ నివసిస్తున్న 200 మంది వంటవాళ్లు, సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు.

ఈ అపార్ట్‌మెంట్లలో ఉంటున్న ఓ వ్యక్తి తన సమస్య గురించి బీబీసీతో ఇలా చెప్పారు.

“అపార్ట్‌మెంట్‌లో పైనున్న నాలుగు ఫ్లోర్లలోని ఇళ్లకు నీటిని సరఫరా చేయడం కుదరదని, ట్యాంకులోని నీటిని బకెట్లతో తెచ్చుకోవాలని మాతో చెప్పారు. నీటి ఖర్చుల్ని తగ్గించడానికే ఇలా చేస్తున్నామని ఈ కొత్త విధానం తీసుకొచ్చామని మేనేజ్‌మెంట్ చెబుతోంది”.

ఈ అపార్ట్‌మెంట్ల యజమాని నాగరాజుతో బీబీసీ మాట్లాడింది. “అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని మూడు బోర్లు ఎండిపోయాయి. మూడు ట్యాంకర్లతో నీటిని తీసుకొస్తున్నాం. ఒక్కో ట్యాంకర్ ద్వారా 4 వేల లీటర్ల నీటిని తీసుకొస్తాం. గతంలో ఒక్కో ట్యాంకర్‌కు 700 రూపాయలు చెల్లించేవాళ్లం. ఇప్పుడు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

సోమసుందర పాళ్యలోని అనేక అపార్ట్‌మెంట్లలో ఈ సమస్య ఉంది. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గర్లో ఉంది.

బెంగళూరు నీటి సమస్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కూటర్ మీద తాగు నీరు తెచ్చుకుంటున్నబెంగళూరు ప్రజలు

నీటి సంక్షోభానికి మూలం ఏమిటి?

2007లో బెంగళూరు చుట్టు పక్కల ఉన్న కొన్ని గ్రామాలను నగర పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ గ్రామాలకు కావేరీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నాలుగో దశ కింద తాగునీరు అందించాల్సి ఉంది.

“ఈ స్కీమ్ నాలుగో దశ కింద మహదేవపురకు 3.5 కోట్ల లీటర్ల నీరు అందించాలి. 2013 నుంచి ఇప్పటివరకు 3.5 కోట్ల లీటర్ల నీరే అందిస్తున్నారు. అయితే రోజూ ఈ ప్రాంతానికి వెయ్యి మంది కొత్తవాళ్లు వచ్చి స్థిరపడుతున్నారు” అని వైట్‌ఫీల్డ్‌లోని వార్డ్ నంబర్ 103లో నివసిస్తున్న మురళి గోవిందరాజులు బీబీసీతో చెప్పారు.

“కొత్తగా వస్తున్న వారి కోసం బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లను నిర్మిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్లుగా నీటి సరఫరా మాత్రం పెరగడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకుంటున్నాం” అని ఆయన చెప్పారు.

“మాకు ఆరు నెలల నుంచి కావేరీ నీళ్లు వస్తున్నాయి. అయితే ఇటీవల ఆ నీళ్లు రావడం హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో మా కమ్యూనిటీలో ఉన్న 256 భవనాల కోసం మేము ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుంటున్నాం. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడం లేదు. దీంతో బోర్లు ఎండిపోయాయి” అని గ్లోబల్ ఐటీ కంపెనీలో పని చేస్తున్న రుచి పంచోలీ చెప్పారు.

“గతంలో మేము అత్యవసరం అనుకున్నప్పుడు వైట్‌ఫీల్డ్‌కు రెండు కిలోమీటర్ల దూరం నుంచి 250 రూపాయలకు ఒక ట్యాంకర్ తెప్పించుకునే వాళ్లం” అని ప్రజా సేన సమితితో కలిసి పని చేస్తున్న ఎన్‌వి మంజునాథ్ తెలిపారు.

“ఇప్పుడు ట్యాంకర్ ధర 1,500 రూపాయలు. ఒక్కో ట్యాంకర్‌లో 4 వేల లీటర్ల నీరు వస్తుంది. అయితే ఇదేమీ కొత్తది కాదు. గతంలో మాకు 250 అడుగుల లోతులో బోరు ద్వారా నీరు వచ్చేది. ఇప్పుడు 1,800 అడుగులు తవ్వితే కానీ నీరు రావడం లేదు” అని ఆయన చెప్పారు.

బెంగళూరులో ఒకప్పుడు మూడు వందల సరస్సులు, చెరువులు ఉండేవని, వాటన్నింటినీ కబ్జా చేసి భవనాలు కట్టడం వల్ల సరస్సులు లేకుండా పోవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమన్ గుండవరపు చెప్పారు.

“వైట్ ఫీల్డ్స్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థలు ఎక్కువ. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇక్కడే ఉంటున్న హాస్టళ్లలో ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని హాస్టల్స్‌లో నీటి వాడకంపై యజమానులు ఆంక్షలు విధిస్తున్నారు” అని ఆయన బీబీసీతో అన్నారు.

“సరస్సుల పునరుద్దరణ జరగడం లేదు. వర్తూరు ప్రాంతంలో ఆరేడు సరస్సులు ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో అవి రీచార్జ్ కాలేదు” అని వర్తూర్ రైజింగా ప్రాంతంలో నివసిస్తున్న జగదీష్ రెడ్డి చెప్పారు.

“బెంగళూరు విషయంలో అందరూ ట్రాఫిక్ సమస్య గురించి చెబుతుంటారు. అయితే నగరంలో అసలైన పెద్ద సమస్య తాగునీటి కొరత” అని సామాజిక కార్యకర్త శ్రీనివాల్ అళ్వలి తెలిపారు.

బెంగళూరు, బెల్లందూరు. వర్తూరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీళ్లు తీసుకువస్తున్న బాలిక

నీటి సమస్య ఇంకా ఎంత కాలం ఉంటుంది?

మరో 100 రోజుల వరకూ నీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదంటున్నారు మున్సిపల్ అధికారులు, సామాజిక కార్యకర్తలు.

నగరంలో తాగునీరు అందించేందుకు కావేరీ వాటర్ ప్రాజెక్టును వివిధ దశల్లో ప్రారంభించినప్పుడు వేసిన అంచనాలతో పోలిస్తే తర్వాతి కాలంలో జనాభా భారీగా పెరిగిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

“ప్రస్తుతం కావేరీ జలాల కోసం విపరీతమైన ఒత్తిడి ఉంది” అని బెంగళూరు తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ బోర్డు ఛైర్మన్ ప్రశాంత మనోహర్ చెప్పారు.

కావేరీ తాగునీటి సరఫరా ప్రాజెక్టులో ఐదో దశ గడువు ప్రకారం 2023 జులై నాటికి పూర్తై ఉండాల్సింది. ప్రాజెక్టు పనులు మొదలైన తర్వాత కోవిడ్ కారణంగా ఆటంకం ఏర్పడింది.

ఇది పూర్తైతే 110 గ్రామాల్లోని 50 లక్షల మందికి నీటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఐదో దశ పనులకు 4,112 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు.

“ఐదో దశలో భాగంగా ఏప్రిల్ నుంచి 5-10 కోట్ల లీటర్ల నీటిని పంపింగ్ చేస్తాం” అని బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ చెప్పారు.

“ఏప్రిల్‌లో నీటి పంపింగ్ ప్రారంభమైతే ఐదారు నెలల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి. మొదట 30 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తాం. తర్వాత దాన్ని పెంచుకుంటూ 75.5 కోట్ల లీటర్లకు తీసుకెళతాం. అలా చేయడం వల్ల ప్రస్తుత సమస్య నుంచి గట్టెక్కవచ్చు” అని ఆయన అన్నారు.

నగరంలో ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడిన వారు మరో 100 రోజులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భూగర్భ జలాల నిపుణుడు విశ్వనాథ్ శ్రీకంఠయ్య చెప్పారు.

బెల్లందూరు, వర్తూరు సరస్సుల్లో స్థానికంగా విడుదలయ్యే మురుగు నీటిని శుద్ధి చేసి నింపినట్లైతే భూగర్భ జలాలు కొంతమేర పెరుగుతాయి. నగరంలోని మొత్తం 186 సరస్సుల్లో ప్రస్తుతం 24-25 మాత్రమే పునరుద్దరించగలిగే పరిస్థితి ఉంది. వాటిని పునరుద్దరించినా నీటి సమస్యను కొంత తగ్గించవచ్చు. కావేరి ఐదో దశ ప్రారంభమైతేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది” అని ఆయన అన్నారు.

బెంగళూరు నీటి సమస్య, ఎలక్ట్రానిక్ సిటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రమ్ముల్లో నీళ్లు నింపుకుంటున్న బెంగళూరు ప్రజలు

బెంగళూరు ఇమేజ్ ఎలా మసకబారుతోంది?

‘‘ప్రస్తుత నీటి సంక్షోభం ఒక హెచ్చరిక లాంటిది. బెంగళూరు భారతదేశంలో అత్యంత అత్యాశ ఉన్న నగరం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడకు వచ్చేవాళ్లంతా డబ్బు సంపాదన, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు” అని బ్రాండ్ ఎక్స్‌పర్ట్ హరీష్ బిజూర్ చెప్పారు.

“బ్రాండ్ బెంగళూరుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే నగర ప్రతిష్టను దెబ్బ తీసే అనిశ్చిత భవిష్యత్‌వైపు మనం వెళుతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు” అని ఆయన బీబీసీతో చెప్పారు.

“ఎవరైనా బెంగళూరులో ఒక సంస్థను ప్రారంభించి 4500 మందికి ఉద్యోగాలు కల్పించాలని అనుకున్నారు. అయితే ఈ నగరంపై విపరీతమైన ఒత్తిడి ఉందని ఆయన భావిస్తే, హైదరాబాద్ లేదా పుణే వెళతారు. ఎందుకంటే ఆ నగరాలపై ఇంత ఒత్తిడి లేదు. బెంగళూరు ఇప్పటికే దాని ప్రతిష్టను కోల్పోతోంది. మనం జీవించడానికి గాలి, నీరు, ఆహారం అవసరమని మనం మరచిపోకూడదు. గాలి పరంగా దిల్లీ కంటే బెంగుళూరు మెరుగ్గా ఉంది” అని హరీష్ అభిప్రాయపడ్డారు.

“ఇక్కడ మంచి ఆహారం లభిస్తుంది. అసలు సమస్య తాగునీటికి సంబంధించినది. భూగర్భ జలాలు పడిపోయినప్పుడు, ఆ భూమిపై నివసించే ప్రజల గురించి ఇది చాలా చెబుతుంది. ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది’’ అని ఆయన చెప్పారు.

బెంగళూరు మహిళ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు

బెంగళూరులోని నీటి సమస్య రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో ఇది ప్రచారాస్త్రంగా మారుతోంది.

వచ్చే వారంలోపు తాగునీటి సమస్య పరిష్కరించకపోతే తాము ఆందోళనకు దిగుతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కరవు సాయం అందించాలని కేంద్రాన్ని పదే పదే కోరినప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెబుతోంది.

కరవు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి తమకు 18,172 కోట్ల రూపాయలు అవసరం అని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. 2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని 226 తాలూకాల్లో 223 తాలూకాలు కరవు బారిన పడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోని 7,412 గ్రామాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నట్లు రెవెన్యూ శాఖ తాజా నివేదిక వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)