పాలు ఎవరు తాగొచ్చు? ఎవరు తాగకూడదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'మా కంపెనీ బిస్కెట్లలో పాలు ఎక్కువ, మా సంస్థ ఉత్పత్తుల్ని పాలలో కలిపి తాగిస్తే మీ పిల్లలు ఎన్నో విజయాలు సాధిస్తారు' అంటూ టెలివిజన్లలో వస్తున్న ప్రకటనలను కొన్నేళ్లుగా చూస్తున్నాం.
ప్రపంచంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్.
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022-23లో భారతదేశంలో 23.058 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి.
మనుషులకు ఆవు పాలు అవసరమని, ఆరోగ్యకరమైనవనే భావన భారతీయ సమాజంలో విస్తృతంగా ఉంది. రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోవడం చాలా మందికి ఉన్న అలవాటు.
బాల్యంలో ఒక దశ దాటిన తర్వాత, మనిషి తప్ప మరే జంతువు లేదా జీవి, జీవితాంతం పాలు తాగదు, ముఖ్యంగా వేరే జంతువు పాలు ఏవీ తాగవు.
అయితే.. పాలు ప్రతి ఒక్కరు, ప్రతి రోజూ తాగొచ్చా? ఇందులో పోషకాలు ఉన్నాయా? రోజులో ఎన్ని పాలు తాగొచ్చు? పాలు ఎవరు తాగకూడదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

ఫొటో సోర్స్, Getty Images
మాంసాహారులకు పాలు అవసరమా?
పాలలో కాల్షియం, ప్రొటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని.. అయితే తగినంత మాంసాహారం తీసుకునేవారు పాలను తమ ఆహారంలో తీసుకోకున్నా ఎలాంటి సమస్యలు ఉండవని పిల్లల డాక్టర్, న్యూట్రిషనిస్ట్ అరుణ్ కుమార్ చెప్పారు.
"నియోలిథిక్ కాలంలో, మానవులకు అనేక రకాల పోషకాహార లోపాలు ఉండేవి. అందువల్ల, దీనిని భర్తీ చేయడానికి, జంతువులను పెంచి వాటి పాలను తాగేవారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడటం అసాధ్యం కాబట్టి ఈ అలవాటు ఏర్పడింది. అది సమాజంలో 10,000 సంవత్సరాలుగా కొనసాగింది. ఇప్పుడు మన ఆహారం ప్రణాళికాబద్దంగా ఉంది. పాలు అవసరం లేదు" అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
‘‘శాకాహారులు తప్పనిసరిగా పాలు తాగాలి. పాలు అందరికీ సరిపోతాయా అని అడిగితే, కాదనే చెప్పాలి. ఎందుకంటే పాలలో లాక్టోస్ అనే షుగర్ ఉంటుంది. అది జీర్ణం కావాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ కావాలి. మన పేగుల్లో ఆ ఎంజైమ్ లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి" అని డాక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, DOCTORARUNKUMAR/FACEBOOK
పాలలో ఏ పోషకాలు ఉన్నాయి?
"మనం ఉపయోగించేవి ఎక్కువగా ఆవు పాలు, ఆ తరువాత గేదె పాలు. కేలరీల పరంగా చూస్తే, వంద గ్రాముల ఆవు పాలలో 67, గేదె పాలలో 117 కేలరీలు ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా గేదె పాలు తాగడం వల్ల శరీర బరువు పెరుగుతుంది" అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
"వంద గ్రాముల ఆవు పాలలో 120 మిల్లీ గ్రాములు, గేదె పాలలో 210 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.
ప్రొటీన్ల విషయానికొస్తే, ఆవు పాలలో 3.2 గేదె పాలలో 4.3 మిల్లీ గ్రాములు ఉన్నాయి. కానీ ఇందులో కేసైన్ ప్రోటీన్ అంత తేలిగ్గా జీర్ణం కాదు. అందుకే మన జీర్ణాశయంలో లాక్టేజ్ ఎంజైమ్ లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు రావొచ్చు. కొవ్వు పరంగా చూస్తే, ఆవు పాలలో 4.1 , గేదె పాలలో 6.5 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి గేదె పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి" అని డాక్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలు ఎవరు తాగకూడదు?
తల్లిపాలు తాగే పిల్లల్లో లాక్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. అయితే రోజూ పాలు తాగడం వల్ల మనిషి ఎదిగే కొద్దీ శరీరంలో, అవయవాల్లో మార్పులు వస్తాయి. అందుకే పెద్ద వాళ్ల విషయంలో పాలు సహజ పానీయం కాదు అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
"పాలు నేరుగా అజీర్ణానికి దారి తీయవచ్చు. కొంతమంది రోజుకు లీటరు పాలు తాగుతారు. అయితే ఒక్కోసారి అర గ్లాసు పాలు తాగినా గ్యాస్, గుండెల్లో మంట, విరేచనాలు లాక్టోస్ అలెర్జీ ఉన్నవారికి పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్లు పాలకు దూరంగా ఉండాలి" అని డాక్టర్ చెప్పారు.
“ఆవు పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇవ్వడం వల్ల బరువు పెరుగుతారు. అయితే కేవలం పాలు మాత్రమే తాగించడం మంచిది కాదు. ఆవు పాలు తాగడం వల్ల కొంతమంది పిల్లలు ఇతర ఆహార పదార్థాలు తినలేరు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆవు పాలలో ఐరన్ చాలా తక్కువ ఉంటుంది" అన్నారు డాక్టర్.
‘‘పిల్లలు 13 లీటర్ల పాలు తాగితే ఒక రోజుకు సరిపడా ఐరన్ లభిస్తుంది, కానీ అంత మొత్తంలో పాలు తాగడం సాధ్యం కాదు. అంతే కాదు పాలలో ఉండే కాల్షియం శరీరంలోని ఐరన్ శాతాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల రక్త హీనత ఏర్పడుతుంది" అని అరుణ్ కుమార్ చెప్పారు.
"ఏడాది లోపు పిల్లలకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. కొంతమంది పిల్లలకు నాలుగు నెలలకే ఆవు పాలు తాగిస్తారు. దీని వల్ల ప్రొటీన్ అలర్జీలు, పొట్టలో రక్తస్రావం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒక్కోసారి అది డీ హైడ్రేషన్‌కు దారి తీయవచ్చు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో మాత్రమే ఆవుపాలు తేలిగ్గా జీర్ణం అవుతాయి" అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

రోజుకు ఎంత మొత్తంలో పాలు తాగవచ్చు?
'క్రికెటర్ ధోనీకి ఇష్టమైన పానీయం పాలు. రోజూ నాలుగు లీటర్ల ఆవు పాలు తాగడం వల్లే హెలికాప్టర్ షాట్‌లు సులువుగా కొట్టగలడు' అని కొన్నేళ్ల క్రితం ఇంటర్నెట్‌లో ప్రచారం జరిగింది. దీనిపై ధోనీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. తాను రోజుకు ఒక లీటర్ పాలు మాత్రమే తీసుకుంటానని చెప్పారు.
"ధోనీ లాగా ప్రతి ఒక్కరూ రోజూ లీటర్ పాలు తీసుకోలేరు. ఆయన చేసే వ్యాయామానికి అది సరిపోతుంది. అయితే సగటు వ్యక్తికి ఇది ఆరోగ్యకరం కాదు. రోజుకి 400 మిల్లీ లీటర్ల పాలు, 400 గ్రాముల పెరుగు సరిపోతుంది" అని పోషకాహార నిపుణులు ధరిణి కృష్ణన్ చెప్పారు.
"ఈ రోజుల్లో చాలా కుటుంబాలు వారానికి రెండుసార్లు లేదా ఒకసారి మాత్రమే మాంసాహారాన్ని తినగలుగుతున్నాయి. కాబట్టి వారు రోజూ పాలు తీసుకోవడం మంచిది. కానీ వృద్ధులకు పాల సంబంధిత అజీర్ణం సమస్య ఉంటే, వారు 400 మిల్లీ లీటర్లు వరకు వే ప్రొటీన్ తీసుకోవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, SARAVANAKUMARM/FACEBOOK
పాలలో చక్కెర వేసుకుని తాగవచ్చా?
"ఉదయం 200మిల్లీ లీటర్లు, సాయంత్రం 200 మిల్లీ లీటర్లు..ఇలా రోజుకు 400 మిల్లీ లీటర్ల వరకు పాలు తీసుకుంటే ఎలాంటి సమస్య రాదు. అయితే పాలలో చక్కెర వేసుకుని తాగడం మంచిది కాదు. పాలలో ఇప్పటికే తగినంత కేలరీలు ఉన్నాయి. అందుకే ఎక్కువకాలం చక్కెర కలుపుకుని పాలు తాగడం శరీరానికి ప్రమాదకరంగా మారవచ్చు" అని హోమియో వైద్యుడు శరవణ కుమార్ హెచ్చరించారు.
"ఉదాహరణకు మనం రోజుకు రెండు సార్లు పాలలో ఒక చెంచా పంచదార కలిపి తాగితే, అది రోజుకు 40 గ్రాముల చక్కెర అవుతుంది. ఒక నెలలో మనం ఒక కిలో కంటే ఎక్కువ చక్కెరను పాలతోనే వినియోగిస్తున్నాం. మనం దీన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాం అంటే ఎంత చక్కెర తింటున్నామో ఆలోచించండి. కాబట్టి చక్కెర లేకుండా పాలు తాగడం మంచి మార్గం." అని చెప్పారాయన.
‘‘అల్సర్, లాక్టోస్ అలర్జీ ఉంటే పాలకు దూరంగా ఉండాలి.. అజీర్ణ సమస్యలున్నా పాలు తాగకూడదు. పాలు తాగకపోయినా కాల్షియం కావాలనుకుంటే మాంసాహారం, మటన్ లెగ్ సూప్, గుడ్డు, నెయ్యి, వెన్న, వేరుశెనగలు, ఆకుకూరలు కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ అని హోమియో వైద్యుడు శరవణ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ1 పాలు, ఏ2 పాలు: ఏది మంచిది?
స్థానిక ఆవుల ఏ2 రకం పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని, ఏ1 రకం విదేశీ ఆవుల పాలను రోజూ తాగితే మధుమేహంతో పాటు అనేక రోగాలు వస్తాయనే వార్తలు నిజమేనా అని డాక్టర్ అరుణ్ కుమార్‌ను అడిగాం.
ఆయన దీని గురించి సమాధానం ఇస్తూ “దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. పాలలో కొన్ని ప్రొటీన్ల నిర్మాణాలలో తేడాలు ఉన్నాయి, ఏ1 పాలు శరీరానికి హానికరం అనేందుకు బలమైన ఆధారాలు లేవు. దేశీయ ఆవులలో 98% ఏ2 పాలను ఉత్పత్తి చేయగలవు. గేదె పాలు 100% ఏ2. జెర్సీ ఆవుల వంటి విదేశీ ఆవుల పాలు కూడా. అవి ఏ2 పాలను మాత్రమే ఇస్తాయి. కొన్ని విదేశీ జాతులు మాత్రమే ఏ1 పాలు ఇస్తాయి." డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.
దీనిపై పోషకాహార నిపుణురాలు ధరిణి కృష్ణను ప్రశ్నించగా.. ఏ1 పాలు, ఏ2 పాలపై ఎలాంటి పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.
దుకాణాలు, డెయిరీ ఫామ్‌లలో అమ్మే పాలను మరిగించిన తర్వాత తాగితే సరిపోతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














