గ్రీన్ సప్లిమెంట్లు: ఈ ‘సూపర్ పౌడర్లు’ ఆరోగ్యానికి మ్యాజిక్‌లా పని చేస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనాబెల్ రక్‌హమ్
- హోదా, హెల్త్ రిపోర్టర్
‘‘మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి చేయాల్సిందల్లా ఒక చెంచా మ్యాజిక్ పౌడర్‌ను నీటిలో కలిపి తాగేయడమే’’ అంటూ కంపెనీలు తమ ‘సూపర్ గ్రీన్ సప్లిమెంట్ల’ను మార్కెట్‌లో అమ్ముతాయి.
కొన్ని కంపెనీలైతే వీటిని తాగడం వల్ల కురులు, గోళ్లు బలంగా మారడంతోపాటు ఒంట్లో శక్తి పెరిగి, కడుపు ఉబ్బరం తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పెద్ద జాబితాను ఏకరువు పెడతాయి.
గ్రీన్ సప్లిమెంట్ల వల్ల ప్రి, ప్రొబయాటిక్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్లు లభిస్తామయంటూ ప్రచారం చేస్తారు.
కానీ, ఇవే పోషకాలను మన ఆహారంలో మరింత సులభంగా, చౌకగా పొందే మార్గాలు ఉన్నాయని బీబీసీకి నిపుణులు చెప్పారు.
టామ్సిన్ హిల్ ఒక డైటీషియన్. ఎన్‌హెచ్ఎస్ గుర్తింపు పొందిన డైటీషియన్ ఆమె. సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా వీటి గురించి మొదటగా తనకు తెలిసిందని ఆమె చెప్పారు. ఒక డైటీషియన్‌గా ఈ పౌడర్ల ద్వారా శరీరానికి ఏమి పోషకాలు అందుతాయో తెలుసుకునేందుకు ప్రయత్నించానని ఆమె అన్నారు.
రూ. 9,909 కోట్లు (945 మిలియన్ పౌండ్లు) మార్కెట్ విలువ ఉన్న అథ్లెటిక్ గ్రీన్స్ కంపెనీ ఉత్పత్తుల్ని ఆమె పరిశీలించారు. తమ సూపర్‌ఫుడ్ పౌడర్ ‘ఏజీ1’ను తీసుకున్న వినియోగదారులు మరింత చురుకుగా మారారని, వారికి క్రేవింగ్స్ తగ్గిపోయాయని, చక్కని చర్మాన్ని సొంతం చేసుకున్నారంటూ అథ్లెటిక్ గ్రీన్స్ పేర్కొంది.
‘‘ఆ ప్యాకెట్ వెనుక ఉన్న పదార్థాల జాబితాను నేను చూశాను. అవి ఒక గణనీయమైన రీతిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం లేదని నాకు అనిపించింది’’ అని బీబీసీతో ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రియల్ సూపర్‌ఫుడ్స్ అనే మరో కంపెనీ, తమ సూపర్ గ్రీన్స్ బ్లెండ్‌ను రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, ఓవరాల్ ఆరోగ్యానికి దోహదపడుతుందంటూ పేర్కొంది. 2021లో డ్రాగన్ డెన్ అనే బీబీసీ ప్రోగ్రామ్‌లో ఈ కంపెనీ పాల్గొంది.
ఫ్రీ సోల్ కంపెనీ ఎఫ్‌ఎస్ గ్రీన్ బ్లెండ్ వల్ల కూడా ఇలాంటి ప్రయోజనాలే కలుగుతాయని చెప్పారు. ఇందులోని అశ్వగంధ, గోల్డెన్ కివి, మకా వంటి ప్రధాన పదార్థాలు రోగనిరోధక వ్యవస్థ, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయని ఫ్రీ సోల్ కంపెనీ పేర్కొంది.
ఏజీ1 పౌడర్ ఫార్ములా, నిరంతరం మెరుగుపరిచే విధానాల్లో భాగంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులతో కూడిన తమ బృందం వేలాది అధ్యయనాలను పరిశీలించిందని బీబీసీతో అథ్లెటిక్ గ్రీన్స్ అధికార ప్రతినిధి చెప్పారు.
ఫ్రీ సోల్ బృందం కూడా తమ ఉత్పత్తుల్లో క్లినికల్‌గా అధ్యయనం చేసిన, పేటెంట్ ఉన్న పదార్థాలు ఉన్నట్లు చెప్పింది.
రియల్ సూపర్‌ఫుడ్స్ కంపెనీని కూడా బీబీసీ సంప్రదించగా, తమ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ వాదనలను ఆ కంపెనీ చేయలేదు.
యూకేలో ఈ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ అనుమతులు కూడా లభించాయి. దేశంలో ఆహర భద్రతను పరిశీలించే నియంత్రణ సంస్థ ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియేషన్.

ఫొటో సోర్స్, Getty Images
హెల్త్ యాంగ్జైటీతో ఆటలు
టామ్సిన్ హిల్ ముఖ్యంగా ఈ మూడు కంపెనీల ఉత్పత్తుల్ని విశ్లేషించారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి కంపెనీలు చేస్తోన్న వాదనల్ని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె అన్నారు.
‘‘అవి చాలా పేలవ నాణ్యతతో ఉన్నాయి. ఉత్పత్తుల అధ్యయనంలో చాలా తక్కువ మంది పాల్గొన్నారు. వారిలో చాలా మంది ఆధారపడదగినవారు కాదు’’ అని ఆమె చెప్పారు. ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలుగా పిలిచే ఈ ఉత్పత్తులు మన హెల్త్ యాంగ్జైటీతో ఆడుకుంటున్నాయని హిల్ అన్నారు.
ఒక డైటీషియన్‌గా తనకున్న అనుభవాన్ని బట్టి మన యువ తరంలో ఆరోగ్య స్పృహ బాగా పెరుగుతోందని ఆమె చెప్పారు. కానీ, లేని ఆరోగ్య ప్రయోజనాలను చూపిస్తూ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టేలా కంపెనీలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో భారీగా అందుబాటులో ఉన్న సూపర్ గ్రీన్ ఉత్పత్తుల్ని చూస్తే ప్రజలు వాటిని ఏ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారో అర్థం అవుతుందని రిజిస్టర్డ్ న్యూట్రీషనిస్ట్, రచయిత జెన్నా హోప్ అంచనా వేశారు.
2023లో 220 మిలియన్ పౌండ్లు (రూ. 2,306 కోట్లు)గా ఉన్న సూపర్ గ్రీన్ పౌడర్ మార్కెట్ 2030 నాటికి 395 మిలియన్ పౌండ్ల (రూ. 4,141 కోట్లు)కు చేరుకుంటుందని వన్ ఇండస్ట్రీ అంచనాలు సూచిస్తున్నాయి.
‘‘ఈ ఉత్పత్తులకు సంబంధించి చాలా తప్పుడు సమాచారం మార్కెట్లో ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి, మీ మేథోశక్తి చురుకుదనానికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, నిద్రకు ఈ ఉత్పత్తులు కావాలని మీరు అనుకునేలా ఈ బ్రాండ్లు చేస్తాయి. కానీ, నిజానికి మీరు ఆరోగ్యకరమైన, సంతులిత ఆహారంపై దృష్టి సారిస్తే ఈ ప్రయోజనాలన్నీ మీకు దక్కుతాయి. వీటి కోసం మీరు ఈ ఎలైట్ గ్రీన్ పౌడర్లను తాగాల్సిన పనిలేదు’’ అని బీబీసీతో ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బడ్జెట్‌తో వారం రోజుల పండ్లు కొనొచ్చు
సూపర్ గ్రీన్ పౌడర్ల ధరల్లో తేడాలు ఉంటాయి. మీరు ఎంచుకునే బ్రాండ్‌ను బట్టి రోజుకు 1 పౌండ్ (రూ. 104) నుంచి 4 పౌండ్ల (రూ. 419) వరకు ఖర్చు అవుతుంది.
‘‘కొంతమంది పండ్ల కోసం వారానికి పెట్టే ఖర్చు ఇది. కాబట్టి వీటికి బదులుగా ఎక్కువగా పండ్లు, కూరగాయలపై దృష్టి సారిస్తే మంచింది. పాలకూర, తాజా ఆకుకూరలు, బీన్స్, తృణధాన్యాలు, పప్పులు వంటివి ఇంకా మనకు అందుబాటు ధరల్లో ఉంటాయి’’ అని హోప్ అన్నారు.
రీఫైన్డ్ షుగర్స్, కృత్రిమ చక్కెరలు, ఆల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తినడం తగ్గిస్తే మన ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయని హోప్ నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కొందరికి ప్రయోజనకరమే’’
ఈ సప్లిమెంట్ల వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, అవి ఆరోగ్యానికి హానికరం కాదని హిల్ వెల్లడించారు. కావాలంటే ప్రజలు వాటిని ప్రయత్నించవచ్చని చెప్పారు.
కొంతమందికి ఈ సప్లిమెంట్లు సానుకూల దృక్పథంతో ఉండేందుకు సహాయపడతాయంటూ హోప్ అన్నారు.
బిజీగా ఉండే, తక్కువ సమయం దొరికే వ్యక్తులకు ఇవి ప్రయోజనకరంగా ఉండొచ్చని హోప్ అభిప్రాయపడ్డారు.
‘బాగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాన్ని చేసే వ్యక్తులకు తగు మొత్తంలో పోషకాలు అందేలా ఈ సప్లిమెంట్లు సహాయపడొచ్చు. కొన్ని రకాల కూరగాయలు, పండ్లు తినేందుకు ఇష్టపడని వారికి సప్లిమెంట్ల ద్వారా ఆ లోటు నిండుతుంది’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యకర డైట్ చిట్కాలు
పోషకాలను పొందేందుకు హోల్ ఫుడ్స్ సరైనవి అని బీబీసీతో బ్రిటిష్ డైట్ అసోసియేషన్ ప్రతినిధి నికోలా లుడ్లామ్ రైనీ అన్నారు.
‘‘ఆరోగ్యానికి, ఆరోగ్యకర డైట్‌కు కచ్చితంగా గ్రీన్ సప్లిమెంట్లు అవసరం లేదు. ఒక వారంలో 30 వేర్వేరు రకాల చెట్ల ఆధారిత ఆహారాల్ని తీసుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలి.
గ్రీన్ సప్లిమెంట్లు తీసుకోవాలని అనుకునేవారు మొదట డైటీషియన్ లేదా రిజిస్టర్డ్ న్యూట్రీషనిస్ట్‌ను తప్పకుండా సంప్రదించాలి’’ అని రైనీ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్: ‘మోదీ ఈసారి గెలవరనే నేను అనుకుంటున్నా’
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














