గుజరాత్-ఇసబ్‌గోల్: తక్కువ నీటితో సాగయ్యే ఈ పంట రైతుల్ని ధనవంతుల్ని చేయగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రుచిత పుర్బియా
- హోదా, బీబీసీ కోసం
‘‘రెండేళ్ల క్రితం ఎకరానికిపైగా భూమిలో (5 బీగాలు) ఇసబ్‌గోల్ పంట సాగు చేశాను. దిగుబడి వచ్చిన పంటను మన్ (40 కిలోలు)కు రూ. 1,800 చొప్పున అమ్మగా రూ. 2.20 లక్షల రాబడి వచ్చింది.
ఈ ఏడాది దాదాపు 3 ఎకరాల్లో పంట పండించాను. వాతావరణం అనుకూలించి అంతా సవ్యంగా సాగితే 4000 కిలోల (100 మన్‌లు) దిగుబడి వస్తుంది. ఈ ధర ప్రకారం చూస్తే ఆరేడు లక్షలు సంపాదిస్తాను.’’
మెహసాణాలోని గోధాన జిల్లా రైతు బచ్చూభాయి ఇలా ఇసబ్‌గోల్ పంటపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
బచ్చూభాయి తరహాలోనే గుజరాత్‌లో ఇసబ్‌గోల్‌ను సాగు చేసే చాలా మంది రైతులు ఈసారి మంచి సంపాదన వస్తుందని అనుకుంటున్నారు.
భారత్ మొత్తంలో ఇసబ్‌గోల్ వ్యాపారం గుజరాత్‌లోని మెహసాణా జిల్లా ఉంజా పట్టణంలో అత్యధికంగా జరుగుతుంది.
యార్డుల్లో 40 కిలోల ఇసబ్‌గోల్‌కు రూ. 3,500 ధర పలుకుతోందని బీబీసీతో ఉంజా ఏపీఎంసీ చైర్మన్ దినేశ్ పటేల్ చెప్పారు.
‘‘మన్ ఇసబ్‌గోల్‌కు రూ.3,500 ధర నడుస్తోంది. అయితే, నిరుటి పంటకు ఈ ధర ఇస్తున్నారు. ఈ ఏడాది పంట మార్కెట్లోకి రావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టొచ్చు. కాబట్టి ఈ ధర ఇంకా పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. పంట దిగుబడి బాగా వస్తే ఈసారి మార్కెట్‌లో ఇసబ్‌గోల్ పుష్కలంగా అందుబాటులో ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ఈసారి ఇసబ్‌గోల్ ఉత్పత్తి భారీగా ఉంటుందని వ్యవసాయ డైరెక్టర్ కార్యాలయం అంచనా వేసింది.
భారీ ఉత్పత్తితో పాటు, అధిక ధర ఉండటంతో ఈసారి మంచి ఆర్జన వస్తుందని ఓవైపు రైతులు ఆశిస్తున్నారు. మరోవైపు వర్షాల వల్ల పంటకు నష్టం కలుగుతుందనే భయాలు కూడా ఉన్నాయి.
ఇసబ్‌గోల్ పంటకు వర్షం భయం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు ఇసబ్‌గోల్‌ను భారీగా పండిస్తున్న నేపథ్యంలో తక్కువ నీరు తీసుకునే ఈ పంటతో రైతులు ఎలా ధనవంతులు అవుతారో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఇసబ్‌గోల్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలు
గుజరాత్‌లో ప్రసిద్ధ వాణిజ్య పంట ఇసబ్‌గోల్ అని చెప్పవచ్చు.
ఇసబ్‌గోల్ పంటకు సంబంధించిన సమాచారాన్ని ఐసీఈఏఆర్ నివేదికతో పాటు పరిశోధకులు డాక్టర్ పీజే పటేల్ బీబీసీకి తెలిపారు.
అనువైన నేల
ఇసబ్‌గోల్ శీతాకాలపు పంట.
ఇసుక, నల్లరేగడి, పొడి నేలలు ఈ పంటకు బాగా అనుకూలంగా ఉంటాయి.
ఒకవేళ నేలలో వర్షపునీరు, తేమ ఎక్కువకాలం నిల్వ ఉంటే ఈ పంట కుళ్లిపోతుంది.
తక్కువ నీరు అవసరం. పొడి, చలి వాతారణం అనువుగా ఉంటుంది.
ఏ కాలంలో పండిస్తారు?
డిసెంబర్ మధ్య నుంచి జూన్ మధ్య వరకు ఇసబ్‌గోల్‌ను పండిస్తారు.
ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి?
గుజరాత్‌లో ‘గుజరాత్ ఇసబ్‌గోల్ నం.4’ రకం విత్తనాన్ని చాలా మేలురకంగా పరిగణిస్తారు. ఈ విత్తనాలు నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తాయి.
నీటి వసతి
ముందు చెప్పుకున్నట్లుగా ఈ పంటకు ఎక్కువ నీరు అవసరం లేదు.
అయితే నేల రకాన్ని బట్టి మూడు లేదా నాలుగు నుంచి అయిదు లేదా ఆరుసార్లు నీటిని పట్టాలి.
ఇసుక నేలలకు మూడు సార్లు మాత్రమే నీరు అవసరం.
వాతావరణం
ప్రధానంగా వడగండ్లు, తేమ వాతావరణం వంటివి ఇసబ్‌గోల్ పంటకు నష్టం చేస్తాయి.
ఒకవేళ వర్షం కురిస్తే పంట మొత్తం నేలమట్టం అవుతుంది. రైతుకు ఏమీ మిగలదు.
కాబట్టి వర్షాలు ఈ పంటకు హానికరం. అకాల వర్షాలతో ఈ పంటకు పెద్ద సవాలు ఎదురవుతుంది.
తెగుళ్లు, వ్యాధులు
ఉత్తర గుజరాత్‌లోని ఇసుక నేలల్లో ఈ పంటను పండించడం వల్ల దీనికి చెదపురుగు సోకే అవకాశం ఉంటుంది.
దీని నివారణకు పురుగు మందులను పిచికారీ చేయాలి.
ఇసబ్‌గోల్‌కు అఫిడ్స్ అనే వ్యాధి రావొచ్చు.
అఫిడ్స్ అనేది ఈ పంటకు పట్టే ప్రధాన తెగులు. విత్తనాలు విత్తిన 50-60 రోజుల తర్వాత ఇది కనిపిస్తుంది. 12-15 రోజుల వ్యవధిలో తెగులు మందులను పిచికారీ చేయడం వల్ల దీన్నుంచి పంటను కాపాడవచ్చు.
ఎరువు
ఈ పంటకు ఎక్కువ రసాయన ఎరువులు అవసరం లేదు. నత్రజని, భాస్వరం, పొటాష్ ఉండే ఎరువుల్ని దీనికి వాడాలి.
చాలా తక్కువ పరిమాణంలో నైట్రోజన్ దీనికి అవసరం. కాబట్టి నేలలో హెక్టారుకు 120 కేజీల కంటే తక్కువ నత్రజని ఉన్నప్పుడు మాత్రమే నైట్రోజన్ ఎరువు వేయాలి. హెక్టారుకు మామూలుగా 20-30 కేజీల నైట్రోజన్, 15 కేజీల భాస్వరం సరిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
మంచి దిగుబడిపై ఆశాభావం
ఉంజా మార్కెట్ యార్డులో ఇసబ్‌గోల్ పంట ధర 40 కిలోలకు రూ. 3,250 నుంచి రూ 4,125 వరకు ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇసబ్‌గోల్ సాగు అత్యధికంగా నమోదు అయినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి.
2024 ఆర్థిక సంవత్సరంలో 31,208 హెక్టార్లకు పైగా భూమిలో ఇసబ్‌గోల్ పంట వేశారు. ఈ నివేదిక ప్రకారం 2024లో ఇసబ్‌గోల్ పంట సాగు 135 శాతం పెరిగింది. అంటే 2023లో 13,245 హెక్టార్లలోనే సాగు జరిగింది.

ఎగుమతి
ప్రపంచంలో ఇసబ్‌గోల్ అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్. గుజరాత్, రాజస్థాన్‌లతో పాటు మధ్యప్రదేశ్‌లో కూడా ఈ పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా ఫార్మా పరిశ్రమలు, ఔషధ తయారీ కోసం డ్రగ్ కంపెనీలు ఈ పంటను కొనుగోలు చేస్తుంటాయి.
ప్రధానంగా మెహసాణా జిల్లాలోని సిద్ధాపూర్, బనస్కాంఠ జిల్లాల నుంచి ఎగుమతి, ప్రాసెసింగ్ అవుతుంది.
గుజరాత్ ఇన్ఫర్మేషన్ విభాగం చేసిన ట్వీట్ ప్రకారం, భారత్‌కు ఇసబ్‌గోల్ అతిపెద్ద దిగుమతిదారు యునైటెడ్ స్టేట్స్.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధక సంస్థతో పాటు ఐసీఏఆర్‌కు చెందిన ‘‘డైరెక్టరేట్ ఆఫ్ మెడిసికల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ రీసెర్చ్ నివేదిక ప్రకారం,
ఇసబ్‌గోల్ విత్తనాల మీది బయటి పూత చాలా ప్రయోజనకరమైనది. ఇది చాలా వ్యాధులను నయం చేసే మూలిక.
మలబద్ధకం వంటి వ్యాధుల నివారణలో ఇది మేలు చేస్తుంది.
ఇసబ్‌గోల్ పేగు సంకోచాలను ప్రేరేపించడం ద్వారా పెద్ద పేగు తెరుచుకునేలా చేస్తుంది.
ఆహార ఉత్పత్తుల రూపకర్తలు దీన్ని చాలా ముఖ్యమైన పదార్థంగా పరిగణిస్తారు.
అత్యధిక ఫైబర్ ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, బ్రెడ్, ఐస్‌క్రీమ్‌ల నుంచి ఔషధాల వరకు అన్నింటిలో ఇది ఉపయోగపడుతుంది. కాస్మోటిక్స్ తయారీలో కూడా దీన్ని వాడతారు.
ఇవి కూడా చదవండి:
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














