జీఎస్టీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటి? ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కేసులో ప్రధాన అభియోగం ఐటీసీ అక్రమాలేనా

ప్రత్తిపాటి శరత్, పుల్లారావు

ఫొటో సోర్స్, facebook/prathipati Pullarao, Prathipati Sharat

ఫొటో క్యాప్షన్, ప్రత్తిపాటి శరత్, పుల్లారావు
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ను రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో ఆయన్ని రిమాండ్‌కు తరలించారు.

శరత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ జీఎస్టీ చెల్లింపుల్లో మోసాలకు పాల్పడిందన్నది ప్రధాన అభియోగం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి, కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించారంటూ ఆయనపై కేసు నమోదైంది.

ఈ కేసుల్లో ప్రత్తిపాటి శరత్‌తో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఏ), 120, 34ల కింద నమోదైన కేసులో వీరిని అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఇంతకీ డీఆర్ఐ ఆరోపిస్తున్నట్టు జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడం ఏంటన్నది ఆసక్తిగా మారింది. జాతీయ స్థాయిలో సాగుతున్న ఆర్థిక నేరాల్లో ఇలాంటి కేసులు తరచూ నమోదవుతున్న తరుణంలో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది.

జీఎస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో...

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం జీఎస్టీ 2017 జూలై నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందున్న 17 రకాల పన్నులను సరళీకృతం చేసి జీఎస్టీని అమలు చేశారు.

ఈ జీఎస్టీ చెల్లింపుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు అప్పటి నుంచే కేంద్ర ఆర్థిక వ్యవహరాల నిఘా బృందాలు కనిపెడుతున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.

జీఎస్టీ సహా పన్నులు చెల్లించి కొనుగోలు చేసిన ఓ సరకుని మరొకరు కొనుగోలు చేసినప్పుడు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాభంపై మాత్రమే రెండో వ్యాపారి చెల్లిస్తే సరిపోతుంది. కానీ మొత్తం విలువపై పన్ను చెల్లించడం వల్ల అదనంగా చెల్లించిన మొత్తాన్ని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) పేరుతో తిరిగి తీసుకోవడానికి వీలు కల్పించారు.

ఐటీసీ క్లెయిమ్స్ పేరుతో తప్పుడు పత్రాలు సమర్పించి పెద్ద మొత్తంలో జీఎస్టీ విభాగం నుంచి లబ్ధి పొందుతున్నట్టు ఇప్పటికే పలుమార్లు రుజువైంది.

2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే 29,273 సంస్థలు ఇలాంటి ఫేక్ ఐటీసీ క్లెయిమ్స్ కోసం ప్రయత్నించినట్టు జీఎస్టీ అధికారులు ప్రకటించారు. ఆ క్లెయిముల విలువ రూ. 44,015 కోట్లుగా గుర్తించారు.

గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఇలాంటి ఫేక్ క్లయిమ్స్‌పై చేపట్టిన దర్యాప్తులో రూ. 4,646 కోట్ల రెవెన్యూని ఫేక్ క్లయిమ్స్ బారి నుంచి కాపాడినట్టు ప్రకటించారు.

2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికే కేంద్ర జీఎస్టీ వర్గాలు గుర్తించిన ఫేక్ క్లయిమ్స్‌లో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో 926 బోగస్ సంస్థలను గుర్తించగా, ఆ తర్వాత రాజస్తాన్‌లో 507, దిల్లీలో 483, హరియాణాలో 424 గుర్తించినట్టు అధికారులు చెప్పారు.

ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా రూ.765 కోట్ల మేర ఫేక్ ఐటీసీ క్లెయిమ్స్ కోసం ప్రయత్నించిన 19 సంస్థలను గుర్తించినట్టు తెలిపారు.

పన్ను లెక్కింపు

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏం చెబుతుందంటే..

వ్యాట్ అమలుచేసిన సమయంలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే కారణంతోనే జీఎస్టీని అమలులోకి తెచ్చారు. అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా సాగడం వల్ల ఎటువంటి అక్రమాలకు ఆస్కారముండదని అప్పట్లో ఆశించారు.

కానీ అందులో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఉపయోగించుకుని ఇలాంటి అక్రమాలు యధేచ్చగా సాగించే ముఠాలు ఏటా బయటపడుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

జీఎస్టీ చట్టం సెక్షన్ 132(బీ), (సీ) ప్రకారం వస్తువులు గానీ సేవలు గానీ అందించకుండానే క్లెయిమ్స్ చేసుకోవడం నేరం.

క్లాజ్ సీ ప్రకారం భౌతికంగా సేవలు గానీ, సరకులు గానీ పొందకుండా ఐటీసీ కోసం ప్రయత్నిస్తే వారిని శిక్షించే అవకాశం ఉంది.

అంటే బిల్లు ఇచ్చినా తీసుకున్నా నేరం చేసినట్టవుతుందన్నది చట్టంలో ఉంది.

రాయితీల కోసం డొల్ల కంపెనీలు తెరిచి, కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు ప్రస్తావిస్తూ ఐటీసీలు కొల్లగొడుతున్నట్టు రుజువవుతుంది.

పేపర్ల మీద మాత్రమే లావాదేవీలు జరిగినట్టు చూపించి నకిలీ బిల్లులను జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

"ఇనుము, వెండి, అల్యూమినియం, రాగి వంటి స్క్రాప్ సరఫరా చేసినట్టు బిల్లులుంటాయి. నకిలీ బిల్లులను అప్‌లోడ్ చేయగానే అందులో ఉన్న వివరాలు తనిఖీ చేసే యంత్రాంగం ఉండాలి. ఇన్వాయిస్‌లను పోల్చి చూసే వెసులుబాటు లేదు. దాని వల్ల డొల్ల కంపెనీలు అవి అప్‌లోడ్ చేసే బిల్లులను బట్టి జీఎస్టీ పన్ను రాయితీలు వచ్చేస్తుండడం ఆసరాగా తీసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. బోగస్ సంస్థలను అరికట్టే ప్రయత్నాలు మరింత ఎక్కువగా జరగాలి" అంటూ విజయవాడకు చెందిన రిటైర్డ్ జీఎస్టీ అధికారి ఆర్.రమేష్ బాబు అన్నారు.

మూడు నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే తనిఖీలు మెరుగైనప్పటికీ పటిష్ట యంత్రాంగం మాత్రం పూర్తిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఆరేడేళ్లుగా ఇదే తంతు

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా జీఎస్టీ పన్ను రాయితీ పొందిన ఉదంతాలున్నాయి. కేసులు కూడా నమోదైన అనుభవాలు ఉన్నాయి. కొందరిని అరెస్ట్ చేసినట్లు కూడా రికార్డులు చెబుతున్నాయి.

డొల్ల కంపెనీలకు ఒకే అడ్రస్ ఉండడమే కాకుండా, కొన్నిసార్లు ఒకే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ సాయంతో కంపెనీలు సృష్టించిన ఉదంతాలున్నట్టు జీఎస్టీ అధికారులు చెబుతున్నారు.

"2017 నుంచి ఇలాంటి తప్పుడు పత్రాలతో పన్ను రాయితీలు పొందడం కొనసాగుతుంది. కొన్ని కంపెనీలలో ఒకేసారి లావాదేవీలు పెరిగిపోతుంటాయి. కొన్ని సార్లు నెలల తరబడి ఎటువంటి లావాదేవీలు ఉండవు. కానీ హఠాత్తుగా పెద్ద మొత్తంలో జీఎస్టీ చూపిస్తారు. తక్కువ విలువైన సరుకులను ఎక్కువ మొత్తంలో అమ్మినట్టు చూపిస్తారు. ఇంకొన్ని కేసుల్లో ఒకే అడ్రసులోని కంపెనీల మధ్య లావాదేవీలు జరిగినట్లు చెబుతారు. ఇలాంటి ఇన్వాయిస్‌ల మీద దృష్టి పెట్టి తీగలాగితే డొంక కదులుతూ ఉంటుంది" అంటూ కేంద్ర జీఎస్టీలో పనిచేస్తున్న ఓ అధికారి బీబీసీకి తెలిపారు.

ఒకటి, రెండేళ్ల జీఎస్టీ పత్రాలు చూపించి బ్యాంకులను మోసగించే ముఠాలు కూడా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. బోగస్ జీఎస్టీ పన్ను రాయితీలతో పాటుగా బ్యాంకులను మోసగించిన కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

అనుమానం వచ్చిన ప్రతి కేసులోనూ దర్యాప్తు ముమ్మరం చేయడం ద్వారా కట్టడి చేసే యత్నాలు ఉద్ధృతం చేస్తున్నట్టు వివరించారు.

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌

అమరావతితో సబ్ కాంట్రాక్టుల పేరుతో..

ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పోరేషన్ అమరావతి నిర్మాణంలో సబ్ కాంట్రాక్టు సంస్థగా ఏపీ డీఆర్ఐ చెబుతోంది.

అవెక్సా సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండగా.. నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలో ఆ సంస్థ కార్యాలయాలున్నట్టు వెల్లడించింది.

సబ్ కాంట్రాక్టుల పేరుతో పనులు చేయకుండానే తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీ రాయితీ పొందినట్టు కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ ( డీజీజీఐ) ఈ నేరాన్ని పసిగట్టునట్టు చెబుతోంది. ఇప్పటికే అవెక్సా కార్పోరేషన్ తప్పుడు రాయితీలు పొందడంతో, ఆ సంస్థపై రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు కూడా జారీ అయ్యాయని తెలిపింది.

జాక్సన్ ఎమినెన్స్ అనే సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకుని సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరద కాలువలు, కల్వర్టులు, వాకింగ్ ట్రాక్ వంటి నిర్మించాల్సి ఉన్నప్పటికీ, మళ్లీ ఆ పనులను సబ్ కాంట్రాక్టులకు అప్పగించినట్టు రికార్డులు సృష్టించి పనులు చేయకుండానే రూ. 21.93 కోట్లను కాజేశారని డీఆర్ఐ ప్రధాన అభియోగం.

షెల్ కంపెనీల ద్వారా అటు కేంద్ర జీఎస్టీ విభాగాన్ని మోసగించడం, ఇటు ఏపీ ప్రభుత్వ నిధులను దారి మళ్లించడానికి పాల్పడినట్టు పేర్కొంది.

ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకూ రోడ్డు నిర్మాణం పేరుతో మరో రూ. 26.25 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్టు డీఆర్ఐ అభియోగపత్రంలో ఉంది.

శరత్ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఆందోళన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శరత్ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఆందోళన

టీడీపీ టార్గెట్‌గానే...

ప్రత్తిపాటి శరత్ సహా పలువురు జీఎస్టీ రాయితీల ఉల్లంఘనకు పాల్పడినట్టు గతంలోనే డీజీజీఐ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ముందు మాజీ మంత్రి తనయుడి అరెస్ట్ రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఇలాంటి ప్రయత్నాలకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

"ఇది డీఆర్ఐ కుట్ర కేసు. కేవలం ప్రతిపక్ష నాయకుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రయత్నం. నా కుమారుడు, కుటుంబ సభ్యులపై బురదజల్లుతున్నారు. మేం ఎటువంటి నేరం చేయలేదు. ప్రభుత్వం చెబుతున్న కంపెనీకి నా కుమారుడికి సంబంధం లేదు. అయినప్పటికీ, తప్పుడు కేసులో ఇరికించారు. శరత్ కనీసం డైరెక్టర్ కాదు. కనీసం షేర్ హోల్డర్ కూడా కాదు. అందుకే న్యాయపోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం" అంటూ ప్రత్తిపాటి పుల్లారావు బీబీసీతో అన్నారు.

ఎన్నికల ముంగిట తప్పుడు కేసులు పెట్టి తమను నియంత్రించాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతలను వేధించడానికే డీఆర్ఐ ఉందంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)