గుంటూరులో డయేరియా పదేపదే ఎందుకు ప్రబలుతోంది

బాధితులను పరామర్శిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
ఫొటో క్యాప్షన్, బాధితులను పరామర్శిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నీటి కాలుష్యం కారణంగా డయేరియా మళ్లీ ప్రబలుతోంది.

ఇప్పటికే అక్కడ వందల మంది డయేరియాతో ఆసుపత్రిలో చేరుతున్నారు.

గత 11 రోజుల్లో సుమారు 500 మంది డయేరియా బారినపడ్డారని అధికారులు తెలిపారు.

ఇటీవల ఆ ప్రాంతంలో నలుగురు చనిపోయారు. అయితే వారిలో ఒకరు మాత్రమే డయేరియా వల్ల చనిపోయారని అధికారులు చెప్తున్నారు.

కానీ, డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తర్వాతే వారు ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి 10న 23 మంది ఆసుపత్రిలో చేరగా మరుసటి రోజు ఆ సంఖ్య 48కి చేరిందని అధికారులు తెలిపారు. ఇలా పెరుగుతూనే ఉన్నాయి, 21న కూడా కొత్త కేసులు నమోదయ్యాయి.

కొందరు అర్బన్ హెల్త్ సెంటర్లలో చికిత్స చేయించుకున్నాక కోలుకున్నారు.

మరికొందరి పరిస్థితి తీవ్రంగా మారడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో చేర్చారు. ఇంకొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరారు.

అయితే, పది రోజులు దాటిన తర్వాత కూడా డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడం ఆందోళన వ్యక్తమవుతోంది.

పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెబుతున్న ప్రభుత్వం.. విధుల్లో అశ్రద్ధ వహించారంటూ సంబంధిత మున్సిపల్ సిబ్బందిని సస్పెండ్ చేసింది.

2018లో 24 మంది మృతి

2018 మార్చిలోనూ ఇలాగే కలుషిత నీటి వలన గుంటూరులో వేల మంది డయేరియా బారిన పడగా సుమారు 24 మంది చనిపోయారు.

అప్పుడు కూడా మంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్లు దెబ్బతినడం వల్ల వాటిలోకి మురికి నీరు చేరడంతో సమస్య తలెత్తింది.

ప్రస్తుతం సమస్య తలెత్తిన ఇదే శారదా కాలనీ, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో నాడు కూడా డయేరియా ప్రబలింది.

దాంతో గత అనుభవాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

మంచి నీటి పైప్ లైన్లు
ఫొటో క్యాప్షన్, శారదా కాలనీలోని మురికి కాలువలో మంచినీటి పైప్ లైన్లు.

‘మంచి నీటి పైపుల్లో మురికి నీరు కలుస్తోంది’

గుంటూరు నగరంలోని ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అనేక మురికి వాడలున్నాయి. వీటిలో మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేదు.

సంగడి గుంట, శారదా కాలనీ, ముత్యాలరెడ్డి నగర్, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో బీబీసీ పర్యటించినప్పుడు అనేక మంచినీటి పైప్‌లైన్లు తుప్పుపట్టి కనిపించాయి.

ఈ మంచినీటి పైపు లైన్లు మురుగు కాల్వలలోంచి ఉన్నాయి.

డ్రైనేజీ పొంగినప్పుడు మురికి నీరు మంచినీటి పైపుల్లోకి చేరుతుండటం కూడా కనిపించింది.

ఇలా మురికి నీరు కలిసిన మంచినీరు తాగడం వల్ల కొందరు అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

గుంటూరులో డయేరియా
ఫొటో క్యాప్షన్, డ్రైనేజీ పొంగినప్పుడు మురికి నీరు మంచినీటి పైపుల్లోకి చేరుతుండటం కూడా కనిపించింది.

"మా ఇంటి ముందు డ్రైనేజీ ఉంది. దానిలో చెత్తాచెదారం పేరుకుపోయి మురికి నీరు పొంగిపోతుంది. కొన్నిసార్లు మా ఇంట్లోకి వచ్చేస్తుంటుంది. దాంతో పాటు చెత్త వచ్చేస్తుంది. అయినా మాకు తప్పదు. అలానే ఉండాల్సి వస్తోంది. ఇక తాగునీటిలోనూ డ్రైనేజీ నీరు కలుస్తుంది. మాకు ఆ నీరే గతి. నిత్యం వాటినే తాగుతున్నాం. కానీ వారం రోజుల క్రితం ఒక్కసారిగా అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. నాకు కూడా రెండు రోజుల పాటు తగ్గలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం" అంటూ శారదా కాలనీకి చెందిన పెరుకుల శివపార్వతి బీబీసీకి తెలిపారు.

డయేరియా కారణంగా తమ బంధువుల అమ్మాయి ఫిబ్రవరి 11వ తేదీన చనిపోయినట్టు ఆమె చెప్పారు.

గుంటూరులో డయేరియా

అదుపులోకి వచ్చేవరకు ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి: డీఎంఅండ్‌హెచ్ఓ

డయేరియా బాధితుల్లో కొందరికి ఇంటి వద్దనే వైద్యం అందించగా కోలుకున్నట్టు డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి బీబీసీతో చెప్పారు.

మరికొందరిని అర్బన్ హెల్త్ సెంటర్లకు తరలించగా పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఇంటికి పంపించినట్లు తెలిపారు.

"కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్)కు తరలించాం. ఇతర ప్రాంతాల నుంచి కూడా వైద్య బృందాలను రప్పించాం. ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు ఇచ్చాం. ఇంకా కొన్ని కేసులు వస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ప్రత్యేక బృందాలు పని చేస్తూనే ఉంటాయి" అని విజయలక్ష్మి తెలిపారు.

అయితే, మృతుల విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రకటనలకు, ప్రజలు చెబుతున్న దానికి పొంతన కనిపించడం లేదు.

ఇటీవల ఎం. పద్మావతి (18), కొర్రపాటి ఓబులేశు (59), మహమ్మద్ ఇక్బాల్ (35), గాజుల సూర్యనారాయణ (75) చనిపోయారు.

వీరిలో పద్మావతిని మాత్రమే డయేరియా మృతిగా నిర్ధరించి రూ. 5 లక్షల పరిహారం అందించారు.

ఒకరు మాత్రమే డయేరియాతో చనిపోయినట్లు బీబీసీతో డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు.

ఇతర కారణాలతో మరణించిన వారిని డయేరియాగా పరిగణించలేమన్నారు.

ఒకరు క్యాన్సర్ సంబంధిత సమస్యలతో, మిగిలిన వారు ఇతర సమస్యలతో మరణించినట్టు ఆమె తెలిపారు.

గుంటూరులో డయేరియా
ఫొటో క్యాప్షన్, పైప్ లైన్లు సరిచేస్తున్న సిబ్బంది

కలుషిత నీటికి అడ్డుకట్ట పడదా?

గుంటూరు నగరానికి తాగునీటి కోసం పులిచింతల నుంచి కృష్ణా జలాలను తరలిస్తారు. ఉండవల్లి పంపింగ్ సెంటర్‌లో నీటిని పరిశుభ్రంగా మార్చి నగరంలోని వివిధ ట్యాంక్‌లకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తారు.

నగరంలో తాగునీటి సరఫరాలో లోపాన్ని గుర్తించి 2013లోనే తాగునీటి పైప్ లైన్ల ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. మొత్తం రూ. 460 కోట్లతో గుంటూరు నగరం, సమీప గ్రామాలకు సమగ్ర సురక్ష మంచినీటి సరఫరా పథకానికి పనులు ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ పథకం మొదలయ్యింది.

పదేళ్ల తర్వాత కూడా ఈ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరిన దాఖలాలు కనిపించడం లేదు. తాజా పరిణామాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి.

నగరంలోని అనేక ప్రాంతాల్లో పైప్ లైన్ల ఆధునికీకరణ విషయంలో కార్పొరేషన్ వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. బహిరంగంగానే మురికినీరు కలిసిపోతున్నా దానిని నియంత్రించే ప్రయత్నం జరగడం లేదనే విమర్శలున్నాయి.

"ప్రస్తుతం డయేరియా కేసులు నమోదయిన డివిజన్లతో పాటుగా మరికొన్ని మురికివాడల్లో కూడా తాగునీటి సరఫరా సక్రమంగా లేదు. అదే అనేక సమస్యలకు కారణమవుతోంది. నిధులు వెచ్చించినా, లక్ష్యం మాత్రం చేరలేకపోయారు. మునిసిపల్ అధికారుల అలసత్వం కారణంగా తుప్పుపట్టిన పైపుల ద్వారా మురికినీరు కలిసిపోతుంది. పైపులు సరిచేయాల్సిన సిబ్బంది దానిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత విస్మరించడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సురక్షిత తాగునీటి సరఫరా జరగకపోతే పెను ముప్పు తప్పదు" పట్టణ పేదల సంక్షేమ సంఘం ప్రతినిధి కె.నళినీకాంత్ అన్నారు.

తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, దీర్గకాలిక ప్రయోజనాల రీత్యా తక్షణమే పైప్ లైన్లన్నీ సరిచేయాలని ఆయన కోరారు.

గుంటూరులో డయేరియా
ఫొటో క్యాప్షన్, సంగడి గుంట ఏరియాలో ప్రధాన రహదారికి ఆనుకుని తాగునీటి సరఫరా పైపులు ఇవి. పూర్తిగా తుప్పు పట్టాయి.

పాఠం నేర్చుకోకపోవడమే ప్రధాన వైఫల్యం

2018 మార్చి నెలలో సుమారు 3 వేల డయేరియా కేసులు నమోదయ్యాయి.

ఇది జరిగిన ఆరేళ్లకు మళ్లీ వేసవి ముంగిట్లోనే డయేరియా ప్రబలడం ఆందోళనకరంగా మారింది.

అప్పట్లో ప్రాణ నష్టం జరిగి, పలు కుటుంబాలు అనాథలుగా మారిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే సమస్యకు మూల కారణంగా కనిపిస్తోంది.

"సమస్యకు మూలాలు గుర్తించాం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న నీటిని కూడా కాచి చల్లార్చుకుని తాగాలని చెప్పాం. వైద్య, ఆరోగ్య శాఖ బృందాలు పర్యటిస్తున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నాం. పైప్ లైన్ల పరిస్థితి మీద దృష్టి పెట్టాం. శ్రీనగర్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్వహణలో లోపాలు కూడా గుర్తించి, సరిచేస్తున్నాం. అందుకు అనుగుణంగా సిబ్బంది రంగంలో దిగారు. ప్రస్తుతం అంతా అదుపులో ఉంది. కేసులు తగ్గుముఖం పట్టాయి. నీటిసరఫరాలో లోపాలన్నీ సరిచేసే పనిలో ఉన్నాం" అని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

సమస్య పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలకు ఆదేశాలిచ్చామని, దానికి అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం అందిస్తోందని ఆయన బీబీసీతో తెలిపారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి నివసిస్తున్న జిల్లా కేంద్ర నగరంలోనే ప్రజలకు తాగునీటిని సక్రమంగా అందించలేని దుస్థితి దాపురించిందంటూ టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం నేతలు విమర్శిస్తున్నారు.

ఆ పార్టీల నేతలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్, గుంటూరులో డయేరియా తరచూ ఎందుకు ప్రబలుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)