ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు దాటిన ఊబకాయులు, భారత్‌లో పురుషుల కంటే మహిళల్లోనే స్థూలకాయం అధికం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్మిత ముందాసాద్
- హోదా, హెల్త్ రిపోర్టర్
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్య పెరుగుతోంది. వంద కోట్లకు పైగా జనం ఊబకాయం బారిన పడ్డారు.
మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడుతున్న వంద కోట్లకు పైగా జనంలో 88 కోట్ల మంది పెద్దలు కాగా, 15 కోట్ల 90 లక్షల మంది పిల్లలున్నారు.
టోంగా, అమెరికన్ సమోవా ప్రాంతాల్లో మహిళలలో ఊబకాయం సమస్య తీవ్రంగా ఉండగా, పురుషులలో ఊబకాయం సమోవా, నౌరులలో ఎక్కువగా ఉంది.
ఇక్కడ 70 నుంచి 80 శాతం మంది వయోజనులు ఊబకాయం బాధితులే.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో పరిస్థితి ఎలా ఉంది?
గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఊబకాయం కారణమవుతుంది.
ఊబకాయం ర్యాంకింగ్ (ఊబకాయంతో బాధపడుతున్న వారి శాతం, వయస్సు తేడాను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు) ప్రకారం కొన్ని దేశాల పరిస్థితి ఇలా ఉంది.
1. స్త్రీలలో ఊబకాయం విషయంలో భారత్ 19వ స్థానంలో ఉండగా, పురుషుల పరంగా 21వ స్థానంలో ఉంది.
2. మహిళల్లో ఊబకాయం విషయంలో చైనా 11వ స్థానంలో, పురుషుల పరంగా 52వ స్థానంలో ఉంది.
3. పురుషులలో స్థూలకాయం వేగంగా పెరుగుతున్న దేశాల్లో అమెరికా 10వ స్థానంలో, మహిళల పరంగా 36వ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఊబకాయం సమస్యలో బ్రిటన్ 55వ స్థానంలో ఉంది. మహిళల పరంగా 87వ స్థానంలో ఉంది.
ఈ సందర్భంగా స్థూలకాయంతో పోరాడేందుకు కొత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లలు, యువకులలో వేగంగా..
"ఈ దేశాలలో చాలావరకు ఊబకాయం అనేది ఆరోగ్య, అనారోగ్యకరమైన ఆహారాల మధ్య పోటీగా మారింది" అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని సీనియర్ పరిశోధకుడు మజిద్ ఎజాటి బీబీసీతో చెప్పారు.
"కొన్ని సందర్భాల్లో మార్కెటింగ్ కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తాయి. ఈ ప్రచారం అనారోగ్యకర ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది" అని తెలిపారు.
మరికొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం ధర ఎక్కువగా ఉంటే లేదా అందుబాటులో లేకపోతే ప్రజలు ఊబకాయాన్ని పెంచే ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు.
జనాల్లో బరువు తక్కువున్న వాళ్లూ ఉంటారు. అయితే ఈ సమస్య ఉన్న ప్రాంతాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
ఒక రిపోర్టు ప్రకారం పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం రేటు 1990, 2022 మధ్య నాలుగు రెట్లు పెరిగింది.
వయోజన మహిళల్లో ఇది రెండు రెట్లు వేగంగా పెరిగింది. వయోజన పురుషులలో ఈ వేగం మూడు రెట్లు ఎక్కువ.
ఇంతలో తక్కువ బరువున్న పెద్దల నిష్పత్తి 50 శాతం తగ్గింది. అయితే పేద దేశాల్లో ఈ సమస్య ఇంకా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం, కోవిడ్ కూడా కారణం
"వాతావరణ మార్పులు, కోవిడ్ -19, యుక్రెయిన్‌లో యుద్ధం లాంటి పరిస్థితులు బరువు సంబంధిత సమస్యలను పెంచాయి" అని మజిద్ ఎజాటి అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే ఈ పరిస్థితులు పేదరికాన్ని పెంచాయి, ప్రజలు పౌష్టికాహారానికి దూరమయ్యారని తెలిపారు.
కొన్ని దేశాల్లోని కుటుంబాలకు తగినంత ఆహారం లభించడం లేదని, వారు అనారోగ్యకరమైన ఆహారం వైపు వెళుతున్నారని అన్నారు.
డబ్ల్యూహెచ్‌వో సహకారంతో 1,500 కంటే ఎక్కువ మంది పరిశోధకుల నెట్‌వర్క్ ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 22 కోట్ల మంది వ్యక్తుల ఎత్తు, బరువును కొలిచింది.
దీని కోసం బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) సహాయం తీసుకుంది. కొన్ని దేశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని మజిద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- దిల్లీ అల్లర్లు: నాలుగేళ్లలో వందలాది ఎఫ్ఐఆర్లు, అరెస్టులు... ఎంతమందికి న్యాయం దక్కింది?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














