యుక్రెయిన్ యుద్ధం: రష్యా‌లో ‘లక్షన్నర జీతం’తో ఉద్యోగాలంటూ భారతీయులను ట్రాప్ చేస్తున్న ఏజెన్సీ.. పట్టుకున్న సీబీఐ

సీబీఐ దర్యాప్తు
ఫొటో క్యాప్షన్, ఈ ఏజెంట్ల వల్ల మోసపోయిన 35 మంది బాధితులను గుర్తించామని సీబీఐ తెలిపింది.
    • రచయిత, షెర్లిన్ మోలన్
    • హోదా, బీబీసీ న్యూస్, ఢిల్లీ

ఉద్యోగాల పేరిట ప్రజలను రష్యాకు తరలించి, బలవంతంగా అక్కడి సైన్యంలో పనిచేయిస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వెల్లడించింది.

సోషల్ మీడియా వేదికగా ‘రష్యాలో ఉద్యోగాలు’ అనే ప్రకటనలతో వీరు ప్రజల్ని ట్రాప్ చేస్తున్నారని తెలిపింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ఏజెంట్ల నెట్‌వర్క్‌ బారిన పడిన 35 మంది బాధితులను గుర్తించామని సీబీఐ తెలిపింది.

సీబీఐ విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఏజెంట్లు 'వ్యవస్థీకృత నెట్‌వర్క్‌'గా విస్తరించి ఈ రాకెట్ నడిపిస్తున్నారని తెలిపింది.

యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదికలు, స్థానికంగా ఉన్న పరిచయాల ద్వారా ‘రష్యాలో మంచి ఉద్యోగాలు’ ఇప్పిస్తామని అమాయకులైన యువకులను మోసం చేస్తున్నారు.

రష్యాలో భారతీయుడి మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో రష్యాలో ఉద్యోగాలు అని ప్రకటనలు ఇచ్చి, ప్రజల్ని మోసగిస్తున్న రాకెట్‌ను గుర్తించింది సీబీఐ.

నెలకు లక్షన్నర జీతమని చెప్పి..

నెలకు రూ.1.5 లక్షల జీతంతో ఉద్యోగాలని యూట్యూబ్‌ చానల్‌లో వచ్చిన ప్రకటనను నమ్మి, తాను రష్యాకు వచ్చినట్లు మాస్కోలో ఉన్న ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

“ఆర్మీలో పనిచేయాలని వారు మాకు చెప్పలేదు” అని ఆయన తెలిపారు.

ఇటీవల, రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయులు మరణించారు. వీరిలో హైదరాబాద్‌ యువకుడు మహమ్మద్ అస్ఫాన్ ఒకరు.

వీరు ఉద్యోగాల పేరిట రష్యాకు వెళ్లి, సైన్యంలో చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, రంగంలోకి దిగిన భారత అధికారులు ఈ ఏజెంట్ల నెట్‌వర్క్‌ను గుర్తించి, పలువురిని అరెస్ట్ చేశారు.

ఈ ఏజెంట్ల ద్వారా వెళ్లిన భారతీయులకు శిక్షణ ఇచ్చి, వారి ఇష్టానికి వ్యతిరేకంగా రష్యా-యుక్రెయిన్ వార్ జోన్‌లో మోహరిస్తున్నారని సీబీఐ పేర్కొంది. ఈ ఏజెంట్ల వల్ల వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపింది.

రష్యా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సీబీఐ దాడులు, కేసులు

దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి సహా 13 ప్రాంతాల్లో సీబీఐ నిర్వహించిన దాడుల్లో పలు ప్రైవేటు వీసా కన్సల్టెన్సీ సంస్థలు, ఏజెంట్లపై కేసులు నమోదు చేసింది.

ఈ దాడుల్లో నేరానికి పాల్పడినట్లు గుర్తించడంలో కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు రూ.50 లక్షల డబ్బును సీజ్ చేసి, కొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

రష్యా ఆర్మీలో సహాయకుల ఉద్యోగాల కోసం కొంత మంది భారతీయులను నియమించుకున్నట్లు గుర్తించామని అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా తెలిపింది.

వారిని తిరిగి భారత్‌కు రప్పించే విషయమై రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, యుద్ధానికి దూరంగా ఉండాలని భారతీయులందరికీ విజ్ఞప్తి చేసినట్లు చెప్పింది.

రష్యాలో ఉద్యోగాల పేరిట మోసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌కు చెందిన అస్ఫాన్‌కు రష్యా సైన్యంలో హెల్పర్ ఉద్యోగమని చెప్పి, అక్కడి సైన్యంలోకి పంపారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

రష్యా-యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తయి, మూడో ఏడాది ప్రారంభమైంది.

సైనికుల కొరతతో రష్యా ఆర్మీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని చాలా కథనాలు వచ్చాయి.

రష్యా సైన్యంలో భారతీయులను కూడా మోహరించారని కథనాలు వచ్చాయి.

ఇటీవల, ఇద్దరు భారతీయులు యుద్ధంలో మరణించడంతో భారత అధికారులు స్పందించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

ఈ ఏజెంట్ల నెట్‌వర్క్‌లో ఇద్దరు ఏజెంట్లు రష్యాలో ఉండగా, మరో ఇద్దరు భారత్‌లో ఉన్నారు.

ఈ నలుగురు ఏజెంట్లకు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్న ఫైజల్ ఖాన్ దుబాయ్‌కు చెందిన వారు.

ఆయన 'బాబా వ్లాగ్స్' పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు.

ఈ ఏజెంట్లు రష్యాకు 35 మందిని పంపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

2023 నవంబర్ 9న మొదటి బ్యాచ్‌లో ముగ్గురిని చెన్నై నుంచి షార్జాకు పంపారు. అక్కడి నుంచి 12న మాస్కోకు తీసుకెళ్లారు.

ఫైజల్ ఖాన్ బృందం మొదట ఆరుగురు, ఆ తరువాత ఏడుగురిని రష్యాకు పంపినట్లు తెలుస్తోంది.

తమకు సైన్యంలో హెల్పర్స్ ఉద్యోగాలని మాత్రమే చెప్పారని, సైనికుల ఉద్యోగాలని చెప్పలేదని బాధితులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)