బంగారం ధర ఎందుకు పెరుగుతోంది, హైదరాబాద్‌లో రేట్లెలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ స్టోరీ రాసే సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ.66,240గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,720గా ఉంది.
‘‘మా అమ్మాయి పెళ్లేమో ఈ నెలలో పెట్టుకున్నాం. ఒక 10 తులాల వరకు పెడదాం అనుకున్నాం. రేటు చూస్తేనేమో బాగా పెరిగిందంటున్నారు. ఎలా కొనాలో తెలియడం లేదు. కాస్త ఆగుదామా అంటే, పెళ్లి రోజేమో దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ ఇది ఒక మధ్యతరగతి ఇంట్లో పెళ్లి పెట్టుకున్న తల్లి ఆవేదన.
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెట్టుకున్న మధ్య తరగతి వాళ్లకు కొందరికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే, బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి.
వారం రోజుల్లో ఏదో వందా, రెండొందలు కాకుండా.. ఏకంగా రూ.1,500 పైననే ధర పెరిగింది. పైగా భారత్‌లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇది పెళ్లిళ్ల సీజన్.
మార్చిలో, ఆ తర్వాత ఏప్రిల్‌లో కొన్ని ముహుర్తాలున్నాయి. కానీ, పెరిగిన బంగారం ధర పెళ్లిళ్లు పెట్టుకున్నవారిని కంగారు పెడుతోంది.
భారతీయుల పెళ్లిల్లో బంగారమనేది ఒక ముఖ్యమైన భాగం.
మరి ఆ బంగారం కొనాలంటే.. ఇప్పుడు సాధ్యమేనా? అమ్మాయి పెళ్లి ఖర్చును, అప్పును పెంచేస్తుందా అంటే.. పెంచేలాగానే కనిపిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, మన హైదరాబాద్‌లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి? గత వారం రోజుల్లో ఎంత పెరిగాయి? బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణాలేంటి? మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
ధరల పెరుగుదల ఎలా ఉందంటే..
ఈ స్టోరీ రాసే సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.66,240గా, 22 క్యారెట్ల బంగారం రూ.60,720 ఉన్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో పేర్కొంది..
దేశవ్యాప్తంగా చూసుకుంటే, తులం 24 క్యారెట్లబంగారం మార్చి 7 నాటికి రూ.65,049గా పలకగా, 22 క్యారెట్ల బంగారం రూ.59,584 ఉందని ఇండియన్ బులియన్, జ్యువెలర్స్ అసోసియేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. (మార్చి 9 నాటి ధరలు ఇంకా అప్‌డేట్ కావల్సి ఉంది).
మార్చి 1న ఈ ధరలు తులం 24 క్యారెట్ల బంగారం రూ.62,816, అదే 22 క్యారెట్ల బంగారమైతే రూ.57,540 ఉన్నట్లు ఇండియన్ బులియన్, జ్యువెల్లర్స్ అసోసియేషన్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
అంటే వారం రోజుల ధరలను చూస్తే.. బంగారం రూ.1500 పైన పెరిగింది.
ఈ వారం రోజుల్లో మాత్రం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
అప్పటి వరకు తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.61 వేల నుంచి రూ.62 వేలకు అటుఇటుగా పలుకుతూ వస్తుండగా.. ఈ వారంలో మాత్రం రూ.64 వేలకు పైకి చేరుకుని, రూ.65 వేలకు దగ్గరగా ట్రేడవుతోంది.
ఈ ధరలకు జీఎస్టీ, తరగు ఇతరాత్ర చార్జీలను కలపలేదు. ఇక వాటిని కూడా కలిపితే, ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
బంగారం ధరలు పెరిగేందుకు ప్రస్తుతం పలు కారణాలున్నాయి. ప్రధాన కారణం అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే. అమెరికా తన మానిటరీ పాలసీని ఈ ఏడాది చివరిలో కాస్త సడలింపు చేస్తుందనే అంచనాలు బంగారం ధరల ర్యాలీకి దోహదం చేశాయి.
స్పాట్ గోల్డ్ ధర శుక్రవారం ఒక్క ఔన్స్‌కు 2,177.51 డాలర్లు పలికింది.
మార్చి 7న ఈ ధర 2,152 డాలర్ల వద్ద జీవన కాల గరిష్ట స్థాయిలను కూడా తాకినట్లు రాయిటర్స్ రిపోర్టు చేసింది.
యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.9 శాతం పెరిగి 2,185.5 డాలర్లను చేరుకున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన ఈ ధరలు ప్రస్తుతం దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి.
ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఈ ఏడాది చివరిలో రేట్ల కోత ఉంటుందనే సంకేతాలను ఇవ్వడంతో, బంగారానికి అదనంగా డిమాండ్ వస్తుందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘గోల్డ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, దీనికి బుల్లిష్ సెంటిమెంట్ ఉందని న్యూయార్క్‌కు చెందిన ఒక ఇండిపెండెంట్ మెటల్స్ ట్రేడర్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక రాజకీయ టెన్షన్లతో 2024లో బంగార ధర రూ.70 వేలను తాకుతుందని ఇండస్ట్రీ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే రిపోర్టు చేసింది.
ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారితే, రక్షణాత్మక ఆస్తులకు (డిఫెన్సివ్ అసెట్స్) డిమాండ్ పెరగనుందని జీజేసీ చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. దీంతో అంచనాలకు మించి ధరలు పెరుగుతాయని తెలిపింది.
2023లో కూడా 13 శాతం రిటర్నులతో బంగారం అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనం.

ఫొటో సోర్స్, Getty Images
బంగారానికి డిమాండ్ సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే
భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే కార్యక్రమాలలో బంగారం ప్రముఖమైన స్థానాన్ని దక్కించుకుంది.
సాధారణంగా భారత్‌లో వార్షిక బంగారు డిమాండ్‌లో సుమారు 50 శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. బంగారానికి అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉంటుంది.
అయితే, ప్రస్తుతం అత్యధికంగా ఉన్న ధరలతో, జ్యూవెల్లరీ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది.
దీంతో జ్యూవెల్లర్స్ తమ స్టాక్‌ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అంతేకాక, పెళ్లి వేడుకలకు ముహుర్తాలు కూడా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త తక్కువగా ఉన్నాయి. అందుకే, వెడ్డింగ్ రిటైల్ జ్యూవెల్లరీకి కూడా డిమాండ్ తగ్గే అవకాశం ఉందని తన రిపోర్టులో తెలిపింది.
మే నెల ప్రారంభంలో అక్షయ తృతీయ వేడుక ఉండటంతో, రిటైల్ జ్యూవెల్లరీ డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తోంది.
ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా కొనే దేశాల్లో చైనా, భారత్ రెండూ కూడా ప్రముఖమైన స్థానాన్నే సంపాదించుకున్నాయి.

ఫొటో సోర్స్, WGC
2023 క్యూ4లో చైనా వద్ద 2,235.39 టన్నుల బంగారు రిజర్వులుంటే, భారత్ వద్ద 803.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి. గత ఏడాది చైనా అత్యధికంగా తన బంగారు నిల్వలను పెంచుకుంది.
గత ఐదేళ్లుగా భారత్‌లో బంగారం డిమాండ్ 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది.
2024లో ఈ రేంజ్‌ను మించి 800 నుంచి 900 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియన్ ఆపరేషన్స్ సీఈవో పీఆర్ సోమసుందరమ్ చెప్పారని రాయిటర్స్ కథనాన్ని కోట్ చేస్తూ హిందూ బిజినెస్ లైన్ రిపోర్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- 217 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న జర్మన్.. ఆయనకు ఏమైంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














