'డ్రై-ఐస్' తిన్న తరువాత నోట్లోంచి రక్తం పడింది... గురుగ్రామ్ రెస్టారెంట్లో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
హరియాణాలోని గురుగ్రామ్‌లో ఇటీవల మౌత్ ప్రెష్‌నర్ నోట్లో వేసుకున్న ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వివరాలను అనుసరించి, మార్చి 2న ఆరుగురు వ్యక్తులు గురుగ్రామ్‌లోని రెస్టారెంట్‌కు డిన్నర్ చేసేందుకు వెళ్లారు.
భోజనం చేశాక వెయిటర్ వారికి మౌత్ ఫ్రెష్‌నర్ అందించారు. వారిలో ఐదుగురు దానిని నోట్లో వేసుకున్నారు.
ఆ వెంటనే వారి నోటి నుంచి రక్తం రావడం మొదలైంది. నోరంతా మండుతున్నట్లుగా అనిపించిందని వారు ఫిర్యాదు చేశారు.
ఆరో వ్యక్తి తన ఒడిలో బిడ్డ ఉండటంతో ఆ మౌత్ ప్రెష్‌నర్‌ను తీసుకోలేదు. కానీ, మిగిలిన వారు ఇబ్బందులు పడటం చూసి, వారికి ఏమిచ్చారని ఆ వెయిటర్ అడిగారు.
అతడి నుంచి పాలిథిన్ కవర్ ప్యాకెట్‌ను తీసుకుని తమ దగ్గర పెట్టుకున్నారు. ఆ ఐదుగురి ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటనే దగ్గరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్‌కు తమతో తీసుకువచ్చిన పాలిథిన్ ప్యాకెట్‌ను చూపించి, వారికి ఇచ్చిందేంటో చూపించారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ పాలిథిన్ ప్యాకెట్‌లో ఉన్న పదార్థం 'డ్రై ఐస్' చెప్పారు వైద్యులు.
బాధితుల్లో ఒకరైన అంకిత్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. తన ఆరోగ్య సరిగా లేనందున మాట్లాడలేనని అన్నారు. రెస్టారెంట్ యజమాని, మేనేజర్, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 328, 120బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సెక్షన్లపై న్యాయవాది సోనాలి కద్వాస్రా మాట్లాడుతూ, "ఐపీసీలోని సెక్షన్ -328 కింద నేరం చేయాలనే ఉద్దేశంతో విషం మొదలైన వాటి ద్వారా గాయపరచడం వంటి అభియోగాలను నమోదు చేస్తారు. అయితే, 120B సెక్షన్ మాత్రం ఏదైనా నేరానికి పాల్పడే నేరపూరిత కుట్రకు సంబంధించినది'' అని తెలిపారు.
“గురుగ్రామ్ ఘటనలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కానీ, వారి ఉద్దేశం నిరూపించడం కష్టమే. ఈ విషయంపై పోలీసులు సంబంధిత వ్యక్తులతో విచారణ జరిపించాల్సి ఉంటుంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డ్రై ఐస్ అంటే ఏమిటి?
డ్రై ఐస్ అనేది కార్బన్ డయాక్సైడ్ ఘన రూపమని దిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ గుప్తా వివరించారు.
''దీని కనిష్ట ఉష్ణోగ్రత సుమారు -78 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. ఇది వస్తువులను గడ్డకట్టడానికి లేదా చల్లబరచడానికి ఉపయోగిస్తారు, అయితే, ఇది సాధారణ మంచు మాదిరి తడిగా ఉండదు'' అన్నారు.
"సాధారణంగా డ్రై ఐస్ సురక్షితమైనదే. కానీ చర్మంతో తాకినట్లయితే, దాని తక్కువ ఉష్ణోగ్రత కారణంగా అది కోల్డ్ బర్న్ వంటి సమస్యలను కలిగిస్తుంది" అని రాజీవ్ గుప్తా తెలిపారు.
డ్రై ఐస్ చూడటానికి సాధారణ మంచు మాదిరే తెల్లగా కనిపిస్తుందని అనస్తీషియాలజిస్ట్ డాక్టర్ సచిన్ మిట్టల్ అన్నారు.
''నీరు గడ్డకట్టడం ద్వారా సాధారణ ఐస్ తయారవుతుంది, అయితే, డ్రై ఐస్ కార్బన్ డయాక్సైడ్ ఘన రూపం. గాలి, పొగతో ప్రతిచర్య కారణంగా తయారవుతుంది'' అని తెలిపారు.
మాక్స్ హాస్పిటల్‌కు చెందిన ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలోని మెడికల్ అడ్వైజర్ డాక్టర్ అశుతోష్ శుక్లా మాట్లాడుతూ, "సాధారణ ఐస్ కరిగినప్పుడు నీరుగా మారుతుంది, నీటిని వేడిచేస్తే ఆవిరి విడుదలవుతుంది. కాగా, డ్రై ఐస్ కరిగినప్పుడు, నీరు కాకుండా నేరుగా గ్యాస్ రూపంలోకి మారుతుంది. క్లోజ్డ్ రూంలో భారీగా డ్రై ఐస్ ఉంటే, అక్కడున్నవారికి అది హానికరం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెస్టారెంట్‌లో డ్రై ఐస్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది?
గురుగ్రామ్‌లో డ్రైఐస్ తిన్న వారి నోటిలో పుండ్లు ఏర్పడి, రక్తస్రావం అయిందని అశుతోష్ చెప్పారు.
డ్రై ఐస్ పట్టుకుంటే చర్మం కాలిపోతుంది, కాబట్టి గ్లౌజులు ధరించకుండా పట్టుకోరాదని సూచిస్తున్నారు.
''డ్రై ఐస్ చాలా చల్లగా ఉంటుంది, కడుపులోకి ప్రవేశించిన వెంటనే రంధ్రం ఏర్పడుతుంది’’ అని మిట్టల్ చెప్పారు.
''ఇది ప్రాణాంతకం కావచ్చు. దాని గ్యాస్ మనిషి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే, అపస్మారక స్థితికి కారణమవుతుంది. డ్రై ఐస్ ఎంత మేర శరీరానికి హాని కలిగిస్తుందో చెప్పడం కష్టం'' అని మిట్టల్ చెప్పారు.
30 గ్రాముల ఐస్ ముక్క తిన్నా అది శరీరానికి హాని కలిగిస్తుంది, చర్మాన్ని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు.

డ్రై ఐస్ దేనికి ఉపయోగిస్తారు?
ఈరోజుల్లో డ్రై ఐస్ వాడటం ట్రెండ్‌గా మారిపోయిందని మిట్టల్ అంటున్నారు.
రెస్టారెంట్‌లలో ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం పొగ సృష్టించడానికి డ్రై ఐస్ వాడతారు.
అదేవిధంగా వివాహ వేడుకల్లో వధువు లేదా వరుడు ప్రవేశించే సమయంలో పొగ సృష్టించడానికి ఉపయోగిస్తారు.
కానీ డ్రై ఐస్‌ను క్లోజ్డ్ రూంలో వాడితే అక్కడి మనుషుల శరీరంలో ఆక్సిజన్ లోపించి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిని పెంచి అపస్మారక స్థితికి కారణమవుతుంది.
వస్తువులను ఎక్కువ కాలం భద్రపరచడానికి కూడా డ్రై ఐస్ వాడతారు.
డ్రై ఐస్ మంచి 'కూలింగ్ ఏజెంట్' కాబట్టి పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఐస్‌తో ఉష్ణోగ్రతను -30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించవచ్చు, అందుకే ఆహార పదార్థాలను సంరక్షించడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లిక్విడ్ నైట్రోజన్, డ్రై ఐస్
2017లో దిల్లీలోని ఓ వ్యక్తి బార్‌లో లిక్విడ్ నైట్రోజన్ ఉన్న డ్రింక్‌ను అనుకోకుండా తాగినట్లు వార్తలు వచ్చాయి.
ఆయనను ఆసుపత్రికి తరలించగా, కడుపులో పెద్ద రంధ్రం పడినట్లు వైద్యులు గుర్తించారు.
డ్రై ఐస్ మాదిరి లిక్విడ్ నైట్రోజన్ ప్రమాదకరం కానప్పటికీ, అది శరీరంలో త్వరగా శోషితం అవుతుందని, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతేనే హానికరమని డాక్టర్ మిట్టల్ చెప్పారు.
ప్రమాదకరమైన ఉత్పత్తుల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోందని లాయర్ సోనాలి కద్వాసర చెప్పారు.
దీనిని వినియోగదారుల కోర్టులు పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని ఆమె భావిస్తున్నారు.
ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు డ్రై ఐస్, లిక్విడ్ నైట్రోజన్ వాడుతున్నారు. కానీ, పానీయాలు, వంటల్లో వాటిని వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 300 ఏళ్ల క్రితం భారీ సంపదతో సముద్రంలో మునిగిపోయిన యుద్ధ నౌక.. దీని వెలికితీతకు చేపడుతున్న ఆపరేషన్ ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్: భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














