రూపా వైరాప్రకాశ్: మరుగుజ్జువు నువ్వేం చేయగలవంటే.. ఏకంగా పారాలింపిక్స్‌లో బంగారు పతకంతో తిరిగొచ్చారు

- రచయిత, హేమ రాకేశ్
- హోదా, బీబీసీ తమిళ్
చెన్నైలోని వండలూరుకు చెందిన 41 ఏళ్ల రూపా వైరప్రకాశ్ ఎత్తు తక్కువ ఉంటారు. మరుగుజ్జుతనం కారణంగా చిన్నప్పటి నుంచి ఆమెను కొందరు ఆటపట్టించేవారు.
దీంతో రూప 5వ తరగతితో పాఠశాల చదువు ఆపేశారు. అయితే, జీవితం పట్ల ఆమెకున్న అభిరుచుల కారణంగా మిగతా రంగాలపై దృష్టిపెట్టారు రూప.
వికలాంగుల కోసం నిర్వహించిన బోచా క్రీడా పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకున్నారు రూప.
ఈ సందర్భంగా రూప మాట్లాడుతూ.. ‘‘ఈ జన్మలో నేనసలు ఏమీ చేయలేనుకున్నా. ఇంకా ఎక్కువ చదవాల్సి ఉండేదనుకున్నా. కానీ, 'డిఫరెంట్లీ ఏబుల్డ్ బోచా' పోటీల్లో పాల్గొని, బంగారు పతకం సాధించాను. ఆ క్షణం నేను జీవితాంతం బతికేలా ప్రేరణ ఇచ్చింది’’ అని నవ్వుతూ చెప్పారు రూప.

రూప కుటుంబం
రూప కుటుంబంలో ఐదుగురు ఆడపిల్లలు. ఆమె చిన్నమ్మాయి. రూపకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. రూపలో చిన్నప్పటి నుంచి పెరుగుదల లోపం ఉంది.
అయితే ఈ లోపం ఎక్కడా తెలియకుండా తల్లిదండ్రులు చూసుకున్నారని రూప తెలిపారు.
“చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా మా ఇంట్లో వాళ్లు కొనేవారు. నేను ఎక్కడికీ వెళ్లలేనని నాకనిపించేలా వాళ్లు ఎప్పుడూ చేయలేదు. నేను మా ఇంటికి సమీపంలోని పాఠశాలలో 5వ తరగతి వరకు మాత్రమే చదివాను. అప్పుడు నాకు చదువుపై ఆసక్తి లేదు. అక్కడ ఐదో తరగతి వరకే ఉండేది. పాఠశాలలో వికలాంగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ తర్వాత చదువుకోలేకపోయాను’’ అని రూప గుర్తు చేసుకున్నారు.
“నేను నా కజిన్స్‌తో ఉంటున్నా. చాలా రోజులకు చదువు విలువ తెలుసుకున్నా. కజిన్స్ పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు, నేనూ అక్షరాలు చదవడం, రాయడం నేర్చుకున్నా’’ అని రూప చెప్పారు.

సొంతంగానే నేర్చుకుని..
రూప పాఠశాలకు వెళ్లి ఐదో తరగతి వరకే చదివినా, చదువుపై ఆసక్తితో కథలు, పద్యాలు చదివారు. ఆమెకు కంప్యూటర్లంటే ఆసక్తి. అందుకే కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో స్నేహితుల నుంచి నేర్చుకున్నారు రూప. తర్వాత గూగుల్‌లో తనకు కావాల్సిన సమాచారాన్ని వెతికేవారు.
దీనిపై రూప మాట్లాడుతూ.. “ఇంటర్నెట్ నాకు చాలా ఉపయోగపడింది. నా ఎత్తు కారణంగా ఇతరుల సహాయం లేకుండా ఏ పనీ చేయలేను. నా చేతులు, కాళ్లు చిన్నవి కాబట్టి నేను నిలబడి ఉంటేనే కంప్యూటర్ ఆపరేట్ చేయగలను. కాబట్టి నాతో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు” అని తెలిపారు.
“ఇంటర్నెట్‌లో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకొని, గూగుల్‌ని వాడటం ప్రారంభించాను. చిన్న చిన్నగా టైప్ చేస్తూ కావాల్సిన సమాచారం తెలుసుకోవడం ప్రారంభించాను. గూగుల్ ద్వారా షేర్ మార్కెట్ గురించి తెలుసుకున్నా, అందులో కొంత డబ్బు కూడా పెట్టుబడి పెట్టాను’’ అని రూప చెప్పారు.

పారాలింపిక్స్‌లో బంగారు పతకం
ఎప్పుడూ ఇంటర్నెట్‌లో ఏదో ఒకటి వెతికే రూప, దాని ఫలితాలను కూడా సాధించారు.
ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా నడవలేని, పరుగెత్తలేని వికలాంగుల కోసం నిర్వహించే పోటీలను తెలుసుకొని, దానిలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత 2019 పారాలింపిక్ బోచా గేమ్స్‌లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకున్నారు రూప. అనుకున్నది సాధించారు. పోటీల్లో ఆమె జట్టు బంగారు పతకం సాధించింది. ఈ పతకం రూపకు ఎనలేని ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది.
దీని గురించి రూప మాట్లాడుతూ.. ‘‘ఏం చేయగలవు, ఏం సాధించగలవు, నీ జీవితం నాలుగు గోడల మధ్యనే గడిచిపోతుందని చాలామంది అనేవారు. కానీ వాటన్నింటినీ పటాపంచెలు చేయాలనుకున్నా. 'వికలాంగుల బోచా పోటీ'ల కోసం శిక్షణ తీసుకున్నా. నా జట్టు 2019లో బంగారు పతకాన్ని గెలుచుకుంది ”అని రూప చెప్పారు.

జీవితాన్ని మార్చిన స్నేహితుడు
మరుగుజ్జుగా పుట్టినా, ఈ ప్రపంచంలో ఎన్నో సాధించాలి అని రూప చాలాసార్లు అనుకున్నారు. ఒక రోజు వికలాంగుడైన తన స్నేహితుడు మోహన్‌ని కలిశారు.
కండరాల బలహీనత బాధితుల కోసం ఇద్దరూ కలిసి ఒక ఫౌండేషన్ ప్రారంభించారు.
కండరాల బలహీనతతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉన్న మందులు, చికిత్సల గురించి వారి ఫౌండేషన్ ద్వారా అవగాహన కల్పించారు. దీనికోసం వారు రెండు నెలలకోసారి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
“నన్ను చాలా కార్యక్రమాలకు వక్తగా ఆహ్వానిస్తున్నారు. నా జీవితాన్ని ఎలా గడుపుతున్నాను, సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నాను, ఎక్కడికి వెళ్లినా నా జీవితాన్ని, నా చుట్టూ ఉన్న వ్యక్తులను ఎలా సంతోషంగా ఉంచుతాను? అనేది అందరికీ చెబుతాను. చాలామంది మీ స్పీచ్ బాగుందని, మా జీవితానికి మార్గదర్శకమని చెబుతుంటారు’’ అని రూప గర్వంగా చెబుతున్నారు.
“నాకు వివిధ వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వారు తమ జీవితంలోని సమస్యలను నాకు చెబుతారు, ఏం చేయాలో మార్గదర్శకత్వం కోసం నన్ను అడుగుతారు. నాకు తెలిసినవి చెబుతాను. చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది నన్ను చూసి వారి జీవితాలను మార్చుకుంటుండటం చూసి, గర్వపడుతున్నాను” అని రూప చెప్పారు.
తనకు ఎన్నో ఆశయాలు ఉన్నాయని, మరిన్ని ప్రాంతాలకు వెళ్లాలని, ఎక్కువ మందిని కలవాలని కోరుకుంటున్నానని రూప అంటున్నారు.
దానికోసం ప్రతి అడుగును ఆచితూచి, బలంగా వేస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భీమా రివ్యూ: గోపీచంద్‌లో హుషారు తగ్గలేదు.. మరి సినిమాలో ఏం తక్కువైంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- భారత్-థాయిలాండ్ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














