భీమా రివ్యూ: గోపీచంద్‌లో హుషారు తగ్గలేదు.. మరి సినిమాలో ఏం తక్కువైంది?

గోపీచంద్ భీమా సినిమా

ఫొటో సోర్స్, Twitter/Gopichand

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

కమర్షియల్ సినిమాలకి కొత్త కథలు ఉండవు. తెలిసిన కథనే కొత్తగా చెప్పాలి. అదే ఈ జోనర్ విజయరహస్యం.

గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ‘భీమా’ ప్రచార చిత్రాలు చూసినప్పుడు పక్కా కమర్షియల్ సినిమా అని అర్ధమైంది.

అయితే దీనికి ఓ ఫాంటసీ అంశాన్ని జోడించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.

మరి ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా ? పక్కా కమర్షియల్ కొలతలతో వచ్చిన భీమా ప్రేక్షకులని అలరించిందా ?

కర్ణాటకలోని శివాలయం..

అది కర్ణాటకలోని మహేంద్రగిరి. అక్కడో మహిమ గల శివాలయం. చనిపోయిన వారి చివరి కోరిక ధర్మమైనదైతే, వారి కుటుంబ సభ్యులు ఆ శివాలయంలో పూజలు చేస్తే.. ఆ కోరిక తీరుతుంది. కానీ ఓ అనూహ్య ఘటన కారణంగా ఆ గుడిని మూసివేస్తారు.

ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా వస్తాడు భీమా (గోపీచంద్), తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?

ఈ గుడికి భీమాకి ఉన్న అనుబంధం ఏమిటి? ఆ గుడిని భీమా తెరిపించాడా? ఆ ఊర్లో భీమాకి ఉన్న శత్రువులు ఎవరు ? ఇదంతా తెరపై చూడాలి.

భీమా

ఫొటో సోర్స్, Twitter/Gopichand

రౌడీ పోలీస్ పాత్ర ఎలా ఉంది?

సెమీ ఫాంటసీ జోనర్‌లో కథ మొదలౌతుంది. తర్వాత ఓ రౌడీ పోలీస్ కథగా మారిపోతుంది. అయితే ఆ పాత్రని దర్శకుడు తొలి సన్నివేశం నుంచే రొటీన్‌గా చూపించుకుంటూ వెళ్ళాడు.

ఎద్దుపై వచ్చి గూండాలని కొట్టే యాక్షన్ ఎపిసోడ్ అయితే రొటీన్‌కి పరాకాష్ఠగా వుంటుంది. అప్పటివరకూ విలన్ బలంగా చూపించి హీరో ఎంట్రీ సీన్‌తోనే పూర్తి గాలి తీసేసిన తీరు పెద్దగా ఆకట్టుకోదు.

పైగా ఇందులో కథ ఏమిటనేది ఎంతకీ పట్టాలెక్కదు. తొలిసగం ఎలాంటి ఆసక్తిని కలిగించకుండానే సాగిపోతుంది.

దర్శకుడు హీరో పాత్రని మలిచిన తీరు పేలవంగా ఉంది. అరిగిపోయిన భజన హీరోయిజం ఫార్మూల నమ్ముకొని ప్రతి సన్నివేశంలో క్యారెక్టర్ ఆర్టిస్టులతో హీరో పాత్రని పొగుడుతూనే వుంటారు. కాలం చెల్లిన హీరోయిజం ఇది.

ఇందులోని లవ్ ట్రాక్ అయితే మరీ బలహీనం. భీమా, విద్య (మాళవిక శర్మ)ల మధ్య నడిపిన సన్నివేశాలైతే అనవసరం అనిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి అలా పదేపదే నడుం చూసే కార్యక్రమం పెట్టుకోవడం హుందాగా అనిపించదు.

అందులో రొమాన్స్ కాకుండా ఎబ్బెట్టుతనం కనిపించింది.

సినిమా మొదలైన తర్వాత ఎక్కడో చోట సంఘర్షణ మొదలవ్వాలి. అది ప్రేక్షకులని కథలో లీనం చేయాలి. భీమాలో మాత్రం అది కనిపించదు. హీరో పరిచయంతోనే భవాని గ్యాంగ్‌ని కొట్టేసిన తర్వాత తనకి వెకేషన్ అన్నట్టుగా ఫీలై కథతో తనకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు.

తెరపై జరుగుతున్న సన్నివేశాలు సమయాన్ని వృథా చేస్తున్న భావన కలిగిస్తాయి తప్పితే కాలక్షేపం ఇస్తున్న అనుభూతినైతే కలిగించవు.

భీమా

ఫొటో సోర్స్, Twitter/Gopichand

ఫాంటసీ ఎలిమెంట్ కాపాడిందా?

విరామం సమయంలో వచ్చిన యాక్షన్ ఘట్టం భీమా ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచగలిగింది. భీమా పాత్రలో ఓ ట్విస్ట్ వుంది. అది తెరపైనే చూడాలి.

అయితే ద్వితీయార్థంలోని కథలో కూడా పెద్ద బలం కనిపించదు. ఇక భీమా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో సెంటిమెంట్ కూడా పండలేదు.

నిజానికి అదంతా ఒక సాగదీత వ్యవహారంలానే ఉంటుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ బావుంది కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న డ్రామా సరిగ్గా కుదరలేదు. పైగా ఇందులో విలన్ చాలా వీక్.

కథ ఓపెన్ చేస్తే ట్విస్ట్ మిస్ అయిపోతుందని చివరి వరకూ విలన్‌ని రివీల్ చేయలేదు. దీంతో హీరోయిజం ఎలివేషన్ కూడా కుదరలేదు. భీమాలో వున్న ఫాంటసీ ఎలిమెంట్ కూడా ప్రేక్షకులకు అంత థ్రిల్ ఇవ్వదు.

కాంతార స్ఫూర్తితో అలాంటి సూపర్ నేచురల్ ఎలిమెంట్ రాసుకున్నారేమో కానీ అది పేలవంగా వచ్చింది. గుడిలో జరిగే క్లైమాక్స్ అయితే ఓవర్ డ్రమటిక్‌గా ఉంది.

భీమా

ఫొటో సోర్స్, Twitter/Gopichand

గోపీచంద్ కష్టపడ్డాడు కానీ..

భీమా పాత్రలో గోపీచంద్ హుషారుగా కనిపించారు. ఆ పాత్రని వినోదాత్మకంగా మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు. గోపీచంద్ తన వరకూ న్యాయం చేశారు కానీ పాత్రలోనే కొత్తదనం లేకపోవడంతో పడిన శ్రమ వృథా అనిపిస్తుంది.

ఇదివరకే చాలామంది హీరోలు ఇలాంటి రొటీన్ హీరోయిజం పాత్రలని చేశారు. భీమా అందులో ఒకటిగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా అనిపించదు. మాళవిక శర్మ అందంగా వుంది. మొదట్లో ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. చివర్లోనే కథలో భాగమౌతుంది.

ప్రియభవాని శంకర్ పాత్రకి కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. నాజర్ సినిమాలో తన అనుభవాన్ని చూపించారు. రఘుబాబు, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి.. ఇలా కామెడీ బ్యాచ్ ఉనప్పటికీ హాస్యం మాత్రం పుట్టలేదు. నరేష్ పాత్ర కొంత నయం.

భీమా

ఫొటో సోర్స్, Twitter/Gopichand

టెక్నికల్ గా ఎలా వుంది ?

రవి బస్రూర్ పాటలు గుర్తుండవు కానీ నేపథ్య సంగీతాన్ని ఆవేశపూరితంగా చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో నేపథ్య సంగీతం హెవీగా వుంటుంది. కొన్ని సార్లు విజువల్‌ని కూడా డామినేట్ చేస్తుంది. స్వామీ జే గౌడ కెమెరా పనితనం డీసెంట్‌గా వుంది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ బావున్నాయి.

ఎడిటర్ ఫస్ట్ హాఫ్‌లో కొంత ట్రిమ్ చేయాల్సింది. అజ్జు మహాకాళి మాటల్లో మెరుపులు లేవు. కొన్ని కాలం చెల్లిన డైలాగులు కూడా వున్నాయి.

దర్శకుడు ఈ కథని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చెప్పడానికి ప్రయత్నించాడు. అది పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు. రచనలో చాలా బలహీనతలు కనిపించాయి. ఎమోషన్స్, డ్రామా నేచురల్‌గా పడించడంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు గోపీచంద్. భీమా ఆ ఎదురుచూపులని ఇంకా పొడిగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)