స్పానిష్ మహిళపై లైంగిక దాడి: ఝార్ఖండ్‌లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
బ్రెజిల్-స్పెయిన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఒక పర్యాటకురాలిపై సామూహిక లైంగిక దాడి(గ్యాంగ్ రేప్) జరిగిందన్న ఆరోపణలు ఝార్ఖండ్‌లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
28 ఏళ్ల బాధిత మహిళ, తన భర్తతో కలిసి మోటార్‌బైక్‌పై భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో, ఝార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఝార్ఖండ్‌లో మరో సామూహిక లైంగిక దాడి ఘటన రిపోర్టు అయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
పాలం జిల్లా బిష్రాంపూర్ ప్రాంతంలో ఆర్కెస్ట్రా డ్యాన్సర్ సామూహిక లైంగిక దాడి కేసు వచ్చినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ముగ్గురు నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది. 21 ఏళ్ల ఈ బాధితురాలిది ఛత్తీస్‌గఢ్ అని పేర్కొంది.
నిందితులు, బాధితులు ఒకరికి ఒకరు తెలుసని, ఒకే ఆర్కెస్ట్రా గ్రూప్‌లో వారు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారని ఏఎన్ఐ చెప్పింది. మూడో నిందితున్ని కూడా అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
స్పానిష్ మహిళ అత్యాచారం కేసులో కూడా ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు దుమ్కా పోలీసులు తెలిపారు. మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారు.
బాధితురాలి భర్తను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల వివరాలను ఇంకా వెల్లడించలేదు.
‘‘మేం వేగంగా విచారణ చేపట్టాం. జిల్లా యంత్రాంగం వైపు నుంచి బాధితులకు కావాల్సిన సాయమంతా అందిస్తున్నాం. బాధితుల పరిహారం పథకం కింద, వారికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ మొత్తాన్ని బాధితురాలి భర్తకు అందించాం. దీనిపై వేగవంతమైన విచారణ చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొన్ని నెలల క్రితం భారత్‌కు చేరుకోకముందు, స్పానిష్ మహిళ, ఆమె భర్త ఆసియాలో పలు ప్రాంతాలను మోటార్‌బైకుపై పర్యటించారు.
ఝార్ఖండ్‌కు రావడానికి ముందు ఈ జంట భారతదేశంలో చాలా పర్యాటక ప్రాంతాలను సందర్శించింది.
బాధిత మహిళ మార్చి 1న రాత్రి కుర్మాహట్ గ్రామ ప్రధాన రహదారికి సమీపంలో టెంట్ వేసుకొని భర్తతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నిందితులు బాధితురాలి భర్తపై కూడా దాడి చేశారు. అసలు ఏం జరిగిందో తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దంపతులు వివరించారు. బాధిత మహిళ పోస్టు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 2,34,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
‘‘ఏడుగురు వ్యక్తులు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారు మమ్మల్ని కొట్టారు. దోచుకున్నారు’’ అని బాధిత మహిళ స్పానిష్ భాషలో చెప్పారు. నిందితులు తమల్ని కొట్టి, చంపేస్తామని బెదిరించినట్లు కూడా తెలిపారు.
మరో వీడియోలో బాధితురాలి భర్త కూడా మాట్లాడారు. ‘‘నా నోరు నొక్కిపట్టారు. కానీ, నాకంటే నా భార్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలాసార్లు వారు నన్ను హెల్మెట్‌తో కొట్టారు. తలపై రాయితో మోదారు. తను (నా భార్య) జాకెట్ ధరించి ఉండటం మంచిదైంది. అది దెబ్బలను కాస్త ఆపింది’’ అని ఆమె భర్త స్పానిష్‌లో వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్పందనపై చర్చ
దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం భారత్‌లో లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దిల్లీ ఘటన తర్వాత నెలకొన్న ఆందోళనలతో దేశంలో లైంగిక దాడుల చట్టాల్లో మార్పులు వచ్చాయి.
కానీ, ఏటా వేల సంఖ్యలో లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు దేశం మరింత దూరం ప్రయాణించాల్సి ఉందని కార్యకర్తలు చెబుతున్నారు.
ఝార్ఖండ్‌లో కూడా మహిళలపై హింస రోజురోజుకూ పెరుగుతోంది.
ఝార్ఖండ్ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలో రోజుకు నలుగురి కంటే ఎక్కువ మందిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఇక్కడ మొత్తంగా 13,533 లైంగిక దాడి ఘటనలు నమోదయ్యాయి.
దేశంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్న సమయంలో అవాంఛిత లైంగిక ప్రవర్తనలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు మహిళలు చెబుతున్నారు.
ఒక అమెరికా జర్నలిస్ట్ చేసిన పోస్టుపై భారత జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.
భారత్ తనకు నచ్చే ప్రదేశాల్లో ఒకటైనప్పటికీ, తాను ఆ దేశంలో నివసించినప్పుడు లైంగిక వేధింపుల స్థాయి ప్రపంచంలో మరెక్కడా చూడని విధంగా ఉందని ఒక అమెరికా జర్నలిస్ట్ పోస్టు చేశారు. తనకు తెలిసిన మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న పలు ఉదాహరణలను అమెరికా జర్నలిస్ట్ ప్రస్తావించారు.
‘‘ఈ సంఘటనను పోలీసులకు రిపోర్టు చేశారా? మీరు ఒకవేళ రిపోర్టు చేయకపోతే, మీరు కచ్చితంగా బాధ్యతలేని వ్యక్తే’’ అని రేఖా శర్మ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో రాసి, మొత్తం దేశాన్ని కించపరచడం సరికాదన్నారు.
ఈ స్పందనపై సోషల్ మీడియా యూజర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఝార్ఖండ్ బాధిత మహిళ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలపై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వారికి సంఘీభావాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
దుమ్కా ఎస్పీ ఏం చెప్పారు?
ఈ ఘటనపై దుమ్కా ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖెర్వార్ స్పందించారు.
దంపతులను చికిత్స కోసం స్థానిక ఆరోగ్య కేంద్రానికి పెట్రోల్ వ్యాన్‌లో తరలించినట్లు పీతాంబర్ సింగ్ రిపోర్టర్లకు తెలిపారు.
‘‘ఈ జంట పెట్రోలింగ్ టీమ్‌తో స్పానిష్, ఇంగ్లిష్ భాషలలో మాట్లాడింది. తొలుత వారి భాషను మా టీమ్ అర్థం చేసుకోలేకపోయింది. కానీ, దెబ్బలతో కనిపించడంతో, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అని ఆయన చెప్పారు. ఆ తర్వాత తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి బాధితురాలు డాక్టర్లకు చెప్పినట్లు తెలిసిందన్నారు.
‘‘మేం ఇప్పటికే కొందరిని అరెస్టు చేశాం. తమ తప్పును వాళ్లు అంగీకరించారు. ఈ ఘటనకు పాల్పడిన మిగతావారి గురించి కూడా వాళ్లు చెప్పారు. వారిని కూడా పట్టుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ కేసును డీఐజీ పర్యవేక్షిస్తున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు సీఐడీ సాయం కూడా తీసుకుంటున్నాం’’ అని పీతాంబర్ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK
బ్రెజిల్, స్పెయిన్ ఎంబసీలు ఏమన్నాయి?
స్పానిష్ మహిళా, ఆమె భర్త తీవ్రమైన క్రిమినల్ దాడిలో బాధితులయ్యారని భారత్‌లోని బ్రెజిల్ రాయబార కార్యాలయం బీబీసీకి తెలిపింది.
బాధిత మహిళతో, స్థానిక అథారిటీలతో, స్పెయిన్ రాయబార కార్యాలయంతో తాము చర్చలు జరుపుతున్నామని చెప్పింది. ఈ జంట స్పానిష్ పాస్‌పోర్టులను ఉపయోగించి భారత్‌కు వచ్చారని తెలిపింది.
‘‘మానసిక సంరక్షణతో పాటు అవసరమైన సాయాన్ని మేం వారికి అందిస్తామని చెప్పినట్లు స్పానిష్ రాయబారి కార్యాలయం తెలిపింది. కానీ, బాధితులు వారి ఆఫర్‌ను తిరస్కరించారు. ఇప్పటికే భారత్ అత్యవసర సేవల విభాగం నుంచి సేవలు పొందినట్లు తెలిపారు’’ అని బ్రెజిల్ రాయబార కార్యాలయం తెలిపింది. తదుపరి పరిణామాలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొంది.
ఈ విషయంపై స్పందన కోసం బీబీసీ స్పానిష్ రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మహిళలపై జరుగుతున్న హింసకు ముగింపు పలకాలి. దీనికి మనమందరం కట్టుబడి ఉండాలి’’ అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో భారత్‌లోని స్పానిష్ రాయబార కార్యాలయం పోస్టు చేసింది.
బాధిత మహిళ, తన భర్తతో కలిసి మోటార్ సైకిల్‌పై ప్రపంచ యాత్ర చేస్తున్నారు. గత ఐదేళ్లలో వీరు 66 దేశాల్లో 1.7 లక్షల కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించారు. ఆరు నెలల నుంచి వీరు భారత్‌లోనే ఉన్నారు. ఝార్ఖండ్‌కు రావడానికి ముందు వీరు దక్షిణ భారత దేశంలోని పర్యాటక ప్రాంతాలతోపాటు కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లను సందర్శించారు.
తాజా ఘటనపై ఝార్ఖండ్‌లోని చంపాయి సోరెన్ ప్రభుత్వం మీద బీజేపీ విమర్శలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?
- విశాఖపట్నం: ఖరీదైన కెమెరా కోసమే సాయి కుమార్‌ను చంపేశారా, నిందితులను సోషల్ మీడియా ఎలా పట్టించింది?
- బ్రిటన్ సముద్ర జలాల్లో రహస్య జీవి.. ఈ కొత్తజీవికి, చేపల సంఖ్య తగ్గిపోవడానికి సంబంధం ఏమిటి
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














