‘ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, నమస్తే తెలంగాణ విలేఖరులు 25 లక్షలు డిమాండ్ చేయడంతో ముగ్గురు కుమారులకు ఉరేసి, తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు’

ఫొటో సోర్స్, Youtube
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న విలేకరులు ఓ కుటుంబంలోని నలుగురి మృతికి కారణమయ్యారు.
హైదరాబాద్ శివార్లలోని టంగుటూరు గ్రామంలో మార్చి 3వ తేదీన నీరటి రవి అనే వ్యక్తి తన ముగ్గురు కొడుకులకు ఉరేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు న్యూస్ కంట్రిబ్యూటర్లు, ఒక హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు.
కేసును విచారించిన పోలీసులు, ఈ ఆత్మహత్యల వెనుక మల్టీ చెయిన్ పెట్టుబడుల నెట్‌వర్క్, విలేకర్ల వేధింపులు ఉన్నాయని చెప్పారు.
ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వార్త పత్రికల కంట్రిబ్యూటర్లపై పోలీసులు కేసులు నమోదుచేశారు. వారిలో సాక్షి, వార్త కంట్రిబ్యూటర్లను అరెస్టు చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నారని మొకిల ఇన్‌స్పెక్టర్ వీరబాబు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం, ఘటన జరిగిన క్రమం ఇది..
రంగారెడ్డి జల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిని నీరటి రవి, శ్రీలత దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రవికి గుంటూరుకు చెందిన తిరుపతి రావు అనే వ్యక్తితో పరిచయం ఉంది. తిరుపతి రావు విజయనగరానికి చెందిన జీఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ స్కీములో పెట్టుబడి పెట్టి, అందులోనే రవిని కూడా చేర్చాడు.
ఈ మనీ సర్క్యులేషన్ స్కీముల్లో మొదట్లో కొంత డబ్బు కడితే, దానిపై నెల నెలా కొంత మొత్తం తిరిగి ఇస్తుంటారు. పెట్టుబడి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ పెడతారు.
ఆ ప్రకారమే రవికి మొదట్లో కొంత డబ్బు వచ్చింది. దీంతో రవి, తన ఊరి వాళ్లు, పరిచయం ఉన్న వాళ్లతో కూడా డబ్బు పెట్టించాడు. వాళ్లలో చాలామందికి డబ్బులు కూడా వచ్చాయి. తాను డబ్బు కట్టించిన వారి నుంచి డబ్బు వసూలు చేసి రవి తిరుపతిరావుకు పంపితే, తిరుపతి రావు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి తాను కట్టించిన వారికి పంచేవాడు. ఈ వ్యాపారం బావుండటంతో, తన గ్రామంలోనే ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టించే పని ప్రారంభించారు రవి.
అయితే మనీ సర్క్యులేషన్ స్కీములో తేడా వచ్చింది. రవికి తిరుపతి రావు నుంచి డబ్బు రావడం ఆగిపోయింది. దీంతో తన ద్వారా డబ్బు కట్టిన వారంతా రవిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
విలేకరుల ఎంట్రీ...
ఈ విషయం శంకరపల్లి మండల కేంద్రంగా పనిచేసే విలేకర్లుకూ తెలిసింది. వారితో అదే ప్రాంతానికి చెంది హైదారాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి కలిశాడు. ఈ నాగరాజు కూడా రవి దగ్గర పెట్టుబడి పెట్టాడు.
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మంగళి శ్రీనివాస్ (ఏ2), ఈనాడు రిపోర్టర్ కురుమ శ్రీనివాస్ (ఏ3), నమస్తే తెలంగాణ రిపోర్టర్ వడ్డే మహేశ్ (ఏ4), వార్త రిపోర్టర్ సిరిపురం శ్రీనివాస రెడ్డి (ఏ5), సాక్షి రిపోర్టర్ సంకే ప్రవీణ్ కుమార్ (ఏ6), హైదరాబాద్ నగర ఆర్డ్మ్ రిజర్వ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న హోంగార్డు ఆలూరు నాగరాజు (ఏ7), నాగరాజు భార్య మనీలా (ఏ8)లు కలసి రవిని బెదిరించడం మొదలుపెట్టారు.
ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశావని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫంక్షన్ హాల్ కడుతున్నావనీ పేపర్లలో వార్తలు రాస్తామని ఈ విలేకర్లు రవిని బెదిరించినట్టు పోలీసులు చెబుతున్నారు. అంతా కలసి దాదాపు 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. అటు హోంగార్డు నాగరాజు కూడా తాను పెట్టుబడి పెట్టిన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తులు తాకట్టు పెట్టి...
‘‘పత్రికల విలేకర్లు, హోంగార్డు కలసి మీ సంగతి బయట పెడతాం అని బ్లాక్ మెయిల్ చేశారు. రవిని, ఆయన బావమరిదిని కలిపి ఒక చోటకు సెటిల్మెంటు కోసం తీసుకెళ్లి 25 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 10 లక్షలు ఇవ్వడానికి రవి ఒప్పుకున్నాడు. దాంతో తన భార్య మంగళసూత్రాలు సహా ఆస్తి అమ్మి రూ. 2.5 లక్షలు ఇచ్చాడు. రవి ప్లాట్లను హోంగార్డు నాగరాజు తాకట్టు పెట్టించి 20 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో విసుగు చెందిన రవి పిల్లల్ని చంపి, తాను చనిపోయాడు’’ అని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో చెప్పారు.
అయితే, హోంగార్డు నాగరాజు కూడా ఈ స్కీమ్‌లో కొంతమందితో డబ్బులు పెట్టించాడు. వాళ్లు తనను డబ్బు కోసం ఒత్తిడి చేస్తుండటంతో రవిపై ఒత్తిడి చేసి పత్రాలు తాకట్టు పెట్టించినట్టు తెలుస్తోంది.
‘‘రవి డబ్బులు ఇవ్వలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రవి మృతిపై ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం. ఇవి మొత్తం రెండు కేసులు. ఒకటి తండ్రి పిల్లలను చంపిన కేసు. రెండోది తండ్రి ఆత్మహత్యకు పలువురు కారణమయ్యారని కేసు. శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్ కుమార్, నాగరాజులను నిన్న అరెస్టు చేసి రిమాండుకు పంపాం. ఈనాడు, జ్యోతి, నమస్తే రిపోర్టర్లు పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. వాళ్లు ఊళ్లలో లేరు. వాళ్లను పట్టుకోవాల్సి ఉంది’’ అని మొకిల ఇన్‌స్పెక్టర్ వీరబాబు బీబీసీతో చెప్పారు.
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే రవితో భార్య గొడవ పడి వెళ్లిపోయిందనీ, అనంతరం రవి పిల్లలను చంపి, తాను చనిపోయారనీ వివరించారు పోలీసులు.
రవితో డబ్బులు కట్టించిన తిరుపతిరావును ఏ1గా, టంగుటూరుకే చెందిన రామకృష్ణని ఏ9గా చేర్చారు పోలీసులు.
ఇవి కూడా చదవండి:
- CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా?
- అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...
- లంచం తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు లేదన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? 1998 నాటి పీవీ నరసింహారావు కేసుకు దీనికి సంబంధం ఏమిటి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














