Electoral Bonds: మార్చి 15 తరువాత ఏం తెలుస్తుంది, ఈ బాండ్లను సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసింది?

ఫొటో సోర్స్, Getty Images
మార్చి 12న భారత ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించామని పేర్కొంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు దారుల వివరాలు, ఆ మొత్తం, ఆ బాండ్లను ఎన్‌క్యాష్ (నగదుగా మార్చుకోవడం) చేసుకున్న రాజకీయ పార్టీల వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని ఈసీకి పంపినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొంది ఎస్‌బీఐ.
మార్చి 15 సాయంత్రం ఐదు గంటలలోపు ఆ వివరాలన్ని ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది.
మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో విమర్శలు ఎందుకొచ్చాయి?

ఫొటో సోర్స్, Getty Images
మార్చి 15 డెడ్‌లైన్..
దేశంలోని రాజకీయ పార్టీల అపారదర్శక ఆదాయ మార్గాల సమస్యను పరిష్కరించి, 'పారదర్శకంగా నిధుల సమీకరణ'ను చేపట్టేందుకే ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టినట్లుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు.
ఈ పథకం ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తోందని ఆరోపిస్తూ, ఆ సమయంలోనే సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది.
గతనెలలో ఇచ్చిన తుది తీర్పులో ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజకీయ పార్టీలు, సంస్థలకు వచ్చిన నిధుల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఇది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఓటర్ల సమాచార హక్కును ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.
అంతేకాకుండా, గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని మార్చి 6వ తేదీలోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని బాండ్లను జారీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, ఎన్నికల కమిషన్ మార్చి 13 సాయంత్రం 5 గంటలలోగా ఈ వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.
అయితే, వివరాలు సమర్పించేందుకు మరింత గడువు కావాలని, జూన్ 30 వరకు సమయం ఇవ్వాలని కోరుతూ మార్చి 11న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోరిన గడువు ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. మార్చి 12వ తేదీలోగా ఆ వివరాలు ఈసీకి అందజేయాలని ఆదేశించింది.
ఎన్నికల కమిషన్ మార్చి 15 సాయంత్రం 5 గంటలలోగా వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చాల్సి ఉంది.
ఆ ఆదేశాలను అనుసరించి, మార్చి 12న వివరాలు ఈసీకి అందజేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఫొటో సోర్స్, Getty Images
ఐదేళ్లలో 22,217 బాండ్ల విక్రయం..
సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఐదేళ్లలో అంటే... ఏప్రిల్ 1, 2019 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 15, 2024 వరకు 22,217 బాండ్లను జారీ చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
ఏప్రిల్ 1, 2019 నుంచి 11 వరకు 3,346 బాండ్లు జారీ చేయగా, 1609 బాండ్లు ఆయా రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని పేర్కొంది ఎస్‌బీఐ.
ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు 18,871 బాండ్లు జారీ చేసినట్లు తెలిపింది.
మొత్తంగా 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్యలో 22,217 బాండ్లు కొనుగోలు అయ్యాయని, వాటిలో 22,030 బాండ్లను ఆయా రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయని తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, తేదీలు, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారో ఆ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
కొనుగోలు చేసిన ఆ ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకున్న తేదీల వివరాలను, ఈ బాండ్ల రూపంలో విరాళాల పొందిన రాజకీయ పార్టీల పేర్లను కూడా ఎన్నికల సంఘానికి తెలిపినట్లు ఎస్‌బీఐ తన అఫిడవిట్‌లో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వివరాలు బహిర్గతం చేస్తే ఏమవుతుంది?
ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు, బాండ్ల విలువను గోప్యంగా ఉంచేలా వీలు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడిస్తున్న సందర్భంలో పలు వ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, పౌర సమాచార హక్కులకు విఘాతం కల్గించేలా ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉందని పేర్కొంది.
తీర్పు సమయంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, “పౌరులు తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడంలో, రాజకీయ పార్టీల నిధులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఆర్టికల్ 19 (1)(ఏ)కు విఘాతం కల్పిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
“వ్యక్తితో పోలిస్తే, తమ విరాళాల ద్వారా కంపెనీలు ఎన్నికల ప్రక్రియను కంపెనీలు ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఎక్కువ. కంపెనీలు అందించే విరాళాలు పూర్తిగా వ్యాపార లావాదేవీలు మాత్రమే. విరాళాల ద్వారా రాజకీయ పార్టీలకు అందించే ఆర్థిక సహకారం క్విడ్ పో క్రోకు దారి తీసే అవకాశం ఉంది” అన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఎవరెవరు బాండ్లు కొనుగోలు చేశారు? ఎంతకు కొనుగోలు చేశారు? ఏ పార్టీకి ఎన్ని నిధులు అందాయి? అనే వివరాలు పౌరులందరికీ బహిర్గతం చేసినట్లు అవుతుంది.

ఫొటో సోర్స్, AFP
అసలేంటీ బాండ్లు?
దేశంలోని రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓ విధంగా ఈ బాండ్లను ప్రామిసరీ నోట్లుగా కూడా భావించొచ్చు. దేశంలోని పౌరులు లేదా సంస్థలు వీటిని అధీకృత బ్యాంకు నుంచి కొనుగోలు చేసి, వారికి నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా అందజేస్తారు.
ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని భారత ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టింది. 29 జూన్ 2018 నుంచి అమలులోకి వచ్చింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల బాండ్లను జారీ చేస్తుంది. వీటిని జారీ చేయడం ద్వారా వచ్చిన నగదును సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది.
కేవైసీ వివరాలు నమోదు చేసుకుని, బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నవారు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. దాతల వివరాలు ఈ బాండ్లపై ఉండవు.
రూ.1000 నుంచి మొదలుకొని రూ.10 వేలు, రూ.1 లక్ష, రూ. 10 లక్షలు, రూ.1 కోటి వరకు స్టేట్ బ్యాంకుకు సంబంధించిన నిర్ణీత బ్రాంచుల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ల కాలపరిమితి 15 రోజులు మాత్రమే.
రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ (ఆర్పీఏ) ప్రకారం నమోదైన రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల నుంచి నిధులు పొందే అర్హత ఉంటుంది.
సాధారణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓటు బ్యాంకు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలా ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ బాండ్లను ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో అందుబాటులో ఉంచుతారు. దీనితోపాటు లోక్‌సభ ఎన్నికల సమయంలో మరో 30 రోజులు అదనపు గడువును ఇస్తారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?
- విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- బూతు కామెంట్లు, బాడీ షేమింగ్, ఫోటోల మార్ఫింగ్, మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














