భారత్-దివ్యాస్త్ర: చైనా నగరాలను టార్గెట్ చేయగల ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి?

భారత మిస్సైల్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అగ్ని -5 క్షిపణి ప్రయోగం

ఒకేసారి అనేక వార్‌హెడ్లను మోసుకుపోయి అనేక టార్గెట్లను ఛేదించగల సామర్థ్యం ఉన్న అగ్ని -5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్టు భారత్ ప్రకటించింది. దీనిని మిషన్ దివ్యాస్త్రగా పిలుస్తున్నారు. ఒడిశాలోని డాక్టర్ అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీనిని ప్రయోగించారు.

అగ్ని-5ను మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ (ఎంఐఆర్‌వి ) సాంకేతికతతో తయారుచేశారు. ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే ఈ సాంకేతికత ఉంది. ఈ సాంకేతికతతో ఒక్క క్షిపణితోనే సుదూరంలోని బహుళ లక్ష్యాలను చేధించవచ్చు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదికగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

‘‘ఎంఐఆర్‌వి టెక్నాలజీతో దేశీయంగా అగ్ని-5 మిస్సెల్, మిషన్ దివ్యాస్త్రను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల తీరు గర్వకారణం’’ అని ప్రధాని సోషల్ మీడియాలో రాశారు.

భారత మిస్సైల్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అగ్ని 5

ఏమిటీ ఎంఐఆర్‌వి టెక్నాలజీ?

అగ్ని-5 క్షిపణి పరిధి 5వేల కిలోమీటర్లు. అంటే దీనర్థం ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలదని.

భారత దీర్ఘకాలిక భద్రతా అవసరాల దృష్ట్యా అగ్ని -5 ఎంతో కీలకమని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

చైనా ఉత్తరభాగం, యూరోప్‌లోని కొన్ని భాగాలతోపాటు ఆసియా ప్రాంతం మొత్తం అగ్ని -5 పరిధిలో ఉంటుంది. గతంలొ అగ్ని సిరీస్‌లో 1 నుంచి 4వరకు ఉన్న క్షిపణుల లక్ష్య ఛేదనా సామర్థ్యం 700 నుంచి 3500 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉండేది.

తాజాగా రూపొందించిన అగిన -5లో పొందుపరిచిన సెన్సర్లు ఎలాంటి అవాంతారాలు లేకుండా లక్ష్యాన్ని చేరుకోగలవు.

1990 నుంచే భారత్ అగ్ని క్షిపణులను ప్రయోగిస్తూ ఎప్పటికప్పుడు ఆధునికంగా తయారుచేస్తోంది.

ఎంఐఆర్‌వి టెక్నాలజీ 50 ఏళ్ళ కిందటే అందుబాటులోకి వచ్చినా కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ సాంకేతికతను అందిపుచ్చుకోగలిగాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఇప్పటిదాకా ఈ సాంకేతికత కలిగిన దేశాలు రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, యూకే మాత్రమేనని ఆ కథనం తెలిపింది.

అగ్ని-5 అణ్వాయుధాలను కూడా మోసుకుపోగలదు.

పాకిస్తాన్ కూడా ఇటువంటి క్షిపణి వ్యవస్థ తయారీ కోసం ప్రయత్నిస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఈ తరహా వ్యవస్థ ఉందా లేక అందుకోసం ప్రయత్నిస్తోందా అనే సందేహాలు ఉన్నాయి.

అయితే ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం అంత తేలికైన పనికాదని ఆర్మ్స్ కంట్రోల్, నాన్ ప్రొలిఫరేషన్ (ఎన్ఐఆర్‌వి) తెలిపింది. అందుకే అన్ని దేశాలు దానిని అభివృద్ధి చేయలేకపోతున్నాయని పేర్కొంది.

ఈ సాంకేతికత అభివృద్ధి కోసం పెద్ద పెద్ద క్షిపణులు, చిన్న వార్ హెడ్స్, సరైన మార్గదర్శకత అవసరమని తెలిపింది.

1970లో అమెరికా ఎంఆర్ఐవి సాంకేతికను సాధించింది. తరువాత అప్పటి సోవియట్ యూనియన్ దీనిని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ఈ క్లబ్‌లో ఇండియా కూడా స్థానం సంపాదించింది.

భారత మిస్సైల్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్

అగ్ని క్షిపణి పరీక్షలు

అగ్ని -5ను 2012 నుంచి అనేకసార్లు విజయవంతంగా ప్రయోగించినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది. తొలుత 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగల అగ్ని-1 క్షిపణి నుంచి ఇప్పుడు 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీయగల సామర్థ్యమున్న అగ్ని-5ను రూపొందించారు.

జూన్ 2021లో డీఆర్‌డీఓ విజయవంతంగా అగ్ని-పి ని పరీక్షించింది. దీని పరిధి వెయ్యి నుంచి 2000 కిలోమీటర్లు. ఈ మిస్సైల్ ను రోడ్డు మీద నుంచైనా, లేదంటే రైల్వే ఫ్లాట్‌ఫామ్ నుంచైనా ప్రయోగించవచ్చు.

అగ్ని-5 క్షిపణిని అభివృద్ధి చేస్తామని భారత్ 2007లో ప్రకటించింది. 2012లో అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించారు. దీని తరువాత తాము ఎంఐఆర్‌వి టెక్నాలజీపై పని చేస్తామని అప్పటి డీఆర్‌డీఓ డైరక్టర్ జనరల్ వీకే సరస్వతీ ప్రకటించారు. అగ్ని -5 ప్రాజెక్ట్ విజయవంతంలో మహిళా సైంటిస్టులు కీలక పాత్ర పోషించారు.

ఇప్పటిదాకా భారత రక్షణ దళాల వద్ద 700 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల అగ్ని -1, అగ్ని -2 (2వేల కిలోమీటర్లు), అగ్ని -3 (2500 కిలోమీటర్లు), అగ్ని -4 (3500 కిలోమీటర్లు ) ఉన్నాయి.

పాకిస్తాన్ లాంటి లక్ష్యాలను ఛేదించడానికి భారత్ వద్ద ఉన్న పాత అగ్నిక్షిపణులు సరిపోతాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.

భారత మిస్సైల్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2023లో బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా పీఎం మోదీ, జింగ్‌పింగ్

భారత్‌కు ప్రయోజనమేంటి?

అగ్ని -5 ద్వారా చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని భారత్ భావిస్తోంది. ఎంఐఆర్‌వి టెక్నాలజీతో భారత్ కొన్ని ప్రయోజనాలు సాధించాలని చూస్తోందని పరిశోధకులు జాషువా టీ వైట్, కైల్ డీమింగ్ అభిప్రాయపడినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

చైనా నగరాలను లక్ష్యంగా చేసుకోగల భూతల క్షిపణులు ఇండియా వద్ద పరిమితంగా ఉన్నాయి. అగ్ని 5 ఆ సమస్యకు చెక్ పెడుతుందని ఇండియా భావిస్తోంది.

చైనా లేదా మరే దేశమైనా బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరిస్తే దానికి సమాధానంగా అగ్ని-5 పనిచేస్తుందని భావిస్తున్నారు. సముద్ర ఆధారిత న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్స్ (ఎస్ఎస్‌బిఎన్ఎస్) విషయంలో చైనా భారత్ కంటే చాలా ముందుంది.

‘‘చైనాను నిరోధించగల సామర్థ్యం ఉందనే విషయాన్ని చూపడానికి భారత్ ఎంతో కష్టపడింది. అనేక చైనా లక్ష్యాలు ఇండియాకు సుదూరంగా ఉన్నాయి. అగ్ని -5 ఈ సమస్యను తీర్చి, లక్ష్యాలను ఛేదించడానికి సహాయపడుతుంది. పైగా పాకిస్తాన్ మిలటరీ సామర్థ్యానికి ఎంఐఆర్‌వి టెక్నాలజీతో రూపొందించిన అగ్ని-5 క్షిపణి ఒక సమాధానమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెనీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రిస్టోఫర్ క్లియరీ అభిప్రాయపడినట్టు ది హిందూ వార్తా పత్రిక తెలిపింది.

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘అగ్ని -5 విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఇండియా న్యూక్లియర్ సామర్థ్యం పెరిగింది. మరోపక్క ఇతరులు ప్రయోగించే క్షిపణులను నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ’’ అని రాశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)