ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?

ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ రెజ్లర్, నటుడు జాన్ సీనా ఆస్కార్ అవార్డుల వేడుకల వేదికపై ఇలా కనిపించారు

లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక ‘ఓపెన్‌హైమర్‌’ సినిమా బృందానికి చాలా ప్రత్యేకమైనది.

మొదటి అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ ప్రొఫైల్ నేపథ్యంగా బ్రిటిష్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. యూఎస్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అవార్డులనే ఆస్కార్ అవార్డులుగా పిలుస్తారు.

ఓపెన్‌హైమర్ చిత్రం 13 నామినేషన్లలో నిలిచింది. ఉత్తమ సినిమా కేటగిరీలోనే కాకుండా ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ ఫోటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్‌ట్రాక్ విభాగాల్లో ఓపెన్‌హైమర్ చిత్రం విజేతగా నిలిచింది.

ఓపెన్‌హైమర్ సినిమాకు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ అందుకున్న తొలి ఐరిష్ నటుడిగా సిలియన్ మర్ఫీ నిలిచాడు.

‘‘నేను ఆనందంలో మునిగి తేలుతున్నా. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్న అందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నా’’ అని ఆస్కార్ వేదికపై సిలియన్ మర్ఫీ అన్నారు.

1960లో ‘బెన్-హర్’ చిత్రం తర్వాత బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీల్లో ఆస్కార్ అందుకున్న తొలి చిత్రంగా ఓపెన్‌హైమర్ నిలిచింది.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపైకి రెజ్లర్, నటుడు జాన్ సీనా ఒంటిపై దుస్తుల్లేకుండా రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఆయన ఎందుకు ఇలా చేశారు?

ఈ అంశం సహా ఆస్కార్ వేడుకల్లో ఐదు విశేషాలను ఇక్కడ చూద్దాం.

జాన్ సీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాన్ సీనా

1. జాన్ సీనా ఎందుకు ఇలా చేశారు?

1974 లో ఫోటోగ్రాఫర్, కళాకారుడు రాబర్ట్ ఒపెల్ పూర్తిగా నగ్నంగా వేదికపైకి రావడం అకాడమీ వేడుకల చరిత్రలో మరిచిపోలేని క్షణాలలో ఒకటి.

బ్రిటిష్ నటుడు డేవిడ్ నివెన్ తన చేతులతో విజయ సంజ్ఞ చేస్తూ నడుస్తున్నపుడు ఆయన వెనుక ఒపెల్ నడుస్తున్న ఫోటో వైరల్‌గా మారింది.

అలాంటి సీన్ ఈ ఆదివారం ఆస్కార్ స్టేజీపై పునరావృతం అయ్యింది.

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు ప్రకటించడానికి రెజ్లర్, నటుడు జాన్ సీనా స్టేజీపైకి నగ్నంగా వచ్చేశారు. ఆయన చెప్పులు మాత్రమే ధరించారు. విజేత పేరుతో ఉన్న కవరును కొద్దిగా అడ్డుపెట్టుకున్నారు.

వాస్తవానికి, రెండు నెలల క్రితం కాస్ట్యూమ్ డిజైనర్లు పనికి తగ్గ జీతాల కోసం ఒక క్యాంపెయిన్ నడిపారు. "మేం లేకపోతే మీరు నగ్నంగా కనిపిస్తారు" అనేది కాస్ట్యూమర్స్ యూనియన్ క్యాంపెయిన్ నినాదం.

జాన్ సీనా వేదికపైకి ఇలా రావడం దానినే గుర్తు చేస్తోంది.

వెరైటీ మ్యాగజైన్‌ ప్రకారం కాస్ట్యూమ్ రంగంలోని వ్యక్తులు తక్కువ వేతనం పొందుతున్నారు. దీంతో సమాన వేతనం కోసం వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మా స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పూర్ థింగ్స్ సినిమాకు ఉత్తమ నటి కేటగిరీలో ఎమ్మా స్టోన్ ఆస్కార్ అందుకున్నారు

2. ఎమ్మా స్టోన్: చిరిగిన డ్రెస్‌తో రెండో ఆస్కార్

ఉత్తమ నటి కేటగిరీ అవార్డు ప్రకటన సందర్భంగా ఒక అనుకోని ఘటన జరిగింది.

పూర్ థింగ్స్ సినిమాలో నటించిన ఎమ్మా స్టోన్ (35) ఈ ఏడాది ‘ఉత్తమ నటి’గా ఎంపికయ్యారు. ఇంతకుముందు ‘‘లా లా ల్యాండ్’’ సినిమాలో కూడా ఆమె ఇదే కేటగిరీలో ఆస్కార్‌ అందుకున్నారు.

అవార్డు తీసుకునేందుకు ఆమె స్టేజీపైకి వచ్చారు. వేదిక మీదకు వస్తున్నప్పుడే తాను ధరించిన డ్రెస్‌లో ఏదో లోపం తలెత్తినట్లుగా ఆమె గుర్తించారు. తీరా చూస్తే వెనుక భాగంలో ఆమె డ్రెస్ చిరిగిపోయింది. అక్కడే ఉన్న సహనటీమణులు ఆమెకు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆమె అలాగే అవార్డును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

‘‘ఇది నా కష్టం మాత్రమే కాదు. జట్టు సమష్టి కృషికి నిదర్శనం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

వేదిక నుంచి కిందకు దిగబోతుండగా ఆమె ప్రేక్షకులను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు.

‘‘దయచేసి వెనుక నుంచి నా దుస్తుల్ని చూడకండి’’ అని ఆమె అన్నారు.

ర్యాన్ గోస్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

3. బార్బీ పాటకు కెన్ స్టెప్పులు

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన ‘‘ఐయామ్ జస్ట్ కెన్’’ పాటకు వేదికపై ర్యాన్ గోస్లింగ్ ప్రదర్శన ఇవ్వడం ఆస్కార్ విశేషాల్లో ఒకటి.

బార్బీ సినిమాలోని ఈ పాటకు ర్యాన్ గోస్లింగ్‌తో పాటు 65 మంది డ్యాన్సర్లు కలిసి ప్రదర్శన ఇచ్చారు.

ఈ ప్రదర్శనలో బార్బీ సినిమాలోని పాటతో పాటు ప్రఖ్యాత నటి మార్లిన్ మన్రో ‘‘మెన్ ప్రిఫర్ బ్లాండ్స్’’ పాటకు కూడా స్టెప్పులు వేశారు. దీంతో అతిథులంతా చప్పట్లతో ప్రశంసించారు.

మరో ఆశ్చర్యకర అంశం ఏంటంటే, పాట చివర్లో గన్స్ ఎన్ రోజెస్ బ్యాండ్‌కు చెందిన గిటారిస్ట్ స్లాష్ ప్రదర్శన. ఇది ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

అయితే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ అవార్డు ‘‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్’’ పాటకు దక్కింది. అమెరికా సింగర్ బిల్లీ ఎల్లిష్ ఈ పాటను పాడారు.

ఈ అవార్డుతో రెండు ఆస్కార్లు గెలిచిన అతిచిన్న వయస్కురాలిగా ఎల్లిస్ చరిత్ర సృష్టించారు.

రాబర్ట్ డౌనీ జూనియర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ డౌనీ జూనియర్

4. రాబర్ట్ డౌనీ జూనియర్

రాబర్ట్ డౌనీ జూనియర్‌కు ఆస్కార్ రావడం మరో విశేషం. ఎందుకంటే ఆయన గత జీవితం వివాదాలకు కేరాఫ్‌. జైలుకు కూడా వెళ్లారు.

కొన్నేళ్లు చికిత్స తీసుకున్న తర్వాత మళ్లీ నటన రంగంలోకి అడుగుపెట్టారు. 'ఎవెంజర్స్' సినిమాలో ఐరమ్ మ్యాన్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

ఒపెన్ హైమర్ చిత్రంలో మిలటరీ మ్యాన్, రాజకీయ నాయకుడైన లూయిస్ స్ట్రాస్ పాత్రలో నటించారు రాబర్ట్ డౌనీ. ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ గెలుచుకున్నారు.

"నేను ఈ అవార్డును నా భయంకరమైన బాల్యానికి, అకాడమీకి, నా భార్య సుసాన్ డౌనీకి అంకితం ఇస్తున్నాను" అని రాబర్ట్ చెప్పారు.

తన భార్య ప్రేమ కారణంగానే జీవితం సరైన మార్గంలో నడిచిందని, ఈ రోజు ఈ స్టేజి మీదకు రాగలిగానని ఆయన చెప్పారు.

బిల్లీ ఎల్లిష్

ఫొటో సోర్స్, Getty Images

5. వాళ్లు రెడ్ పిన్ ఎందుకు ధరించారు?

రెడ్ కార్పెట్‌పై నడిచిన చాలా మంది నటులు వారి ఛాతీ, చేతులపై రెడ్ పిన్ ధరించారు. గాజాలో కాల్పుల విరమణ డిమాండ్‌కు ఈ పిన్ చిహ్నంగా మారింది.

మార్క్ రుఫెలో, రామీ యూసఫ్, సింగర్ బిల్లీ ఎలిష్, దర్శకుడు అవా డువెర్నే వంటి ప్రముఖులు దీనిని ధరించారు.

"గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం మేమంతా పిలుపునిచ్చాం. పాలస్తీనా ప్రజలకు న్యాయం, శాంతిని కోరుకుంటున్నాం” అని రామీ యూసఫ్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో పది వేల మంది పిల్లలు సహా దాదాపు 30,000 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)