యాదాద్రిలో ‘దళిత, బలహీన వర్గాల’ మంత్రులకు అవమానం జరిగిందా...ఈ వివాదంపై భట్టి విక్రమార్క ఏమన్నారు?

ఫొటో సోర్స్, Twitter/RS Praveen Kumar
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు.
భట్టి విక్రమార్క దళితుడు కావడంతోనే అలా కింద కూర్చోబెట్టారని బీఆర్ఎస్, బీఎస్పీలు సోషల్ మీడియాలో విమర్శలు చేశాయి.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దళిత, బలహీన వర్గాల వ్యక్తులకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే, భట్టి విక్రమార్క తనను కావాలని కింద కూర్చోబెట్టారంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Revanthreddy
అసలేం జరిగింది?
సీఎం రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీతతో కలిసి మార్చి 11 ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. సీఎం దంపతులకు ఆలయ పూజారులు స్వాగతం పలికి, ఆలయంలో పూజలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ కూడా యాదాద్రికి వెళ్లారు. ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించే క్రమంలో ఆలయం లోపల సీఎం, మంత్రులు కూర్చోనేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు ఎత్తయిన పీటలు (స్టూళ్లు) వేశారు.
వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతోపాటు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరోవైపు కూర్చోన్నారు.
కోమటిరెడ్డి పక్కన మరో తక్కువ ఎత్తున్న పీటపై భట్టి విక్రమార్క కూర్చున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్న వైపు మరో తక్కువ ఎత్తున్న పీటపై కొండా సురేఖ కూర్చున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత పక్కన సీట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కూర్చోవాలి. అయితే.. అలా జరగలేదు.
బీఆర్ఎస్ ఏమన్నది ?
బీఆర్ఎస్ పార్టీ తన ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్ లో ఘటనకు సంబంధించిన వీడియోలు షేర్ చేసింది.
‘‘యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని, బహుజన బిడ్డ కొండా సురేఖను ఘోరంగా అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో.. వారు పైన కూర్చోని భట్టి విక్రమార్క, కొండా సురేఖలను కింద కూర్చోబెట్టి అవమానించిన రేవంత్ రెడ్డి, సహచర మంత్రులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.’’ అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
క్షమాపణలు చెప్పాలి: కల్వకుంట్ల కవిత
ఈ విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నల్గొండలో మీడియాతో మాట్లాడారు.
‘‘యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి గారిని, మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారు. వాళ్ళను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు కవిత.
మరోవైపు, దీనిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు.
‘‘ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు దుర్మార్గం. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పైన కూర్చున్నారు. వీళ్ల కాళ్ల వద్ద డిప్యూటీ సీఎంగా ఉన్న దళిత వర్గాలకు చెందిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. వాళ్ల కాళ్ల దగ్గర కూర్చున్నారు. అలాగే బలహీన వర్గాలకు చెందిన మంత్రి కొండా సురేఖ వాళ్ల కాళ్ల దగ్గర కూర్చున్నారు. యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలను అమానించారు. సాక్షాత్తుగా దేవుడి వద్దనే దళిత, బడుగు బలహీనవర్గాలకు అవమానం జరిగితే.. ఎవరికిపోయి చెప్పుకోవాలి..’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దేవుడి సాక్షిగా అవమానం: బీఎస్పీ
ఈ వ్యవహారం బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో స్పందించారు.
‘‘దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం.. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం..’’ అంటూ భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ట్వీట్ పై భిన్న వాదనలు వ్యక్తమయ్యాయి. కొందరు కాంగ్రెస్ పార్టీని, భట్టి విక్రమార్కను అవమానించారంటూ కామెంట్ చేయగా...మరికొందరు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవమానాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు స్పందించలేదంటూ ఆరోపించారు.
‘‘దళిత ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంచనాలతో అంత్యక్రియలు చెయ్యనప్పుడు నీకు గుర్తుకి రాలే అవమానం.. ఇప్పుడు వచ్చిందా? కోమటిరెడ్డి, ఉత్తమ్ నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రులు.. భట్టి గారు ఖమ్మం కి చెందినవారు. దేవుళ్ళ దగ్గర రాజకీయం ఏంది?’’ అంటూ కాంగ్రెస్‌కు చెందిన వరుణ్ ట్వీట్ పెట్టారు.
మరోవైపు, భట్టి విక్రమార్క ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కింద కూర్చున్న ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ ‘కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం’ అని తెలంగాణ సీఎం సీపీఆర్వో అయోధ్యరెడ్డి రాశారు.

ఫొటో సోర్స్, AyodyaReddyBoreddy/FB
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఉష దాసరి ఎక్స్ హ్యాండిల్ లో స్పందించారు. దళితులను మచ్చిక చేసుకోవడం ద్వారా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ వీడియోను ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘కావాలని చేసింది కాదు’: భట్టి విక్రమార్క
అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ లో సింగరేణి గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడారు.
తాను ఎవరికో తలవంచివాడిని కాదని, ఎవరో పక్కన కూర్చోపెడితే కూర్చునేవాణ్ని కాదని స్పష్టం చేశారు.
‘‘యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆశీర్వచనం తీసుకునే క్రమంలో కావాలనే కింద కూర్చున్నాను. అక్కడ ఉన్న చిన్న పీటపై కూర్చున్నాను. ఆ ఫొటోను తీసుకుని రాష్ట్రంలో చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. వారందరికీ సహృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. నిజమే.. అలా చూసి మీ మనసు కష్టపడి ఉండొచ్చు. కానీ, ఇది ఎవరో కావాలని చేసింది కాదు.’’ అని చెప్పారు.
మరోవైపు బీఆర్ఎస్, బీఎస్పీలు కలిసి భట్టి విక్రమార్కపై అతి ప్రేమ చూపిస్తున్నారని, అది తమకు అక్కర్లేదని మాజీ ఎంపీ, భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి అన్నారు.

ఫొటో సోర్స్, facebook/Bhatti Vikramarka Mallu
యాదాద్రి ఆలయ అధికారులు ఏమన్నారు?
ఈ వ్యవహారంపై యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావుతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందనేది సరికాదు. దీన్ని ఆలయ ఈవోగా ఖండిస్తున్నాను. ఇదేమీ కావాలని చేసింది కాదు. ఆ సమయంలో బాగా రద్దీగా ఉంది. అందుకే కొంచెం ఆలస్యమవడంతో విక్రమార్క అటువైపు కూర్చున్నారు. అంతేకానీ, వేరే ఉద్దేశం లేదు, కావాలని చేసింది కాదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, BHATTI VIKRAMARKA MALLU
ఎమ్మెల్సీ నుంచి ఉపముఖ్యమంత్రి వరకు..
మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018, 2023లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2007లో ఎమ్మెల్సీగా పనిచేశారు.
2009-11 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ విప్‌గా పనిచేశారు. 2011-14 మధ్య శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2018 నుంచి 2023 డిసెంబరు వరకు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షనేతగా ఉన్నారు.
గతేడాది డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల బాధ్యతలు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook/Konda Surekha
వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ..
కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో పర్యావరణ, అటవీ, దేవదాయ శాఖల మంత్రిగా ఉన్నారు.
ఆమె 1995లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 జరిగిన ఎన్నికల్లో శాయంపేట నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో శాయంపేట నుంచి రెండోసారి గెలిచారు. ఆ తర్వాత 2004లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అప్పట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైసీపీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్‌లో చేరారు.
2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేసి...మళ్లీ కాంగ్రెస్ చేరి గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- బూతు కామెంట్లు, బాడీ షేమింగ్, ఫోటోల మార్ఫింగ్, మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














