విమానంలో 153 మంది ప్రయాణికులు, నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు, తర్వాత ఏం జరిగిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గింటో
- హోదా, బీబీసీ న్యూస్
ఇద్దరు పైలట్‌లు విమానం నడుపుతూ 28 నిమిషాల పాటు నిద్రలోకి జారుకున్నారు. ఇండోనేషియాలోని సులవేసి నుంచి జకార్తాకు వెళుతున్న 'ఎయిర్‌బస్ A320' విమానంలో ఈ ఘటన జరిగింది.
జనవరి 25న జరిగిన ఈ సంఘటనపై ఇండోనేషియా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
పైలెట్లు నిద్ర పోయిన సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులున్నారు.
రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పైలట్ (32) విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత విశ్రాంతి తీసుకుంటానని తన కో-పైలట్‌కు తెలిపారు. దానికి కో-పైలట్ (28) కూడా అంగీకరించారు.
అయితే, సదరు కో-పైలట్ కూడా అప్పటికే అలసిపోయారు. ఆయన భార్య నెలరోజుల ముందు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లల సంరక్షణలో తీరిక లేకుండా గడిపారు కో పైలట్. దీంతో విమానం నడుపుతూ ఆయన కూడా నిద్రలోకి జారుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత ఏం జరిగింది?
జకార్తాలోని ఏరియా కంట్రోల్ సెంటర్ విమానాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించింది. పైలెట్ల నుంచి సమాధానం రాలేదు.
28 నిమిషాల తర్వాత పైలెట్ నిద్ర లేచారు. అయితే అప్పటికే తన కో- పైలెట్ కూడా నిద్రిస్తున్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు విమానం సరైన మార్గంలో వెళ్లడం లేదనీ గమనించారు.
అనంతరం జకార్తా నుంచి వచ్చిన కాల్స్‌కు స్పందించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా దించారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానయాన సంస్థ ఏమంటోంది?
కాగా, అంతకుముందు ఇద్దరూ విమానం నడపడానికి ఫిట్‌గా ఉన్నారని విమానయాన సంస్థ వైద్య పరీక్షలు నిర్ధారించిన తర్వాతే వారు విధుల్లోకి వచ్చారు. పరీక్షల్లో వారి బ్లడ్ ప్రెజర్, హార్ట్‌బీట్ రేటు సాధారణంగానే ఉందని, ఆల్కహాల్ తీసుకోలేదని తేలింది.
పైలట్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్లు కనిపించినప్పటికీ, దాని నిద్ర తీవ్రత నిర్ధరణ పరీక్షలు విఫలమయ్యాయని విమానయాన నిపుణులు ఆల్విన్ లై బీబీసీకి తెలిపారు.
ఉద్యోగుల అలసత్వంపై 'బాటిక్ ఎయిర్' విమానయాన సంస్థను అధికారులు మందలించారు.
బాటిక్ ఎయిర్ సంస్థ తమ సిబ్బంది విశ్రాంతి సమయంపై మరింత శ్రద్ధ వహించాలని ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ హెడ్ ఎం క్రిస్టి ఎండా ముర్ని సూచించారు.
కాగా, తగినంత విశ్రాంతి విధానంతో పనిచేస్తున్నామని, అన్ని భద్రతా సిఫారసులను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని బాటిక్ ఎయిర్ వేస్ సంస్థ ప్రకటించింది.
బాధ్యులైన పైలెట్, కో పైలెట్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.
2019 నవంబర్‌లో ఇదే విమానయాన సంస్థకు చెందిన విమానం ప్రయాణిస్తుండగా పైలట్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఆ రోజు విమానంలో 148 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- బైజూస్: ఒకప్పటి అత్యంత విలువైన స్టార్టప్ అప్పులకుప్పగా ఎలా మారింది
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- 217 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న జర్మన్.. ఆయనకు ఏమైంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















