బైజూస్: ఒకప్పటి అత్యంత విలువైన స్టార్టప్ అప్పులకుప్పగా ఎలా మారింది

బైజు రవీంద్రన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బైజూస్ రవీంద్రన్
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌లో ఒకటైన బైజు రవీంద్రన్ కంపెనీ బైజూస్ 2018లో యూనికార్న్ సంస్థల జాబితాలో చేరింది.

కరోనావైరస్ సంక్షోభంలో స్కూళ్లు మూతపడటంతో, బైజూస్ విపరీతంగా పెట్టుబడులను ఆకర్షించి తన వ్యాపారాలను భారీగా విస్తరించింది.

కానీ, ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బలతో ఈ కంపెనీ ఒక్కసారిగా చతికిలపడింది.

2018 నాటికి 1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో బైజూస్ యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ గల సంస్థలు)గా చరిత్ర సృష్టించింది.

అయితే, 2021లో 327 మిలియన్ల డాలర్లు (రూ.2.70 లక్షల కోట్లు) నష్టాలను సంస్థ చూసింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 17 రెట్లు ఎక్కువ. అప్పటి నుంచి వరుస వైఫల్యాలను సంస్థ మూట కట్టుకుంటూనే ఉంది.

ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు (1.82 లక్షల కోట్లుగా)గా ఉన్న కంపెనీ విలువను ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ 1 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.8,266 కోట్లకు) తగ్గించేసింది.

బైజూస్ కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

కంపెనీ సీఈఓగా రవీంద్రన్ తొలగింపు

గత నెల 23న బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్(టీ అండ్ ఎల్) నిర్వహించిన ఈజీఎంలో మెజార్టీ వాటాదారులు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించాలని ఓటేశారు. నిర్వహణ లోపం, వైఫల్యాల ఆరోపణలపై ఆయన్ను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే, ఈ ఆరోపణలను రవీంద్రన్, ఆయన కుటుంబం కొట్టివేసింది. అంతర్గత కంపెనీ చట్టాలను ఈ సమావేశం ఉల్లంఘించిందని, కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టర్ ఈజీఎంలో ఉండాలని చెప్పింది.

ఆ తర్వాత ఉద్యోగులకు రాసిన లేఖలో, ఈ సమావేశం హాస్యాస్పదంగా ఉందని, దీన్ని కోర్టులో సవాలు చేయనున్నట్టు తెలిపింది.

రోడ్డున పడ్డ వేలాది మంది ఉద్యోగులు

ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈజీఎంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది కర్నాటక హైకోర్టు.

ఇటీవల కాలంలో ఈ ఎడ్‌టెక్ కంపెనీకి న్యాయ, ఆర్థికపరమైన సవాళ్లు పెద్ద ఎత్తున పెరిగాయి.

గత ఏడాది కాలంలోనే, కంపెనీ అప్పులు కుప్పలుగా పేరుకు పోయాయి. కంపెనీ ఇన్వెస్టర్లు సైతం అసంతృప్తిగా ఉన్నారు.

అప్పులిచ్చిన వారు సైతం కోర్టుల్లో దావాలు వేశారు. దేశీయ ఆర్థిక నేరాల విభాగం సైతం ఈ కంపెనీ కార్యకలాపాలపై విచారణ చేపట్టింది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వేతనాలు ఆలస్యమవుతున్నాయి. నగదు సంక్షోభం కంపెనీని వెంటాడుతోంది.

పలు తుది గడువులు ముగిసిన తర్వాత జనవరిలో రిపోర్టు చేసిన 2022 సంవత్సరానికి చెందిన ఆర్థిక ఫలితాల్లో థింక్ అండ్ లెర్న్ కంపెనీకి 8,230 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు ప్రకటించింది.

2023కి చెందిన ఆడిటెడ్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. డిసెంబర్ తుది గడువునూ ఇది మిస్ అయింది.

బైజూస్‌పై కస్టమర్ల సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. వారు భరించలేని కోర్సులను కొనుగోలు చేయాలని తమపై కంపెనీ ఒత్తిడి తెచ్చిందని అన్నారు.

సోషల్ మీడియాలో సైతం కంపెనీపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలన్ని నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసినవి కంపెనీ కొట్టివేస్తుంది.

రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల యాక్సస్ లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం ఆలస్యమవుతున్నట్లు ఈ నెలలో బైజూస్ తన ఉద్యోగులకు తెలిపింది.

డబ్బులు లేకపోవడంతో వేతనాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నెల క్రితం కూడా కంపెనీ చెప్పింది.

బైజూస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022లో కంపెనీ రెవెన్యూలు అత్యధిక భాగం హార్డ్‌వేర్ సేల్స్‌ను వచ్చాయి.

అతిపెద్ద టీచింగ్ కంపెనీగా ఎలా ఎదిగింది?

ఆన్‌లైన్ ట్యూటరింగ్ సంస్థగా 2011లో బైజూస్‌ను బైజు రవీంద్రన్ ప్రారంభించారు. దీనికి ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్వరంలో నడిచే చాన్ జుకర్‌బర్గ్, టైగర్ గ్లోబల్ అండ్ జనరల్ అట్లాంటిక్ లాంటి సంస్థలు ప్రధాన ఫండింగ్ కంపెనీలు.

తొలుత ఈ కంపెనీ భారత్‌లో స్కూల్ విద్యార్థులకు, పోటీపరీక్షలకు క్లాస్‌లు చెప్పడంపై ఫోకస్ చేసింది. ఆ తర్వాత కంపెనీ పలు భారతీయ భాషల్లో లెర్నింగ్ యాప్స్‌ను ప్రవేశపెట్టింది.

కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో భారతదేశంలో అనేకమంది విద్యార్థులు బైజూస్ లాంటి ఆన్‌లైన్ క్లాసుల వైపు మళ్లారు. ఇదే ఆ సంస్థకు వరంగా మారింది.

కరోనా మహమ్మారి రాకతో కంపెనీ విలువ రాకెట్‌లా దూసుకుపోయింది. వైట్ హ్యాట్ జూనియర్, ఆకాశ్, ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ లాంటి స్టార్టప్‌లను వరుసగా సంస్థ తనలో కలిపేసుకుంది. దీని కోసం 2 బిలియన్ డాలర్లు (రూ.16,519 కోట్లు) ఖర్చు పెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

డజన్ల సంఖ్యలో పోటీదారులు ఉన్నప్పటికీ, కోడింగ్ క్లాస్‌ల నుండి పోటీ పరీక్షల కోచింగ్ వరకు ప్రతి కోర్సును అందించే ఒక అతి పెద్ద ఆన్‌లైన్ టీచింగ్ కంపెనీగా ఎదిగింది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుని, ఇండియన్ టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే బ్రాండ్‌గా బైజూస్ నిలబడింది.

బైజూస్

ఫొటో సోర్స్, Getty Images

200 మిలియన్ డాలర్లను సేకరించి నగదు కొరతను పరిష్కరించుకునేందుకు కంపెనీ ప్రతిపాదించిన రైట్స్ ఇష్యూ వల్ల బైజూస్, తన ఇన్వెస్టర్ల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొంది. కంపెనీలో అదనంగా కొత్త షేర్లను కొనుగోలు చేయాలని ప్రస్తుత షేర్‌హోల్డర్లకు కంపెనీ ఆహ్వానం పంపింది.

రైట్స్ ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయిందని ఈజీఎంకు ముందు రవీంద్రన్ చెప్పారు. ఈ నిధులు ఎలా వాడుతున్నామో పర్యవేక్షించేందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీని నియమించాలనుకుంటున్నట్ల కూడా చెప్పారు.

కానీ, కంపెనీ విలువ ఒక్కసారిగా తగ్గిపోయింది. అంటే, రైట్స్ ఇష్యూలో పాల్గొనని ఇన్వెస్టర్లు కంపెనీలో తమ వాటాను గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు.

రైట్స్ ఇష్యూను అడ్డుకోవాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) వద్ద నలుగురు బైజూస్ ఇన్వెస్టర్లు తమ పిటిషన్ దాఖలు చేశారు.

ఇన్వెస్టర్ల పిటిషన్‌ను పరిష్కరించేంత వరకు ప్రత్యేక అకౌంట్‌లో రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను ఉంచాలని ట్రైబ్యునల్ బైజూస్‌ను ఆదేశించింది.

అదేవిధంగా, అమెరికాలోని ఒక అస్పష్టమైన హెడ్జ్ ఫండ్‌లోకి 533 మిలియన్ డాలర్ల నిధులను కంపెనీ దారిమళ్లించిందని ఆరోపిస్తూ లెండార్లు ఫ్లోరిడా కోర్టులో కూడా పిటిషన్ వేశారు.

కానీ, ఈ ఆరోపణలను కంపెనీ కొట్టివేసింది. తమ విదేశీ సబ్సిడరీ లబ్దిదారిగా పేర్కొంది.

బైజూస్ 100 శాతం సబ్సిడరీకే ఈ నగదు బదిలీ అయినట్లు ఫండ్స్‌ను నిర్వహించే వెల్త్‌ మేనేజర్ కామ్‌షాఫ్ట్‌ కోర్టుకు తెలిపింది.

రూ.9,300 కోట్ల లావాదేవీల విషయంలో విదేశీ మారకపు నిబంధనలను బైజూస్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో రవీంద్రన్‌కు భారత ఆర్థిక నేరాల ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 22న లుకౌట్ నోటీసు జారీ చేసింది.

ఈడీ విచారణ ముగిసిందని బైజూస్ బీబీసీకి తెలిపింది.

‘‘విదేశీ మారకపు నిర్వహణ చట్ట(ఫెమా) నిబంధనలన్నింటికీ మేం కట్టుబడి ఉన్నాం, భవిష్యత్‌లో కూడా కట్టుబడి ఉంటుంది’’ అని బైజూస్ తెలిపింది.

ప్రస్తుతం రవీంద్రన్ దుబాయ్‌లో ఉన్నారు. గత మూడేళ్లుగా దిల్లీ, దుబాయ్‌కు ఆయన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. రవీంద్రన్ ఎక్కడున్నారన్న విషయంపై మాత్రం బైజూస్ సమాచారం ఇవ్వలేదు.

బైజూస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

కంపెనీ ముందున్న అతిపెద్ద సవాలు ఇదే

నిధులు సేకరించడమే కంపెనీ ముందున్న అతిపెద్ద సవాలని ఇండిపెండెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ రీసెర్చ్, అడ్వయిజరీ సంస్థ అధినేత శ్రీరామ్ సుబ్రమణియన్ చెప్పారు. ఆర్థిక నివేదికలను సమర్పించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందని చెబుతూ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ హస్కిన్స్, సెల్స్ లిప్‌ సంస్థలు తప్పుకున్నాయి. కంపెనీ రికార్డులను పరిశీలించడం కష్టమవుతోందని ఆ రెండు సంస్థలూ చెప్పాయి.

ఆ వార్తల నడుమ బోర్డు సభ్యుల్లో ముగ్గురు పీక్ ఎక్స్‌వీ పార్టనర్స్(గతంలో సీక్వోయా క్యాపిటల్ ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ వి.రవి శంకర్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్‌కు చెందిన వివియాన్ వు, ప్రోసెస్‌కు చెందిన రస్సెల్ డ్రెయిన్‌స్టాక్ గత ఏడాది కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. దీంతో బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్‌లు మాత్రమే బోర్డులో మిగిలారు.

కంపెనీలు ఫెయిల్ కావడం, త్వరగా దెబ్బతినడం కొన్నిసార్లు వాటికి మంచిదేనని సుబ్రమణియన్ అన్నారు.

వాల్యుయేషన్ కోసం పరుగులు పెట్టకుండా, మంచి వ్యాపార విధానాలను కంపెనీలు అనుసరించాలని చెప్పారు. నిధులు సేకరించడం, కొన్ని రోజులకే వాల్యుయేషన్‌కు వెళ్లడం సరైన విధానం కాదని అన్నారు.

ఇది ఒకప్పుడు అతిపెద్ద భారత స్టార్టప్‌గా పేరున్న బైజూస్ పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ స్టార్టప్‌లో జరిగే పరిణామాల గమనిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)