మాల్దీవుల నుంచి భారత సైనికులు వెనక్కు వచ్చేస్తే చైనాకు కలిగే ప్రయోజనమేంటి?

మొహమ్మద్ ముయిజ్జు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ముయిజ్జు
    • రచయిత, అంబరాసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్, మాల్దీవుల మధ్య సంబంధాల్లో మార్చి 10వ తేదీ ఓ మైలురాయిగా నిలవనుంది.

మాల్దీవుల్లో ఉన్న తమ సైన్యాన్ని భారత్ ఈ ఆదివారం నుంచి ఉపసంహరించుకోనుంది. ముందుగా నిర్ణయించిన గడువు తేదీ ప్రకారం భారత సైనికులు మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చేయనున్నారు.

గత కొద్ది నెలలుగా మాల్దీవులు, చైనా దగ్గరైనట్లు కనిపిస్తున్నాయి.

మే నెల నాటికి తమ భూభాగంపై ఉన్న 80 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్‌ను కోరారు. ముయిజ్జు తీసుకున్న ఈ నిర్ణయం చైనా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఉంది.

మాల్దీవుల నుంచి విడతలవారీగా భారత బలగాల ఉపసంహరణ జరగనుంది.

ఎన్నికల ప్రచారం నాటి నుంచే ముయిజ్జు మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి పంపించే విషయంలో దూకుడుగా ఉన్నారు.

మే 10వ తేదీ తర్వాత యూనిఫాంలో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ ఒక్క భారత సైనికుడు కూడా మాల్దీవుల్లో ఉండరని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల చెప్పారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

మాల్దీవుల్లో భారత సైనికులు ఏం చేస్తున్నారు?

మాల్దీవులకు సాయంగా అందజేసిన హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసం సైనికులు అక్కడ ఉన్నారని భారత్ చెబుతోంది.

ఈ హెలికాప్టర్లను భారత్ కొన్నేళ్ల కిందట మాల్దీవులకు అందజేసింది.

భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్‌కు మాల్దీవులు చాలా కీలకం. ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై పట్టు సాధ్యమవుతుంది.

అయితే, ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్, మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. భారత్ - మాల్దీవుల సంబంధాల్లో నెలకొన్న సమస్యలను, తనకు అనుకూలంగా మలుచుకుని ఆ ప్రాంతంలో పట్టు పెంచుకోవాలని చైనా భావిస్తోంది.

సైనికులకు బదులు సాంకేతిక సిబ్బందిని నియమించేలా భారత్, మాల్దీవులు అంగీకరించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

అందులో భాగంగా, సాంకేతిక బృందం మాల్దీవులకు చేరింది. అనంతరం ముయిజ్జు నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

ఇటీవల ముయిజ్జు కూడా మాట్లాడుతూ, ''ఇక్కడి నుంచి వెళ్లిపోయిన సైనికులు తమ యూనిఫాంలు మార్చుకుని, సాధారణ దుస్తుల్లో తిరిగి వస్తారని కాదు. అలాంటి సందేహాలను, అసత్యాలను పట్టించుకోనవసరం లేదు.'' అన్నారు.

''మే 10 తర్వాత దేశంలో భారత సైనికులు ఎవరూ ఉండరు. యూనిఫాంలో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ ఎవరూ ఉండరు'' అని ముయిజ్జు చెప్పారు.

ఇకపై ఈ దేశంలో భారత సైన్యం ఏ రూపంలోనూ ఉండదని నేను గట్టిగా చెబుతున్నా అన్నారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

చైనాకి దగ్గరవుతున్న మాల్దీవులు

''ఎయిర్‌క్రాఫ్ట్ మాల్దీవుల్లోనే ఉంటుంది. భారత పౌరులు కూడా అక్కడ ఉంటారు. ఈ విషయంలో, ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు కనిపిస్తోంది'' అని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయపడ్డారు.

మాల్దీవుల్లోని కొందరు ఈ ఒప్పందాన్ని సైనికుల స్థానంలో పౌరులను, అంటే సాధారణ దుస్తుల్లో ఉన్న ఉద్యోగులను పంపించినట్లు చూస్తున్నారు.

ఈ విషయంపై బీబీసీ ముయిజ్జు కార్యాలయాన్ని సంప్రదించింది, కానీ ఎలాంటి స్పందనా రాలేదు.

మరోవైపు, ఒక చిన్న దేశమైన మాల్దీవులు ఆసియాలోని రెండు శక్తులైన భారత్, చైనా మధ్య చిక్కుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా మాల్దీవులకు చైనా మిలియన్ డాలర్ల రుణాలు ఇస్తోంది. వాటిలో ఎక్కువ భాగం ఆర్థిక, నిర్మాణ రంగాల అభివృద్ధికి ఇచ్చింది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి.

గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం, నూతన అధ్యక్షులు భారత్‌లో పర్యటించేవారు. కానీ, ముయిజ్జు విషయంలో అలా జరగలేదు.

ముయిజ్జు మొదట తుర్కియే, ఆ తర్వాత యూఏఈ, చైనాల్లో పర్యటించారు. ఇంతవరకూ భారత్‌కు రాలేదు.

చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముయిజ్జు మాట్లాడుతూ, ''మాది చిన్నదేశం అయినంత మాత్రాన, మమ్మల్ని బెదిరించే హక్కు వారికి ఉందని కాదు'' అన్నారు.

ముయిజ్జు చేసిన ఈ ప్రకటనకు, భారత్‌కు సంబంధం ఉన్నట్లుగా కనిపించింది. కానీ, ముయిజ్జు భారత్ పేరును ప్రస్తావించలేదు.

మొహమ్మద్ ముయిజ్జు

ఫొటో సోర్స్, REUTERS

చైనా - మాల్దీవుల ఒప్పందం

ఈవారం ప్రారంభంలో మాల్దీవుల ప్రభుత్వం, చైనా మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం భారత్ ఆందోళనలను పెంచింది.

ఎలాంటి చెల్లింపులూ లేకుండానే ఈ ఒప్పందం జరిగినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మాల్దీవుల ప్రభుత్వం తెలియజేయలేదు.

అయితే, మాల్దీవులకు చైనా భీకర ఆయుధాలను ఉచితంగా అందజేయనుందని, మాల్దీవుల భద్రతా దళాలకు శిక్షణ కూడా ఇస్తుందని మంగళవారం జరిగిన ర్యాలీలో ముయిజ్జు చెప్పారు.

గతంలో భారత్, అమెరికాలు మాల్దీవుల సైన్యానికి శిక్షణనిచ్చాయి.

''ఇది అద్భుతం'' అని మాల్దీవులకు చెందిన రాజకీయ నిపుణులు అజీమ్ జహీర్ అన్నారు. సైనిక సహకారం అందించేందుకు మాల్దీవులు తొలిసారిగా చైనాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.

పెట్టుబడుల విషయంలో ముయిజ్జు చైనాకు దగ్గరవుతారని తెలుసు, కానీ ఆయన ఇంతదూరం వెళ్తారని ఎవరూ ఊహించలేదని ఆయన అన్నారు.

అయితే, మాల్దీవుల్లో దీర్ఘకాలిక సైనిక ప్రణాళికలను చైనా ఖండించింది.

''ఇవి ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు'' అని చెంగ్డు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ థింక్ ట్యాంక్ ప్రెసిడెంట్, డాక్టర్ లాంగ్ జింగ్‌చున్ అన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా తన పట్టు పెంచుకోవాలనుకుంటే, మాల్దీవుల కంటే మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు.

మొహమ్మద్ ముయిజ్జు

ఫొటో సోర్స్, Getty Images

ఇండియా ఫస్ట్ నుంచి చైనా ఫస్ట్ వరకూ..

మొహమ్మద్ ముయిజ్జుని 'చైనా ఫస్ట్' విధానానికి అనుకూలంగా భావిస్తారు. అయితే, ఆయన తనను తాను చాలాసార్లు 'మాల్దీవ్స్ ఫస్ట్' విధానానికి మద్దతుదారుగా చెప్పుకున్నారు.

మాల్దీవుల గత ప్రభుత్వాలు 'ఇండియా ఫస్ట్' విధానానికి అనుకూలమని చెప్పేవారు.

తన ఎన్నికల ప్రచారంలోనూ భారత్‌తో అవలంబిస్తున్న విధానాల గురించి అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ సొలిహ్ ప్రభుత్వంపై ముయిజ్జు విమర్శలు చేసేవారు.

భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి సమాచారం బయట పెట్టడంలేదంటూ విమర్శించేవారు. ఇప్పుడు ముయిజ్జూపై కూడా అలాంటి విమర్శలే వస్తున్నాయి.

గత నెలలో చైనా పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హొన్‌ - 3 మాలేలో ఆగేందుకు ముయిజ్జు ప్రభుత్వం అనుమతించింది. దీనిపై భారత్ అభ్యంతరం తెలిపింది.

చైనా ఆర్మీకి చెందిన ఈ నౌక మాలేలో ఎందుకు ఆగుతుందో మాల్దీవులు ఎలాంటి కారణం చెప్పలేదు.

అయితే, ఈ పరిణామాన్ని భారత్‌కు చెందిన నిపుణులు అంగీకరించడం లేదు. ఆ నౌక సేకరించే సమాచారాన్ని చైనా ఆర్మీ వినియోగించుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

ఎస్ జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎస్ జైశంకర్

భారత్ కొత్త బేస్ 'జటాయు'

మాల్దీవులతో పెరుగుతున్న దూరాన్ని అధిగమించేందుకు, హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచుకునేందుకు భారత నావికాదళం ఇటీవల లక్షద్వీప్‌లో ఓ కొత్త నావికా స్థావరాన్ని (నేవల్ బేస్) ప్రారంభించింది.

ఈ నేవల్ బేస్‌కు ఐఎన్ఎస్ జటాయుగా నామకరణం చేసింది. లక్షద్వీప్‌లోని మినికాయ్ ద్వీపంలో ఈ బేస్‌ ఏర్పాటైంది.

సముద్ర దొంగలు, డ్రగ్స్ రవాణా నియంత్రణకు జటాయు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ఇండియన్ నేవీ చెబుతోంది.

అయితే, దీని ద్వారా మాల్దీవులకు గట్టి సందేశం పంపేందుకు భారత్ ప్రయత్నించిందని కొందరు భావిస్తున్నారు.

ఈ కొత్త పరిణామాలకు, మాల్దీవులతో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి సంబంధం లేదని మరికొంతమంది భారతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''ఇందులో కొత్తదనం ఏమీ లేదు, నాకు తెలిసినంత వరకూ దీనిగురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది'' అని భారత మాజీ దౌత్యవేత్త శ్యామ్ శరణ్ అన్నారు.

మాల్దీవులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

మాల్దీవుల ఆందోళనలు

ముయిజ్జు భారత్‌తో దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, చారిత్రకపరంగా చూస్తే భారత్ చాలాకాలంగా మాల్దీవులకు సాయం చేస్తోంది.

మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో పర్యాటకానిదే కీలకపాత్ర. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య అత్యధికం.

అంతేకాకుండా ఔషధాలు, ఆహారం, నిర్మాణ రంగంలోని వినియోగించే వస్తువుల కోసం మాల్దీవులు భారత్‌పై ఆధారపడుతోంది.

కరోనా సమయంలో మాల్దీవులకు వచ్చిన వ్యాక్సిన్‌లలోనూ అత్యధిక శాతం భారత్ నుంచే వచ్చాయి.

ఈ ఏడాది మొదట్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలపై ముయిజ్జు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు భారత్‌లో ఆగ్రహం వ్యక్తమైంది.

కొన్ని టూరిజం కంపెనీలు కూడా మాల్దీవులను బహిష్కరించాలంటూ మాట్లాడాయి.

ఈ వివాదం తర్వాత, ఇటీవలి రెండు నెలల్లో దాదాపు నాలుగు లక్షల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. వారిలో 13 శాతం మంది చైనా పర్యాటకులు.

వివాదానికి ముందు భారత్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది.

ఈ వైఖరి కారణంగా మొహమ్మద్ ముయిజ్జు తన దేశంలోనూ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)