బియ్యం, గోధుమలు? ఏవి తింటే శరీరానికి మంచిది

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుభాష్ చంద్రబోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫుడ్ ఫైట్ అనే పదాన్ని చాలా మంది వినే ఉంటారు. అందులో ఎవరు ఎక్కువ తినగలరనేది పోటీ. అయితే, ఆహారం మధ్య పోరు గురించి ఎవరైనా విన్నారా?

బియ్యం, గోధుమల విషయంలో చాలా కాలంగా ఇలాంటి నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతోంది. మీరు విన్నది నిజమే. ఆరోగ్యానికి బియ్యం మంచివా లేదా గోధుమలా? అన్నదే ఆ చర్చ.

బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అన్నం మానేసి గోధుమలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. చాలా మంది వైద్యులు కూడా గోధుమలతో చేసిన ఆహారాలను సిఫారసు చేస్తారు.

అయితే, బియ్యం, గోధుమలు.. ఈ రెండు గింజల మధ్య తేడా ఏమిటి? నిజంగానే గోధుమల్లో బియ్యం కంటే ఎక్కువ పోషకాలుంటాయా? ఇవి తినడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలున్నాయా?

మరి ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బియ్యం, గోధుమల్లో కార్బోహైడ్రేట్లు దాదాపుగా ఒకే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

బియ్యం - గోధుమలు

బియ్యంలో కంటే గోధుమల్లో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తక్కువగా ఉండడం వల్లే వైద్యులు సిఫార్సు చేస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

అయితే ఈ రెండింటిలో కార్బోహైడ్రేట్స్ దాదాపు ఒకే రకంగా ఉంటాయని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో సీనియర్ డైటీషియన్(పోషకాహార నిపుణురాలు) విజయశ్రీ చెబుతున్నారు.

''బియ్యం, గోధుమల్లో దాదాపు ఒకే స్థాయిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రెండింటి మధ్య తేడా చాలా తక్కువ, దాదాపుగా రెండూ ఒకటే'' అని ఆమె చెప్పారు.

బియ్యం, ఇంకా గోధుమల్లో ఏయే పోషకాలు, ఎంత మొత్తంలో లభిస్తాయో ఆమె వివరించారు.

నేషనల్ న్యూట్రిషన్ ఏజెన్సీ ప్రకారం ''100 గ్రాముల బియ్యంలో 350 కేలరీల శక్తి, 100 గ్రాముల గోధుమల్లో 347 కేలరీ శక్తి ఉంటాయి.

అదే వంద గ్రాముల బియ్యంలో 6 నుంచి 7 శాతం ప్రైమరీ ప్రొటీన్ ఉండగా, గోధుమల్లో 12 శాతం సెకండరీ ప్రొటీన్ ఉంటుంది''

అలాగే, కొవ్వు పదార్థం ఈ రెండింటిలోనూ చాలా తక్కువ పాళ్లలో ఉంటుందని చెప్పారు.

విజయశ్రీ

ఫొటో సోర్స్, MGM HEALTHCARE

ఫొటో క్యాప్షన్, డైటీషియన్ విజయశ్రీ

బియ్యంలో కూడా ఫైబర్..

ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునేవారు గోధుమలకు ప్రాధాన్యం ఇస్తారు.

అయితే, వరి ధాన్యంలోనూ ఫైబర్ ఉంటుందని విజయశ్రీ చెబుతున్నారు.

కానీ, ధాన్యం ప్రాసెసింగ్‌లో (బియ్యంగా మార్చే ప్రక్రియ) ఆ పోషకాలు పోతాయి.

కానీ, గోధుమల్లో ఆ ప్రక్రియ లేకపోవడంతో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.

బియ్యం, గోధుమల్లో లభించే పోషకాలు

''బియ్యంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. పాలిష్ చేయని బియ్యంలో మాత్రమే థయామిన్, ఫైబర్ ఉంటాయి'' అని పోషకాహార నిపుణురాలు విజయశ్రీ చెప్పారు.

''గోధుమల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు బియ్యం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఐరన్, కాల్షియం, ఫైబర్ ఉంటాయి.''

వినీత కృష్ణన్

ఫొటో సోర్స్, SIMS

ఫొటో క్యాప్షన్, న్యూట్రిషనిస్ట్ వినీత కృష్ణన్

అన్నంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయా?

సాధారణంగా షుగర్ రోగులకు బియ్యం, వాటితో చేసే ఆహార పదార్థాలను వైద్యులు పెద్దగా సిఫార్సు చేయరు. దానికి కారణాలను తెలుసుకునేందుకు సిమ్స్ ఆస్పత్రికి చెందిన న్యూట్రిషనిస్ట్ వినీత కృష్ణన్‌తో మాట్లాడాం.

''గోధుమల్లో ఇన్‌సాల్యుబల్ (కరిగిపోని) ఫైబర్ ఉంటుంది. అది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. కానీ, బియ్యంలో ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి'' అని ఆమె చెప్పారు.

ఇదే ప్రశ్నకు డైటీషియన్ విజయశ్రీ సమాధానమిస్తూ ''ఫైబర్ లేకపోవడం వల్ల అన్నం త్వరగా జీర్ణమైపోయి రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. అందుకే వైద్యులు ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, గోధుమలను సిఫార్సు చేస్తారు'' అన్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరాటాలు.. చపాతీలు తయారు చేసేటప్పుడు సాగే గుణం ఉండే పదార్థమే గ్లూటెన్

గోధుమల వల్ల కొత్త వ్యాధి వస్తుందా?

తాజా అధ్యయనాల ప్రకారం, ''సుదీర్ఘ కాలం గోధుమ వంటకాలను ఆహారంగా తీసుకుంటున్న షుగర్ రోగుల్లో సీలియాక్ డిసీజ్ (చిన్నపేగును దెబ్బతీసే జీర్ణ సంబంధిత సమస్య) కనిపిస్తోంది'' అని డాక్టర్ వినీత కృష్ణన్ చెప్పారు.

అందుకు గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే పదార్థమే కారణమని ఆమె అన్నారు.

ఇంకా సరళంగా చెప్పాలంటే, పరాటాలు.. చపాతీలు తయారు చేసేటప్పుడు సాగే గుణం ఉండే పదార్థమే గ్లూటెన్ అని ఆమె వివరించారు.

''గోధుమల్లో ప్రధాన సమస్య గ్లూటెన్. గోధుమలతో చేసిన ఆహారం నమిలినప్పుడు చివరికది బబుల్‌గమ్ మాదిరిగా అనిపిస్తుంది. అదే గ్లూటెన్'' అని విజయశ్రీ తెలిపారు.

అలాగే, గ్లూటెన్ ఒక ప్రొటీన్. గోధుమల్లో అనేక రకాల ప్రొటీన్లు ఉంటాయి.

అయితే, గ్లూటెన్ అందరికీ సరిపడదని నిరూపితం కాలేదని, అది కొద్దిమందిలో మాత్రమే అలెర్జీ కలిగిస్తుందని విజయశ్రీ చెప్పారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

గ్లూటెన్ ఇబ్బందులు ఎవరిలో వస్తాయి?

ఇటీవలి కాలంలో చాలా మందిలో గ్లూటెన్ సంబంధిత ఇబ్బందులు పెరిగాయని, దానికి కారణం పరాటాలతో పాటు అనేక రకాల ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలేనని విజయశ్రీ చెబుతున్నారు.

"అప్పటికే గ్లూటెన్ అధికంగా ఉండే వాటికి మనం డాల్డాను జోడిస్తాం. దీంతో శరీరంలోని అదనపు కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్‌ నిరోధకతకు కారణమవుతాయి'' అని ఆమె చెప్పారు.

అలాగే, '' సీలియాక్ డిసీజ్ ఉన్నవారిలో గ్లూటెన్ సమస్య ఉంటుంది. గ్లూటెన్ వినియోగానికి, ఇన్సులిన్ స్థాయిలకు సంబంధమున్నట్లు గుర్తించారు. సుదీర్ఘ కాలంగా గోధుమలు వినియోగించినా షుగర్ వచ్చే అవకాశం ఉంది. కానీ, అవేవీ ఇంకా నిరూపితం కాలేదు'' అంటున్నారు విజయశ్రీ.

అదే సమయంలో సోరియాసిస్‌, ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో కూడా గ్లూటెన్‌ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్‌ వినీత చెబుతున్నారు.

ఏయే ఆహారాల్లో గ్లూటెన్ ఉంటుంది?

సాధారణంగా ధాన్యాల్లో గ్లూటెన్ కనిపిస్తుంది.

''గోధుమలు, మైదా, బార్లీ, ఓట్స్ వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. కూరగాయల్లో గ్లూటెన్ ఉండదు'' అని విజయశ్రీ తెలిపారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

మైదా, సెమోలినా మంచివేనా?

గోధుమల నుంచి వచ్చే మైదా, సెమోలినా(రవ్వ) దాదాపు ఒకే విధంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మైదా, సెమోలినా అనేవి గోధుమ నుంచి వచ్చే ఉప ఉత్పత్తులు. మైదా కారణంగా చాలాకాలంగా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.

''మైదాను రసాయనాలతో ప్రాసెస్ చేయడం వల్ల గోధుమల్లోని మంచి పోషకాలు పోయి కార్బోహైడ్రేట్లు మాత్రమే మిగులుతాయి. గోధుమలను రవ్వ మాదిరిగా ప్రాసెస్ చేయడం ద్వారా సెమోలినా వస్తుంది. కాబట్టి అందులో కొంత ఫైబర్ ఉంటుంది'' అని డాక్టర్ వినీత చెప్పారు.

మైదాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఉపయోగం లేకపోవడమే కాకుండా, అందులోని ఇతర పదార్థాలు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని విజయశ్రీ తెలియజేశారు.

వీడియో క్యాప్షన్, బియ్యం, గోదుమలు... ఆరోగ్యానికి ఏది మంచిది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)