కేసీఆర్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై ఆరోపణలేంటి?

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నాయి.

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంతో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చింది.

ప్రణీత్ రావు సస్పెన్షన్‌కు పైకి వేరే కారణాలు కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి.

ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.

ప్రణీత్ కుమార్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రణీత్ కుమార్

ప్రణీత్ రావు ఎవరు?

దుగ్యాల ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో డీఎస్పీగా పని చేశారు.2007 బ్యాచ్‌కు చెందిన ఎస్.ఐ. ఆయన. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పనిచేశారు.

తర్వాత, ఎస్ఐబీలో గత ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పట్లో ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న ప్రభాకరరావు ఏరికోరి ప్రణీత్‌ను తీసుకొచ్చారని పోలీసు శాఖలో చెబుతుంటారు.

2018లో ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ రాగా, గతేడాది డీఎస్పీగా మరో ప్రమోషన్ లభించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయనను ఎస్ఐబీ నుంచి సిరిసిల్ల జిల్లాలోని డీసీఆర్బీకి బదిలీ చేసింది.

ఆ తర్వాత ఆయనను పోలీసు శాఖ సస్పెండ్ చేసింది.

డేటా స్టోరేజీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

హార్డ్ డిస్క్‌లు ‌‍ధ్వంసం చేశారని ఫిర్యాదు

ప్రణీత్ రావు సస్పెన్షన్‌కు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది పోలీసు శాఖ అభియోగం. సస్పెన్షన్ ఆర్డర్‌లో ఇదే విషయం రాశారు.

‘‘ గత ఏడాది డిసెంబరు 4న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాకర్ రూమ్‌కు వచ్చి ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలను నిలిపేశారు. తర్వాత, తాను పనిచేసిన రెండు రూముల్లోని కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లలోని 42 హార్డ్ డిస్కులను తీసుకుని ధ్వంసం చేశారు. డేటా బేస్‌లోని డేటా అంతా డిలీట్ చేశారు. కంప్యూటర్లలో కొత్త హార్డ్ డిస్క్‌లు పెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ సందర్భంగా సేకరించిన సీడీఆర్, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాను డేటా బేస్ నుంచి పూర్తిగా తీసేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం చూపడం, అధికారాన్ని దుర్వినియోగపరచడం, నిబం‌‍ధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఇంటర్నెట్‌ కనెక్షన్ తీసుకుని వాడుకున్నట్లు తేలింది. ఇందుకు టీఎస్సీఎస్(కండక్ట్) రూల్స్, 1964 ప్రకారం సస్పెండ్ చేస్తున్నాం’’ అని ప్రణీత్ రావు సస్పెన్షన్ లేఖలో రాశారు.

పశుసంవర్థక శాఖ కార్యాలయంలోనూ ఈ తరహా ఘటనే జరిగింది.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ సైతం మాసబ్ ట్యాంకులోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లను మాయం చేశారని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో గత డిసెంబరులో కేసు నమోదైంది.

తాజాగా పోలీసు శాఖలో ప్రణీత్ రావు వ్యవహారం బయటపడింది.

మరోవైపు, ప్రణీత్ రావు పదోన్నతి విషయంలోనూ విమర్శలున్నాయి.

2007 బ్యాచ్ అధికారి అయిన ఆయన, చాలా వేగంగా ప్రమోషన్లు పొంది డీఎస్పీ అయ్యారని పోలీస్ శాఖలో చెప్పుకుంటారు.

పోలీసుశాఖలో 1998 వరకే డీఎస్పీ ప్రమోషన్లు ఇచ్చారు. తర్వాత 2002, 2004 బ్యాచ్ పోలీసు అధికారులు ఉన్నా వారిలో చాలా మందికి డీఎస్పీగా ప్రమోషన్లు రాలేదు.

అలాంటిది 2007లో రిక్రూట్ అయిన ప్రణీత్ రావుకు ఏకంగా రెండు ప్రమోషన్లు ఇచ్చారన్న విమర్శలున్నాయి.

‌పనితీరు ఆధారంగా అకడమిక్, అడహక్ పేరిట పోలీసుశాఖలో ప్రమోషన్లు ఇస్తుంటారని బీబీసీతో రిటైర్డ్ అదనపు డీసీపీ బి.రెడ్డన్నచెప్పారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఎస్ఐబీ ఏం చేయాలి? ఏం చేస్తోంది?

మావోయిస్టులు, ఉగ్రవాదుల కదలికపై ని‌‍‌ఘా పెట్టేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐబీని ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ప్రగతి భవన్ (ప్రస్తుతం మహాత్మాజ్యోతిరావు పూలే భవన్)కు కూత వేటు దూరంలోనే ఈ కార్యాలయం ఉంటుంది.

ఎస్ఐబీకి ప్రభాకరరావు ఐజీ హోదాలో చీఫ్‌గా ఉండేవారు. 2020లో ఉద్యోగ విరమణ చేశాక కూడా ప్రభుత్వం ఆయనను కొనసాగించింది.

ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకరరావు ఉన్నప్పుడు ప్రణీత్ రావును ప్రత్యేకంగా ఎస్ఐబీకి తీసుకువచ్చారు.

స్పెషల్ ఆపరేషన్ బృందాన్ని ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా రెండు రూములకు విడిగా ఇంటర్నెట్ లైను తీసుకుని 17 కంప్యూటర్లు పెట్టుకున్నారు.

ఇలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు, అధికారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణలు వచ్చాయి.

మావోయిస్టులు, ఉగ్రవాదుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన చోట రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలున్నాయి.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

గుర్తు తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ పై పర్యవేక్షణ

ప్రణీత్ రావుపై ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ డి. రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చి 10వ తేదీన 243/2024 ఎఫ్ఐఆర్ పెట్టారు.

ఇందులో ఫోన్ ట్యాపింగ్ విషయంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ ‌‍ఫిర్యాదు చేశారు. అయితే, నేరుగా ఫోన్ ట్యాపింగ్ అని లేకపోయినా, గుర్తుతెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించి రహస్యంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు.

‘‘ఎస్ఐబీ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీగా పనిచేస్తున్న క్రమంలో ప్రణీత్ రావు ప్రత్యేకంగా ‌‍ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేసుకున్నారు.

వారి కదలికలను అక్రమంగా, రహస్యంగా గమనించేవారు. దీనికి సంబం‌‍ధించి ప్రత్యేకంగా 17 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని డేటా బేస్ ఏర్పాటు చేశారు. వాటన్నింటిని గతేడాది డిసెంబరు 4న ఎస్ఐబీ కార్యాలయానికి వచ్చి ధ్వంసం చేశారు. డేటాను కంప్యూటర్ల నుంచి డిలీట్ చేశారు’’ అని అదనపు ఎస్పీ రమేశ్ తన ఫిర్యాదులో రా‌‍శారు.

‘‘ఆఫీసుకు వచ్చినప్పుడు ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలు పనిచేయకుండా నిలిపేశారు. సీసీ కెమెరాలను నిలిపివేసి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. అందులోని ఐఎంఈఐ నంబర్ల డేటా తీసేశారు. దీని వెనుక నేరపూరిత కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 409, 427, 201, 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్-1984 సెక్షన్ 3, ఐటీ చట్టం సెక్షన్ 65, 66, 70 ప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు రమేశ్.

ఫిర్యాదులో గుర్తుతెలియని వ్యక్తులుగా రాసినప్పటికీ, ఎవరెవరి నంబర్లు తీసుకున్నారనే విషయంపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫోన్ ట్యాపింగ్‌పై చట్టాలేం చెబుతున్నాయి?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తోంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. 2022 నవంబరులో రాజ్ భవన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనడం రాజకీయ దుమారాన్ని రేపింది.

ఫోన్ ట్యాపింగ్ అనేది భారత దేశంలో కొన్ని సందర్భాల్లోనే చట్టబద్ధమైన అంశంగా పరిగణిస్తారు.ఇందుకు టెలీగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

టెలీగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ – 5(2) ప్రకారం దేశ సార్వభౌమత్వం, సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫోన్లు ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలను సూచిస్తుంది.

భారతదేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రత, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసేలా చర్యలు ఉన్నప్పుడు ఏదైనా కంప్యూటర్‌లోని సమాచారాన్ని పర్యవేక్షించడం, డీక్రిప్ట్ చేయడం కోసం ఏదైనా ఏజెన్సీని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అధికారం ఉన్న అధికారికి ఉంటుంది.

ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అనుమతి లేకుండా ట్యాప్ చేస్తే ఏమవుతుంది?

డీఎస్పీ ప్రణీత్ రావు విషయంలో ఇదే జరిగిందని పోలీసుశాఖలోని అధికారులు చెబుతున్నారు.

మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులు, అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ప్రణీత్ రావుపై ఉన్నాయి. ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ చేశారనేది విచారణలో తేలాల్సిన అంశంగా మారింది.

‘‘ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఈ తరహా చర్యలను అడ్డుకునేలా టెలీగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26(బి) ఉంటుంది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది. అనుమతి లేకుండా చట్టబద్దమైన కారణాలు లేకుండా ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే గోప్యత హక్కును ఉల్లంఘించడం కిందకు వస్తుంది.’’ దని చెప్పారు తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా ఫోన్ ట్యాప్ చేయడానికి వీల్లేదు. అనుమతి లేకుండా చేస్తే అక్రమం అవుతుంది. ట్యాపింగ్ చేయాలంటే చట్టబద్ధమైన, కచ్చితమైన కారణం చూపించాలి. దేశ రక్షణ, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యక్తుల ఫోన్లే ట్యాప్ చేసేందుకు వీలుంటుంది. దేశ ప్రయోజనాల విషయంలో గోప్యత అనేది ముఖ్యంగా భావించరు. కానీ, అదే సమయంలో ప్రైవేటు సంభాషణలు తీసుకునేందుకు వీల్లేదు. ఒకవేళ గోప్యతకు భంగం కలిగిందని భావిస్తే కచ్చితంగా న్యాయపోరాటం చేయవచ్చు. అందుకు టెలీగ్రఫీ చట్టం అనుమతిస్తుంది’’ అని రామకృష్ణారెడ్డి చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో గోప్యత హక్కు ఉల్లంఘిస్తున్నారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వ్యక్తి గోప్యతకు దెబ్బతీసే అంశంగా పరిగణిస్తారు. దేశ రక్షణ, సార్వభౌమాధికారం అని చెబుతూ సాఫ్ట్‌వేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నాయి.

‘‘పదేళ్ల కిందట ఫోన్ ట్యాపింగ్ లైన్లు పది వరకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి ఏకంగా వందకు చేరుకున్నాయి. ఇందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది’’ అని పోలీసు శాఖకు చెందిన రిటైర్డ్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

ఇలా సమకూర్చకున్న లైన్లతో పెద్దసంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు, అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

ఫోన్ ట్యాపింగ్ అనేది, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారం, వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోవడమే అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు.

2015లో ఓటుకు నోటుగా పిలిచే కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌తో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి అప్పట్లో బయటకు వచ్చింది.

ఈ విషయంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు కారకులంటూ అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఏపీ ప్రతిపక్షనేత జగన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్, తెలంగాణ ఏసీబీ అధికారులపై ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

వివిధ వ్యక్తులు చేసిన ఫిర్యాదుతో ఏపీలో 88 కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణకు సిట్ వేయగా, విచారణ కొనసాగుతూనే ఉంది.

ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది?

ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రాలు, కేంద్రం పరిధిలో వేర్వేరు సంస్థలు చూస్తుంటాయని చెప్పారు తెలంగాణ రిటైర్డ్ అదనపు డీసీసీ బి.రెడ్డన్న.

‘‘కేంద్రం పరిధిలో హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఈడీ, డీఆర్ఐ, రా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, దిల్లీ పోలీసు కమిషనరేట్‌లకు ట్యాపింగ్‌కు వీలుంటుంది. రాష్ట్ర పరిధిలోకి వచ్చేసరికి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి’’ అని రెడ్డన్న చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్

ఫొటో సోర్స్, Getty Images

అయిదేళ్ల కిందట పెగాసస్ తో ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. దీనిపై దేశంలోనూ పెద్ద దుమారం రేగింది. అయిదేళ్ల కిందట అంటే, 2019లో కేంద్ర ప్రభుత్వం కొందరి ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్, న్యూస్ వైబ్ సైట్ ‘‘ద వైర్’’ అప్పట్లో కథనాలు ప్రచురించాయి.

దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను పెగాసస్ సాఫ్ట్‌వేర్ సాయంతో ట్యాప్ చేసినట్లు ఆ వార్తా సంస్థలు కథనంలో ఆరోపించాయి.

ఇజ్రాయెల్ సంస్థ క్లయింట్స్ ఆసక్తి కనబరిచిన 50 వేల మొబైల్ నంబర్లలో 300లకు పైచిలుకు నంబర్లు భారతీయులకు చెందినవని ‘ది వైర్’ పేర్కొంది.

ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌ఓ అనే సంస్థ తయారు చేసింది. అయితే,

ఈ ఆరోపణలను ఎన్ఎస్‌ఓ తోసిపుచ్చింది.

తాము కేవలం గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థలతోనే కలిసి పనిచేస్తామని, ముఖ్యంగా నేరాలు, ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ వివరించింది.

పెగాసెస్ మీద పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రకంపనలు రేగాయి.

రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్, కొందరు వేర్పాటువాద నేతలు, సిక్కు కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు ఆరోపించారు.

ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)