ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తేదీలు వచ్చేశాయి, షెడ్యూల్ పూర్తి వివరాలివే...

ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభకు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 18వ లోక్ సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న ఉండబోతున్నాయి. అదే రోజు లోక్ సభతో పాటు మొత్తం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవుతాయి.
ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదలవుతుంది.
నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25 కాగా, స్క్రూటినీ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 26న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఏప్రిల్ 29గా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ను బట్టి ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.

ఫొటో సోర్స్, @ysjagan
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 151 స్థానాలో వైసీపీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక స్థానంలో గెలుపొందింది.
గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైసీపీ గెలుచుకోగా, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.

ఫొటో సోర్స్, @ncbn
ఈసారి పార్టీల వ్యూహాలు, అంచనాలు ఏంటి?
ఏపీలో ప్రధానంగా వైసీపీ తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తలపడుతున్నాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి.
వైసీపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశాయి. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి.

ఫొటో సోర్స్, @JanaSenaParty
లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయనున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను తిరిగి గెలిపిస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందని, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలు ఈ అరాచక పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారని చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, @realyssharmila
కాంగ్రెస్ ఒంటరి పోరు
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకుంటామని ఆశిస్తోంది. జగన్‌కు అడ్డుకట్ట వేసేది తామేనంటూ ఏపీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల ఇప్పటికే ప్రకటనలు చేస్తున్నారు.
2019 నాటికి కీలక నేతలంతా దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపినప్పటికీ 1.17 శాతం ఓట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
తెలంగాణలో పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగని వై.ఎస్.షర్మిల ఈసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారి పార్టీని ఎన్నికల్లో దింపుతున్నారు.
స్వయంగా ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, గతంలో వైసీపీ కోసం పాదయాత్రలు చేసి విజయంలో తానూ భాగస్వామినని చెప్పుకున్న షర్మిల ఈసారి అన్న పార్టీతోనే తలపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఇవి కూడా చూడండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- 217 సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న జర్మన్.. ఆయనకు ఏమైంది?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








