రూపర్ట్ మర్దోక్: 92 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న మీడియా దిగ్గజం, ఈ జంట కథ ఇదీ..

రూపర్ట్ మర్డాక్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, రూపర్ట్ మర్దోక్
    • రచయిత, కాథరిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆయన టీం ప్రకటించింది.

92 ఏళ్ల రూపర్ట్ మర్దోక్, రష్యన్ రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా జుకోవా(67)తో చాలా నెలలుగా డేటింగ్ చేస్తున్నారు.

ఈ ఏడాది కాలిఫోర్నియాలోని మొరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో మర్దోక్ వివాహం జరగనుంది. ఇది ఆయనకు ఐదో పెళ్లి.

గత ఏడాది ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి మర్దోక్ వైదొలిగారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం జూన్‌లో వీరి వివాహం జరగనుంది, ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.

మర్దోక్ ఆస్ట్రేలియాలో జన్మించారు. 2023 ఏప్రిల్‌లో మాజీ పోలీస్ అధికారి అయిన ఆన్ లెస్లీ స్మిత్‌తో ఆయన నిశ్చితార్థం అకస్మాత్తుగా రద్దయింది.

అనంతరం ఎలెనా జుకోవాతో మర్దోక్ డేటింగ్ చేస్తున్నట్లు వదంతులు వచ్చాయి. ఆయన మాజీ భార్యలలో ఒకరైన చైనా వ్యాపారవేత్త వెండి డెంగ్ నిర్వహించిన పార్టీలో ఇద్దరూ కలుసుకున్నట్లు చెబుతారు.

ఎలెనా జుకోవా

ఫొటో సోర్స్, BFA/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, ఎలెనా జుకోవా గతంలో రష్యన్ చమురు బిలియనీర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకున్నారు.

ఎవరీ ఎలెనా జుకోవా?

మర్దోక్ ఇంతకుముందు ఆస్ట్రేలియన్ ఫ్లైట్ అటెండెంట్ ప్యాట్రిసియా బుకర్, స్కాటిష్ జర్నలిస్ట్ అన్నా మాన్, వెండి డెంగ్, అమెరికా మోడల్, నటి జెర్రీ హాల్‌లను వివాహం చేసుకున్నారు.

ఎలెనా జుకోవా గతంలో రష్యన్ చమురు బిలియనీర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకున్నారు.

వారి కుమార్తె దశ రష్యా పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు రోమన్ అబ్రమోవిచ్‌ను 2017లో పెళ్లి చేసుకున్నారు.

లాచ్లాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొడుకు లాచ్లాన్‌కు మీడియా బాధ్యతలు అప్పగించారు రూపర్ట్ మర్దోక్.

మీడియా దిగ్గజం

రూపర్ట్ మర్దోక్ 1950లలో ఆస్ట్రేలియాలో తన వృత్తిని ప్రారంభించారు. 1969లో యూకేలో న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తాపత్రికలను కొనుగోలు చేశారు.

తరువాత ఆయన న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్‌తో సహా పలు అమెరికా పబ్లికేషన్స్ కొనుగోలు చేశారు.

1996లో 'ఫాక్స్ న్యూస్‌'ను ప్రారంభించారు. ఇప్పుడు అమెరికాలో అత్యధికంగా వీక్షిస్తున్న టీవీ న్యూస్ ఛానెల్ ఫాక్స్ న్యూస్‌.

2013లో 'న్యూస్ కార్ప్' సంస్థను స్థాపించిన మర్దోక్, వందలాది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియా అవుట్‌లెట్‌లకు యజమానిగా కొనసాగారు.

వివాదాలకు చిరునామా

వివాదాలు లేకుండా మర్దోక్ జీవితం సాగలేదు. యూకేలో హత్యకు గురైన పాఠశాల విద్యార్థిని మిల్లీ డౌలర్ వాయిస్ మెయిల్‌లను 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' వార్తాసంస్థ వినడం అప్పట్లో పెద్ద వివాదానికి కారణమైంది.

గత ఏడాది సెప్టెంబరులో మర్దోక్ తన మీడియా సామ్రాజ్యంలో ముఖ్యమైన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కొడుకు లాచ్లాన్‌కు పగ్గాలను అప్పగించారు. తరువాత ఫాక్స్, న్యూస్ కార్ప్ కంపెనీలకు చైర్మన్‌ ఎమిరిటస్‌గా కొనసాగుతున్నారు.

జుకోవాతో మర్దోక్ వివాహం ఆయన వ్యాపారాలను ప్రభావితం చేసే అవకాశం లేదని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఆ వ్యాపారాలను ట్రస్టు పేరిట మర్దోక్ నలుగురు కొడుకులు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)